Wednesday, 28 April 2021

కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది

 కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది 

రైతుల ఆందోళన  సందర్భంగా ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ కరోనా వుధృతంగా వుంది; వెళ్ళాల్సిందేనా? తప్పదా?  అని అజిత అడిగింది. వెళితే నేను ఓ రెండు వారాల తరువాత చనిపోవచ్చు; వెళ్ళకపొతే రేపే ఇంటి వెనక చనిపోతాను అన్నాను.  చావు మీద నా అవగాహన అది.

 

“మనుషులు తాము బతకాలనుకున్న విధంగా ఎలాగూ బతకలేరు; కనీసం చావాలనుకున్న చోటైనా చనిపోయే అవకాశం వుండాలికదా!” అనే అర్థం వచ్చేలా వైల్డ్ గ్రాస్ సీరీస్ లో  లూసన్ అన్నాడు. అది నాకు బాగా నచ్చేసి   రెండు కథల్లో  రెండు భిన్నన కోణాల్లో వాడాను.  చావుకు నేను కోరుకునే స్పాట్ గురించి కూడ ఒక సందర్భంలో రాశాను. ఆ క్రమంలోనే ఈ రోజు పోస్టు పెట్టాను.  ఫ్రెడెరిక్ ఏంగిల్స్ కూడ death wish గురించి మాట్లాడి వున్నాడు. మన మార్కిస్టు పెద్దలు అన్నీ చదువుతారు గానీ మార్క్స్, ఏంగిల్స్ ను మాత్రం చదవరు. మనుషుల భావ సంచయనంలో Reification అనేది ఒకటుంటుందని కూడ వీళ్ళకు తెలీదు.  సమయం సందర్భంలేక హేతువాదం  మాట్లాడుతారు. నేను హేతువాదినని ఎన్నడు చెప్పుకోలేదు. పైగా సందర్భ శుధ్ధిలేని హేతువాదుల్ని అసహ్యించుకుంటాను.

 

ఉద్యమ కాలంలో కొందరు సన్నిహితులతో  కొన్ని సందర్భాలలో మృత్యుముఖంలో వున్నాను. వాళ్ళకేకాదు నాకూ చావంటే భయమేకానీ   అనివార్యం అయినపుడు దాన్ని హుందాగా స్వీకరించాలి అనేది నా అవగాహన. వాళ్ళను ఓదార్చేవాడిని. మాభూమి సినిమాలో  “కళ్ళుతెరిచే చనిపోయాడా?” అని తన కొడుకు గురించి ఒక మహిళా గెరిల్లా అడుగుతుంది.  That should be the spirit.

 

సోషల్ మీడియాలో  కొందరు ఒక తప్పుడు సంస్కృతిని ప్రమోట్ చేస్తుంటారు.  వాళ్ళు మనకుగానీ సమాజానికిగానీ చేయగలిగింది ఏమీ వుండదు. ఆ శక్తి సామర్థ్యాలూ  వాళ్ళకు వుండవు. కానీ, ప్రతి పోస్టులో ఒక నైతిక తప్పును వెతికే ప్రయత్నం చేస్తుంటారు.  నా మీద, అజిత మీద అభిమానంతో కష్ట కాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచినవారున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఇలాంటి పిల్ల చేష్టలు ఎన్నడూ చేయరు. నేను వాళ్ళను ప్రేమిస్తాను. మనం కొందరిని ప్రేమించాము అంటే కొందరిని ద్వేషిస్తున్నాము అనేకదా అర్థం.

 

            కరోనా వైద్యం గురించి వైద్యరంగానికి చెందినవారూ, చెందనివారూ అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళందరూ చివర్లో ఒక మాట అంటున్నారు; “50-50 ఛాన్సెస్ వుంటాయి” అట. కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. To be or not to be. అలా జరగవచ్చు జరగకపోనూ వచ్చు అట. దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదూ?

 

దేశంలోనికి కరోనా వచ్చాక నేను అనేక వూర్లు తిరిగాను. అనేక ప్రయాణాలు చేశాను. అజిత ఇంట్లోనే వుంది. నేనే బలవంతంగా వ్యాక్సిన్ కు  తీసుకుని వెళ్ళాను, RT-PCR టెస్టుకూ నేనే తీసుకుని వెళ్ళాను. చాలా పెద్ద రద్దీ. తోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. తనకు అక్కడే సోకి వుంటుంది.

