వాడి ఇల్లు ఒక ఆధునిక కమ్యూన్ !
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 25 September 2022
వాడి ఇల్లు ఒక ఆధునిక కమ్యూన్ !
వాడి ఇల్లు ఒక ఆధునిక కమ్యూన్ !
Friday, 23 September 2022
నాలాంటి వాళ్లను ఎప్పుడూ నమ్మకండి.
నాలాంటి వాళ్లను ఎప్పుడూ నమ్మకండి.
రాత్రి మీ పరిస్థితి నాకు పూర్తిగా అర్ధం అయింది.
గతం గురించి మరచిపొండి.
అది మీకు నష్టాన్నీ, కష్టాన్ని కలుగచేస్తూ వుంటుంది.
ముందు ఇంటి పని నుండి బయటపడండి.
వంట పనికి, అంట్ల పనికి ఇద్దరు పని మనుషుల్ని పెట్టుకోండి.
చిన్న కుటుంబాల్లో ఇద్దరు పని మనుషులు నెలకు ఓ ఆరు వేల రూపాయలకు వస్తారు.
అలా దొరికిన సమయాన్ని ఇతర రంగాల్లో పనిచేస్తే ఆ ఆరు వేల రూపాయలకన్నా ఎక్కువ వస్తాయి.
మనుషులు శారీరక శ్రమ నుండి మేధో శ్రమ వైపుకు, గ్రామాల నుండి పట్టణాలకు ప్రయాణం చేస్తారు.
ఇంటి పని నుండి బయట పడ్డాక మీ కొత్త జీవిత భాగస్వామి కోసం వెతకండి.
అతను సింగిల్ అయ్యుండాలి.
మీరు అతనికి అతను మీకు నచ్చాలి.
వీలుంటే రిజిస్టర్ మేరేజ్ చేసుకోండి.
అధికారిక రికార్డులు అన్నింటిలోనూ మీ పేరు చేరేలా చూసుకోండి.
మీలో ఎవరు చనిపోయినా ఆస్తి పంపకాలు ఎలా జరగాలి అనేది స్పష్టంగా రూపొందించుకుని రిజిస్టర్డ్ వీలునామా రాసుకోండి.
సహజీవనంలో ఇలాంటి లీగల్ అంశాలను పట్టించుకోకపోవడంవల్లనే మీ విశాఖపట్నానికే చెందిన జగత్ ధాత్రి బలవన్మరణానికి గురయ్యారు.
ఆస్తి వున్నప్పుడు దానికి కొన్ని నియమాలుంటాయి. వాటిని పాటించి తీరాలి.
ఆస్తికి అతీతమైన ప్రేమ వుంటుందని నమ్మితే దానికే కట్టుబడి వుండాలి.
అతనికి ఆస్తితోపాటూ ముందుగానే సంతానం వున్నా, మీకూ ఆస్తితోపాటు సంతానంవున్నా మీ రెండో వివాహం అంత సులువు కాదు.
ఆస్తి దగ్గర మనుషులు కుక్కలకన్నా హీనంగా ప్రవర్తిస్తారు. అటు అతని వారసులు ఇటు మీ వారసులు కొట్లాడుకుంటారు.
ఈ ఆస్తి వివాదాలు లేకుండ, పెళ్ళి లేకుండ, సహజీవనం చేసే పరిష్కారం కూడ ఒకటి వుంది.
అప్పుడూ దాని నియమాలు దానికుంటాయి. వాటిని పాటించాల్సి వుంటుంది.
మనుషులు సాధారణంగా దాంపత్యం ఎలా వుండాలని ఆలోచిస్తారు.
మరణం తరువాత ఈ లోకంలో జరిగే పరిణామాల్ని గురించి కూడ ఆలోచించాలి.
ముందు మీరు మీ మాజీ భర్త మీద భావోద్వేగ కవితలు రాయడం మానేయండి.
నాలాంటి వాళ్లను ఎప్పుడూ నమ్మకండి.
ఎవరయినా ప్రేమ నిండిన కళ్ళుగల ఇమోజీలో, ఎర్రటి హృదయాలో, పెదాలో పంపితే నేనూ బోలెడు సరదా కబుర్లు చెపుతుంటాను. అది ఆ క్షణపు సరదా మాత్రమే. దీన్ని శాశ్వితం చేసుకోవాలని వారూ అనుకోరు నేనూ అనుకోను.
మీకు అన్నీ మంచే జరగాలని ఆశిస్తాను.
Thursday, 22 September 2022
Hijab Controversy in Iran - Protest against the State.
