Friday, 12 March 2021

Movie : Is Mother’s Love a Commodity – Chinese movie ‘Hi Mom!’

 Movie : Is Mother’s Love a Commodity – Chinese movie ‘Hi Mom!’

 తల్లి ప్రేమ కూడ సరుకేనా?  - చైనా సినిమా ‘హాయ్ మామ్’

 

ప్రపంచంలో కొన్నింటికి ఉపయోగపు విలువ మాత్రమే వుంటుంది. కొన్నింటికి ఉపయోగపు విలువతోపాటు మారకపు విలువ కూడ వుంటుంది. తల్లి ప్రేమకు ఉపయోగపు విలువ వుంటుంది; మారకపు విలువ వుండదు. తల్లి ప్రేమకు విలువకట్టలేం అంటే దానికి విలువే లేదని కాదు.

 

సమాజంలో ప్రతీదీ సరుకుగా మారిపోయాక తల్లిదండ్రుల ప్రేమను కూడ సరుకుగా చూసే సాంప్రదాయం మొదలై చాలా కాలం అయింది. మనం ఏ ఇంటికి వెళ్ళినా యజమాని గది (మాస్టర్ బెడ్ రూం), పిల్లల గది, వంటగది,  లివింగ్ రూం వంటివి కనిపిస్తాయి. కొన్ని చోట్ల గెస్ట్ రూములు కూడ వుంటాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే పేరెంట్స్ రూమ్ వంటివి కనిపిస్తాయి. అనేక ఇళ్ళల్లో వరండాల్లో వృధ్ధుల మంచం వుంటుంది. అంతకన్నా హీనంగా వృధ్ధులు చూరు కింద నివశిస్తున్న  ఇళ్ళు కూడ కనిపిస్తాయి. తల్లిదండ్రుల్ని కొందరు వృధ్ధాశ్రమాలలో చేరుస్తున్నారు. ఇంకొందరు ఆనాధాశ్రమాలకు వదిలేస్తున్నారు. వ్యవసాయరంగంలో ట్రాక్టర్ల రాకతో ఇటీవలి కాలంలో పల్లెటూర్లలో గొడ్ల పాకలతో అవసరం తీరిపోయింది. ఇప్పుడు కొందరు తమ వృధ్ధ తల్లితండ్రుల్ని ఆ గొడ్ల పాకల్లో వుంచుతున్నారు.

 

అందరూ అలా చేస్తున్నారని చెప్పడం సరైనది కాదుగానీ కొంతమంది అయినా అలా చేస్తున్నారు అనేది వాస్తవమే. సమాజంలో ఒక్కరు అలా చేసినా అది అమానవీయమే. అది వ్యాపిస్తే మానవ సంక్షోభం తలెత్తుతుంది. ప్రభుత్వాలు వృధ్ధాప్య పెన్షలు ఇస్తున్నాయిగాబట్టి ఒక ప్రమాదం వాయిదా పడుతోందిగానీ లేకుంటే వృధ్ధ తల్లిదండ్రుల జీవితాలు మన సమాజంలో మరింత దయనీయంగా వుండేవి.

 

మనిషి జీవితంలో తల్లి ప్రాధాన్యతను ప్రపంచానికి చెప్పడానికి చైనా హాస్యనటి జియా లింగ్ ‘హల్లో, లీ హ్యూయాన్ యింగ్’ సినిమా తీసింది. ఇంగ్లీషులో ఈ సినిమా టైటిల్చ ‘హాయ్ మామ్’.  చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు కథ, దర్శత్వ బాధ్యతల్ని కూడ తనే నిర్వహించింది జియా లింగ్.   

 

కథ విషయానికి వస్తే, జియా గ్జియాయోలింగ్ ముఫ్ఫయ్యవ పడిలోవున్న రచయిత్రి. ఇరవయ్యేళ్ళ క్రితం తను పదేళ్ల పాపగా వుండగా ఓ ట్రక్కు యాక్సిడెంట్ లో ఆమె తల్లి  లీ హ్యూయాన్ యింగ్ చనిపోతుంది. తన తల్లి అకాల మరణాన్ని పొందడమేగాక, జీవించిన కాలంలోనూ ఆమె ఆనందంగా లేదని గుర్తుకొచ్చి జియా తరచూ బాధపడుతూ వుంటుంది. ఇదీ ఈ సినిమా సెటప్.