 

నేను 1951లో పుట్టాను. అప్పుడు ఇండియాలో life expectancy 40 యేళ్ళ కన్నా తక్కువ. అంటే నేను  life expectancy కన్నా 80 శాతం ఎక్కువగా  బతికేశాను.  ఇంతటి వయసులో ఒక్కరోజు కూడ హాస్పిటల్ లో ఇన్ పేషంట్ గా లేను. నేను ఆరోగ్యానికి అంతటి ప్రాధాన్యం ఇస్తాను. కరోనా నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. నేను రోజూ సూర్యోదయానికి ముందు 45 నిమిషాలు బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేస్తాను.  బ్రీథింగ్ ఎక్సర్ సైజు చేసిన తరువాత ఒక సెల్ఫీ తీసుకోవడం ఒక అలవాటు. చెస్ట్ మజిల్స్  ఫార్మేషన్ లో లోపాలు తెలుస్తాయి.  మజిల్స్  ఫార్మేషన్ బాగుంటే కాన్ఫిడెన్స్ లెవల్స్ కొంచెం పెరుగుతాయి. (ఇక్కడ పెట్టిన ఫొటో ఏప్రిల్ 25న తీసింది)

 

మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే  బ్రీథింగ్ ఎక్సర్ సైజులు ఆక్సిజన్ పుష్కలంగా స్వీకరించడానికి పనికి వస్తాయి. వైరస్ ను మందులతోనే ఎదుర్కోవాలి. ఏ మందుతో అన్నదీ ఇంకో బ్రహ్మపదార్ధం. ఒకరోజు Remdesivir  దివ్యౌషధం అంటున్నారు.  నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి Remdesivir  వాడావంటే నేరుగా  వెంటి లేటర్ కు పోవడమే అని హెచ్చరించాడు. అది ఆయన అనుభవం. RT-PCR టెస్టు రిపోర్టుల్లో 50 శాతం తప్పుల తడక అట.  దేన్ని నమ్మాలీ?

 

ఎదైనా అనివార్యం అయినపుడు ఏం చేయాలీ? అనే విషయంలో మనిషికి ఒక విధానం వుండాలి. ఆ కోణం లోనే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. నేను బై  ఛాన్స్ పఠాన్ గా వుట్టాను. బై ఛాయిస్ పఠాన్ గా చనిపోతాను. ఈ మాట కూడ ఇవ్వాళ కొత్తగా అనలేదు. గతంలోనూ ఒకటిరెండుసార్లు అన్నాను. ఫేస్ బుక్ చిల్లర మిత్రులకు ఒక మనవి ఈ పఠాన్ కామెంట్ ను ఇంకో నైతిక చర్చగా మార్చవద్దు.

 

రచన  : 29 ఏప్రిల్  2021


Monday, 26 April 2021

AM Khan Yazdani Workout 25 April 2021

 

AM Khan Yazdani

Workout 25 April 2021

AM Khan Yazdani (Danny) and Eluri Agitha



 AM Khan Yazdani (Danny) and Eluri Agitha



తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!  


  AM Khan Yazdani (Danny) and Eluri Agitha



తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!   

 

 

అజిత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జగమొండి. Tough. బస్సు సౌకర్యం కూడ లేని ఓ కుగ్రామంలోని పొలాల దగ్గర నుండి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డూప్లెక్స్ వరకు, ఓ ప్రముఖ టీవీ ఛానల్లో అడ్మిన్ వరకు అన్ని స్థాయిల్లోనూ వ్యవహారాల్ని చక్కదిద్దగల నిర్వహణ సామర్థ్యం తనది. తను అనుకున్నది ఏదైనాసరే దాన్ని ప్రేమతోనో కసితోనో సాధించేవరకు నిద్రపోదు. ఫొటో షాప్ ను ముందు తను నేర్చుకుని మా పెద్దాడికి నేర్పింది.  

 

అమ్మాయిని పార్టీలో ఇద్దామనుకుంటున్నాను ఓ మంచి కుర్రాడ్ని చూడండి అని మా మావగారు ఏలూరి భీమయ్య ఓసారి కొండపల్లి సీతారామయ్యను కోరారట. మీ జిల్లాలో డానీ వున్నాడుగా అని కేఎస్‍ అన్నారట. పశ్చిమ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో ఓ అరుగురు అమ్మాయిలు పార్టీ పెళ్ళికి సిధ్ధంగా వున్నారు అని ఓసారి నిమలూరి భాస్కరరావు చెప్పారు. భార్యకు భర్త టాలెంటును అర్థం చేసుకోగలిగినంత జ్ఞానమూ, లోకంలో తన మొగుడే సూపర్ స్టార్ అనుకునేంత అజ్ఞానమూ వుండాలి అని మా గురువుగారు ఎంజీ రామారావుగారు అనేవారు. అలాంటి  జ్ఞానం అజ్ఞానం తూకంలో నాకు అజిత నచ్చింది. పార్టి పెద్దల అభిప్రాయం నా ఎంపిక రెండూ ఒకటే కావడంతో 1983 ఏప్రిల్ 27న మా పెళ్ళి జరిగింది.

 

భార్యాభర్తలు ఒకరుగా కనిపించే రెండు వ్యక్తిత్వాలు. వాళ్ళ మధ్య ప్రేమ వున్నట్టే ఘర్షణ కూడ వుంటుంది. అజితది ప్రధానంగా పల్లెటూరి మనస్తత్వం. నాది మొదటి నుండి పట్టణ దృక్పథం. అంచేత మా మధ్య ఆమేరకు నిరంతరం ఒక ఘర్షణ కూడ కొనసాగింది. ప్రేమించుకుంటూ కొట్లాడుకుంటూ జీవితాన్ని నిర్మించుకుంటూ 38 సంవత్సరాలు పూర్తి చేసేశాం.

