Wednesday 7 May 2014

Never there Should be a Modi Sarkar


కభీనహీ మోదీ సర్కార్! 

డానీ  


సీమాంధ్రలో  పోలింగ్ ముగిసింది. కొత్త రాష్ట్రంలో తొలి ఎన్నికలు కావడంవల్ల మాత్రమేగాక జాతీయ రాజకీయ సన్నివేశం మూలంగానూ ఈ ఎన్నికలు  ఆఢునిక భారత చరిత్రలో చాలా కీలకంగా మారాయి.

వ్యక్తిగతంగా నాకు, మా మిత్రుల్లో చాలా మందికీ ఎన్నడూ పార్లమెంటరీ రాజకీయల మీద నమ్మకంలేదు. ఈపార్టి ఆపార్టి అని కాకుండా పార్లమెంటరీ రాజకీయ పార్టీల నాయకులందర్నీ నేను కఠిన పదజాలంతో విమర్శించేవాడిని. కానీ ఈసారి ఎన్నికల్లో పార్లమెంటరీ రాజకీయల మీద ఆసక్తి కలిగింది. దానికి కారణం ఒకే ఒక నినాదం; అబ్ కి బార్ మోదీ సర్కార్. (అది బీజేపి సర్కార్ కూడా కాదట!)
వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి భారత ప్రధాని కావడం అందరూ ఆహ్వానించదగిన మహత్తర విషయం. కానీ,  వెనుకబడిన కులాలకు చెందిన యాభై కోట్ల మందిలో వారికి  నరేంద్ర మోదీ ఒక్కరే దొరికారా బీసీ అనడానికీ? అటు కేంద్ర రిజర్వేషన్ జాబితాలోనూ, ఇటు  రాష్ట్ర రిజర్వేషన్ జాబితాలోనూ, చట్టబధ్ధంగా  ముస్లీంలు, దళిత క్రైస్తవులు కూడా బీసీలే. అంచేత, ముస్లీంలు, క్రైస్తవులు ఎవరూ హిందూ వెనుకబడిన కులాలను ఎప్పుడూ తక్కువగా చూడరు. 

నరేంద్ర మోదీని  చూస్తే గుజరాత్ అల్లర్లు గుర్తుకు వస్తాయి. వెయ్యి మందిని కిరాతకంగా ఊచకోత కోయడం గుర్తుకు వస్తుంది. అలా ఎవరికైనా గుర్తుకు రాకపోతే వాళ్ల మెదడులో ఏదో లోపం వుందని అనుకోవాలి.
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల నిలయం. ఇక్కడ అందర్నీ కలుపుకునిపోయే సామరస్య విధానాలు కావాలి. ద్వేషరాజకీయాల మీద బతికే నరేంద్ర మోదీలు భారతదేశ సంస్కృతికి ముసలం వంటివారు. అభివృధ్ధి కావలసిందే. కానీ, దానికోసం సామాజిక ప్రశాంతతను ఫణంగా పెడతాం అంటే కుదరదు.  అభివృధ్ధికన్నా  సామాజిక ప్రశాంతతే సమాజానికి గొప్పది.
       ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత అల్పసంఖ్యాక వర్గాలేకాదు హిందూ సమాజంలోని భక్తులు, విద్యావంతులు, మానవతావాదులు, ఉదారవాదులు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, శాంతి కాముకులు, దళిత-బహుజనులు, పేదలు  ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ వంటి మొరటు మనిషికి మద్దతు పలకరు.
భారత సామాజిక సామరస్యం మీద నరేంద్ర మోదీ దాడిని ఆపడానికి మేము సహితం సమిధనొక్కటి ధారబోయాలనుకున్నాము. మోదీకి మద్దతిచ్చే పార్టీలు, వాటి నాయకుల్ని ఓడించడానికి క్రియాశీలంగా ప్రయత్నం చేయకపోతే ఒక చారిత్రక తప్పిదం చేసినట్టే అనిపించింది.

