Monday, 5 May 2014

Caste Polarization and Vote Banks

డానీ కాలం
కులాలు, మతాలు ఓటుబ్యాంకులు

డానీ


        ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయని తెలియనివాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరూలేరు.  అయితే, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్న వైనానికి వస్తున్నంత ప్రచారం, అక్కడ చోటు చేసుకుంటున్న కొత్త సామాజిక సమీకరణలకు రావడంలేదు.  ఆ విశేషాలు కూడా మీడియాలో వస్తే, సీమాంధ్రలో రాజకీయ మార్పులకన్నా సామాజిక సమీకరణలే వేగంగా మారుతున్నాయని గుర్తించడానికి వీలుండేది.

        రాజకీయంగా చూస్తే సీమాంధ్రలో వలసల పోకతో  కాంగ్రెస్ ఖాళీ అయిపోతున్నట్టూ, వలసల రాకతో తెలుగుదేశం క్రిక్కిరిసిపోతున్నట్టూ కనిపిస్తోంది. ఇది వాస్తమే అయినప్పటికీ అక్కడ వెలుగులోనికిరాని  సామాజిక వాస్తవాలు అనేకం వున్నాయి.

        ఏ రాజకీయా పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే దానికి తగిన ఓటు బ్యాంకు వుండాలి. ఓటు బ్యాంకు అంటే గతంలో రాజకీయా సిధ్ధాంతాలు లేడా నమ్మకాలు అని అర్ధం చెప్పుకోవడానికి వీలుండేది. ఇప్పుడు రాజకీయ సిధ్ఢాంతాలకూ, విశ్వాసాలకూ తావులేదు. అట్ట పేజీలు తీసేస్తే, అన్ని పార్టీల  ఎన్నికల ప్రణాళికలు ఒకేలా కనిపిస్తున్నాయి. అసలు అన్నింటినీ ఒకరే రాసారేమో అనే అనుమానం కూడా వస్తుంది.


        రాజకీయ సిధ్ధాంతాలు లేనపుడు ఓటు బ్యాంకు అంటే ఏమిటీ అనేది? ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు. ఇప్పట్లో ఓటు బ్యాంకు అంటే కులాలు, మతాలు అని తెలియనివాళ్ళు ఎవరూ వుండరు. గతంలోనూ ఓటు బ్యాంకులో కులం, మతం వుండేవిగానీ, ఇటీవల  మరింత ప్రస్పుటంగా   ముందుకు వచ్చాయి.

        మొన్నటిదాక రాష్ట్ర్ రాజకీయాలు విభజన, సమైక్యత వాదాలతో హోరెత్తాయి. పరస్పర వ్యతిరేక భావోద్వేగాల ఆధారంగా, ప్రాంతాలవారిగా రాజకీయాలు విడిపోయాయి.  ఉద్యమాల భావోద్వేగాలకూ, ఎన్నికలకూ పెద్దగా సంబంధంలేదని లేదని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. రెండు నెలల క్రితం వరకు ఇరు ప్రాంతాల్లో  చెలరేగిన భావోద్వేగాలు  రాజకీయాల్లోకి పరావర్తనం చెందివుంటే ఒక భిన్నమైన సమీకరణలు  ఏర్పడి వుండేవి. తెలంగాణలో, టిఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపి, సిపిఐ లతో ఒకటో రెండో కూటములు ఈపాటికి ఏర్పడివుండేవి. కానీ అలా జరగలేదు. సీమాంధ్రలో తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి ద్వయం నెలకొల్పిన జై సమైక్యాంధ్ర  పార్టి  అందరికన్నా ముందుండేది. కానీ అలా జరగలేదు.

ఉద్యమాలు భావోద్వేగాలతో సాగితే, ఎన్నికల పొత్తులు ఓటు బ్యాంకు సమీకరణలతో జరుగుతాయని మరోసారి రుజువయ్యింది. తెలంగాణను టీఆర్ ఎస్ తెచ్చిందనీ, కాంగ్రెస్ ఇచ్చిందనీ తెలియనివాళ్ళు ఎవరూలేరు. కానీ, ఇప్పుడు ఎన్నికల ప్రాంగణంలో తెలంగాణలో కాంగ్రెస్సేకాదు టిఆర్ ఎస్ కూడా అంతగా అత్మవిశ్వాసంతో కనిపించడంలేదు. విభజనకు గట్టి మద్దతు ఇచ్చిన సిపిఐ పరిస్థితి కూడా మెరుగుపడకపోగా తగ్గు ముఖంలో వుంది.