 

మార్క్సిస్టు భాషలో చెప్పాలంటే మా అనుబంధంలో పరిమాణాత్మక మార్పు ఒక గుణాత్మక మార్పుకు దారితీసింది.  మా కుటుంబంలో విప్లవానికి ముందు నన్ను నేను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ తనను అజ్ఞానిగానూ భావించడం మూలంగా తనకు నేను పాఠాలు చెప్పేవాడిని. విప్లవం విజయవంతం అయ్యాక తనను తాను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ నన్ను అజ్ఞానిగానూ భావించడం మూలంగా ఇప్పుడు తను నాకు పాఠాలు చెపుతోంది.

 

తను నెలకు ఒకసారయినా విడిపోవాలని గట్టిగా అనుకుంటూ వుంటుంది. నాకు తన మీద చాలా కోపం వచ్చిన సందర్భాలున్నాయిగానీ విడిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కారంచేడు తదితర ఉద్యమాల కోసం నేను ఇల్లు వదిలి వెళ్ళినపుడూ, పనిచేసే పత్రికలు మూతబడినపుడు, నా కష్టకాలాల్లో తను చాలా దృఢంగా నిలబడింది. ఓసారి ఓ టీవీ ఆఫీసులో వాతావరణం నచ్చక తనకు ఫోన్ చేశాను. “నువ్వు తలవంచి ఒకచోట పనిచేయాల్సిన అవసరం లేదు. తక్షణం రిజైన్ చేసి ఇంటికి వచ్చేయి. చూసుకుందాం” అంది. తను అలా సపోర్ట్ చేయకపోతే మీడియాలో నా ‘పొగరు’ కొనసాగేది కాదేమో!

 

నా కాస్ట్యూమ్ డిజైనర్ తనే. షర్ట్స్, ట్రౌజర్స్ దగ్గర నుండి బూట్లు, వాచీలు, కాస్మెటిక్స్, గాడ్జెట్స్ వరకు అన్నీ తనే సెలెక్ట్ చేస్తుంది. అయితే, అజితతో నాకు కొన్ని ఇబ్బందులూ వున్నాయి.  తను ఇప్పటికీ నన్ను ఓ సూపర్ స్టార్ అనుకుంటోంది. అంత వరకే అయితే నాకూ ఆనందమే. కానీ,  ఎవరయినా నన్ను ఎత్తుకుపోతారని ఈ వయసులోనూ  అనుమానిస్తూ వుంటుంది.

 

సమీప భవిష్యత్తులో వివాహ వ్యవస్థ అంతరించిపోతుందని నా అంచనా. కొత్త తరంలో పెళ్ళి మీద ఆసక్తి తగ్గిపోతోంది. సుదీర్ఘ కాలం ఒక అనుబంధంలో కొనసాగడం అనేది ఒక రకం నిర్బంధంగా భావిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వుంది. మా పెళ్ళికి పురోహితునిగావున్న చలసాని ప్రసాద్ వంద పెళ్ళిళ్ళు చేశాడు. వాటిల్లో 99 ఫెయిల్. మేము మాత్రమే ఇంకా కలిసున్నాం. బహుశ మమ్మల్ని ఐదు  అంశాలు కట్టిపడేశాయి అనుకుంటాను. మొదటిది; కుటుంబానికి తన కాంట్రిబ్యూషన్ ను నేను గౌరవిస్తాను, నా కాంట్రిబ్యూషన్ ను తను  గౌరవిస్తుంది. రెండోది; పిల్లలకు  పేరెంట్స్ సౌకర్యాలు కల్పించాలిగానీ సమస్యలు సృష్టించకూడదని ఇద్దరం గట్టిగా అనుకుంటాం. మూడోది; కామన్ ఫ్రెండ్స్. నాలుగోది; కమ్యూనిస్టు అభిమానం. చివరిదయినా ముఖ్యమయినది తనంటే నాకు చాలా ఇష్టం.

 

27 ఏప్రిల్ 2021 

Thursday, 1 April 2021

Happy Birthday Arun!

 అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!

 

నేను తండ్రి కాబోతున్నానని తెలిసినపుడే పుట్టబోయే బిడ్డకు పేరు కూడ నిర్ణయించుకున్నాను. ఆడపిల్ల పుడితే ఉష, అబ్బాయి పుడితే అరుణ్.   అరుణ్ అంటే మా అమ్మకు సంతృప్తి కలగలేదు. ఇక్బాల్ ఖాన్ అనిపిలిచేది. ఖాన్ ఎప్పుడైతే వచ్చిందో అజితవాళ్ళు చౌదరి తగిలించారు. వెరసి వాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్  చౌదరి అయ్యాడు.