హిజాబ్ వివాదం : రాజ్యంపై తిరుగుబాటు
Andhrajyothi Fri, 23 Sep 2022
మైసూర్ యూనివర్శిటీలో నేను కొన్నాళ్ళు ఏంఏ సోషియాలజీ చదివాను. మొదటి సంవత్సరం వైవాకు కూడ అటెండ్ అయ్యాను. వైవా సందర్భంగా ‘అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ’ అని నన్ను పిలిచి ప్రొఫెసర్ ఒక ప్రశ్న వేశారు. ‘ప్రపంచ ఆధునీకరణకు ముస్లిం దేశాల్ని భారమితిగా ఎందుకు పరిగణిస్తారు? అనేది ఆ ప్రశ్న. దానిని విని నేను కొంత కంగారుపడ్డాను. మొదటిది; నేను అప్పటికే ‘డానీ’ అనే పిలుపుకు అలవాటు పడిపోయాను. అహమ్మద్ మొహిద్దీన్ అనేది నా పేరు అని కూడా మరిచిపోయాను. రెండోది; నేను ముస్లిం కాబట్టి ముస్లింలకు సంబంధించిన ప్రశ్న వేశారని కొంచెం ఇబ్బందిగానూ ఫీల్ అయ్యాను. మూడోది; అప్పటికి ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. దాన్ని సిలబస్‌లోనూ ఎక్కడా చెప్పలేదు.
బిక్కముఖం వేసుకుని నిలబడడం కన్నా, మరో ప్రశ్నలో అదృష్టాన్ని పరిశీలించుకుందామని ‘పాస్’ అన్నాను. వారు మరో ప్రశ్న వేశారు. ‘ఊరేగింపులు, ఉత్సవాల్లో మనుషులు తమ శక్తికి మించిన ఉత్సాహంతో పాల్గొంటారు. ఎందుకు?’ అని అడిగారు. అది ఎమిలీ డర్ఖేమ్ ‘సంఘీభావం’కు సంబంధించిన ప్రశ్న అని నాకు వెంటనే అర్థం అయిపోయింది. మార్క్స్ తరువాత నాకు ఇష్టమైన సమాజశాస్త్రజ్ఞుడు డర్ఖేమ్. పైగా జీవితంలోనూ, విద్యాలయంలోనూ నాకు ఇష్టమైన అంశం సంఘీభావం. నా శక్తి మేరకు సాలిడారిటీని వివరించాను. పాస్ మార్కులు వచ్చాయి. వైవా అయిపోయాక కూడ ఆ మొదటి ప్రశ్న మీద నా ఆసక్తి తగ్గలేదు. ఆ ప్రొఫెసర్ ఛాంబరుకు వెళ్ళి నాకు జ్ఞానబోధ చేయమని అడిగాను. నేను చూపించిన ఆసక్తికి ఆయన చాలా సంతోషించారు. ఆ ప్రశ్నకు చాలా సుదీర్ఘమయిన వివరణ ఇచ్చారు.
‘‘ఏ దేశంలో అయినా ఏదైనా మతాచారంగానీ, సంస్కృతిగానీ మారాలంటే సాధారణంగా అనేక సంవత్సరాలు పడుతుంది. దశాబ్దాలు గడిచిపోతాయి. కొన్నిసార్లు శతాబ్దాలూ పట్టవచ్చు. కానీ పశ్చిమాసియా దేశాలు అందుకు భిన్నం. ఉదాహరణకు ఇరాన్‌ను చూడు. అక్కడ రాత్రికి రాత్రి సర్వం మారిపోతుంది. ఒకడు అధికారానికి రాగానే పశ్చిమ దేశాల సంస్కృతిని అలవర్చుకోవాలని ప్రకటిస్తాడు. అంటే ‘ఆధునికత’ అన్నమాట. అంతే.. రాత్రికి రాత్రి అక్కడ అంతా మారిపోతుంది. బార్లు, పబ్బులు, క్లబ్బులు, జీన్స్, టీ షర్ట్స్, బీచ్ పార్టీలు, పేకాట క్లబ్బులు, కేసినోలు అన్నీ వచ్చేస్తాయి. ఇంకో పదేళ్లకు దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొకడు అధికారానికి వస్తాడు. తూర్పు దేశాల సంస్కృతిని పరిరక్షించాలంటాడు. అంటే ‘ఛాందసం’ అన్నమాట. వెంటనే పైన చెప్పినవన్నీ పోతాయి. మతాచారాలు మరింత ఛాందస రూపంలో అమలవడం మొదలవుతుంది. ఇది తూర్పు దేశాల సంస్కృతి అన్నమాట. అందుచేత, ప్రపంచంలో తూర్పుగాలి వీస్తున్నదో, పశ్చిమగాలి వీస్తున్నదో తెలుసుకోవాలంటే పశ్చిమాసియా దేశాలను; మరీ ముఖ్యంగా ఇరాన్ పరిణామాలను; అధ్యయనం చేయాలి’’ అన్నారు.
ఇప్పుడు ఇరాన్‌లో మహిళలు సాగిస్తున్న హిజాబ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల గురించి వింటున్నపుడు ఆనాటి మా ప్రొఫెసర్ మాటలు గుర్తుకొచ్చాయి. అయితే, ఆనాడు నాకు రాని సందేహాలు అనేకం ఇప్పుడు వస్తున్నాయి.
