Wednesday, 7 May 2014

Changing of Values in Journalism

1996 – 2014
మారుతున్న పాత్రికేయ విలువలు
డానీ

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఈరోజు గోటేటి రామచంద్రరావు వ్యాసం “కాంగ్రెస్ కు చరమగీతం” అచ్చయింది. ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాసాలు సాధారణ విషయమే అయినా సీమాంధ్రలో పోలింగ్ జరుగుతున్న రోజున రావడంతో దీనికో ప్రత్యేకత వచ్చింది.  1996 లోక్ సభ ఎన్నికల సందర్భంగా నేను రాసిన ఇలాంటి వ్యాసం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. అప్పటి నా వ్యాసం గణాంకాల మీద ఆధారపడిరాసిందయితే, ఇప్పటి గోటేటి రామచంద్రరావు వ్యాసానికి డేటాగానీ, ఉపపత్తిగానీ ఏమీలేవు.


 ఆంధ్రజ్యోతి విజయవాడ ఎడిషన్లో అప్పట్లో నేను కాంగ్రెస్ బీటు చూస్తుండే వాడిని.   పోలింగ్ రోజైన ఏప్రిల్ 27 నాటి జిల్లా పేజీలో నా కథనం ’విజయవాడలో కాంగ్రెస్ మొగ్గు?’ బ్యానర్ గా అచ్చయింది. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా నేను స్పష్టంగానే ఆ శీర్షిక పెట్టాను.  ఎడిటోరియల్ డెస్కువాళ్ళు ’ముందు జాగ్రత్తగా’ ప్రశ్నార్ధకం జోడించారు!. “62 శాతం పోలింగ్ ప్రాతిపదికపై కాంగ్రెస్ అభ్యర్ధి పర్వతనేని ఉపేంద్రకు 3,51,886 పడనున్నాయి” అనేదే ఇందులో ప్రాణప్రదమైన వాక్యం.  

     ఫలానా అభ్యర్ధి ప్రచారంలో ముందున్నారనీ, ఓటర్లను ఆకట్టుకుంటున్నారనీ రాయడం వరకే అప్పట్లో సాంప్రదాయంగా వుంది. అలాకాకుండా ఫలానా అభ్యర్ధికి ఇన్ని ఓట్లు పడుతున్నాయని ఒకట్లు, పదులు, వందల స్థానాల్ని కూడా లెక్కలుగట్టి చెప్పడం అప్పుడేకాదు ఇప్పటికీ కొత్తే! అలాంటి ప్రయోగాన్ని మరెవరైనా ఎక్కడయినా చేసినట్టు నాకు తెలీదు.

నేనూ ఆ కథనాన్ని రాయడానికి మూడు కారణాలున్నాయి.  అన్నింటికన్నా మొదటిది ప్రయోగతృష్ణ.  ఎదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెట్టాలనే ఉత్సాహం (అతిఉత్సాహం  కూడా కావచ్చు). రెండోది, కృష్ణాజిల్లాలోని అన్ని రెవెన్యూ మండలాలతో నాకు సన్నిహిత సంబంధాలుండేవి. అంచేత, అక్కడి విభిన్న సామాజికవర్గాల రాజకీయ వ్యవహార శైలి గురించి ఒక అవగాహన వుండేది.  మూడోది, స్టాటిస్టిక్స్ ను విశ్వవిద్యాలయం స్థాయిలో ఒక పాఠ్యాంశంగా చదవడమేగాక తరువాతి కాలంలో  వాటిని మరికొంత అధ్యయనం చేశాను.  అప్పటికే  ఆంధ్రజ్యోతిలో స్టాక్ లైన్ శీర్షికతో బీ.యస్.ఇ. సెన్సెక్స్ ను వారంవారం  విశ్లేషిస్తున్నాను. కొత్తగా సెఫాలజీ ( Psephology*)లో కొంత ప్రావిణ్యాన్ని సాధించే ప్రయత్నాల్లో వున్నాను.

ఇంత కసరత్తు చేసినా ఫలానా అభ్యర్ధికి ఇన్ని ఓట్లు పడుతున్నాయని చెప్పే కథనం ప్రచురణకు సంపాదకవర్గం అనుమతి ఇవ్వడం ఆరోజుల్లో సామాన్య విషయం కాదు. అయితే గణంకాల్ని కఛ్ఛితంగా లెక్కలేసి చెప్పడంలో అప్పటికే  నాకో దస్తరం వుంది. 1992 ఫిబ్రవరి నెలలో జరిగిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎన్నికల్లో పిన్నమనేని కోటేశ్వరవు వర్గానికి 175 ఓట్లు పడబోతున్నాయని రాశాను. వాస్తవానికి 177 ఓట్లు పడ్డాయి. 1994 లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున బీ.యస్.ఇ. సెన్సెక్స్ 4300 స్థాయిని దాటేందుకు వీలున్నదని పక్షం రోజుల ముందు రాశాను. ఆ ఏడాది ఫిబ్రవరి 28 ఉదయం సెన్సెక్స్ 4299.36 పాయింట్ల వద్ద మొదలయింది. ఇలాంటి మరికొన్ని సంఘటనల నేపథ్యంలో నామీద ఏర్పడిన నమ్మకంతో ఎడిటోరియల్ డెస్క్ నా కథనాన్ని ప్రచురణకు అనుమతి ఇచ్చింది.

ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వడ్డే శోభనాద్రీశ్వర రావు సహజంగానే  నా కథనం మీద మండిపడ్డారు. ఎలక్షన్ కమీషన్ కు  పిర్యాదు చేస్తానని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హెచ్చరించారు. దానితో ఆఫీసులో పంచాయితీ జరిగింది. కొందరు నా ప్రయోగ ఆసక్తిని మెచ్చుకున్నా, మరికొందరు నా కథనం సాంప్రదాయ విరుధ్ధం అన్నారు. చివరకు నేను దాన్నో సవాలుగా తీసుకుని “నా కథనంలో చెప్పిన ఫలితం రాకపోతే వుద్యోగం మానేస్తాను” అన్నాను.  

అలా అనుక్షం ఉత్కంఠతో రెండు వారాలు గడిచాక ఏప్రిల్ 9న  కౌంటింగు జరిగింది. నేను 62 శాతం ప్రాతిపదికపై ఓట్లను లెఖ్ఖ వేయగా 65. 93 శాతం పోలింగు జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లు 3,74,111 అవుతాయి. ఉపేంద్రకు 3, 97,709 ఓట్లు పడ్డాయి. 13, 51, 332 ఓటర్లున్న నియోజకవర్గంలో అంచనా తేడా కేవలం 1.74 శాతం మాత్రమే! అంటే దాదాపు కఛ్ఛితంగా అంచనా వేసినట్టే!

     అప్పటి స్పాట్ న్యూస్ డైరెక్టర్ ఎస్. సురేష్ “మీ అంచనా ఎంత కరెక్టో గణాంకాలతో వివరిస్తూ మెయిన్ స్టోరీ రాయండి” అన్నారు. వారు కాంగ్రెస్ అభ్యర్ధి పర్వతనేని ఉపేంద్రకు అత్యంత సన్నిహిత బంధువు కూడా.  ’కాంగ్రెస్ ’విజయ’వాడ రహాస్యం’ పేరుతో అచ్చయిన ఆ కథనంలో “విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంపై పోలింగు రోజున ’స్పాట్ న్యూస్’ విశ్లేషణ అక్షరాలా నిజమైంది” అని రాశాము.

దానితో ఆ వివాదం ముగిసిందిగానీ, నా మీద గుసగుసల ప్రచారం ఒకటి మొదలయింది. సమాజంలో నిత్యం చెడును ఆకాంక్షించేవాళ్ళూ, మెదడూ,  హృదయం రెండూ చెడిపోయినవాళ్ళూ పెద్ద సంఖ్యలోనే వుంటారు. మనకు మరీ దగ్గరగా వున్నవాళ్లలోనే వాళ్ళు మరీ ఎక్కువగా వుంటారనేది నా అనుభవం. ఈ కథనానికి నేను చెప్పిన మూడు కారణాలు కాకుండా వాళ్ళు మరో కొత్త కారణాన్ని సృష్టించి ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు సృష్టించగల కారణం ఏమిటో ఊహించడం కష్టమేమీకాదు!  