 

కనీస భద్రతను ఏర్పాటు చేయకుండ పిల్లల్ని కనడం తప్పని నేను భావిస్తాను. విజయవాడలో ఒక ఇల్లు, ఒంగోలు దగ్గర కొంత పొలం కూడబెట్టాను. అయితే, అరుణ్  మూడు నెలల వయసులో వుండగా కారంచేడు ఉద్యమంలో పాల్గొనడానికి చీరాల వెళ్ళిపోయాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒంగోలు పొలాన్ని వదులుకున్నాను.

 

తనను మూడేళ్ళ వయసులో వదిలి వెళ్ళిపోయానన్నమాట సహజంగానే వాడికి నచ్చివుండదు. ఉద్యమాల్లో పాల్గొనేవారి కుటుంబాల్లో ఇలాంటి భావోద్వేగ సమస్యలుంటాయి. తరువాతి కాలంలో ఆ లోటును తీర్చడానికి చాలా ప్రయత్నించానుగానీ పిల్లలిద్దరూ ‘అమ్మకొడుకులు’గా వుండిపోయారు. తమను గట్టెక్కించడంలో అమ్మ పాత్ర ముఖ్యమని వాళ్ళు భావిస్తుంటారు.

 

తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఆస్తి వచ్చినట్టు అలవాట్లూ వస్తాయి. అలవాట్లు అంటే అనారోగ్యాలు కూడ. మానాన్నది ధృఢమైన కార్మికుని శరీరం. అది నాకు వచ్చింది. ఆయనకు సినిమాలు, నాటకాలు, పాటలు అంటే చాలా ఇష్టం. బొమ్మలు కూడ గీసేవారట. అవన్నీ నాకూ వచ్చాయి. ఆయనకు ఉబ్బసం వుండేది. అది కూడ నాకు వచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో మానాన్న చాలా అమాయకుడు. అన్నార్తులకు అన్నం పెట్టాలంటే ఆయనకు ఎంత ఆనందమో చెప్పలేము. ఇంట్లో వుందా లేదా అని కూడ చూడకుండ ఎవరెవర్నో ఇంటికి తీసుకుని వచ్చి ఆకలితో వున్నాడంట భోజనం వడ్డించు  అనేవారు. మా అమ్మ తెలివైంది గాబట్టి ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెట్టి మమ్మల్ని గట్టెక్కించింది.

 

మానాన్న చాలా గొప్ప టెక్నీషియన్. మొదటితరం యంత్రపరికరాలు వేటిని చూసినా (విశ్వామిత్రుడిలా) ‘ప్రతిసృష్టి’ చేసే నైపుణ్యం ఆయనకు వుండేది. కొంతకాలం నేను ఆయన వెంట మెకానిక్ బాటలో నడిచానుగానీ మా అమ్మ తప్పించేసింది. నాకు మా పెద్దాడిలో మా నాన్న కనిపిస్తారు; రెండోవాడిలో మా అమ్మ కనిపిస్తుంది. ఒకడిది భావోద్వేగం, ఇంకొకడిది నిర్వహణ సామర్థ్యం. పెద్దాడ్ని చూస్తే ప్రేమ కలుగుతుంది; చిన్నాడ్ని చూస్తే ధైర్యం కలుగుతుంది.

 

మార్కులు ర్యాంకుల కోసం పిల్లల్ని నేను ఎప్పుడూ వత్తిడి చేయలేదు. అప్పట్లో మా తాహతుకు మించిన పని అయినా సరే ఆడుకుంటూ చదువుకోమని స్పోర్ట్స్ స్కూల్ లో చేర్పించాము.  అలాగని అస్సలు పట్టించుకోకుండ వుండలేదు.

 

  మూడవతరం యంత్రపరికరాల్ని అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్ని ప్రతిసృష్టించే  నైపుణ్యం మా పెద్దాడిది.  వాడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్. డెల్, సత్యం సంస్థల్లో పనిచేశాడు. హఠాత్తుగా ఒకరోజు  ఉద్యోగం మానేస్తాను అన్నాడు. నా  జీవితంలో వున్న రొమాంటిసిజం వాడి సాప్ట్ వేర్ వుద్యోగంలో లేదట. ఇది తనకు విసుగ్గా వుందట.  సినిమాల్లో టెక్నీషియన్ గా పనిచేస్తాను అన్నాడు.  “మనసుని లగ్నం చేసి కృషిచేస్తే ఏ రంగంలో అయినా సరే విజయం వస్తుంది” అని మానాన్న అనేవారు. నేను నాటకాలు రాస్తున్నా  ఆడుతున్నా మా నాన్న అభ్యంతరం పెట్టేవారుకాదు. ఎక్కడయినా సరే చిత్తశుధ్ధి వుండాలనేవారు.  నేనూ మా వాడిని కాదనలేదు. సినిమారంగంలో  సక్సెస్ రేటు చాలా తక్కువ అని మాత్రం గుర్తు చేశాను. గతంలో నా గురువులు నాకు చెప్పిన మాటే తనకు చెప్పాను. “వంట చేయడం దగ్గర నుండి రాకెట్ సైన్స్ వరకు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో బేసిక్స్ కొన్ని వుంటాయి. వాటిని ముందు అధ్యయనం చేయాలి. బేసిక్స్ తెలీనివాడు జీవితకాలం గొడ్డు చాకిరీ చేస్తాడేతప్ప ఏ రంగంలోనూ రాణించలేడు. దిసీజ్ థంబ్ రూల్” అన్నాను. సినిమా అనేది విజువల్ ఆర్ట్. లెన్స్ లు, లైటింగ్ ఫిజిక్స్ కు సంబంధించినవి. ఫ్రేమ్ సెట్ చేయడం జామెట్రికి సంబంధించినది.