ఆసియా ఖండంలో మనుషుల భావోద్వేగాలు చాలా తీవ్రంగా వుంటాయి. ప్రపంచమతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయన్నది మనం ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి. "దేశాధినేత ఆదేశాల మేరకు మతాలు పుట్టవు. ప్రజల్లో బలంగా ఉండే మతభావనలనే దేశాధినేతలు క్రోడీకరించి ఒక మతంగా మారుస్తారు" అని ఓ సందర్భంలో ఫ్రెడరిక్ ఏంగిల్స్ అన్నాడు. అంచేత, ఇరాన్‌లో పశ్చిమ గాలులు వీస్తున్నప్పుడు దేశాధినేత హిజాబ్ తీసేయమని ఆదేశించగానే ఇరాన్ మహిళలందరూ హిజాబ్‌లు తీసేశారా? తీయరు. కొందరయినా దాన్ని ప్రతిఘటించి ఉంటారు. ప్రతిఘటించారు కూడా. ఎందుకంటే రాజ్యానికీ ప్రజలకు మధ్య నిరంతరం ఒక వైరం ఉంటుంది. హిజాబ్ ఒక మాధ్యమం మాత్రమే అసలు సంగతి రాజ్యం. రాజ్యం మీద ప్రజల నిరసన.
కేన్సర్ ట్రీట్‌మెంటు కారణంగా జుట్టు ఊడిపోయిన వారికి సంఘీభావం తెలుపడానికి కొందరు తమ జుట్టును తీసేస్తారు. 1980లలో కమ్మర్షియల్ సెక్స్ వర్కర్ ఒకామెను పోలీసులు స్టేషన్ కు పట్టుకునివచ్చి శిరోముండనం చేశారు. ఆ వార్త విని బెజవాడ అట్టుడికిపోయింది. పోలీసుల అకృత్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం సాగింది. అదీ శిరో ముండనమే, ఇదీ శిరోముండనమే. మొదటిది సంఘీభావం.; రెండోది నిరసన. చాలామంది ఈ మౌలిక తేడాను గుర్తించక హిజబ్ ంచాలా? తీసేయాలా? అని చర్చిస్తుంటారు. రాజ్యాన్ని మినహాయించి చేసే చర్చలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే అవుతాయి.
ఇప్పుడు ఇరాన్‌లో తూర్పు గాలులు వీస్తున్నాయి. దేశాధినేత హిజాబ్‌ను ధరించి తీరాలంటున్నారు. రాజ్యాన్ని ప్రశ్నించేవాళ్ళు టోకెన్ ప్రొటెస్ట్‌గా అయినా నడిరోడ్డు మీద నిలబడి హిజాబ్ తీసేస్తారు. పొడుగాటి జుట్టును విరబోసుకుంటూ నడివీధుల్లో తిరుగుతారు. ఇప్పుడు ఇరాన్ మహిళలు ఆ పనే చేస్తున్నారు. ఇరాన్ నిరసనల్లో ఎనిమిది మంది చనిపోయినట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే కావచ్చు.
ఇది పైకి మతవ్యవహారంగా కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో ఇది రాజ్యం మీద తిరుగుబాటు. కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలయ్యాక ‘ఇది ఇస్లాం ధార్మిక మతాచారాల్లో ప్రాథమికమైనదా?’ అనే ప్రశ్నను సుప్రీం కోర్టు లేవనెత్తింది. హిజాబ్ ఇస్లాంలో ప్రాథమికమైనదా? ద్వితీయమైనదా? అలంకారప్రాయమైనదా? అనేవి కావు ప్రశ్నలు. ఎబివిపి సభ్యులు వచ్చి హిజాబ్ తీసేయమంటే ముస్లిం విద్యార్ధినులు తిరస్కరించారు. వాళ్ళు ఎబివిపిలో రాజ్యాన్నీ, అధికారాన్నీ చూశారు. రాజ్యాన్నీ, అధికారాన్నీ, సాంస్కృతిక ఆధిపత్యాన్నీ ధిక్కరించాలనుకున్నారు. ఇది లీగల్ సమస్య కాదు; ఇది ఆత్మగౌరవ సమస్య. ఈ విషయం సుప్రీంకోర్టుకు ఎప్పటికి అర్థం కావాలి?
ముస్లిం మహిళలు రోడ్లెక్కడమూ, ధర్నాలు, నిరసనలు చేయడం ఇస్లాం ధర్మంలో ప్రాథమికమా? ద్వితీయమా? అసలు ముస్లిం మహిళలకు ఆ హక్కు వున్నదా? లేదా? అనేవి అర్థం లేని చర్చలు. అధికారాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు రోడ్డు మీదికి వచ్చారు. దేశ రాజధానికి వచ్చే ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. వాళ్ళు ప్రభుత్వ భక్తుల్నే కాక, ముస్లిం ఛాందసుల్ని కూడ పక్కనపెట్టారు.
- అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)
ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్
https://www.andhrajyothy.com/telugunews/the-hijab-controversy-rebellion-against-the-state-ngts-editorial-182209230129528
Tuesday, 20 September 2022
On Fascism - Tammineni Veerabhadram
"భారతదేశాంలో ఫాసిజం వచ్చే అవకాశాలు లేవు" "నేటి మోదీ పాలనను ఫాసిస్టు అని అనలేం”
Monday, 19 September 2022
We can not term it a Fascism - Tammineni Veerabhadram
నేటి మోదీ పాలనను ఫాసిస్టు అని అనలేం”
Only Speech No Videos
ప్రసంగించమని చాలా ప్రేమగా పిలుస్తారు
ప్రసంగం వీడియోను ఒక జ్ఞాపకంగా మాత్రం ఇవ్వరు!