*Psephology
Psephology is a branch of political science which deals with the study and scientific analysis of elections. Psephology uses historical precinct voting data, public opinion polls, campaign finance information and similar statistical data. (Wikipedia)

పోస్ట్ స్ర్కిప్ట్ :
సెఫాలజీలో నా అనుభవం గురించి మిత్రులు కే. నరసింహాచారి, గడియారం శ్రీవత్స  ద్వార ఏపి జితేందర్ రెడ్డి గారికి తెలిసింది. 1998 లోక్ సభ ఎన్నికల్లో వారు బీజేపి అభ్యర్ధిగా పోటీ చేసి సఫలం కాలేకపోయారు.  1999 లోక్ సభ ఎన్నికలకు ముందు వారు నన్ను మహబూబ్ నగర్ ఆహ్వానించారు.  నెల రోజులు మహబూబ్ నగర్ లో వుండి సెఫాలజీ సేవలు అందించడం నా పని.  నా సేవలకుగాను చాలా ఆకర్షణీయమైన ఫీజు, ఇతర సౌకర్యాలు ఇస్తామని చారీ, శ్రీవత్స ద్వార చెప్పించారు. నిజానికి నాకు ఇప్పటి వరకు అంత ఆకర్షణీయమైన ఫీజును ఎవరూ ఆఫర్ చేయలేదు. పైగా, ఏపీ టైమ్స్ మూసివేసిన నేపథ్యంలో నేను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమయం అది. అయితే, బీజేపి అభ్యర్ధికి  ఎన్నికల సేవల్ని అందించడానికి నైతికంగా, తాత్వికంగా మనసొప్పక  వారి కోరికను సుతారంగా తిరస్కరించి వచ్చేశాను. 

7 మే 2014
తొలి ప్రసారకులు :
http://telugutv.info/mediaexp_forum.php?id=16





Never there Should be a Modi Sarkar


కభీనహీ మోదీ సర్కార్! 

డానీ  


సీమాంధ్రలో  పోలింగ్ ముగిసింది. కొత్త రాష్ట్రంలో తొలి ఎన్నికలు కావడంవల్ల మాత్రమేగాక జాతీయ రాజకీయ సన్నివేశం మూలంగానూ ఈ ఎన్నికలు  ఆఢునిక భారత చరిత్రలో చాలా కీలకంగా మారాయి.

వ్యక్తిగతంగా నాకు, మా మిత్రుల్లో చాలా మందికీ ఎన్నడూ పార్లమెంటరీ రాజకీయల మీద నమ్మకంలేదు. ఈపార్టి ఆపార్టి అని కాకుండా పార్లమెంటరీ రాజకీయ పార్టీల నాయకులందర్నీ నేను కఠిన పదజాలంతో విమర్శించేవాడిని. కానీ ఈసారి ఎన్నికల్లో పార్లమెంటరీ రాజకీయల మీద ఆసక్తి కలిగింది. దానికి కారణం ఒకే ఒక నినాదం; “అబ్ కి బార్ మోదీ సర్కార్”. (అది బీజేపి సర్కార్ కూడా కాదట!)
వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి భారత ప్రధాని కావడం అందరూ ఆహ్వానించదగిన మహత్తర విషయం. కానీ,  వెనుకబడిన కులాలకు చెందిన యాభై కోట్ల మందిలో వారికి  నరేంద్ర మోదీ ఒక్కరే దొరికారా బీసీ అనడానికీ? అటు కేంద్ర రిజర్వేషన్ జాబితాలోనూ, ఇటు  రాష్ట్ర రిజర్వేషన్ జాబితాలోనూ, చట్టబధ్ధంగా  ముస్లీంలు, దళిత క్రైస్తవులు కూడా బీసీలే. అంచేత, ముస్లీంలు, క్రైస్తవులు ఎవరూ హిందూ వెనుకబడిన కులాలను ఎప్పుడూ తక్కువగా చూడరు. 

నరేంద్ర మోదీని  చూస్తే గుజరాత్ అల్లర్లు గుర్తుకు వస్తాయి. వెయ్యి మందిని కిరాతకంగా ఊచకోత కోయడం గుర్తుకు వస్తుంది. అలా ఎవరికైనా గుర్తుకు రాకపోతే వాళ్ల మెదడులో ఏదో లోపం వుందని అనుకోవాలి.
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల నిలయం. ఇక్కడ అందర్నీ కలుపుకునిపోయే సామరస్య విధానాలు కావాలి. ద్వేషరాజకీయాల మీద బతికే నరేంద్ర మోదీలు భారతదేశ సంస్కృతికి ముసలం వంటివారు. అభివృధ్ధి కావలసిందే. కానీ, దానికోసం సామాజిక ప్రశాంతతను ఫణంగా పెడతాం అంటే కుదరదు.  అభివృధ్ధికన్నా  సామాజిక ప్రశాంతతే సమాజానికి గొప్పది.
       ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత అల్పసంఖ్యాక వర్గాలేకాదు హిందూ సమాజంలోని భక్తులు, విద్యావంతులు, మానవతావాదులు, ఉదారవాదులు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, శాంతి కాముకులు, దళిత-బహుజనులు, పేదలు  ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ వంటి మొరటు మనిషికి మద్దతు పలకరు.
భారత సామాజిక సామరస్యం మీద నరేంద్ర మోదీ దాడిని ఆపడానికి మేము సహితం సమిధనొక్కటి ధారబోయాలనుకున్నాము. మోదీకి మద్దతిచ్చే పార్టీలు, వాటి నాయకుల్ని ఓడించడానికి క్రియాశీలంగా ప్రయత్నం చేయకపోతే ఒక చారిత్రక తప్పిదం చేసినట్టే అనిపించింది.

     2011నాటి టిడిపి మహానాడు తీర్మానానికి కట్టుబడివుంటే మేము  తప్పకుండా ఈ ఎన్నికల్లో చంద్రబాబుగారికి గట్టిమద్దతు ఇచ్చివుండేవాళ్ళం.  వారేకాక, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, జనసేన పవన్ కళ్యాణ్ కు సహితం మోదీ మానియా పూనేసింది. ఇక వాళ్లను రాజకీయ ప్రత్యర్ధులుగా, మతసామరస్య వ్యతిరేకులుగా భావించక తప్పలేదు.

 వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, బీయస్పీ తదితర పార్టీలు  ప్రత్యామ్నాయంగావున్నా అవి ఇప్పుటి పరిస్థితుల్లో మనకు సరైన వేదికలు కావు అనిపించింది. జై సమైక్యాంధ్ర పార్టి ఏమాత్రం నిజాయితీలేనిదని తేలిపోయింది. ఇక మిగిలింది కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్. సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు కాడిని పూర్తిగా పడేయడంతో చివరి మలుపులో జగన్ ఒక్కరే మిగిలారు.

మేము జగన్ ను బలపరిచాం అనడంకన్నా జగన్ వ్యతిరేకుల్ని తీవ్రంగా వ్యతిరేకించాం అనడం సబబు. మోదీ, బాబూ, పవన్ కళ్యాణ్, జేపీ సాగించిన మతవాద రాజకీయాలని మేము నిర్ద్వంద్వంగా వ్యతిరేకించదలిచాం. అది తార్కికంగా జగన్ కు అనుకూలంగా మారింది. మరోమాటల్లో చెప్పాలంటే, మేము జగన్ ను అభిమానించడంవల్ల బాబూను వ్యతిరేకించలేదు. బాబూను వ్యతిరేకించడం కోసం జగన్ కు మద్దతు ఇచ్చాం.  బాబు మీద మా వ్యతిరేకత జగన్ కు మద్దతుగా మారింది.