సీమాంధ్రలోనూ పరిస్థితి అందుకుభిన్నంగాలేదు.  సమైక్యవాదాన్ని రేకెత్తించి, నాయకత్వం వహించిన లగడపాటి రాజగోపాల్, కిరణ్ కుమార్ రెడ్డీలను పట్టించుకుంటున్నవాళ్ళు కనిపించడంలేదు. యంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో వెలిగిపోయిన కిరణ్ శిబిరంలో వుండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ తప్ప   పాత ముఖాలు కనిపించడంలేదు.  

విచిత్రంగా అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలోనూ తెలుగుదేశం హఠాత్తుగా వెలుగులోనికి వచ్చింది. విభజన, సమైక్య ఉద్యమాలు వుధృతంగా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పాత్ర వివాదాస్పదంగా వుండింది. చంద్రబాబు విభజనవాదుల్లో సమైక్యవాదిగా, సమైక్యవాదుల్లో విభజనవాదిగా ఒక ఇబ్బందికర పాత్ర పోషిస్తూవుండేవారు.  అయితే, ఎన్నికల్లో భావోద్వేగాలకన్నా అచ్చమైన కులసమీకరణలు,  ఇంకా  పచ్చిగ చెప్పాలంటే ఆర్ధిక సమీకరణలే బలంగా పనిచేస్తాయని చంద్రబాబుకు బాగా తెలుసు. దానికి సంబంధించిన లెఖ్ఖలు బొక్కల్ని విశ్లేషించడంలో  వారు ఘనాపాటి. మత ఓటు బ్యాంకును నడపడంలో బీజేపికి ప్రావిణ్యం వున్నట్టు, కులాల ఓటు బ్యాంకును నడపడంలో చంద్రబాబుకు ప్రత్యేక ప్రావిణ్యం వుంది. 2004లో టిడిపి వట్టిపోయినపుడు ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయినవాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వట్టిపోయినట్టు కనిపిస్తుండడంతో స్వంత గూటికి తిరిగివస్తారని చంద్రబాబుకు క్షుణంగా తెలుసు.

        జగన్ కు కులమతాల సమీకరణల్ని విశ్లేషించడంలో చంద్రబాబు వంటి ప్రావిణ్యంలేదు. నాయన వైయస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత పెల్లుబికిన సానుభూతి తనను సియం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి సరిపోతుందనే ధీమాతో ఇంతకాలం ఆయన వున్నారు. ఎంతటి గొప్పవారి మీదనయినా సానుభూతి ఐదారు నెలలు వుంటుందిగానీ ఐదారేళ్ళు వుండదని వారికి ఇప్పుడిప్పుడే తెలిసివస్తున్నది.

సీమాంధ్రలో రెడ్డి సామాజికవర్గంలో అత్యధికులు జగన్ ను తమ రాజకీయ నాయకునిగా భావిస్తున్నారు. ఎస్సీల్లో మాల సామాజికవర్గం, మాల క్రైస్తవ సామాజికవర్గం, మాదిగ క్రైస్తవ సామాజికవర్గం, క్రైస్తవులు, ముస్లింలు కూడా జగన్ కు గట్టి మద్దతుదారులుగా వున్నారు.  జగన్ కు మద్దతుదారులుగావున్న మాదిగసామాజికవర్గం,  బీసీ సామాజికవర్గాలు, ముస్లీం సామాజికవర్గాల్లో ఇప్పుడు చీలిక కనిపిస్తున్నది.  మాదిగసామాజికవర్గం,  బీసీ సామాజికవర్గాల్లోలు ఎక్కువ భాగం ఇప్పుడు తెలుగుదేశం వైపుకు చూస్తుండగా, ముస్లిం సామాజికవర్గాలు ప్రధానంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి.  జగన్ మద్దతుదారుల  గ్రాఫ్ గత మూడు నెలలుగా క్రమంగా పడిపోతూ వుండడానికి ప్రధాన కారణం మాదిగ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లో వస్తున్న మార్పులే. తక్షణం దీనికి నివారణ చర్యల్ని చేపట్టక పోతే జగన్ గ్రాఫ్ మరింతగా పడిపోయే ప్రమాదం వుంది.