సభలకు నన్ను వక్తగా పిలిచేవారు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. అసలు మన మీద ప్రత్యేక అభిమానం వుంటేనేగా వాళ్ళు వక్తగా పిలిచేది!. ఏసి టూ టైర్ ట్రైన్ టిక్కెట్టు ఇస్తారు; ఏసి డబల్ బెడ్ రూం లో బస ఏర్పాటు చేస్తారు. మంచి భోజనం పెడతారు. ఉదయాన్నే రైల్వేస్టేషన్ వద్ద రిసీవ్ చేసుకుంటారు. రాత్రి మళ్ళీ స్టేషన్ కు వచ్చి వీడ్కోలు చెపుతారు. వచ్చే ఏడాది కూడ మీరే మా మెయిన్ స్పీకర్ అంటారు. అప్పుడుడప్పుడు శాలువ కూడ కప్పి అభిమానం చాటుకుంటారు.
అయితే కొందరు సభకు సంబంధించిన కొన్ని బేసిక్స్ ను మరచిపోతారు. అది వాళ్ల తప్పుకాదు; వాళ్ళకు బేసిక్స్ తెలీవు. నిపుణులను అడిగి బేసిక్స్ తెలుసుకోవాలని తెలియకపోవడం మాత్రం పెద్ద తప్పే.
సభలో ప్రాణప్రదమైన అంశం సౌండ్ అండ్ లైట్. సౌండ్ లో ఐదు అంశాలుంటాయి. మైక్రో ఫోన్, స్టాండ్, పోడియం, సౌండ్ సిస్టమ్, ఆకోస్టిక్స్. చాలా చోట్ల చేతికి మైకి ఇచ్చి మాట్లాడమంటారు. అలాంటి చోట్ల నాకు మూడు నాలుగు నిముషాల కన్నా ఎక్కువ సేపు మాట్లాడడం చాలా కష్టం. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని అనుభవించడానికి చాలా స్ట్రేయిన్ పేయిన్ ను చవిచూడాల్సి వస్తుంది.
కొందరికి త్రీ-పాయింట్ లైటింగ్ గురించి బొత్తిగా తెలీదు. స్పీకర్ వెనుక లైటింగ్ పెడతారు. స్పీకర్ ముఖం మీద లైటింగ్ వుండదు. అప్పుడు స్పీకర్ సిల్హౌటీలో ప్రేక్షకులకు నల్లగా దయ్యంలా కనపడుతుంటాడు. స్పీకర్ ముఖకవళికలు అస్సలు కనిపించవు. స్పీకర్, శ్రోతల మధ్య ఒక అన్యోన్య సంబంధం ఏర్పడకపోతే ఎన్నడూ ఉపన్యాసం రక్తికట్టదు.
ఉపన్యాసం అనేది ప్రదర్శనకళ. పెర్ఫార్మింగ్ ఆర్ట్. ఆడియో విజువల్ ప్రాడక్ట్. ఆ ఫెసిలిటీస్ అన్నీ దానికి ప్రాధమిక అవసరాలు.
పది మందిలో ఒక స్పీకర్ గా పిలిస్తే దానికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం వుండదు. సందర్భాన్నిబట్టి స్పాంటేనిటీని ఉపయోగించి రెండు మూడు నిముషాలు మాట్లాడితే సరిపోతుంది.
ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేక అంశం మీద సమగ్రంగా ప్రసంగించడానికి పిలిచినపుడు దానికి కనీసం ఓ పది రోజుల ప్రిపరేషన్ అవసరం అవుతుంది. కావలసిన రీసెర్చ్, రిఫరెన్సెస్ పూర్తి అయ్యాక నేను పాయింట్ల వారీగా నోట్స్ రాసుకుంటాను. ఉపన్యాసం ఇవ్వడానికి ఓ నాలుగు రోజుల ముందే నిర్వాహకులకు నా ఉపన్యాసం ప్రసంగ పాఠం కాపీ పంపుతాను. వాళ్ళు తమకు ప్రత్యేక ఆసక్తిగల మరికొన్ని అంశాలను చేర్చమంటారు. అనవసర అపార్ధానికి అవకాశం వుంటుందనుకునే కొన్ని అంశాల్ని తీసేయమంటారు. వాళ్ళ సూచనలు వచ్చాక పైనల్ కాపీ తయారు చేసుకుంటాను.
