1996 – 2014
మారుతున్న పాత్రికేయ విలువలు
డానీ
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఈరోజు గోటేటి రామచంద్రరావు వ్యాసం
“కాంగ్రెస్ కు చరమగీతం” అచ్చయింది. ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాసాలు సాధారణ విషయమే
అయినా సీమాంధ్రలో పోలింగ్ జరుగుతున్న రోజున రావడంతో దీనికో ప్రత్యేకత
వచ్చింది. 1996 లోక్ సభ ఎన్నికల సందర్భంగా నేను రాసిన
ఇలాంటి వ్యాసం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. అప్పటి నా
వ్యాసం గణాంకాల మీద ఆధారపడిరాసిందయితే, ఇప్పటి గోటేటి రామచంద్రరావు వ్యాసానికి డేటాగానీ, ఉపపత్తిగానీ ఏమీలేవు.
ఆంధ్రజ్యోతి
విజయవాడ ఎడిషన్లో అప్పట్లో నేను కాంగ్రెస్ బీటు చూస్తుండే వాడిని. పోలింగ్ రోజైన ఏప్రిల్ 27 నాటి జిల్లా పేజీలో నా కథనం ’విజయవాడలో కాంగ్రెస్ మొగ్గు?’ బ్యానర్ గా అచ్చయింది. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా నేను
స్పష్టంగానే ఆ శీర్షిక పెట్టాను.
ఎడిటోరియల్ డెస్కువాళ్ళు ’ముందు జాగ్రత్తగా’ ప్రశ్నార్ధకం జోడించారు!. “62 శాతం పోలింగ్
ప్రాతిపదికపై కాంగ్రెస్ అభ్యర్ధి పర్వతనేని ఉపేంద్రకు 3,51,886 పడనున్నాయి” అనేదే ఇందులో ప్రాణప్రదమైన వాక్యం.
ఫలానా అభ్యర్ధి ప్రచారంలో
ముందున్నారనీ, ఓటర్లను ఆకట్టుకుంటున్నారనీ రాయడం వరకే అప్పట్లో సాంప్రదాయంగా
వుంది. అలాకాకుండా ఫలానా అభ్యర్ధికి ఇన్ని ఓట్లు పడుతున్నాయని ఒకట్లు, పదులు, వందల
స్థానాల్ని కూడా లెక్కలుగట్టి చెప్పడం అప్పుడేకాదు ఇప్పటికీ కొత్తే! అలాంటి
ప్రయోగాన్ని మరెవరైనా ఎక్కడయినా చేసినట్టు నాకు తెలీదు.
నేనూ ఆ కథనాన్ని రాయడానికి మూడు కారణాలున్నాయి. అన్నింటికన్నా మొదటిది ప్రయోగతృష్ణ. ఎదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెట్టాలనే ఉత్సాహం (అతిఉత్సాహం కూడా కావచ్చు). రెండోది, కృష్ణాజిల్లాలోని
అన్ని రెవెన్యూ మండలాలతో నాకు సన్నిహిత సంబంధాలుండేవి. అంచేత, అక్కడి విభిన్న
సామాజికవర్గాల రాజకీయ వ్యవహార శైలి గురించి ఒక అవగాహన వుండేది. మూడోది, స్టాటిస్టిక్స్ ను విశ్వవిద్యాలయం
స్థాయిలో ఒక పాఠ్యాంశంగా చదవడమేగాక తరువాతి కాలంలో వాటిని మరికొంత అధ్యయనం చేశాను. అప్పటికే
ఆంధ్రజ్యోతిలో స్టాక్ లైన్ శీర్షికతో బీ.యస్.ఇ. సెన్సెక్స్ ను
వారంవారం విశ్లేషిస్తున్నాను. కొత్తగా
సెఫాలజీ ( Psephology*)లో కొంత
ప్రావిణ్యాన్ని సాధించే ప్రయత్నాల్లో వున్నాను.
ఇంత కసరత్తు చేసినా ఫలానా అభ్యర్ధికి ఇన్ని ఓట్లు
పడుతున్నాయని చెప్పే కథనం ప్రచురణకు సంపాదకవర్గం అనుమతి ఇవ్వడం ఆరోజుల్లో సామాన్య
విషయం కాదు. అయితే గణంకాల్ని కఛ్ఛితంగా లెక్కలేసి చెప్పడంలో అప్పటికే నాకో దస్తరం వుంది. 1992
ఫిబ్రవరి నెలలో జరిగిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎన్నికల్లో పిన్నమనేని
కోటేశ్వరవు వర్గానికి 175 ఓట్లు పడబోతున్నాయని రాశాను.
వాస్తవానికి 177 ఓట్లు పడ్డాయి. 1994
లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున బీ.యస్.ఇ. సెన్సెక్స్ 4300
స్థాయిని దాటేందుకు వీలున్నదని పక్షం రోజుల ముందు రాశాను. ఆ ఏడాది ఫిబ్రవరి 28 ఉదయం సెన్సెక్స్
4299.36 పాయింట్ల వద్ద మొదలయింది. ఇలాంటి మరికొన్ని సంఘటనల
నేపథ్యంలో నామీద ఏర్పడిన నమ్మకంతో ఎడిటోరియల్ డెస్క్ నా కథనాన్ని ప్రచురణకు అనుమతి
ఇచ్చింది.
ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన
వడ్డే శోభనాద్రీశ్వర రావు సహజంగానే నా
కథనం మీద మండిపడ్డారు. ఎలక్షన్ కమీషన్ కు
పిర్యాదు చేస్తానని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హెచ్చరించారు. దానితో
ఆఫీసులో పంచాయితీ జరిగింది. కొందరు నా ప్రయోగ ఆసక్తిని మెచ్చుకున్నా, మరికొందరు నా
కథనం సాంప్రదాయ విరుధ్ధం అన్నారు. చివరకు నేను దాన్నో సవాలుగా తీసుకుని “నా కథనంలో చెప్పిన ఫలితం రాకపోతే వుద్యోగం
మానేస్తాను” అన్నాను.
అలా అనుక్షం ఉత్కంఠతో రెండు వారాలు గడిచాక ఏప్రిల్ 9న కౌంటింగు జరిగింది. నేను 62 శాతం
ప్రాతిపదికపై ఓట్లను లెఖ్ఖ వేయగా 65. 93 శాతం పోలింగు
జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లు 3,74,111 అవుతాయి.
ఉపేంద్రకు 3, 97,709 ఓట్లు పడ్డాయి. 13,
51, 332 ఓటర్లున్న నియోజకవర్గంలో అంచనా తేడా కేవలం 1.74
శాతం మాత్రమే! అంటే దాదాపు కఛ్ఛితంగా అంచనా వేసినట్టే!
అప్పటి స్పాట్
న్యూస్ డైరెక్టర్ ఎస్. సురేష్ “మీ
అంచనా ఎంత కరెక్టో గణాంకాలతో వివరిస్తూ మెయిన్ స్టోరీ రాయండి” అన్నారు. వారు కాంగ్రెస్ అభ్యర్ధి పర్వతనేని ఉపేంద్రకు
అత్యంత సన్నిహిత బంధువు కూడా. ’కాంగ్రెస్
’విజయ’వాడ
రహాస్యం’ పేరుతో
అచ్చయిన ఆ కథనంలో “విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంపై పోలింగు రోజున ’స్పాట్
న్యూస్’ విశ్లేషణ
అక్షరాలా నిజమైంది” అని రాశాము.
దానితో ఆ వివాదం ముగిసిందిగానీ, నా మీద గుసగుసల ప్రచారం
ఒకటి మొదలయింది. సమాజంలో నిత్యం చెడును ఆకాంక్షించేవాళ్ళూ, మెదడూ, హృదయం రెండూ చెడిపోయినవాళ్ళూ పెద్ద సంఖ్యలోనే
వుంటారు. మనకు మరీ దగ్గరగా వున్నవాళ్లలోనే వాళ్ళు మరీ ఎక్కువగా వుంటారనేది నా
అనుభవం. ఈ కథనానికి నేను చెప్పిన మూడు కారణాలు కాకుండా వాళ్ళు మరో కొత్త కారణాన్ని
సృష్టించి ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు సృష్టించగల కారణం ఏమిటో ఊహించడం
కష్టమేమీకాదు!
*Psephology
Psephology is a
branch of political science which deals with the study and scientific analysis
of elections. Psephology uses historical precinct voting data, public opinion
polls, campaign finance information and similar statistical data. (Wikipedia)
పోస్ట్ స్ర్కిప్ట్ :
సెఫాలజీలో నా అనుభవం గురించి మిత్రులు
కే. నరసింహాచారి, గడియారం శ్రీవత్స ద్వార ఏపి
జితేందర్ రెడ్డి గారికి తెలిసింది. 1998 లోక్ సభ
ఎన్నికల్లో వారు బీజేపి అభ్యర్ధిగా పోటీ చేసి సఫలం కాలేకపోయారు. 1999 లోక్ సభ ఎన్నికలకు ముందు వారు
నన్ను మహబూబ్ నగర్ ఆహ్వానించారు. నెల రోజులు
మహబూబ్ నగర్ లో వుండి సెఫాలజీ సేవలు అందించడం నా పని. నా సేవలకుగాను చాలా ఆకర్షణీయమైన ఫీజు, ఇతర
సౌకర్యాలు ఇస్తామని చారీ, శ్రీవత్స ద్వార చెప్పించారు. నిజానికి నాకు ఇప్పటి వరకు
అంత ఆకర్షణీయమైన ఫీజును ఎవరూ ఆఫర్ చేయలేదు. పైగా, ఏపీ టైమ్స్ మూసివేసిన నేపథ్యంలో
నేను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమయం అది. అయితే, బీజేపి
అభ్యర్ధికి ఎన్నికల సేవల్ని అందించడానికి నైతికంగా,
తాత్వికంగా మనసొప్పక వారి కోరికను
సుతారంగా తిరస్కరించి వచ్చేశాను.
7 మే 2014
తొలి ప్రసారకులు :
http://telugutv.info/mediaexp_forum.php?id=16
సమాజంలో నిత్యం చెడును ఆకాంక్షించేవాళ్ళూ, మెదడూ, హృదయం రెండూ చెడిపోయినవాళ్ళూ పెద్ద సంఖ్యలోనే వుంటారు. మనకు మరీ దగ్గరగా వున్నవాళ్లలోనే వాళ్ళు మరీ ఎక్కువగా వుంటారనేది నా అనుభవం. నిజం!
ReplyDelete