 

మొదట్లో, సి వనజతో కలిసి కొన్ని డాక్యుమెంటరీలు తీశాడు. ఆ తరువాత శ్రీప్రకాష్ తో కలిసి పనిచేశాడు. యూరేనియం బాధితుల మీద డాక్యుమెంటరీలు తీయడంలో శ్రీప్రకాష్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.  2009లో కమల్ హాసన్  మోహన్ లాల్, వెంకటేష్ లతో తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ (తెలుగులో ‘ఈనాడు’) సినిమాకు కెమెరా, ఎడిటింగ్ విభాగాల్లో సహాయకుడిగా పనిచేశాడు. ఇందులో, రెండు ప్రత్యేకతలున్నాయి. కమల్ హాసన్ సినిమాలో పనిచేయడం అనేది సినీ టెక్నీషియన్లకు ఒక కల వంటిది. అది అరుణ్ కు మొదటి సినిమాలోనే నెరవేరింది. ‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ భారతదేశంలో తీసిన మొదటి డిజిటల్  సినిమా. రెడ్ కెమేరాను ఆపరేట్ చేయడానికి లండన్ నుండి టెక్నీషియన్లు వచ్చారు. అలా దేశంలో తొలి డిజిటల్  టెక్నీషియన్ గా వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడ అరుణ్ కు దక్కింది. తరువాత తను ‘రెడ్’ అరుణ్ అయిపోయాడు.  ఆ తరువాత 2011లో వచ్చిన ‘గగనం’ సినిమాకు ‘డిజిటల్ టెక్నాలజీ కన్సల్టెంట్’ గా పనిచేశాడు. 

 

మన దేశంలోనికి డిజైనర్ డ్రోన్ లు రావడానికి ముందే స్వయంగా ‘డ్రోన్’ ను రూపొందించి మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో వాడాడు. అలాగే త్రీ - యాక్సిస్ గింబల్ ను తయారు చేసి రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాలో ‘ఫ్లో క్యామ్’   షాట్లు రూపొందించాడు. ఇప్పటికీ కొందరు ‘ఫ్లో క్యామ్’   షాట్లను ‘అరుణ్ షాట్’ అంటుంటారు. అలా తను స్పెషలిస్ట్ కెమేరామేన్ గా స్థిరపడ్డాడు. ‘ఫిదా’, ‘నిశ్శబ్దం’ తదితర సినిమాల్లో అమెరికాలో తీసిన స్పెషల్ సన్నివేశాలు అరుణ్ కు మంచి పేరును తెచ్చాయి. ఇవన్నీ నాకు పుత్రోత్సాహాన్ని కలిగించిన సంఘటనలు. కరోనా కాలంలో ఔడ్ డోర్ షూటింగులు తగ్గిపోవడంతో  ఇప్పుడు తను వాస్తవ ఔడ్ డోర్ సీన్లను స్టూడియోలో డిజిటల్ గా ‘ప్రతిసృష్టి’ చేసే ప్రయోగాలు చేస్తున్నాడు. సినిమా షూటింగు కోసం ఇటలీలో రెండు వారాలుండి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు.   

 

నాకు వున్నట్టే వాడి డ్రాబ్యాక్స్ వాడికున్నాయి. ప్రయోగాల్లో  నిమగ్నమయిపోయాడంటే తిండి నిద్ర ఆరోగ్యం డబ్బును కూడ పట్టించుకోడు. ఎకనామిక్స్ లో బాగా పూర్. మానాన్నకు మా అమ్మ, నాకు అజిత దొరికినట్టు వాడికి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దే జీవిత భాగస్వామి అయినా దొరకాలి. లేదా వాడే ఎకనామిక్స్ లో బేసిక్స్ అయినా నేర్చుకోవాలి.

 

అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!

Wednesday, 17 March 2021

పర్షియన్ సినిమాకు తిరుగుబాటే ప్రాణం

 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురణకు పరిశీలించగలరు. 




పర్షియన్ సినిమాకు తిరుగుబాటే ప్రాణం 

  • డానీ


ప్రపంచ సాంస్కృతిక కదలికలకు ఇరాన్ ఒక భారమితి. ఇరాన్ ను గమనిస్తేచాలు ప్రపంచ సాంస్కృతిక వాలు ఎటుందో అర్ధం అయిపోతుంది. గాలివాటం తూర్పు నుండి పశ్చిమానికి వుందో, పశ్చిమం నుండి తూర్పుకు వుందో తేలిపోతుంది.   