"ఇక ముగించాలి" అని అధ్యక్షుడు అనడానికి ముందే ప్రసంగాన్ని ముగించడం మంచి సాంప్రదాయం. ఇచ్చిన దానికన్నా ఎక్కువ సమయం ప్రసంగించి ఇతర వక్తల సమయాన్ని హరించే హక్కు ఏ వక్తకూ లేదు. నా ప్రసంగానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు అని నిర్వాహకుల్ని ముందే అడుగుతాను . నిర్వాహకులు సాధారణంగా మనకు 30 నిముషాల వ్యవధిని ఇస్తారు. సబ్జెక్ట్ విస్తారాన్ని బట్టి కొందరు 45 నిముషాలు, ఒక గంట కూడ వ్యవధి ఇస్తారు. వారు చెప్పిన వ్యవధిని దాటకుండ నా ప్రసంగాన్నీ జాగ్రత్తగా ఎడిట్ చేసుకుంటాను. ఒకసారి రిహార్సల్ కూడ చేస్తాను. అది ఇక నేరుగా ప్రింటర్ కాపీగా మారిపోతుంది.
కొందరు నిర్వాహకులు మొదట ఫోన్ చేసినపూడు తగిన సమయమే కేటాయిస్తారు. తీరా సభ మొదలయ్యాక వాళ్ళకు కొన్ని లోకల్ ఆబ్లిగేషన్స్ గుర్తుకు వస్తాయి. జాబితాలో లేనివాళ్లనూ వేదిక మీదికి పిలుస్తారు. ఈ ఆబ్లిగేషన్ స్పీకర్లు మాట్లాడిన సమయాన్ని ప్రధాన వక్తకు కేటాయించిన సమయంలో కోత వేస్తారు. ఇక ఆ ఉపన్యాసం ఒక లాంఛన ప్రాయంగా మారిపోతుంది.
నన్నొక ఇంపార్టెంట్ స్పీకర్ గా పిలిచిన ప్రతి సభకూ నేను కొత్త బట్టలతో వెళతాను. ఆ కొత్త బట్టలు ఆ ఉపన్యాసానికి గుర్తుగా వుంటాయి. వాటిని చూసినపుడు ఆ ఉపన్యాసం, దాన్ని నిర్వహించినవారు, మెచ్చుకున్నవారు, విబేధించినవారు, సూచనలు చేసినవారు, ఆనాటి వాతావరణం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ బట్టల జతకు అంతటి ఎటాచ్ మెంట్ వుంటుంది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మెమెంటో అన్నమాట!
ఉపన్యాసానికి పాయింట్లు రాసుకుని సాప్ట్ / హార్డ్ కాపీలతో వెళ్ళినపుడు అనివార్యంగా పోడియం, మైక్రోఫోన్ స్టాండ్ కావాలి. అవి రెండూ లేకుండ కేవలం మైక్ చేతికి ఇస్తే మన కుడిచేతిని కట్టేసినట్టే. ఎడమ చేతిలో కాగితాలుంటాయి. లేదా సాఫ్ట్ కాపీతో సెల్ పోన్ వుంటుంది. అక్కడికి వక్త సగం చచ్చిపోతాడు. తోడేలును భోజనానికి పిలిచి సన్నటి కూజాలో పాయసం పెట్టిన కొంగ కథ గుర్తుకు వస్తుంది. వక్తల్ని 'దివ్యాంగులు'గా మార్చి ప్రసంగించమనడం ఏం న్యాయం?
ఉపన్యాసానికి ఎప్పుడైనా బలాన్ని ఇచ్చేది సబ్జెక్ట్, సందర్భం. ఆ తరువాత మంచి ఉపన్యాసానికి ఇంకో రెండు దినుసులు కావాలి. ఇందులో మొదటిది; వేదిక ముందు వుండే శ్రోతల శ్రధ్ధ. ఉపన్యాసాన్ని శ్రోతలు శ్రధ్ధగా వింటుంటే ఉపన్యాసకుడి బాధ్యత పెరుగుతుంది. ఉపన్యాసం ఇంకా మెరుగుపడుతుంది. రెండోది, వేదిక మీద వుండే సాటి వుపన్యాసకులు. తనతో సమఉజ్జీగా భావించే మరో ఉపన్యాసకుడు వేదిక మీద వుంటే ఉపన్యాసకునిలో పోటీతత్వం పెరుగుతుంది. అప్పుడూ ఉపన్యాసం గొప్పగా రక్తికడుతుంది.
ఇక్కడితో నిర్వాహకులు తమ పని పూర్తయిపోతుంది అనుకుంటారు. కానీ, ఉపన్యాసలకు మరో ముఖ్యమైన బాధ్యత మిగిలే వుంటుంది. అదే ఉపన్యాసానికి ఆడియో వీడియో కాపి. చాలా మంది నిర్వాహకులు ఈ బాధ్యతను చాలా నిర్లక్ష్యం చేస్తారు. ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ ను పెట్టుకోరు. ఈ రోజుల్లో అదేమి ఖరీదయిన వ్యావహారం కాదు. 1000 - 1500 రూపాయలిస్తే అన్నీ తామే చూసుకుని ఎడిట్ కాపీని పెన్ డ్రైవ్ లో వేసి ఇచ్చే వీడియోగ్రాఫర్లు దాదాపు అన్ని పట్టణాల్లోనూ వున్నారు. మీటింగ్ ఖర్చుతో పోలిస్తే ఇది పెద్ద లెఖ్ఖలో ఖర్చుకాదు. వక్తల ట్రావెలింగ్ ఫేర్ , ట్రావెలింగ్ అలవెన్సెస్, క్యాబ్స్ కాస్ట్ , ఏసి వసతి, భోజనం వగయిరాలకు ఒక్కొక్కరికి సగటున 8 వేల రూపాయలు అవుతాయి. అలా పోల్చినా వీడియో గ్రాఫర్ ఖర్చు పెద్దదేమీకాదు.