 రాష్ట్రం వరకు చంద్రబాబుతో హోరాహోరీగా తలపడినా, ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే కూటమి విషయంలో జగన్ కు చివరి వరకూ చాలా ఊగిసలాట వుండింది. ఆయనకు కూడా అడపాదడపా మోదీ మీద వ్యామోహం వచ్చేది. అది మాకు చాలా నిరాశ కలిగించింది. 

మే 4 ఆదివారం  సాయంత్రం విజయవాడ సభలో ఆయన చేత “ బాబు  మోడీ కోసం ఓటడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిత కోసం ఓటడుగుతున్నా”  “కేంద్రం మెడలు వంచే ప్రభుత్వం కావాలో, చంద్రబాబులా కేంద్రం వద్ద మోకరిల్లే  ప్రభుత్వం కావాలో తేల్చుకోండి”  ‘‘నరేంద్ర మోడీ, చంద్రబాబు, సోనియా... వీరెవ్వరికీ మన రాష్ట్రం మీద ప్రేమ లేదు”  “ ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా అనేది తర్వాత చూద్దాం.” వంటి నాలుగు మాటలు చెప్పించడానికి తెరవెనుక, తెర బయట చాలా మంది చాలా రకాలుగా దౌత్యాలు నడపాల్సివచ్చింది.

అంతిమంగా పోలింగ్ జరిగిపోయింది. ప్రజల ముందు మావంతుగా ఒక ప్రత్యామ్నాయాన్ని పెట్టాం. ప్రజలు శాంతి సామరస్యాలనే కోరుకుంటారనే మా నమ్మకం వమ్ముకాదని మా ప్రగాఢ విశ్వాసం. ఆ విషయం 16న తేలుతుంది. ఇప్పటికైతే చాలా ఆనందంగా వుంది శాయశక్తులా క్రీయాశీలంగా మా పాత్రను మేము పోషించామని!

Danny Notes, 7  May 2014




Monday, 5 May 2014

Caste Polarization and Vote Banks

డానీ కాలం
కులాలు, మతాలు ఓటుబ్యాంకులు

డానీ


        ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయని తెలియనివాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరూలేరు.  అయితే, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్న వైనానికి వస్తున్నంత ప్రచారం, అక్కడ చోటు చేసుకుంటున్న కొత్త సామాజిక సమీకరణలకు రావడంలేదు.  ఆ విశేషాలు కూడా మీడియాలో వస్తే, సీమాంధ్రలో రాజకీయ మార్పులకన్నా సామాజిక సమీకరణలే వేగంగా మారుతున్నాయని గుర్తించడానికి వీలుండేది.

        రాజకీయంగా చూస్తే సీమాంధ్రలో వలసల పోకతో  కాంగ్రెస్ ఖాళీ అయిపోతున్నట్టూ, వలసల రాకతో తెలుగుదేశం క్రిక్కిరిసిపోతున్నట్టూ కనిపిస్తోంది. ఇది వాస్తమే అయినప్పటికీ అక్కడ వెలుగులోనికిరాని  సామాజిక వాస్తవాలు అనేకం వున్నాయి.

        ఏ రాజకీయా పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే దానికి తగిన ఓటు బ్యాంకు వుండాలి. ఓటు బ్యాంకు అంటే గతంలో రాజకీయా సిధ్ధాంతాలు లేడా నమ్మకాలు అని అర్ధం చెప్పుకోవడానికి వీలుండేది. ఇప్పుడు రాజకీయ సిధ్ఢాంతాలకూ, విశ్వాసాలకూ తావులేదు. అట్ట పేజీలు తీసేస్తే, అన్ని పార్టీల  ఎన్నికల ప్రణాళికలు ఒకేలా కనిపిస్తున్నాయి. అసలు అన్నింటినీ ఒకరే రాసారేమో అనే అనుమానం కూడా వస్తుంది.


        రాజకీయ సిధ్ధాంతాలు లేనపుడు ఓటు బ్యాంకు అంటే ఏమిటీ అనేది? ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు. ఇప్పట్లో ఓటు బ్యాంకు అంటే కులాలు, మతాలు అని తెలియనివాళ్ళు ఎవరూ వుండరు. గతంలోనూ ఓటు బ్యాంకులో కులం, మతం వుండేవిగానీ, ఇటీవల  మరింత ప్రస్పుటంగా   ముందుకు వచ్చాయి.

        మొన్నటిదాక రాష్ట్ర్ రాజకీయాలు విభజన, సమైక్యత వాదాలతో హోరెత్తాయి. పరస్పర వ్యతిరేక భావోద్వేగాల ఆధారంగా, ప్రాంతాలవారిగా రాజకీయాలు విడిపోయాయి.  ఉద్యమాల భావోద్వేగాలకూ, ఎన్నికలకూ పెద్దగా సంబంధంలేదని లేదని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. రెండు నెలల క్రితం వరకు ఇరు ప్రాంతాల్లో  చెలరేగిన భావోద్వేగాలు  రాజకీయాల్లోకి పరావర్తనం చెందివుంటే ఒక భిన్నమైన సమీకరణలు  ఏర్పడి వుండేవి. తెలంగాణలో, టిఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపి, సిపిఐ లతో ఒకటో రెండో కూటములు ఈపాటికి ఏర్పడివుండేవి. కానీ అలా జరగలేదు. సీమాంధ్రలో తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి ద్వయం నెలకొల్పిన జై సమైక్యాంధ్ర  పార్టి  అందరికన్నా ముందుండేది. కానీ అలా జరగలేదు.

ఉద్యమాలు భావోద్వేగాలతో సాగితే, ఎన్నికల పొత్తులు ఓటు బ్యాంకు సమీకరణలతో జరుగుతాయని మరోసారి రుజువయ్యింది. తెలంగాణను టీఆర్ ఎస్ తెచ్చిందనీ, కాంగ్రెస్ ఇచ్చిందనీ తెలియనివాళ్ళు ఎవరూలేరు. కానీ, ఇప్పుడు ఎన్నికల ప్రాంగణంలో తెలంగాణలో కాంగ్రెస్సేకాదు టిఆర్ ఎస్ కూడా అంతగా అత్మవిశ్వాసంతో కనిపించడంలేదు. విభజనకు గట్టి మద్దతు ఇచ్చిన సిపిఐ పరిస్థితి కూడా మెరుగుపడకపోగా తగ్గు ముఖంలో వుంది.

సీమాంధ్రలోనూ పరిస్థితి అందుకుభిన్నంగాలేదు.  సమైక్యవాదాన్ని రేకెత్తించి, నాయకత్వం వహించిన లగడపాటి రాజగోపాల్, కిరణ్ కుమార్ రెడ్డీలను పట్టించుకుంటున్నవాళ్ళు కనిపించడంలేదు. యంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో వెలిగిపోయిన కిరణ్ శిబిరంలో వుండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ తప్ప   పాత ముఖాలు కనిపించడంలేదు.  

విచిత్రంగా అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలోనూ తెలుగుదేశం హఠాత్తుగా వెలుగులోనికి వచ్చింది. విభజన, సమైక్య ఉద్యమాలు వుధృతంగా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పాత్ర వివాదాస్పదంగా వుండింది. చంద్రబాబు విభజనవాదుల్లో సమైక్యవాదిగా, సమైక్యవాదుల్లో విభజనవాదిగా ఒక ఇబ్బందికర పాత్ర పోషిస్తూవుండేవారు.  అయితే, ఎన్నికల్లో భావోద్వేగాలకన్నా అచ్చమైన కులసమీకరణలు,  ఇంకా  పచ్చిగ చెప్పాలంటే ఆర్ధిక సమీకరణలే బలంగా పనిచేస్తాయని చంద్రబాబుకు బాగా తెలుసు. దానికి సంబంధించిన లెఖ్ఖలు బొక్కల్ని విశ్లేషించడంలో  వారు ఘనాపాటి. మత ఓటు బ్యాంకును నడపడంలో బీజేపికి ప్రావిణ్యం వున్నట్టు, కులాల ఓటు బ్యాంకును నడపడంలో చంద్రబాబుకు ప్రత్యేక ప్రావిణ్యం వుంది. 2004లో టిడిపి వట్టిపోయినపుడు ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయినవాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వట్టిపోయినట్టు కనిపిస్తుండడంతో స్వంత గూటికి తిరిగివస్తారని చంద్రబాబుకు క్షుణంగా తెలుసు.