 

హఠాత్తుగా జియాకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. తన తల్లి జీవితంలోని విషాదాన్ని తొలగించాలనుకుంటుంది. ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది అన్నట్టు ఒక అద్భుతం జరిగి  ఆమె గతం లోనికి  ప్రయాణించి 1981లో ప్రవేశిస్తుంది. తన తల్లి లీ హ్యూయాన్ యింగ్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ గేటు ముందు పడుతుంది. అప్పటికి లీ హ్యూయాన్ యింగ్ ఇరవై యేళ్ళ యువతి. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. స్నేహం చేసి లీ కి దగ్గ్ర అవుతుంది జియా.

 

తన తల్లి తన తండ్రినే పెళ్ళాడితే ఇక పాత కథే కొనసాగుతుంది కదా! అలా జరగకూడదనుకుంటుంది జియా. తన తల్లి తన తండ్రిని ఎక్కడ పెళ్ళాడేస్తదోనని జియా దిగులుపడిపోతుంది. తన తల్లి ఎలాగూ అందంగా వుంటుంది. తల్లికి కాబోయే భర్త అందంగా వుంటేనే పిల్లలు అందంగా పుడతారు. అతను ఐశ్వర్యవంతుడు అయితేనే పిల్లలకు మెరుగైన జీవితం దొరుకుతుంది. అతను మంచివాడయితేనే తన తల్లి సుఖపడుతుంది. తన తండ్రికన్నా అందగాడు, స్థితిమంతుడు, మంచివాడు అయిన వ్యక్తిని వెతికి తన తల్లిని ప్రేమించేలా చేస్తుంది.

 

హాయ్ మామ్ సినిమాలో ప్రొటోగోనిస్టు కూతురుగా జియా లింగ్ నటించింది. ఆమె తల్లి లీ హ్యూయాన్ యింగ్ గా గ్జియాఓఫీ ఝాంగ్ నటించింది.

 

తల్లిప్రేమ, మన జీవితాల్లో తల్లి ప్రాధాన్యత గురించే కాకుండ స్త్రీ స్వేఛ్ఛ సమానత్వం గురించి కూడ ఈ సినిమా చర్చిస్తుంది. అయితే, ఒక గంభీరమైన అంశాన్ని ఇలా ప్రహసనంగా చెప్పడం ఏమిటీ అని విమర్శిస్తున్న వారూ వున్నారు. అయితే, జియా లింగ్ మాత్రం తన సినిమా మీద సంతృప్తితోవుంది. తనకు తెలిసిన ప్రక్రియ హాస్యం. ఆ ప్రక్రియలోనే తను చెప్పాల్సింది చెప్పిందామె. “నా సినిమా చూశాక ప్రేక్షకులు తమ జీవితంలో తల్లి ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు” అంటున్నదామె.

 

ఈ వివాదం ఎలావున్నా ప్రేక్షకులు మాత్రం ‘హాయ్ మామ్’ను చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు.  చైనా సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ సినిమాగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన వంద సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.  

The attitude of contemporary Marxists and Ambedkarites aid the state to celebrate

 Dear State! Celebrate!  

The attitude of contemporary Marxists and Ambedkarites aid the state to celebrate

మన కాలపు మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు మారనంత వరకు

రాజ్యామా! సంబరపడు!

 

మార్క్సిస్టులు కులమతాల్నీ, అంబేడ్కరిస్టులు వర్గాన్నీ గుర్తించనంత వరకు ఈ సమాజం మారదు.

 

అంబేడ్కర్ సాంఘీక సమానత్వం గురించి మాత్రమే మాట్లాడాడన్నది మన కాలపు‘అంబేడ్కరిస్టుల’ కల్పన. అంబేడ్కర్ రాజకీయ సమానత్వం గురించీ, ఆర్థిక సమానత్వం గురించి కూడ గట్టిగా మాట్లాడాడు. ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుందన్నాడు.

 

ఈ వాస్తవాన్ని ఇప్పటి అంబేడ్కరిస్టులు తమ సౌలభ్యం కోసం దాచి పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళు కులవ్యవస్థను మార్చలేరు. కులనిర్మూలన సమాజాన్ని నిర్మించలేరు. పెట్టుబడీదారీ వ్యవస్థ అఘాయిత్యాలను అడ్డుకోలేరు. ఇలాంటివాళ్ళు వర్తమాన సమాజానికి అక్కరలేదు.