స్మార్ట్ ఫోన్లు వుంటే చాలు ఎవరయినా సరే వీడియో తీసేయవచ్చనే భ్రమల్లో చాలామంది వుంటారు. కొన్ని చోట్ల ఏకంగా నిర్వాహకుల పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి తమాషా చూస్తుంటారు. మరికొన్ని చోట్ల కెమేరా ఫిజిక్స్ గురించీ, ఫ్రేమ్ జామెట్రీ గురించి, ఎక్స్ పోర్ట్ రిజల్యూషన్ గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికి ఈ బాధ్యతను అప్పచెపుతారు.ఇంతటి నిర్లక్ష్యాన్ని నేను భరించలేను. చాలా అసహనానికి గురవుతాను.
ఒక చారిత్రక సందర్భంలో ఒక సభను నిర్వహిస్తున్నవారికి ఆ సంఘటనను చరిత్రలో పదిలపరచాలనే స్పృహ వుండాలి.
ఈ అమెచ్యూర్ కెమేరామన్ లకు కొన్ని సూచనలు చేయాలనిపిస్తున్నది. ఫొటోలు తీసే సమయంలో కెమేరాను వర్టికల్ (పోట్రెయేట్)గానూ పట్టుకోవచ్చు. హారిజాంటల్ (ల్యాండ్ స్కేప్)గానూ పట్టుకోవచ్చు. కానీ, వీడియో తీసే సమయంలో విధిగా హారిజాంటల్ (ల్యాండ్ స్కేప్) యాంగిల్స్ లో మాత్రమే తీయాలి. ఈ వీడియోను స్మార్ట్ టీవీలో చూసేటప్పుడు ఎలావుంటుందనే ఆలోచన వుండాలి. ఎక్కడెక్కడ గ్రాఫిక్ ప్లేట్స్ వస్తాయి అనే ఊహ వుండాలి. మిగిలిన స్పేస్ లో మన ఆబ్జెక్ట్ ను ఎలా కంపోజ్ చేయాలనేది చాలా ముఖ్యం. అదే సృజనాత్మకత.
లక్షన్నర రూపాయల ఖరీదు చేసే ఆపిల్ ఫోన్లు కాకపోయినా ఇరవై వేల రూపాయల విలువచేసే MI 10i ఫోన్లలోనూ Full High Defenition (FHD 1920 X 1080p) రిజల్యూషన్ వస్తుంది. అంతకు తక్కువ రిజల్యూషన్ వుంటే ఆ వీడియో ఎందుకూ పనికిరాదు; ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాము అని సంతృప్తిపడడానికి తప్ప. FHD రిజల్యూషన్ లో రికార్డ్ అయిన వీడియో ఫైల్ ను అవసరాన్ని బట్టి అనేక రకాలుగా వాడవచ్చు. 4K, 8K రిజల్యూషన్లు అందుబాటులో వున్న కాలంలో కనీసం FHD రిజల్యూషన్ లో అయినా వీడియో తీయకపోతే ఆ వీడియోగ్రాఫర్ ను పురాతత్వ ప్రదర్శనశాలలో పెట్టాలి.
వీడియో తీసే సమయంలో ప్రతి 20-30 నిముషాలకు ఒక కట్ వేసుకోవాలి. వక్తను జాగ్రత్తగా గమనిస్తూ అతను పాజ్ తీసుకున్నప్పుడో, మంచినీరు తాగుతున్నప్పుడో కట్ వేసుకుంటే మరీ మంచిది. 30 నిముషాల లోపు వుండే ఫైల్స్ ను డౌన్ లోడింగ్ - అప్ లోడింగ్ -చేయడం సులువు. భారీ ఫైల్స్ ఒక్కోసారి అప్ లోడింగ్ -డౌన్ లోడింగ్ జరగవు. దిగువస్థాయి కంప్యూటర్లలో స్ట్రక్ అయిపోతాయి.
సభల వీడియోలవల్ల ఒక విశాల ప్రయోజనం వుంటుంది. సాధారణంగా మన సభలకు ఓ వందమంది వస్తుంటారు. కరోనానంతర కాలంలో అంతమంది కూడ రావడంలేదు. ఆ సభ ప్రసంగాల వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే కనీసం ఇంకొ 2, 3 వందల మంది చూస్తారు. సభల్ని నిర్వహించేది భావప్రచారం కోసమే కనుక ప్రసంగాల వీడియోలు తప్పని సరి.