        జగన్ కు కులమతాల సమీకరణల్ని విశ్లేషించడంలో చంద్రబాబు వంటి ప్రావిణ్యంలేదు. నాయన వైయస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత పెల్లుబికిన సానుభూతి తనను సియం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి సరిపోతుందనే ధీమాతో ఇంతకాలం ఆయన వున్నారు. ఎంతటి గొప్పవారి మీదనయినా సానుభూతి ఐదారు నెలలు వుంటుందిగానీ ఐదారేళ్ళు వుండదని వారికి ఇప్పుడిప్పుడే తెలిసివస్తున్నది.

సీమాంధ్రలో రెడ్డి సామాజికవర్గంలో అత్యధికులు జగన్ ను తమ రాజకీయ నాయకునిగా భావిస్తున్నారు. ఎస్సీల్లో మాల సామాజికవర్గం, మాల క్రైస్తవ సామాజికవర్గం, మాదిగ క్రైస్తవ సామాజికవర్గం, క్రైస్తవులు, ముస్లింలు కూడా జగన్ కు గట్టి మద్దతుదారులుగా వున్నారు.  జగన్ కు మద్దతుదారులుగావున్న మాదిగసామాజికవర్గం,  బీసీ సామాజికవర్గాలు, ముస్లీం సామాజికవర్గాల్లో ఇప్పుడు చీలిక కనిపిస్తున్నది.  మాదిగసామాజికవర్గం,  బీసీ సామాజికవర్గాల్లోలు ఎక్కువ భాగం ఇప్పుడు తెలుగుదేశం వైపుకు చూస్తుండగా, ముస్లిం సామాజికవర్గాలు ప్రధానంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి.  జగన్ మద్దతుదారుల  గ్రాఫ్ గత మూడు నెలలుగా క్రమంగా పడిపోతూ వుండడానికి ప్రధాన కారణం మాదిగ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లో వస్తున్న మార్పులే. తక్షణం దీనికి నివారణ చర్యల్ని చేపట్టక పోతే జగన్ గ్రాఫ్ మరింతగా పడిపోయే ప్రమాదం వుంది.

కమ్మ సామాజికవర్గంలో అత్యధికులు టిడిపి మద్దతుదారులుగా వున్నారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ వైపుకు వెళ్ళిన కార్పొరేట్ వర్గం ఇప్పుడు తిరిగి టిడిపి గూటికి చేరుకుంటున్నది. అలా నేరుగా తిరిగి రావడానికి ఇబ్బందులున్నవాళ్ళు బీజేపి మీదుగా టిడిపికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. సీమాంధ్రలో చేపట్టబోయే ప్రాజెక్టులల్ని దృష్టిలో వుంచుకుని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నిర్మాణ సంస్థలు సంస్థలు సహితం బాబూ-మోదీ కూటమిలో చేరుతున్నాయి. బీసీ, మాదిగ సామాజికవర్గంలో టిడిపీకి మొదటి నుండీ గట్టి మద్దతు వుంది. జగన్ రాకతో ఆ ఓటు బ్యాంకు కొంత చెడినఫ్ఫటికీ ఇప్పుడు మళ్ళీ పాతస్థితి నెలకొంటున్నది. బీజేపీతో పొత్తు కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతిన్నప్పటికీ ఆ కొరవను స్వంత సామాజిక వర్గంతోపాటూ, బీసీ, మాదిగ  సామాజికవర్గాలు పుడుస్తాయని చంద్రబాబు నమ్మకంగా వున్నారు. ఇటీవల ఆయన రాజకీయ రేఖాచిత్రం భారీగా పెరగడానికి కారణం ఇదే!

సీమాంధ్రలో ఒకరకంగా సంధిగ్ధంలోవున్న సామాజికవర్గం కాపులది. ఈవర్గం కొన్ని జిల్లాలలో టిడిపీకి మద్దతుదారుగా వుంది. మరొకొన్ని జిల్లాలలో కాంగ్రెస్ తో వుంది. కాంగ్రెస్ నావకు చిల్లులు పడ్డాయని తెలిసినా దాని కెప్టెన్ గా చిరంజీవి వుండడంతో కాపు సామాజికవర్గం ఆలోచనల్లోపడింది. ఈ సంధిగ్ధాన్ని తొలగించడానికే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు రంగంలో దించారనే వాదనా వినిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య కాపు సామాజికవర్గం తీసుకునే నిర్ణయమే ఈసారి సీమాంధ్ర ఎన్నికల్లో కీలకం కానున్నాయి.


తెలంగాణలో కేసిఆర్ భావోద్వేగ నాయకుడే అయినప్పటికీ కులాల సమీకరణలో ఆయన శక్తియుక్తులు సరిపోవని ఇటీవలి పరిణామాలు చెపుతున్నాయి. సీమాధ్రలో జగన్ అనుసరిస్తున్న పంథానే తెలంగాణలో కేసిఆర్ అనుసరిస్తున్నరనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ ఎస్ టిక్కెట్టు తీసుకోవడానికి అభ్యర్ధులు లేరంటే నమ్మశక్యంగా లేదు. తెలంగాణలో వెలమ సామాజికవర్గంకన్నా, రెడ్డి సామాజికవర్గం సంఖ్యలోనూ, ప్రాబల్యంలోనూ చాలా పెద్దదన్న వాస్తవాన్ని కేసిఆర్ అంతగా పట్టించుకున్నట్టులేదు.  ఎన్నికల్లో కులం పనిచేసినంత బలంగా భావోద్వేగాలు పనిచేయవు. ఇక్కడా చంద్రబాబు తన తెలివిని ప్రదర్శిస్తున్నారు. బీసీ, రెడ్డి, మాదిగ, కమ్మ సామాజికవర్గాలతో తెలంగాణలో ఓటు బ్యాంకును నిర్మించే పనిలోపడ్డారు. ముస్లింలుబయటికి పోవడంతో ఏర్పడేలోటును బీజేపి తెచ్చే అదనపు ఓట్లతో పూడ్చుకోవచ్చని ఆయన కంప్యూటర్ లో లెఖ్ఖలు వేసి తేల్చుకున్నారు

ఈ ఎన్నికల్లో అటు సీమాంధ్రలోనూ,  ఇటు తెలంగాణలోనూ ఒక స్పష్టమైన ఓటు బ్యాంకును నిర్మించుకోలేకపోయిన పార్టి కాంగ్రెస్సే. రెడ్డి, కమ్మ తదితర పాబల్య కులాలను పార్టీ నాయకత్వం నుండి తప్పిస్తే, కొత్త సామాజిక నిర్మాణాన్ని (సోషల్ ఇంజినీరింగ్) చేపట్త వచ్చని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. ఇలాంటి ఆలోచనల్లో తప్పులేదు. దాన్ని  చాలా ముందుగానే అమల్లో పెట్టి వుండాల్సింది. అయితే, కాంగ్రేస్ కు అంతర్గతంగా ఒక జాడ్యం వుంది. ప్రతిదాన్నీ నాన్చినాన్చి చివరి ఘడియలో హడావిడిగా చేస్తుంది. అది తెనాలి రామలింగడు పిల్లికి పాలు తాపించినట్టు వుంటుంది.   రైట్ డెసిషన్ ఇన్ రాంగ్ టైం అండ్  ఇన్ రాంగ్ ఫార్మ్! 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

5 ఏప్రిల్ 2014
ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/a-calumn-by-danny/15133.html

Mayday - Modi

మోడీ - మేడే

డానీ

                     సకలదేశాల కార్మికులారా! ఏకంకండు! ఇప్పటికే సకలదేశాల పెట్టుబడిదారులు ఏకం అయిపోయారు!  అనుమానం వున్నవాళ్ళు బీజేపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ సీమాంధ్ర పర్యటనని చూడండి.