 

మరోవైపు మర్క్సిస్టులూ అదే తప్పు చేస్తున్నారు. కులమతాలు గతితార్కిక భౌతికవాదం పరిధి లోనికి రావని కార్ల్ మార్క్స్ తమకు స్వయంగా చెప్పినట్టు వీళ్ళు ప్రపంచాన్ని నమ్మిస్తుంటారు. వర్గం సర్వాంతర్యామి. సమాజంలో సర్వత్రా సర్వకాలాల్లో వర్గం, వర్గ దోపిడి,  వర్గపోరాటం వుంటుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. కులం మతంలో వర్గం వుండదని మన కాలపు మార్క్సిస్టులు సెలవిస్తున్నారు. వీళ్ళు వర్గ రహిత సమాజాన్ని నిర్మించనూలేరు. కులమత దోపిడీ అణిచివేతల్ని  నిర్మూలించనూలేరు. ఇలాంటివాళ్ళు కూడ వర్తమాన సమాజానికి అక్కరలేదు.

Thursday, 11 March 2021

Movie : Perversities of late (stage) Capitalism – PARASITE movie

 Movie : Perversities of late (stage) Capitalism – PARASITE movie

పెట్టుబడీదారీ వృధ్ధదశ - ‘పారసైట్’ సినిమా

 

దక్షణ కొరియా దర్శకుడు బోంగ్ జూన్ హో 2019లో నిర్మించిన ‘పారసైట్’ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కొందరైతే దీనిని  2010వ శతాబ్దపు మహోన్నత సినిమాగా భావిస్తున్నారు. ఇంగ్లీషు సినిమా కానప్పటికీ బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ విభాగాల్లో ‘పారసైట్’ నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.  తాత్విక ప్రగాఢతతోపాటూ వర్తమాన సమాజాన్ని కొత్త కోణంలో చిత్రించడం ఈ సినిమాలొ ఒక విశేషం.

 

సృష్టిలో ప్రతిజీవికీ తన జీవికను కాపాడుకోవడం ప్రాధమిక ధర్మం. మనం ఇప్పుడు ఆహార సేకరణ సమాజంలో లేము; ఆహార ఉత్పత్తి సమాజంలో వున్నాం. వర్తమాన సమాజంలో జీవికను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆర్ధిక  కార్యకలాపాన్ని సాగించాల్సి వుంటుంది. తద్వార కనీసం బతకడానికి అవసరమైన మేరకయినా సంపాదించాల్సి వుంటుంది.

 

ఆహార సేకరణ సమాజంలో మనిషికి ప్రకృతి ప్రధాన ఆదాయ వనరుగా వుంటుంది. ఆహార ఉత్పత్తి సమాజంలో ఆ వెసులుబాటు అంతరించిపోతుంది. పైగా, మనిషికి  ప్రకృతి పరాయిది అయిపోతుంది.  అంచేత సమాజంలోని ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ధనాత్మక నికర ఆస్తిని కలిగివుండాలి; Positive networth!. రుణాత్మక నికర ఆస్తిని అంటే negative networth కలిగిన వ్యక్తి బతుకు బానిసకన్నా హీనంగా మారిపోతుంది.  భారతదేశంలో ఎవరయినా ఆర్థిక కార్యకలాపం సాగించడానికి ఆర్థిక పెట్టుబడి (ఫైనాన్షియల్ కేపిటల్) ఒక్కటే సరిపోదు. సామాజిక పెట్టుబడి (సోషల్ కేపిటల్ ) కూడ కావాల్సివుంటుంది.

 

పెట్టుబడి అనగానే దాన్ని వెంటనే విమర్శించేయాలి అనుకోవాల్సిన పనిలేదు. కొత్త విధానాలన్నీ సమాజంలోనికి  ఏవో కొన్ని ఆదర్శాలు, విలువలతో ప్రవేశిస్తాయి. లేకుంటే వాటికి ఆమోదాంశం, ఆదరణ దొరకదు. పెట్టుబడీదారీ విధానం కూడ కొన్ని అలాంటి ఆదర్శాలతోనే రంగప్రవేశం చేసింది. ఆధునికత,  ప్రగతిశీలత, ప్రజాస్వామికత, ఉత్పత్తిలో వేగం పెరగడం, అభివృధ్ధి మొదలైనవన్నీ దాని తొలినాటి నినాదాలు. డబ్బు సంపాదించడానికి కూడ కొన్ని నైతిక విలువలు పాటించాలనీ 20వ శతాబ్దపు మధ్యభాగం వరకు భావించేవారు. ఒక విధంగా అది మనకు స్వాతంత్రం వచ్చిన కాలాన్ని దీనికి మైలురాయి అనుకోవచ్చు. 