ఇరాన్‍ లో  రాత్రికి రాత్రి పబ్బులు, క్లబ్బులు, క్యాసినోలు వెలుస్తాయి. హఠాత్తుగా అవన్నీ మాయమైపోయి ఒక ఛాందస సంస్కృతిక  వాతావరణం నెలకొంటుంది. ఇలాంటి ఆటుపోట్ల మధ్యన ఇరాన్ సినిమా ఎదుగుతూ వుంటుంది. అక్కడి రాజకీయ వాతావరణాన్నీ, సాంస్కృతిక నిబంధనల్ని, ప్రభుత్వ నిర్బంధాన్నీ  అర్ధం చేసుకోకుండా ఇరాన్ సినిమాలను అర్ధం చేసుకోలేము. ఆ నిర్బంధం నుండి పుట్టడంవల్ల కావచ్చు ఈరాన్ సినిమాలు భిన్నంగానేగాక, భావోద్వేగాల్ని లోతుగా గట్టిగా ఒడిసి పట్టుకుంటుంటాయి.  


అన్నిదేశాల్లోనూ వున్నట్టే ఇరన్ లోనూ వాణిజ్యసినిమా, కళాత్మక సినిమా అనే రెండు విభాగాలుంటాయి. ఇరాన్ వాణిజ్య సినిమాల గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిందేమీలేదు. అవన్నీ హాలివుడ్ పోకడలతో మన తెలుగు సినిమాల్లానే వుంటాయి. ఇరాన్ సినిమాల గురించి చెప్పుకోవాల్సింది అక్కడి కళాత్మక సినిమాల గురించి. ప్రఖ్యాత ఆస్ట్రియా దర్శకుడు మైఖేల్ హనెకె, జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్మర్ హర్జోగ్ తదితరుల మాటల్లో చెప్పాలంటే “ఇరానియన్ సినిమా అంటే ప్రపంచపు గొప్ప కళాత్మక సినిమా”. 


E:\Bahram Beyzai.jpeg


బర్హమ్ బెజాయి


ఇప్పుడు ఇరాన్ కళాత్మక సినిమా డైరెక్టర్లు గొప్పవాళ్లని మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు గొప్ప తిరుగుబాటుదారులు కూడా. తిరుగుబాటుల నుండే గొప్ప డైరెక్టర్లు పుడతారన్నా తప్పుకాదు. 1960వ దశకంలో  ప్రారంభమయిన  ఇరాన్ కళాత్మక సినిమా సాంప్రదాయపు మొదటి తరానికి బహరమ్ బేజాయ్, నాసర్ తగ్వాయి ప్రాతినిధ్యం వహంచగా, రెండో తరానికి కరీమ్ మాసిహీ, అబ్బాస్ కయిరోస్టామీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి తరానికి రఫీ పిట్స్,  అస్గర్ ఫర్హదీ, మాజిద్ మాజిద్ తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాదీ ప్రుగుతూనేవుంది. 



E:\Majid Majidi.jpeg

మాజిద్ మాజిద్



Photos of

  1. Bahram Beyzai 

  2. Nasser Taqvai

  3. Karim-Masihi

  4. Abbas Kiarostami 

  5. Asghar Farhadi

  6. Majid Majidi


ఇరాన్ సినిమా  సృష్టికర్తలు  అనేక దేశాల్లో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ స్వదేశంలో వాళ్ళ పరిస్థితి వేరు. ఇరాన్ సినిమా  సృష్టికర్తలు  పశ్చిమ దేశాలకు చెందిన ఉదారవాదుల ప్రభావంతో సినిమాలు తీస్తున్నారని అక్కడి ఛాందసవాదులు తరచూ విమర్శిస్తుంటారు. ఇలాంటి అపవాదుల కారణంగా అనేకమంది దర్శకులు అరెస్టు అయ్యారు. లేదా దేశం వదిలిపోయారు. అయినప్పటికీ ఇరాన్ లో కళాత్మక సినిమా స్రవంతి నిరాఘాటంగా కొనసాగుతూనే వుంది. 


E:\Separation.jpg

జుదాయి (Separation) 


అస్గర్‍ ఫర్హదీ తీసిన ‘సెపరేషన్’ (జుదాయి) సినిమా 2012లో అస్కార్ అవార్డుల ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ పొందినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇరాన్ సమాజం తీవ్ర కల్లోలాన్ని ఎదుర్కొంటున్నట్టూ, ఇరాన్ సమాజంలో దాంపత్య జీవితం  విఛ్ఛిన్నం అవుతున్నట్టూ, ఇరాన్ యువతరం దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిధ్ధం అవుతున్నట్టూ ఈ సినిమాలో చూపించారని ఛాందసులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. 