                     మోదీ సీమాంధ్ర పర్యటన మేడే రోజున జరగడం యాధృచ్చికమే కావచ్చుగానీ, శ్రామికులు పట్టించుకోనక్కరలేనిది మాత్రంకాదు. లోక్ సభా ప్రచార ఘట్టంలో నరేంద్ర మోదీ సీమాంధ్రకు వరుసగా రెండు రోజులు కేటాయించడం ఒక విశేషం. ఒక రాష్ట్రానికి ఒక రోజు కేటాయించడమే గగనంగా మారిన తీరికలేని సమయంలో మోదీ ఒక ప్రాంతానికి రెండు రోజులు, ఆరు సభలు కేటాయించడం మరీ విశేషం. తిరుపతి, మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విశాఖపట్నం సభల్లో వారు ప్రసంగించారు. ఇలాంటి సందర్భాల్లో సీమాంధ్రతో మోదీకున్న ప్రత్యేక అనుబంధం ఏమిటనే ఆసక్తి ఎవరికైనా వస్తుంది.

                     ఒక విధంగా మోదీ బ్రాండు గుజరాత్ అభివృధ్ధికి రాళ్ళెత్తిన కూలీల్లో సీమాంధ్ర, మరీ ముఖ్యంగా తీరాంధ్ర ఒకటి. “తెలుగు వారి కష్టంవల్ల గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వెలుగుతోంది”  అని చెప్పిన మోదీ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్  సంయుక్తంగా కృష్ణా-గోదావరి బేసిన్ నుండి తరలించుకుపోతున్న చమురు, సహజవాయువు నిక్షేపాల గురించి ప్రస్తావించలేదు.
                     దేశం మొత్తానికి విద్యుత్తు ఇచ్చే శక్తి సామర్థ్యాలు, వనరులు సీమాంధ్రకు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ సర్కారుకే గనుక సత్తా ఉంటే కేవలం సీమాంధ్రలోని కేజీ బేసిన్‌లోని ఇంధన వనరులతోనే మొత్తం దేశానికి కరెంటు ఇవ్వగలిగేదనీ ఆయన యూపియేకు చురకలుకూడా వేశారు.  కేజీ బేసిన్‌లో ఇంధన వనరులు ఏ స్థాయిలో వున్నాయో రిలయన్స్ అంబానీలకు  తెలిసినంతగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియదన్న నిజాన్ని మాత్రం వారు ప్రస్తావించలేదు. కేజీ బేసిన్‌లోని ఇంధన వనరులతో దేశం మొత్తానికి విద్యుత్తు సరఫరా చేయవచ్చన్న సంగతి కూడా నిజమేగానీ, దానికి పీపిఏలు అంబానీలతో చేసుకోదలిచారో, తనకు మరింత ఇష్టులైన ఆదానీలతో చేసుకోదలిచారో అనేది మాత్రం మోదీ చెప్పలేదు. 

"బీహార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుపతిలోని ఈ పవిత్రమైన భూమిపై అడుగుపెట్టాను. నా కళ్లముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని చేరుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది” అంటూ ధార్మికతన్మయత్వంతో ప్రసంగాన్ని మొదలెట్టిన మోదీ  వెంటనే తన అసలు ఆర్ధిక చిట్టాను విప్పారు.

ప్రజాస్వామ్యంలో సహజవనరుల్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు యధేఛ్ఛగా దోచుకోవడానికి అసమ్మతి అడ్డువస్తుంది. ఆ అసమ్మతిని సాంస్కృతికంగా అణిచివేసి, సహజవనరుల దోపిడీని యధేఛ్ఛగా కొనసాగించడానికి దోపిడీదారులు మతాన్ని ముందుకుతెస్తారు. రాజకీయార్ధిక ప్రయోజనాల కోసం మతాన్ని వాడడాన్నే మతతత్వం అంటారు. ఈ విషయంలో బీజేపీది అందెవేసిన చేయ్యి అయితే నరేంద్ర మోదీ గండరగండడు. కార్పొరేట్ సంస్థలు గుజరాత్ లో నరేంద్ర మోదీని ప్రమోట్ చేస్తున్నది అందుకే!
మెజారిటీ మతతత్త్వంవల్ల ముందు మైనారిటీ మత సామాజికవర్గాలు నష్టపోయేమాట నిజమేకానీ, ఆ తరువాత నష్టపోయేది మెజారిటీ మతసామాజికవర్గంలోని పేదవర్గాలే!  అంచేత హిందూత్వ అనేది ముస్లింల సమస్యో, క్రైస్తవుల సమస్యోకాదు: శిక్కుల సమస్యోకాదు. హిందూ మతసామాజికవర్గాల్లోని పేదల సమస్య కూడా. నిజానికి దేశ జనాభాలో హిందూ పేదల సంఖ్యే ఎక్కువ.

       ఎన్నికల సమయంలో ఓటర్లు సాధారంగా  పార్టీల ప్రణాళికల్నో, నాయకుల ప్రసంగాలనో ఆసక్తిగా గమనిస్తూ వుంటారు. నిజానికి ఎన్నికల ముందు  అంతకు మించిన  ఆసక్తికర తెరవెనుక  రాజకీయం చాలా జరుతూ వుంటుంది. మనకు చంద్రబాబు, మోదీల కొత్త రాజకీయ హనీమూన్ మాత్రమే కనపడుతూవుంటుంది. మోదీ రాజకీయానికి రెండు కళ్ళు అనదగిన అంబానీ, ఆదానీల్లో అంబానీ, రామోజీరావుల అనుబంధం తెలియనివారు ఇప్పుడు ఎవరూ వుండరు. హైదరాబాద్ లో చంద్రబాబూ, బీజేపి, ఆరెస్సెస్ నేతలు ఎన్నికల పొత్తుల గురించి చర్చిస్తున్న సమయంలోనే   ఆదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ ఆదానీ గుట్టు చప్పుడు కాకుండా జగన్ ను కలిసి వెళ్ళినట్టు గుప్పుమంది. సీమాంధ్రలో ఎవరు అధికారానికి వచ్చినా జట్టు కట్టడానికి జాతీయ కార్పొరేట్ సంస్థలు సిధ్ధమవుతున్నాయనడానికి ఈ సంకేతాలు చాలు. 

       చాలా కాలంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అనేక కార్పొరేట్ సంస్థల అధిపతులు ఏప్రిల్ రెండవ వారంలో సీమాంధ్రలో ఒక బస్సు యాత్ర నిర్వహించారు. సీమాంధ్రలో హైదరాబాద్ వంటి అభివృధ్ధిని సాధించడం వాళ్ల లక్ష్యమట. ఇలాంటప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎలాంటి అభివృధ్ధిని సాధించారనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది. 

తనవీ చంద్రబాబువీ అభివృద్ధి ఆలోచనలేననీ. చంద్రబాబు హైదరాబాద్‌ను సైబర్ సిటీగా మార్చి, బ్రాండ్ హైదరాబాద్‌ను నిర్మించారనీ మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. చంద్రబాబు మార్కు  అభివృధ్ధికి ప్రతీక  హైదరాబాద్ లో ఒక మూల వున్న హైటెక్ సిటీ. మిగిలిన మూడు మూలల్ని ఆయన గాలికి వదిలేశారు; మరీ ముఖ్యంగా పాతబస్తీని. మాధాపూర్ హైటెక్ సిటీని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ బాపతువాళ్ళు మెచ్చుకుని వుండవచ్చు. మాధాపూర్ ప్రజలు మెచ్చుకున్నారా? అనేదే దానికి అసలు గీటురాయి. కాకులకు కొట్టి గద్దలకు పెట్టే అభివృధ్ధిని ప్రజలు ఎప్పుడూ మెచ్చుకోరు. 2004, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో టిడిపికి వచ్చిన సీట్లే దీనికి ప్రమాణం.  ఆ రెండు ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో టిడిపికి దాదాపు బోణి కూడా కాలేదు. చంద్రబాబు మార్కు అభివృధ్ధి మీద అది ప్రజల తీర్పు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి హైదరాబాద్ లో అంతకు భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశాలూ లేవు.