మొన్న సెప్టెంబరు 14న నేను MI 10i మొబైల్ ఫోన్ మీద తీసిన భార్గవ గడియారం ప్రసంగం వీడియో లింకుల్ని కింద కామెంట్స్ లో పెట్టాను. ఓసారి చూడండి. అదే సభలో నేను కూడ ప్రసంగించాను. నా ప్రసంగాన్ని ఎవరూ ప్రాపర్ గా వీడియో తీయలేదు. ఒకరు తీశారుగానీ, వారు. కెమెరాను కత్తిలా నిలువుగా పట్టుకుని ఫేస్ బుక్ లో లైవ్ ఇస్తున్నారు. అలా కెమేరాను నిలుగా ఎన్నడూ పట్టుకోరాదు. అలా చేస్తే ఇమేజ్ 67 శాతం వృధా అవుతుంది. ఫ్రేమ్ ను ట్రిమ్ చేస్తే ఇంకో 20 శాతం పోతుంది. ఇచ్చిన స్పేస్ లో 90 శాతం వృధా చేసేవారిని ఏమనాలీ? ఉపన్యాసం మధ్యలోనే కనీసం కెమెరాను అడ్డంగా పట్టుకోమని ఆ మొబైల్ ఫోన్ రవినగాయిచ్ కు సౌంజ్ఞ చేశారు. నిలువుగా వీడియో తీయడానికే ఆ కత్తి వీరుడు అంకితమయ్యారు.
2020 సెప్టెంబరు 9న విజయవాడ ఏంబి భవన్ లో 'శ్రీశ్రీ' విశ్వేశ్వరరావు నాయకత్వంలోని సాహితీమిత్రులు నిర్వహించిన 'ఫాసిజం ప్రమాదం' సభ ఒక ప్రామాణిక కార్యక్రమం. టాపిక్ గంభీరమైనది. వేదిక మీద ఇద్దరమే ఉపన్యాసకులం. మొదట నేను, తరువాత తమ్మినేని వీరభద్రం. ఇద్దరికీ చేరో 45 నిముషాలు కేటాయింపు. ఆ సభకు అధ్యక్షోపన్యాసం కూడా లేదు. కేవలం వక్తల పరిచయ వాక్యాలు మాత్రమే వున్నాయి. పరిచయ వాక్యాల్ని కూడ విశ్వేశ్వరరావు ప్రముఖ కవి రావులపాటి సీతారాం తో రాయించాడు. మా తరువాత గోరటి వెంకన్న, విమలక్కలు చెరో 45 నిముషాల వాగ్గేయ ప్రదర్శనలు చేశారు. హాలు బాగుంది, వేదిక బాగుంది, సౌండ్ అండ్ లైట్ ఏర్పాట్లు బాగున్నాయి. శ్రధ్ధగా వినే ఆడియన్స్ వున్నారు. అంతా చాలా చక్కగా సమకూరింది. విశ్వేశ్వరరావు తన అభిరుచికి తగ్గట్టు ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ ను పెట్టాడు. అంతేగాక, అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ ను కూడ ఏర్పాటు చేశాడు. వారం రోజుల తరువాత నా ప్రసంగం వీడియో ఫైల్, కార్యక్రమంలో నేను వున్న ఫొటోల కట్ట చాలా శ్రధ్ధగా నాకు అందజేశాడు. అప్పుడు శ్రీనివాసరెడ్డి తీసిన ఫొటోనే ఇప్పటికీ నా ఫేస్ బుక్ వాల్ లో కవర్ ఫొటోగా కొనసాగుతోంది.
(విశ్వేశ్వర రావు మీటింగు వీడియోతోపాటూ, మొన్న 14 సెప్టెంబరు నాటి వీడియోల లింకుల్ని కూడ కామెంట్స్ బాక్స్ లో పెట్టాను. చూసి మీరే బేరీజు వేసుకోవచ్చు).
Saturday, 17 September 2022
Comedy Script NENINTE – Nov 6 - 1. MODI
Script
NENINTE – Nov 6 - 1. MODI
నరేంద్ర మోదీ :
మేరే భారత్ వాసియో ! మై నరేంద్ర మోది బోల్ రహాహూ. నా పేరు ఇవ్వాల్టీ నుండి మారిపోయిందీ. ఇక మీరు నన్ను నరేంద్ర బీహారీ అని పిలవాలి.
లాలూ ప్రసాద్ యాదవ్ :
హల్లో నరేంద్ర మోదీజీ ! మై లాలూ ప్రసాద్ యాదవ్. ఇక్కడ బీహారీ బాబూ వున్నాడు. జబ్ తక్ దునియా మే ఆలూ రహేగా తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా.
నరేంద్ర మోదీ :
బీహార్ ను ముగ్గురు రాక్షసులు పట్టి పిడిస్తున్నారు. లాలూ, నితీష్, సోనియా. వాళ్ళను సంహరించడానికే నేను పుట్టాను.
లాలూ ప్రసాద్ యాదవ్ :
మోదీ జీ! అసలు విషయం చెపుతాను. భార్రత దేశాన్ని ముగ్గురు రాక్షసులు పట్టి పీడిస్తున్నారు. నరేంద్ర మోదీ ! నరేంద్ర మోదీ ! నరేంద్ర మోదీ ! ఆ ముగ్గురు రాక్షసుల్ని అంత చేయడానికి ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటి అవుతోంది. మాలూమ్?
నరేంద్ర మోదీ :
నేనే బీహార్ కా బాద్షా.