E:\Asghar Farhadi.jpeg 

అస్గర్‍ ఫర్హదీ


ఆ ఏడాది ఇజ్రాయిల్ కు చెందిన ‘ఫుట్ నోట్’ సినిమా ఇచ్చిన గట్టిపోటీని తట్టుకుని ‘సెపరేషన్’ సినిమా అంతిమ విజయాన్ని సాధించింది.  దానితో ఇరాన్‍ లో ఛాందసులు కూడా సంతృప్తి చెందారు. ఇజ్రాయిల్ ను అరబ్ దేశాలు శత్రుదేశంగా భావిస్తాయని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇరాన్ లో సినిమా తీయడం కత్తి మీద సాములాంటిదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. 


ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యంలోవున్న అనేక ప్రేమకథలకు ఆద్యుడు పన్నెండవ శాతాబ్దపు పర్షియన్ కవి నిజామీ గంజావీ. లైలా -మజ్నూ, షీరీన్- ఖోస్రో (ఫర్హాద్) తదితర ప్రేమకావ్యాల్ని పర్షియన్ భాషలో రాసింది అతనే. ప్రేమ, విరహం, వియోగం తదితర భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి పర్షియన్ భాషలో వున్నన్ని వ్యక్తీకరణలు మరే భాషలోనూ లేవంటారు.  అప్పటి పర్షియానే ఇప్పటి ఇరాన్ ప్రాంతం. 


ప్రేమ కథా చిత్రాలు చూసి యువతరం పాడైపోతున్నదని ఆమధ్య ఈరాన్ లో ఛాందసవాదులు పెద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ప్రభావం పురాతన కావ్యాలకు కూడా తాకింది.  ఇరాన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆ మధ్య  షీరీన్- ఖోస్రో కావ్యం పునర్ ముద్రణకు అనుమతి నిరాకరించింది.  యుధ్ధంలో ఖోస్రో చనిపోవడంతో షీరీన్ ఆత్మహత్య చేసుకుంటుంది. అంతకు ముందు ఆమె  ఖోస్రో భౌతిక కాయాన్ని కౌగలించుకుని ఏడుస్తుంది. ఆ సన్నివేశం మీద ఇరాన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారులు తీవ్ర ఆక్షేపణ  తెలియజేశారు. దానితో  ఆ పుస్తక ప్రచురణ ఆగిపోయింది. దాదాపు వెయ్యేళ్ళ తరువాత ఆ పుస్తకం నిషేధానికి గురయింది. 



E:\Abbas Kiarostami.jpeg

అబ్బాస్ కియారోస్తామీ


ఇరాన్ సినిమా దర్శకులు తెలివైనవాళ్ళు. ప్రభుత్వ ఆక్షేపణల నుండి తప్పించుకోవడం వాళ్లకు బాగా తెలుసు. సుప్రసిధ్ధ ఇరాన్ దర్శకుడు అబ్బాస్ కియారోస్తామీ ఒక కొత్త ఎత్తుగడతో 2008లో షీరిన్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో షీరిన్ వుండదు, ఖోస్రో వుండడు. అసలు ఆ కావ్యానికి చెందిన ఒక్క పాత్ర కూడా వుండదు.  ఒక సినిమా హాలులో షీరీన్ అనే ఒక పాత సినిమాను ప్రదర్శిస్తుంటారు.  హాలు నిండా మహిళా ప్రేక్షకులే వుంటారు. మొత్తం సినిమాలో ఒక్కసారి కూడా తెరను చూపరు. మాటలు, గుర్రాల సకిలింపులు, యుధ్ధంలో కత్తుల ఘర్షణ వగయిరాలన్నీ నేపథ్యంలో వినపడుతుంటాయి. షీరీన్ సినిమా చూస్తున్న మహిళా ప్రేక్షకుల భావోద్వేగాలను అత్యంత దగ్గర నుండి చూపడమే అబ్బాస్ కియారోస్తామీ సినిమా ప్లాట్. 


E:\Shirin - 1.jpg

షీరిన్ (2008)



అరబ్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన దాదాపు వంద మంది హీరోయిన్లు ఇందులో నటించారు. దాదాపు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వుంటారు. అన్నీ క్లోజప్ షాట్లే వుంటాయి. లాంగ్ షాట్, మీడియం షాట్ వగయిరాలు ఏమీ వుండవు. కెమేరా ప్యాన్, టిల్ట్, రొటేట్ కూడా అవ్వదు. జూమ్ అనే ప్రసక్తే లేదు. కెమేరాను ఒక చోట పాతేసి ఒక్కో నటిని దాని ముందు కూర్చోబెట్టి సన్నివేశానికి తగ్గట్టు భావోద్వేగాల్ని ప్రదర్శించమన్నాట్టా  అబ్బాస్ కియారోస్తామీ. ఈ సినిమాను అబ్బాస్ లివింగ్ రూమ్ లోనే తీశారంటారు. అలా వుంటుంది పర్షియన్ దర్శకుల తిరుగుబాటు. 