 

పెట్టుబడీదారీ వ్యవస్థ వయస్సు పెరిగే కొద్దీ తొలినాటి విలువలన్నీ ద్వంసం అయిపోతుంటాయి. అప్పటి వరకు విలువలుగా కొనసాగినవన్నీ విలువలు కాకుండాపోతాయి. ఆధునికానంతర (post-modern) భావనలు బలపడతాయి. మనదేశంలో 1980వ దశకం మధ్యలో పాతవిలువల విధ్వంసం వుధృతంగా సాగింది.  జాతీయంగా రాజీవ్ గాంధీ పాలనను, ప్రాంతీయంగా కారంచేడు దురాగతాన్ని, ఉద్యమాల్లో పీపుల్స్ వార్ చీలికను, విజయవాడ అల్లర్లను వీటికి కొన్ని మైలురాళ్ళుగా చెప్పుకోవచ్చు.

 

1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ  (WTO)  ఏర్పడ్డాక రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో విలువల పతనానికి ఒక సరుకు విలువ వచ్చింది. భుకబ్జాలు, పన్ను ఎగవేతలు, బ్యాంకు మోసాలు, హత్యలు సాగించే నేరచరితులకు సమాజంలో గౌరవం పెరిగింది. నేర చరితులు మాత్రమే మనకు నాయకత్వం వహించగలరనే నమ్మకమ పెరిగింది. ఫ్యాక్షనిజం, గూండాయిజాలకు గిరాకీ పెరిగింది. నేర చరితుల్నే ఎన్నుకుని చట్టసభలకు పంపించే సాంప్రదాయం మొదలయింది.

 

1960లకు ముందు ఉద్యోగాలు ఎక్కువ, విద్యావంతులు తక్కువగా వుండేవారు. ఆ తరువాత విద్యావంతులు పెరిగారు; ఉద్యోగాలు తగ్గిపోయాయి. నిరుద్యోగం, ఉపాధి నుండి తొలగింపు, సామూహిక స్థాన భ్రంశం (mass displacement), పేదరికం అన్నీ కలిసి గతంలో ఎన్నడూ ఊహించలేని వికారాలు సమాజంలో ఆమోదాశాంశాన్ని పొందడం మొదలయింది. బతకడానికి మనిషి ఏపనిచేసినా సమర్థనీయమే అనేది కొత్త విలువ. నేతి యువతలో ఈ భ్రష్టత్వాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అవకరాలన్నీ  వృధ్ధ పెట్టుబడీదారీ వ్యవస్థ వైపరీత్యాలు ; perversities of late (stage) capitalism. పెట్టుబడీదారులు తమ సాంప్రదాయ విలువల్ని పాటించనపుడు శ్రామికులూ తమ సాంప్రదాయ విలువల్ని పాటించరు. వర్గ సమాజంలో వుభయ భ్రష్టత్వం కొనసాగుతుంది. 

 

పెట్టుబడీదారీ వ్యవస్థ పతన లక్షణాలని పారసైట్ సినిమా  కళాత్మకంగా, వినోదాత్మకంగా చిత్రించింది.  సినిమా చూస్తుంటే నవ్వు వస్తుంది, దిగులు వేస్తుంది, భయం కలుగుతుంది, పేదరికం నుండి బయటపడడానికి పనివాళ్ళు, వేసే ఎత్తుకు పై ఎత్తుల్ని, ప్రదర్శించే చాకచక్యాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనుషులు ఇంత దుర్భరంగా బతుకుతున్నారని తెలిసి దిగ్భ్రాంతి కలుగుతుంది. నవ్వులాంటి ఏడుపు; ఏడుపు లాంటి నవ్వు ప్రేక్షకులని చుట్టుముట్టుతాయి. దీనినే బ్లాక్ కామెడి అంటున్నారు.

 

పారసైట్ అంటే పరాన్నజీవులు; మరొకరి మీద ఆధారపడి బతికేవారని అర్థం. పేదలేకాదు ధనవంతులు కూడ పరాన్న జీవులే అని అని బోంగ్ జూన్ హో వివరిస్తాడు. పేదలు ఉపాధి కోసం ధనవంతుల మీద ఆధారపడతారు; ధనవంతులు తమ పనులు చేసిపెట్టడం కోసం పేదల మీద ఆధారపడతారు. ఐశ్వర్యవంతులయిన పార్క్ కుటుంబంలో ఆశ్రయం పొందడానికి కిమ్, మూన్ ల పేద కుటుంబాలు పడే ఆరాటమే ఈ సినిమా కథ.  చివర్లో మూన్ భ్రత చనిపోతూ యజమానితో “నీ తిండి తిని బతికాను; ధన్యవాదాలు” అంటాడు. నిజానికి పేదలు లేకుండ ధనవంతులూ బతకలేరని  గుర్తు చేస్తుంది పారసైట్.