       గుజరాత్ లో మోదీ సాధించినట్టు చెప్పుకుంటున్న  అభివృధ్ధి కూడా హైదరాబాద్ హైటెక్కుసిటీ లాంటిదే. దూడ నోరుకట్టి తల్లి ఆవు పాలుపితుక్కుపోయే గడసరి గొల్లవాళ్ళను ప్రజలు తిప్పికొడతారు; అది తెలంగాణలో అయినా అంతే!, సీమాంధ్రలో అయినా అంతే! రాష్ట్రాలు వేరయినా పెట్టుబడీదారులూ ఒకటే;  శ్రామికులూ ఒకటే!
1 మే 2014

http://www.andhraprabha.com/columns/a-column-by-danny/16564.html

Caste War in Seemandhra

సీమాంధ్రలో కులపోరు! 

డానీ

సీమాంధ్ర ఎన్నికల్లో రాజకీయపోరు క్రమంగా కులపోరుగా మారిపోయింది. ఈ ఎన్నికలు తేల్చేది కొత్త రాష్ట్రాన్ని ఏ రాజకీయ కూటమి ఏలాలనేదికాదు; ఏ సామాజికవర్గం మిగిలిన సామాజికవర్గాల్ని ఏలాలనేదే! రెండు పెత్తందారీ సామాజికవర్గాలు ఇంతగా బరి గీసుకుని ఎన్నికల్లో తలపడడం ఇదే మొదటిసారి.  యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ మరియూ మధ్యంతర సామాజికవర్గాలు ఎవర్ని ఎన్నుకుంటారన్నదే ఇప్పుడు కీలక అంశం. 


సహజంగానే ఈ ఎన్నికల్లో రాజకీయ సిధ్ధాంతాలకన్నా కులాల ఆకర్ష పథకాలే ప్రచారాస్త్రాలుగా మారాయి.  ప్రధాన రాజకీయకీయ శిబిరాలు రెండూ రోజుకో కులానికి ఎరవేయడం మనకు కనిపిస్తోంది. “కాపుల్ని ఉపముఖ్యమంత్రిని చేస్తాం” “బీసీల్ని ఉపముఖ్యమంత్రిని చేస్తాం” వంటి వాగ్దానాలు అందులో భాగమే! ముఖ్యమంత్రి పదవి మాత్రం కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు రిజర్వు చేశారనేది అనేది ఇక్కడ అంతరార్ధం!

సీమాంధ్రలో ఆధిపత్య కులాలంటే కమ్మ, రెడ్డి సామాజికవర్గాలేనని  కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాపులు కూడా ఆధిపత్య కులంగా కొనసాగుతున్నప్పటికీ అది సీమాంధ్రలో సార్వజనీన లక్షణంకాదు. అయితే సంఖ్యరీత్యా కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకన్నా, కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువ.

కమ్మసామాజికవర్గం ప్రధానంగా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు నాయకత్వం వహిస్తున్న టిడిపి-బీజేపి కూటమిని బలపరుస్తుండగా,  రెడ్డి సామాజికవర్గం ప్రధానం వైయస్ జగన్  నాయకత్వంలోని వైయస్ ఆర్ సిపిని బలపరుస్తున్నది. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధ్యాన్ని నిర్వహిస్తున్నారు కనుక వారి స్వంత సామాజికవర్గం తార్కికంగా కాంగ్రెస్ పక్షం వహించాలి. కానీ అలా జరగడంలేదు. దానికి రెండు కారణాలున్నాయి. ఇందులో మొదటిది, అంతర్-బహిర్ కారణాలవల్ల కాంగ్రెస్ ఈసారి సీమాంధ్రలో గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. రెండోది, కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు సంఘటితమైనట్టు కాపు సామాజికవర్గం ఇప్పటి వరకు సంఘటిత సమూహంకాదు.  అందులో అనేక రాజకీయ స్రవంతులున్నాయి. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో ఒక భాగం ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపింది కానీ ఆ ప్రయోగం అంతగా సఫలం కాలేదు. ఈసారి కాపు సామాజికవర్గం ప్రధానంగా జగన్ వెంట వుంది.  

       ఇతర సామాజికవర్గాల విషయానికివస్తే, హిందూ వెనుకబడిన కులాల్లో, మాదిగ సామాజికవర్గంలో టిడిపికి కొంతపట్టు వుంది. మాల సామాజికవర్గం, ముస్లింలు, క్రైస్తవులు, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య సామాజిక వర్గాలు స్థూలంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకత్వం కకావికలు కావడంతో ఈ సామాజికవర్గాలు ఈసారి జగన్ పక్షం వహించే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అలాగే మాదిగ సామాజికవర్గంలో అత్యధికులు క్రైస్తవులే గనుక వాళ్ళూ జగన్ వైపుకు మొగ్గే అవకాశాలున్నాయి.

జగన్ వ్యవహారశైలి, ఆయనపై ఆర్ధిక ఆరోపణలు నచ్చని ఉదారవాదులు, విద్యావంతులు, లౌకికవాదులు కొంతకాలం క్రితం చంద్రబాబు మద్దతుదారులుగా మారారు. బీజేపీ-ఆరెస్సెస్ తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు అలా కొత్తగా అందివచ్చిన ఓటు బ్యాంకును మళ్ళీ కోల్పోయారు. ఇలా బయటికి పోతున్నవారిలో ఎంతోకొంత  చంద్రబాబు స్వంత సామాజికవర్గం కూడా వుంది.

                     సీమాంధ్రలో రెండు రోజులపాటు నరేంద్ర మోదీ సాగించిన ఎన్నికల ప్రచార యాత్ర టీడిపి-బీజేపీ లకు ప్రతికూల ఫలితాలని ఇచ్చింది.  తనను తాను ఒక పిచ్చివాడని ప్రకటించుకున్న ఒక సినిమా నటుడితో, ప్రధాని అభ్యర్ధి వేదికను పంచుకోవడం విద్యాధికులైన సీమాంధ్ర మధ్యతరగతికి ఏమాత్రం రుచించలేదు. స్కామాంధ్ర కావాలో, స్వర్ణాంధ్ర కావాలో తేల్చుకోమని మోదీ విసిరిన సవాలు కూడా వెనక్కి చీదింది. చంద్రబాబు స్వర్ణాంధ్రను జనం ఇప్పటికే రెండుసార్లు  ఛీ కొట్టారు. కర్ణాటకలో బీజేపి మంత్రులు సాగించిన స్కాముల గురించి తెలియనివాళ్ళు ఎవరూలేరు. యడ్యూరప్ప, శోభాకరాండ్లజే, గాలి జనార్దన రెడ్డి ఆత్మగా పేరుగాంచిన బీ, శ్రీరాములు తదితరుల్ని చంకలో పెట్టుకుని మోదీ స్కాముల గురించి మాట్లాడడం మధ్యతరగతి వర్గానికి అస్సలు నచ్చలేదు.