ఇరాన్ లో నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న మరో దర్శకుడు  జఫర్ పనాహి.  అబ్బాస్ కియారోస్తామీ  దగ్గర చాలాకాలం సహాయకునిగా పనిచేసిన జఫర్ 1995లో స్వీయదర్శకత్వంలో నిర్మించిన తొలిచిత్రం  వైట్ బెలూన్ తోనే  తన సామర్ధ్యాన్ని చాటి చెప్పాడు. ఓ ఏడేళ్ళ   చిన్న పిల్ల కొత్త సంవత్సరం రోజు ఇంట్లో అక్వారియంలో పెంచుకుందామని  గోల్డ్ ఫిష్ కొనడానికి వెళ్ళి పడిన పాట్లను చిత్రించిన ఈ సినిమా  ప్రపంచ సినిమా చరిత్రలో గొప్ప స్థానాన్ని సాధించేసింది. 


E:\Jafar Panahi.jpg

జఫర్ పనాహి


తన సినిమాల్లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు జఫర్ పనాహిని 2010లో అరెస్టు చేశారు. పౌరహక్కుల సంఘాల ఆందోళన ఫలితంగా అతనికి బెయిల్ వచ్చినప్పటికీ ఒక ఇరవైయేళ్ళపాటు సినిమాలు తీయకూడదనీ, విదేషాలకు వెళ్ళకూడదనీ నిషేధం కొనసాగుతూనేవుంది.  అలాంటి నిర్బంధంలోనూ జఫర్ పనాహి సినిమాలు తీయడం మానలేదు. వాటి కోసం కొత్త టెక్నిక్ కగొన్నాడు. 2011లో తీసిన దిసీజ్ నాట్‍ ఏ ఫిల్మ్, 2013లో తీసిన క్లోజ్డ్ కర్టైన్ అతని ప్రసంసలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆ వరసలో  తీసిన డాక్యూ ఫిక్షన్ టాక్సీ (టాక్సీ టెహరాన్).  గతేడాది బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో  ఈ సినిమా ఉత్తమ చిత్రంగా గోల్డేన్ బేర్ ను అందుకుంది. 


టెహరాన్ జీవితాన్ని ఆవిష్కరించడమే పనాహి ట్రయాలజీ సినిమాల లక్ష్యం.  టెహరాన్ లో టాక్సి డ్రైవరుకు కారులో సాగిన ఒకరోజు అనుభవమే ఈ సినిమా. నిబంధనల రీత్యా కెమేర ఎక్కడా కారు దిగదు. డ్రైవర్ స్థానంలో పనాహీ వుంటాడు. ట్యాక్సీ ఎక్కే రకరకాల ప్యాసింజర్స్ తో జరిగే సంభాషణే ఈ సినిమా. ప్యాసింజర్లలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పేదలు, ధనవంతులు, హైస్కూలు పిల్లలు, సనాతనులు, ఉదారవాదులు, పైరసీ సీడీలు అమ్మేవాళ్ళు, మానవహక్కుల కార్యకతలు వుంటారు. సినిమాలు ఎలా తీయాలనే చర్చతోపాటూ, క్రీడారంగంలో మహిళల ప్రాతినిధ్యం పెంచాలంటూ పోరాడుతున్న  ఇరాన్ న్యాయవాది  గొంచే ఘవామీ   (Ghoncheh Ghavami) అరెస్టు గురించి కూడా ప్యాసింజర్లు చర్చిస్తారు. ఇందులో ప్యాసింజర్లుగా కనిపించేవారెవరూ వృత్తినటులు కాదు. మానవహక్కుల న్యాయవాది నస్రీన్ సొతౌదే, పనాహి మేనకోడలు హైస్కూలు విద్యార్ధి  హనా సయీదీ తమ నిజజీవిత పాత్రల్లో కనిపిస్తారు.  నిషేధం కారణంగా  బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు జాఫర్ పనాహీ  వెళ్లలేకపోయాడు. గోల్డేన్ బేర్ ట్రోఫినీ అతని మేనకోడలు హనా సయీదీ అందుకుంది. బెర్లిన్ జ్యూరీ అధ్యక్షుడు డారెన్ అరొనోఫ్ స్కీ ఉత్తమ చిత్రం అవార్డును అందజేస్తూ ‘టాక్సీ’ ని "a love letter to cinema...filled with love for his art, his community, his country and his audience." అంటూ కొనియాడాడు.  


ఇరాన్ ఆర్ట్ ఫిలిమ్స్ ప్రేరణతో ఇటలీలో నియో రియలిజమ్ సినిమా వికసించిందని అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం హైదరాబాద్ లోనూ కనిపిస్తోంది. జఫర్ పనాహీ మీద ప్రేమతో రోహిత్-శశి సంయుక్తంగా దర్శకత్వంలో అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి నిర్మించిన ‘ఏ లవ్ లెటర్ టు సినిమా’ను ఇటీవల హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ త్రయం హైదరాబాద్ మీద నిర్మించిన సినిమాలత్రయంలో ఇది మూడోది. హైదరాబాద్ లోని సినీజీవుల కష్టాల్ని ఈ సినిమా చిత్రిస్తుంది.  


(రచయిత సీనియర్  పాత్రికేయులు) 

మొబైల్ : 9010757776