లాలూ ప్రసాద్ యాదవ్ :
పాట్నాకా పిచాచి అనుకో. ఇంకా బాగుంటుంది.
నరేంద్ర మోదీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్
కేజ్రీవాల్ :
హల్లో మోదీజీ ! బీహార్ ఎన్నికలు ముందే తెలిసిపోయాయి. మీకు బీహార్లో కూడా ఢిల్లీ ఫలితాలే వస్తాయి. ఆల్ గుడ్ లక్.
నరేంద్ర మోదీ :
హల్లో కేజ్రీవాల్ జీ ! నాకు ఇంకోసారి ఢిల్లీ ఎన్నికలని గుర్తు చేయవద్దు. నాకు చలిజ్వరం వస్తుంది.
కేజ్రీవాల్ :
ఇంక మీకు చలిజ్వరమే. పది లక్షల రూపాయల కోటు తొడుక్కున్నా వణకాల్సిందే.
నరేంద్ర మోదీ :
మోదీకో బీహార్ జీత్ నా హోగా. అందుకే పదిహేడుసార్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేశాను.
కేజ్రీవాల్ :
ఇంత హంగామా చేస్తేనే ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని విసిరి కొట్టారు. బీహార్ కు పదిహేడుసార్లు వెళ్ళారు అంటేనే మీకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని అర్ధం అవుతోంది. మీరు ఇండియా ప్రైమ్ మినిస్టరా? బీహార్ కు ప్రైమ్ మినిస్టరా?
నరేంద్ర మోదీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్
వెంకయ్య నాయుడు :
అయ్యా నరేంద్ర మోదీజీ ! మీడియా మీ మీద కక్ష కట్టింది బాబూ. ఏదో విధంగా మీకు ఇబ్బందులు కలిగిస్తోంది నాయనా. వామలక్ష వాదులు, లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు అంతా ఒకటే మోదీజీ. వాళ్ళకు మీ మీద అకారణ కక్ష. దిసీజ్ క్లియర్.
నరేంద్ర మోదీ :
వెంకయ్య నాయుడు జీ! మీడియా మీద మనం కూడా కక్షసాధించాలి. దానికి ఏదైనా ప్లాన్ చేయండి.
వెంకయ్య నాయుడు :
అయ్యా మోదీజీ। మీరు అంత తొందర పడతారనే మీకు చెప్పలేదు బాబూ. ఇప్పటికే ఇండియాలో నాలుగు అక్షరాలు చదువుకున్న ప్రతోడూ మిమ్మల్ని తిడుతున్నాడు స్వామీ. ఇప్పుడు మీరు మీడియాను గిల్లితే మరిన్ని సమస్యలు వస్తాయి బాబూ. దిసీజ్ క్లియర్.
నరేంద్ర మోదీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్
చంద్రబాబు :
ఏం నరేంద్ర మోదీగారూ! ఏం మాట్లాడుతున్నారూ? తమాషాగా వుందా? ఎన్నికలంటే మీరు కంగారు పడడం కరెక్టు కాదండి.
నరేంద్ర మోదీ :
చంద్రబాబూజీ! ఏ తమాషా నహీ హై. ఏ కంగారూ నహీ హై. ఏ భయం హై. దిల్లీలో మాడు సీట్లే వచ్చాయి. ఇక్కడ నితీష్ కుమార్ కూడా కేజ్రీవాలకన్నా క్రేజీ మ్యాన్. అతనికి మూడ్ వస్తే మనకు మూడు కూడా మిగల్చడు.
చంద్రబాబు :
ఏం నరేంద్ర మోదీగారూ! ఏం మాట్లాడుతున్నారూ? మీరు కనుక ఒకసారి చూసినట్తయితే అమరావతి పక్కన కృష్ణానది నీళ్ళు తాగితే చాలా ధైర్యం వస్తుందని చాలా క్లియర్ గా కనిపిస్తా వుంది. ఒక ముంతలో కృష్ణా నీళ్ళు పంపుతానని మీకు నేను మన్వి చేసుకుంటావున్నాను.
నరేంద్ర మోదీ : ఫేస్ ఎక్స్ ప్రేషన్
రాహుల్ గాంధీ :
నమస్కార్ నరేంద్ర మోదీజీ! మొన్న ఎన్నికల్లో నన్ను మీరు పిల్లాడిని చేసి ఆడుకున్నారు. రాహుల్ బచ్చా బచ్చా అన్నారు.
నరేంద్ర మోదీ :
పిల్లల్ని హిందీలో బచ్చా అంటారు. రావుల్ బచ్చా.
రాహుల్ గాంధీ :
ఇప్పుడు నేను బీహార్ లో గంగానది నీళ్ళు తాగి పెద్దమనిషి అయ్యాను. దాని ఎఫెక్ట్ మీకు రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.
నరేంద్ర మోదీ :
నమస్కార్ దోస్తో! రాహుల్ బాబు కూడా నా మీద జోకులు వేస్తున్నారు. ఇక నేను వెళతాను. మళ్ళీ త్వరలో వస్తా.

.jpg)