ఎలా చూసుకున్నా సీమాంధ్రలో చంద్రబాబుకన్నా జగన్ ఓటు బ్యాంకు బ్యాలెన్సే ఎక్కువగా వున్నట్టు కనపడుతోంది. ఇది జగన్  ఘనత అనడంకన్నా  మోదీ-చంద్రబాబు కూటమి మీద వ్యతిరేకత అనడమే సబబు. మరోవైపు,  బీజేపీ-ఆరెస్సెస్ తో పొత్తువల్ల చంద్రబాబుకు కొత్తగా కలిసివచ్చే ఓటు బ్యాంకు కూడా వుండవచ్చు. అయితే, కలిసివచ్చేదానికన్న చంద్రబాబు కోల్పోయేదే ఎక్కువనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

       జగన్ కు కేంద్ర ప్రభుత్వం విషయంలో సంధిగ్ధం వుంది.  స్కామాంధ్ర కావాలా? అని నరేంద్ర మోదీ అన్నతరువాత కూడా జగన్ కు ఎన్డీయే మీద వ్యామోహం తగ్గినట్టులేదు. “ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీకిగానీ, ఎన్డీయేకుగానీ మద్దతు ఇచ్చేదిలేదు” అని స్పష్టంగా ప్రకటించాల్సిన సమయంలో “కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి నిధులు తెస్తాము” అని ప్రకటించి హిందూత్వ వ్యతిరేకశ్రేణుల నుండి  కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నారు. సంఘ్ పరివారం వ్యతిరేకులు, బీజేపి మిత్రపక్షాల వ్యతిరేకులూ,  రాష్ట్రంలో అంబానీ గ్రూపు కార్యకలాపాల వ్యతిరేకులూ ప్రస్తుతం తన వెంట వున్నారని జగన్ గుర్తించినట్టులేదు.

“ఎన్డీయేను వ్యతిరేకిస్తానంటే యూపియేకు మద్దుతు ఇస్తారనే” తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవచ్చు అని జగన్ జంకవచ్చు. అప్పుడు వారు మూడవ ఫ్రంట్ కు మద్దతిస్తానని ప్రకటించవచ్చు. మాయా, మమత, జయ ఇప్పుడు ఆ మార్గంలోనే పోతున్నారు. చంద్రబాబుది హిందూత్వమార్గం అని స్పష్టం అయిపోయినపుడు తనది లౌకికమార్గం అని స్పష్టత ఇవ్వకపోతే జగన్ జీవిత కాలం పాటు కోల్పోయేది  “వాళ్ళ నాయన కుర్చీ’నే!  “ ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా అనేది తర్వాత చూద్దాం.” అంటూ ప్రచారఘట్టం ముగియడానికి ఒకరోజు ముందు జగన్ చేసిన ప్రకటన నష్టనివారణకు కొంత ఉపకరించవచ్చు.  ప్రచార ఘట్టం చివరి రోజున ఆయన మరింత స్పష్టత ఇస్తే ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటారు! లేకపోతే మరో స్వయంకృతాపరాధంలో మునిగిపోతారు.

సమాజంలో సాధారంగా దళిత బహుజనులు, మత అల్పసంఖ్యాకవర్గాలు అభద్రతా భావానికి గురవుతుంటాయి.  ఈసారి ఎన్నికల్లో సీమాంధ్ర పెత్తందారీ కులాలు అభద్రతా భావంతో భయపడుతున్నాయి. సామాజికంగా ఇది చాలా పెద్దమార్పు!

(రచయిత సీనియర్ పాత్రికేయులు,  రాజకీయార్ధిక విశ్లేషకులు)

హైదరాబాద్
5 మే 2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/16774.html

Tsunduru : Justice Denied

ప్రజల వద్దకు న్యాయం ఇదేనా?

ఉషా యస్ డానీ


చుండూరు ఊచకోత కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు సామాజికన్యాయం కోరుకునేవారికి తీవ్ర అసంతృప్తిnని కలిగించింది. ఇదేమీ ఊహాజనిత కేసుకాదు. హతులో, నిందితులో ఆచూకీ లేకుండా పోయిన కేసూ కాదు. పెత్తందారీ సామాజికవర్గాలకు చెందిన దాదాపు నాలుగు వందల మంది ఏకమై తమ గ్రామాలకు చెందిన దళితుల్ని పట్టపగలు వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి ఎనిమిది మందిని నరికి చంపి సాక్ష్యాల్ని రూపుమాపడానికి శవాల్ని గోనె సంచుల్లో మూటకట్టి  కాలవలో పడేసిన అతికిరాతక కేసు ఇది.

చుండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఏడేళ్ల క్రితం 56 మంది నిందితులకు విధించిన శిక్షలను హైకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 22న రద్దు చేసి, వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దళితుల కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని అంటూ,   ఇప్పటికైనా కక్షలకు స్వస్తిపలికి, మానవతా విలువలతో కలిసి మెలిసి బతకాలని పిర్యాదిదారులకూ,  నిందితులకూ ధర్మాసనం హితవు పలికింది. నిర్దోషులుగా బయటపడిన నిందితుల్ని విజయోత్సవాలు జరుపుకోవద్దని మందలించింది. చుండూరు, మోదుకూరు గ్రామాల్లో అల్లర్లు చెలరేగకుండా కనీసం మూడు నెలలపాటు ముందు జాగ్రత్త చర్యగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది.

ఒక వివాదానికి ముగింపు పలకాల్సిన ధర్మాసనం తీర్పు అనేక కొత్త  సందేహాలకు ద్వారాలు తెరిచింది. నిందితులకు భద్రతను ఏర్పాటు చేయమని ఆదేశించిన కలంతో బాధితులు, మృతుల కుటుంబాలకు ఎలాంటి ఓదార్పునూ అందించలేకపోయింది. ధర్మాసనం తీర్పు ఇంతగా వివాదాస్పదం అయిన సందర్భం ఇటీవలి కాలంలో మరొకటిలేదు. “చట్టం డబ్బున్నోడి చుట్టం” అనే పాతకాలపు నాటు సామెత ఇప్పటీకీ నిజం అనిపిస్తోంది.

హైకోర్టు ధర్మాసనం తీర్పులోని సామాజిక కోణాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలంటే ఈ కేసును తలకిందులు చేసి చూడాలి. చుండూరు మారణకాండలో హతులు పెత్తందారీ కులాలవాళ్ళై, హంతకులు దళితులై, నిందితుల్ని ధర్మాసనం నిర్దోషులంటూ తీర్పు చెపితే ఎలా వుండేదీ? నిందితులకు భద్రత ఏర్పాటు చేయాలని ధర్మాసనం అదేశిస్తే  అప్పుడీ సమాజం ఇంత ప్రశాంతంగా వుండేదా? 

       కరువుకాటకాల్లో ఆకలితో నకనకలాడే  మనుషులు ఆహారం కోసం కొట్లాడుకుంటే అదో ఇది. కాలువలు సుడులు తిరిగి, పొలాలు విరగపండి, గాదుల నిండా ధాన్యరాశులు, ఇంటినిండా ధనరాశులు మూలుగుతున్నాసరే వున్నవాళ్ళు లేనివాళ్ళని వేటాడి చంపుతారని కారంచేడు కండకావరం 1985లో నిరూపించింది. తెలంగాణ వర్గపోరాటాలకు పుట్టినిల్లయితే, సీమాంధ్ర కులపోరాటాల కురుక్షేత్రం అనే అభిప్రాయం పుట్టింది అప్పుడే!

వర్ణవ్యవస్థలో శూద్రులుగా వుండి, ఆధునిక సాంఘీక చట్రంలో ఆధిపత్యకులాలుగా ఎదిగిన సామాజికవర్గాలు 1970-80వ దశాబ్దాల్లో దేశమంతటా చెలరేగిపోయారు. దళితులపై ఒక పరంపరగా దాడులు కొనసాగించారు.  బీహార్ లోని బెల్చీ, పిప్రా,  ఉత్తరప్రదేశ్ లోని కఫల్తా, మధ్యప్రదేశ్ లోని మందసౌర్, మళ్ళీ బీహార్  సాహిబ్ గంజ్ జిల్లాలోని బంఝీలో పోలీసుకాల్పులు, ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడు వంటి దురాగతాలు ఆ దశలో  జరిగినవే. దళితులపై దాడుల్ని నివారించడానికి గట్టి కోరలున్న కొత్త చట్టాలు తేవాలంటూ దళిత యంపీలతో పాటూ పౌరహక్కులు, మానవహక్కుల  సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. కారంచేడు ఉద్యమానికి కేంద్ర కార్యాలయమైన చీరాల విజయనగర్ శిబిరం కూడా పదిమందితో కూడిన మహిళా బాధితుల బృందాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దగ్గరికి పంపింది. చివరకు, 1987లో స్వాతంత్ర దినోత్సవం నాటి సాంప్రదాయ  ఎర్రకోట ప్రసంగంలో  యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధానికి ఒక చట్టం తెస్తున్నట్టు  రాజీవ్ గాంధీ ప్రకటించారు.  ఈ చట్టాన్ని 1989 సెప్టెంబరు 11 న భారత పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిబంధనలన్నీ రూపొందించుకుని ఇది 1995 మార్చి 31  నుండి అమల్లోనికి వచ్చింది.