కమ్మ సామాజికవర్గంలో అత్యధికులు టిడిపి మద్దతుదారులుగా వున్నారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ వైపుకు వెళ్ళిన కార్పొరేట్ వర్గం ఇప్పుడు తిరిగి టిడిపి గూటికి చేరుకుంటున్నది. అలా నేరుగా తిరిగి రావడానికి ఇబ్బందులున్నవాళ్ళు బీజేపి మీదుగా టిడిపికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. సీమాంధ్రలో చేపట్టబోయే ప్రాజెక్టులల్ని దృష్టిలో వుంచుకుని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నిర్మాణ సంస్థలు సంస్థలు సహితం బాబూ-మోదీ కూటమిలో చేరుతున్నాయి. బీసీ, మాదిగ సామాజికవర్గంలో టిడిపీకి మొదటి నుండీ గట్టి మద్దతు వుంది. జగన్ రాకతో ఆ ఓటు బ్యాంకు కొంత చెడినఫ్ఫటికీ ఇప్పుడు మళ్ళీ పాతస్థితి నెలకొంటున్నది. బీజేపీతో పొత్తు కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతిన్నప్పటికీ ఆ కొరవను స్వంత సామాజిక వర్గంతోపాటూ, బీసీ, మాదిగ  సామాజికవర్గాలు పుడుస్తాయని చంద్రబాబు నమ్మకంగా వున్నారు. ఇటీవల ఆయన రాజకీయ రేఖాచిత్రం భారీగా పెరగడానికి కారణం ఇదే!

సీమాంధ్రలో ఒకరకంగా సంధిగ్ధంలోవున్న సామాజికవర్గం కాపులది. ఈవర్గం కొన్ని జిల్లాలలో టిడిపీకి మద్దతుదారుగా వుంది. మరొకొన్ని జిల్లాలలో కాంగ్రెస్ తో వుంది. కాంగ్రెస్ నావకు చిల్లులు పడ్డాయని తెలిసినా దాని కెప్టెన్ గా చిరంజీవి వుండడంతో కాపు సామాజికవర్గం ఆలోచనల్లోపడింది. ఈ సంధిగ్ధాన్ని తొలగించడానికే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు రంగంలో దించారనే వాదనా వినిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య కాపు సామాజికవర్గం తీసుకునే నిర్ణయమే ఈసారి సీమాంధ్ర ఎన్నికల్లో కీలకం కానున్నాయి.


తెలంగాణలో కేసిఆర్ భావోద్వేగ నాయకుడే అయినప్పటికీ కులాల సమీకరణలో ఆయన శక్తియుక్తులు సరిపోవని ఇటీవలి పరిణామాలు చెపుతున్నాయి. సీమాధ్రలో జగన్ అనుసరిస్తున్న పంథానే తెలంగాణలో కేసిఆర్ అనుసరిస్తున్నరనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ ఎస్ టిక్కెట్టు తీసుకోవడానికి అభ్యర్ధులు లేరంటే నమ్మశక్యంగా లేదు. తెలంగాణలో వెలమ సామాజికవర్గంకన్నా, రెడ్డి సామాజికవర్గం సంఖ్యలోనూ, ప్రాబల్యంలోనూ చాలా పెద్దదన్న వాస్తవాన్ని కేసిఆర్ అంతగా పట్టించుకున్నట్టులేదు.  ఎన్నికల్లో కులం పనిచేసినంత బలంగా భావోద్వేగాలు పనిచేయవు. ఇక్కడా చంద్రబాబు తన తెలివిని ప్రదర్శిస్తున్నారు. బీసీ, రెడ్డి, మాదిగ, కమ్మ సామాజికవర్గాలతో తెలంగాణలో ఓటు బ్యాంకును నిర్మించే పనిలోపడ్డారు. ముస్లింలుబయటికి పోవడంతో ఏర్పడేలోటును బీజేపి తెచ్చే అదనపు ఓట్లతో పూడ్చుకోవచ్చని ఆయన కంప్యూటర్ లో లెఖ్ఖలు వేసి తేల్చుకున్నారు

ఈ ఎన్నికల్లో అటు సీమాంధ్రలోనూ,  ఇటు తెలంగాణలోనూ ఒక స్పష్టమైన ఓటు బ్యాంకును నిర్మించుకోలేకపోయిన పార్టి కాంగ్రెస్సే. రెడ్డి, కమ్మ తదితర పాబల్య కులాలను పార్టీ నాయకత్వం నుండి తప్పిస్తే, కొత్త సామాజిక నిర్మాణాన్ని (సోషల్ ఇంజినీరింగ్) చేపట్త వచ్చని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. ఇలాంటి ఆలోచనల్లో తప్పులేదు. దాన్ని  చాలా ముందుగానే అమల్లో పెట్టి వుండాల్సింది. అయితే, కాంగ్రేస్ కు అంతర్గతంగా ఒక జాడ్యం వుంది. ప్రతిదాన్నీ నాన్చినాన్చి చివరి ఘడియలో హడావిడిగా చేస్తుంది. అది తెనాలి రామలింగడు పిల్లికి పాలు తాపించినట్టు వుంటుంది.   రైట్ డెసిషన్ ఇన్ రాంగ్ టైం అండ్  ఇన్ రాంగ్ ఫార్మ్! 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

5 ఏప్రిల్ 2014
ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/a-calumn-by-danny/15133.html

1 comment: