మోడీ - మేడే
డానీ
సకలదేశాల
కార్మికులారా! ఏకంకండు! ఇప్పటికే సకలదేశాల పెట్టుబడిదారులు ఏకం అయిపోయారు! అనుమానం వున్నవాళ్ళు బీజేపి ప్రధాని అభ్యర్ధి
నరేంద్ర మోదీ సీమాంధ్ర పర్యటనని చూడండి.
మోదీ
సీమాంధ్ర పర్యటన మేడే రోజున జరగడం యాధృచ్చికమే కావచ్చుగానీ, శ్రామికులు
పట్టించుకోనక్కరలేనిది మాత్రంకాదు. లోక్ సభా ప్రచార ఘట్టంలో నరేంద్ర మోదీ
సీమాంధ్రకు వరుసగా రెండు రోజులు కేటాయించడం ఒక విశేషం. ఒక రాష్ట్రానికి ఒక రోజు
కేటాయించడమే గగనంగా మారిన తీరికలేని సమయంలో మోదీ ఒక ప్రాంతానికి రెండు రోజులు, ఆరు
సభలు కేటాయించడం మరీ విశేషం. తిరుపతి, మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, భీమవరం,
విశాఖపట్నం సభల్లో వారు ప్రసంగించారు. ఇలాంటి సందర్భాల్లో సీమాంధ్రతో మోదీకున్న
ప్రత్యేక అనుబంధం ఏమిటనే ఆసక్తి ఎవరికైనా వస్తుంది.
ఒక
విధంగా మోదీ బ్రాండు గుజరాత్ అభివృధ్ధికి రాళ్ళెత్తిన కూలీల్లో సీమాంధ్ర, మరీ
ముఖ్యంగా తీరాంధ్ర ఒకటి. “తెలుగు వారి కష్టంవల్ల గుజరాత్ రాష్ట్రంలోని
సూరత్ వెలుగుతోంది” అని చెప్పిన మోదీ గుజరాత్ స్టేట్ పెట్రోలియం
కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్
సంయుక్తంగా కృష్ణా-గోదావరి బేసిన్
నుండి తరలించుకుపోతున్న చమురు, సహజవాయువు నిక్షేపాల గురించి ప్రస్తావించలేదు.
దేశం మొత్తానికి విద్యుత్తు
ఇచ్చే శక్తి సామర్థ్యాలు, వనరులు సీమాంధ్రకు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ
సర్కారుకే గనుక సత్తా ఉంటే కేవలం సీమాంధ్రలోని కేజీ బేసిన్‌లోని ఇంధన వనరులతోనే
మొత్తం దేశానికి కరెంటు ఇవ్వగలిగేదనీ ఆయన యూపియేకు చురకలుకూడా వేశారు. కేజీ బేసిన్‌లో ఇంధన వనరులు ఏ స్థాయిలో
వున్నాయో రిలయన్స్ అంబానీలకు తెలిసినంతగా
కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియదన్న నిజాన్ని మాత్రం వారు ప్రస్తావించలేదు. కేజీ
బేసిన్‌లోని ఇంధన వనరులతో దేశం మొత్తానికి విద్యుత్తు సరఫరా చేయవచ్చన్న సంగతి కూడా
నిజమేగానీ, దానికి పీపిఏలు అంబానీలతో చేసుకోదలిచారో, తనకు మరింత ఇష్టులైన ఆదానీలతో
చేసుకోదలిచారో అనేది మాత్రం మోదీ చెప్పలేదు.
"బీహార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుపతిలోని
ఈ పవిత్రమైన భూమిపై అడుగుపెట్టాను. నా కళ్లముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని చేరుకునే
కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది” అంటూ ధార్మికతన్మయత్వంతో ప్రసంగాన్ని
మొదలెట్టిన మోదీ వెంటనే తన అసలు ఆర్ధిక
చిట్టాను విప్పారు.
ప్రజాస్వామ్యంలో
సహజవనరుల్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు యధేఛ్ఛగా దోచుకోవడానికి అసమ్మతి
అడ్డువస్తుంది. ఆ అసమ్మతిని సాంస్కృతికంగా అణిచివేసి, సహజవనరుల దోపిడీని యధేఛ్ఛగా
కొనసాగించడానికి దోపిడీదారులు మతాన్ని ముందుకుతెస్తారు. రాజకీయార్ధిక ప్రయోజనాల
కోసం మతాన్ని వాడడాన్నే మతతత్వం అంటారు. ఈ విషయంలో బీజేపీది అందెవేసిన చేయ్యి
అయితే నరేంద్ర మోదీ గండరగండడు. కార్పొరేట్ సంస్థలు గుజరాత్ లో నరేంద్ర మోదీని
ప్రమోట్ చేస్తున్నది అందుకే!
మెజారిటీ మతతత్త్వంవల్ల ముందు మైనారిటీ మత సామాజికవర్గాలు
నష్టపోయేమాట నిజమేకానీ, ఆ తరువాత నష్టపోయేది మెజారిటీ మతసామాజికవర్గంలోని
పేదవర్గాలే! అంచేత హిందూత్వ అనేది
ముస్లింల సమస్యో, క్రైస్తవుల సమస్యోకాదు: శిక్కుల సమస్యోకాదు. హిందూ మతసామాజికవర్గాల్లోని
పేదల సమస్య కూడా. నిజానికి దేశ జనాభాలో హిందూ పేదల సంఖ్యే ఎక్కువ.
ఎన్నికల సమయంలో ఓటర్లు సాధారంగా పార్టీల ప్రణాళికల్నో, నాయకుల ప్రసంగాలనో
ఆసక్తిగా గమనిస్తూ వుంటారు. నిజానికి ఎన్నికల ముందు అంతకు మించిన
ఆసక్తికర తెరవెనుక రాజకీయం చాలా
జరుతూ వుంటుంది. మనకు చంద్రబాబు, మోదీల కొత్త రాజకీయ హనీమూన్ మాత్రమే
కనపడుతూవుంటుంది. మోదీ రాజకీయానికి రెండు కళ్ళు అనదగిన అంబానీ, ఆదానీల్లో అంబానీ,
రామోజీరావుల అనుబంధం తెలియనివారు ఇప్పుడు ఎవరూ వుండరు. హైదరాబాద్ లో చంద్రబాబూ,
బీజేపి, ఆరెస్సెస్ నేతలు ఎన్నికల పొత్తుల గురించి చర్చిస్తున్న సమయంలోనే ఆదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ ఆదానీ
గుట్టు చప్పుడు కాకుండా జగన్ ను కలిసి వెళ్ళినట్టు గుప్పుమంది. సీమాంధ్రలో ఎవరు
అధికారానికి వచ్చినా జట్టు కట్టడానికి జాతీయ కార్పొరేట్ సంస్థలు
సిధ్ధమవుతున్నాయనడానికి ఈ సంకేతాలు చాలు.
చాలా కాలంగా హైదరాబాద్ కేంద్రంగా
కార్యకలాపాలు సాగించిన అనేక కార్పొరేట్ సంస్థల అధిపతులు ఏప్రిల్ రెండవ వారంలో
సీమాంధ్రలో ఒక బస్సు యాత్ర నిర్వహించారు. సీమాంధ్రలో హైదరాబాద్ వంటి అభివృధ్ధిని
సాధించడం వాళ్ల లక్ష్యమట. ఇలాంటప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎలాంటి అభివృధ్ధిని
సాధించారనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.
తనవీ చంద్రబాబువీ అభివృద్ధి ఆలోచనలేననీ.
చంద్రబాబు హైదరాబాద్‌ను సైబర్ సిటీగా మార్చి, బ్రాండ్ హైదరాబాద్‌ను నిర్మించారనీ
మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. చంద్రబాబు మార్కు
అభివృధ్ధికి ప్రతీక హైదరాబాద్ లో
ఒక మూల వున్న హైటెక్ సిటీ. మిగిలిన మూడు మూలల్ని ఆయన గాలికి వదిలేశారు; మరీ
ముఖ్యంగా పాతబస్తీని. మాధాపూర్ హైటెక్ సిటీని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్,
బిల్ గేట్స్ బాపతువాళ్ళు మెచ్చుకుని వుండవచ్చు. మాధాపూర్ ప్రజలు మెచ్చుకున్నారా?
అనేదే దానికి అసలు గీటురాయి. కాకులకు కొట్టి గద్దలకు పెట్టే అభివృధ్ధిని ప్రజలు
ఎప్పుడూ మెచ్చుకోరు. 2004, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో టిడిపికి వచ్చిన సీట్లే దీనికి ప్రమాణం. ఆ రెండు ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో
టిడిపికి దాదాపు బోణి కూడా కాలేదు. చంద్రబాబు మార్కు అభివృధ్ధి మీద అది ప్రజల
తీర్పు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి హైదరాబాద్ లో అంతకు భిన్నమైన
ఫలితాలు వచ్చే అవకాశాలూ లేవు.
గుజరాత్
లో మోదీ సాధించినట్టు చెప్పుకుంటున్న
అభివృధ్ధి కూడా హైదరాబాద్ హైటెక్కుసిటీ లాంటిదే. దూడ నోరుకట్టి తల్లి ఆవు
పాలుపితుక్కుపోయే గడసరి గొల్లవాళ్ళను ప్రజలు తిప్పికొడతారు; అది తెలంగాణలో అయినా
అంతే!, సీమాంధ్రలో అయినా అంతే! రాష్ట్రాలు వేరయినా పెట్టుబడీదారులూ ఒకటే; శ్రామికులూ ఒకటే!
1 మే 2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/16564.html
No comments:
Post a Comment