     2011నాటి టిడిపి మహానాడు తీర్మానానికి కట్టుబడివుంటే మేము  తప్పకుండా ఈ ఎన్నికల్లో చంద్రబాబుగారికి గట్టిమద్దతు ఇచ్చివుండేవాళ్ళం.  వారేకాక, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, జనసేన పవన్ కళ్యాణ్ కు సహితం మోదీ మానియా పూనేసింది. ఇక వాళ్లను రాజకీయ ప్రత్యర్ధులుగా, మతసామరస్య వ్యతిరేకులుగా భావించక తప్పలేదు.

 వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, బీయస్పీ తదితర పార్టీలు  ప్రత్యామ్నాయంగావున్నా అవి ఇప్పుటి పరిస్థితుల్లో మనకు సరైన వేదికలు కావు అనిపించింది. జై సమైక్యాంధ్ర పార్టి ఏమాత్రం నిజాయితీలేనిదని తేలిపోయింది. ఇక మిగిలింది కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్. సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు కాడిని పూర్తిగా పడేయడంతో చివరి మలుపులో జగన్ ఒక్కరే మిగిలారు.

మేము జగన్ ను బలపరిచాం అనడంకన్నా జగన్ వ్యతిరేకుల్ని తీవ్రంగా వ్యతిరేకించాం అనడం సబబు. మోదీ, బాబూ, పవన్ కళ్యాణ్, జేపీ సాగించిన మతవాద రాజకీయాలని మేము నిర్ద్వంద్వంగా వ్యతిరేకించదలిచాం. అది తార్కికంగా జగన్ కు అనుకూలంగా మారింది. మరోమాటల్లో చెప్పాలంటే, మేము జగన్ ను అభిమానించడంవల్ల బాబూను వ్యతిరేకించలేదు. బాబూను వ్యతిరేకించడం కోసం జగన్ కు మద్దతు ఇచ్చాం.  బాబు మీద మా వ్యతిరేకత జగన్ కు మద్దతుగా మారింది.


 రాష్ట్రం వరకు చంద్రబాబుతో హోరాహోరీగా తలపడినా, ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే కూటమి విషయంలో జగన్ కు చివరి వరకూ చాలా ఊగిసలాట వుండింది. ఆయనకు కూడా అడపాదడపా మోదీ మీద వ్యామోహం వచ్చేది. అది మాకు చాలా నిరాశ కలిగించింది. 

మే 4 ఆదివారం  సాయంత్రం విజయవాడ సభలో ఆయన చేత  బాబు  మోడీ కోసం ఓటడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిత కోసం ఓటడుగుతున్నా  “కేంద్రం మెడలు వంచే ప్రభుత్వం కావాలో, చంద్రబాబులా కేంద్రం వద్ద మోకరిల్లే  ప్రభుత్వం కావాలో తేల్చుకోండి ‘‘నరేంద్ర మోడీ, చంద్రబాబు, సోనియా... వీరెవ్వరికీ మన రాష్ట్రం మీద ప్రేమ లేదు   ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా అనేది తర్వాత చూద్దాం.వంటి నాలుగు మాటలు చెప్పించడానికి తెరవెనుక, తెర బయట చాలా మంది చాలా రకాలుగా దౌత్యాలు నడపాల్సివచ్చింది.

అంతిమంగా పోలింగ్ జరిగిపోయింది. ప్రజల ముందు మావంతుగా ఒక ప్రత్యామ్నాయాన్ని పెట్టాం. ప్రజలు శాంతి సామరస్యాలనే కోరుకుంటారనే మా నమ్మకం వమ్ముకాదని మా ప్రగాఢ విశ్వాసం. ఆ విషయం 16న తేలుతుంది. ఇప్పటికైతే చాలా ఆనందంగా వుంది శాయశక్తులా క్రీయాశీలంగా మా పాత్రను మేము పోషించామని!

Danny Notes, 7  May 2014




No comments:

Post a Comment