కారంచేడు, చుండూరు దురాగతాల్లో ఒక సామాన్యాంశం వుంది. కమ్మ సామాజికవర్గం నాయకత్వంలోని తెలుగుదేశం పాలన కొనసాగుతున్న రోజుల్లో కారంచేడులో కమ్మసామాజికవర్గం  దళితుల మీద దాడులు జరపగా,  రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న రోజుల్లో చుండూరులో రెడ్డి సామాజికవర్గం  దళితుల మీద దాడులు జరిపింది.


యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేయడానికీ, అది అమల్లోనికి రావడానికీ మధ్య కాలంలో 1991 ఆగస్టు 6న చుండూరు సంఘటన జరిగింది.  దళితులపై అత్యాచారాల కేసుల్ని విచారించి దోషుల్ని సత్వరం శిక్షించడానికి వీలుగా  ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయడానికీ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడానికీ  ఈ చట్టంలోని 14, 15 సెక్షన్లలో అవకాశం కల్పించారు.  ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక కోర్టు మొదట్లో గుంటూరులోనూ, తరువాత చుండూరు క్యాంపు కోర్టులోనూ  విచారణ సాగించింది. దీన్నే ప్రజల వద్దకు న్యాయం అని అప్పట్లో చాలా ఘనంగా చెప్పుకున్నారు.
జస్టిస్ అనీష్ న్యాయమూర్తిగావున్న చుండూరు క్యాంపు కోర్టులో దివంగత న్యాయవాది బీ. చంద్రశేఖర్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు.   179 మంది నిందితుల్లో సాక్ష్యాధారాలు లేవని కొందరినీ, సాక్ష్యాలు ఉన్నా  రికార్డు లేదని మరికొందరినీ, సంశయాత్మక లబ్ది (బెన్‌ఫిట్ ఆఫ్ డౌ ట్) కింద ఇంకొందరినీ మొత్తం 123పై ప్రత్యేక న్యాయస్థానం కేసు కొట్టివేసింది. . మిగిలిన 56 మందిలో 21 మందికి యావజ్జీవ ఖైదు, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది.

కారంచేడు భూమి మీద అద్భుత ఉద్యమం; న్యాయస్థానాల్లో బలహీన పోరాటం. చుండూరు భూమి మీద బలహీన ఉద్యమం న్యాయస్థానాల్లో అద్భుత పోరాటం. అయితే ఆ తరువాత జరిగింది వేరు. ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు నిందుతులకు విధించిన శిక్షను హైకోర్టు కొట్టివేయగా, 2008 చివర్లో సుప్రీం కోర్టు ఒకరికి జీవిత ఖైదునూ, మరో ముఫ్ఫయి మందికి మూడేళ్ళ చొప్పున కఠిన కారాగార శిక్షను విధించింది.

       చుండూరులో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు విధించిన శిక్షతో సంతృప్తి చెందని బాధిత కుటుంబాలు, దోషులకు మరింత కఠిన శిక్ష విధించాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి.  అలాగే, ప్రత్యేక కోర్టులో  శిక్షలు పడినవాళ్ళు సహితం  ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేశాయి.  ఆ తరువాత జరిగిందంతా నడుస్తున్న చరిత్రే!

                     కారంచేడులో ప్రజలు న్యాయస్థానం తీర్పుకోసం ఎదురుచూడలేదు. తమదైన శైలిలో తీర్పు చెప్పారు. ప్రజాకోర్టును నిర్వహించి ప్రధాన నిందితుడికి మరణదండన విధించారు. చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని  ఆ తీర్పును తామే స్వయంగా అమల్లోనికి పెట్టారు. దళితులపై అత్యాచారాల కేసుల్లో ప్రజాతీర్పే సరైనదేమోననే అభిప్రాయాన్నీ  చుండూరు కేసులో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కలిగిస్తున్నాయి. 

                     మనకు సామాజిక న్యాయస్థానాలు కావాలి! ఇప్పటి న్యాయస్థానాలకు కుల స్వభావం, మత స్వభావం, వర్గ స్వభావం వుందీ. ఒక్కసారి ఒక్క కేసులో కోర్టుకు వెళ్ళండి.  నిందితుడిగానేకాదు పిర్యాదిదారుడిగా అయినా సరే వెళ్ళండి. గొప్ప జ్ఞానోదయం అవుతుంది. న్యాయస్థానాల్లో డబ్బు గెలుస్తుంది. కులం గెలుస్తుంది. మతం గెలుస్తుంది. రాజకీయ పార్టి గెలుస్తుంది.

       చట్టనిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థలకన్నా న్యాయవ్యవస్థలో అవినీతి అన్ని హద్దులనూ దాటిపోయింది. గనుల ఘనుడికి బెయిలు ఇవ్వడానికి నాలుగు వందల కోట్లు అడిగిన న్యాయమూర్తులు మనకు తెలుసు. చంచల్ గూడ జైల్లో గనుల ఘనులేకాదు వాళ్లకు బెయిళ్ళు మంజూరు చేసిన న్యాయమూర్తులూ వున్నారు. న్యాయమూర్తులూ మనుషులే. వాళ్ళకూ కులం, మతం, వర్గం, స్వార్ధం, ప్రేమ, పెళ్ళాం, బిడ్డలు, కష్టాలు సుఖాలు, రాజకీయ ఇష్టాయిష్టాలు, డబ్బు ఆశ అన్నీ వుంటాయి.

మనం కార్యనిర్వహణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. శాసన నిర్మాణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. న్యాయవ్యవస్థకు  మాత్రం మినహాయింపుదేనికీ? అది కూడా ప్రజాస్వామ్యవ్యవస్థకున్న మూడు స్థంభాల్లో ఒకటికదా! ఒక అధికారి తప్పుచేస్తే అతని కార్యాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. ఒక శాసన సభ్యుడు తప్పుచేస్తే అతని ఇంటి ముందు ధర్ణా చేస్తున్నాం. ప్రభుత్వం తప్పుచేస్తే,  సచివాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. సామాజిక న్యాయానికి విరుధ్ధంగా తీర్పులుచెపితే న్యాయస్థానాలు  ముందు ధర్ణా చేయడం కూడా మొదలెట్టాలి.

యస్సీ, యస్టీల హక్కుల  పరిరక్షణ కోసం అధికారులు, సిబ్బందిని నియమించే సందర్భాల్లో బాధితుల సమస్యల మీద  సరైన దృక్పధం, సరైన అవగాహన కలిగివున్నవాళ్లనే నియమించాలనీ యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 13 లోని 1వ క్లాజ్ స్పష్టంగా ఒక నియమాన్ని విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలనీ కూడా ఈ క్లాజు  అదేశిస్తుంది.   

13:1    The State Government shall ensure that the administrative officers and other staff members to be appointed in an area prone to atrocity shall have the right aptitude and understanding of the problems of the Scheduled Castes and the Scheduled Tribes.

 సరిగ్గా ఈ నియమం తప్పడంవల్లనే హైకోర్టులో చుండూరు తీర్పు అలా వచ్చింది. కారంచేడు సంఘటనలో జరిగినట్టు ఇక సుప్రీంకోర్టులో అయినా సామాజికన్యాయం జరుగుతుందని ఆశిద్దాం!  

(రచయిత సీనియర్ పాత్రికేయులు,  రాజకీయార్ధిక విశ్లేషకులు)

హైదరాబాద్

5 మే 2014


ప్రచురణ :
బాస మాసపత్రిక, గుంటూరు

జూన్ సంచిక 2014