మనుషుల్ని వర్గం, కులం, మతం విభజిస్తాయని మనకు ఇంతకుముందే తెలుసు. వాసన కూడ మనుషుల్ని విడగొడుతుందని పారసైట్ కొత్తగా గుర్తు చేస్తుంది.

 

https://www.youtube.com/watch?v=SItRjTN-tEo

 

Wednesday, 10 March 2021

Movies - ఇరాన్ సినిమా ‘గావ్’ (1969)

 ఇరాన్ సినిమా ‘గావ్’ (1969)

 

ప్రపంచ సినిమాలో ఇరాన్ సినిమా ప్రత్యేకమైనది. ప్రపంచ మంతా కమ్మర్షియల్ సినిమాల వైపు పరుగులు తీస్తుంటే ఇరాన్ సినిమా కళాత్మక విలువల్ని నమ్ముకుంది. భావోద్వేగాల్ని గొప్పగా చిత్రించింది.

 

ఇరాన్ సినిమాను పర్షియన్ సినిమా అని కూడ అంటారు. ఇరాన్ సినిమాలన్నీ పర్షియన్ భాషలో వుంటాయి.

 

ఇరాన్ సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాయి. ఇరాన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.

 

ఇటాలియన్ నియో రియలిజం సినిమాలు 1960లలో ప్రపంచ ప్రేక్షకుల్ని గొప్పగా ఆకర్షించాయి. ఇప్పుడు ఇరాన్ సినిమాలు అలాంటి స్థానాన్ని సాధించాయి. 

 

ఇరాన్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టిన దర్శకుల్లో ఏడుగురు ముఖ్యులు.  1.  అబ్బాస్ కియరొస్టామి 2. అస్గార్ ఫర్హాదీ  3. సమీర ముఖ్మల్బాఫ్  4. దారియుష్ మెహర్ జూయి 5. మాజిద్ మాజిదీ  6. తహ్మిన్హే మిలాని  7. బాహమన్ ఘోబాదీ

 

`ఇరాన్ సినిమా చరిత్రలో న్యూవేవ్ కు బాటలు వేసిన వాడు దారియుష్ మెహర్ జూయి.  దారియుష్ 1969లో తీసిన గావ్ (ఆవు) ఇరాన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించింది.

 

మానవ సంబంధాలు సరుకుగా మారిపోయే క్రమాన్ని గావ్ సినిమా చూపిస్తుంది.  కార్ల్ మార్క్స్ వివరించిన ఆర్థిక పరాయికరణ, సామాజిక పరాయికరణను ఈ సినిమా అద్దంపడుతుంది. 

 

ఓ పల్లెటూరి రైతు మష్త్ హసన్ కు హసన్ కు మనుషుల కృతక ప్రవర్తన నచ్చదు. అతనికి అత్యంత ఆప్తురాలు అతని పెంపుడు ఆవు. ఒకసారి హసన్ పట్టణానికి వెళ్ళినపుడు అతని సూడి  ఆవు  ఈనే సమయంలో చనిపోతుంది. ఆవు కనిపించకపోవడంతో హసన్ పిచ్చివాడైపోతాడు. తనే ఆవుగా ప్రవర్తించడం మొదలెడతాడు.

 

గావ్ సినిమాలో ప్రొటోగోనిస్టుగా నటించిన ఎజ్జతుల్లా ఎన్తెజామీ ఇరాన్ లో తొలితరం మహా నటుడు.  జర్మనీ థియేటర్ అండ్ సినిమా స్కూల్ లో శిక్షణ పొందిన ఎన్తెజామీ తొలి సినిమా ‘గావ్’ తోనే అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. తన అద్భుత నటనకు చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘సిల్వర్ హ్యూగో’ అవార్డు అందుకున్నాడు.

Sunday, 7 March 2021

'ముస్లిం సోషల్ మూవ్మెంట్’ – ఓ పరామర్శ

‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఎజెండ – ఓ పరామర్శ

 

 ‘ముస్లిం చైతన్య ఎజెండా’ పేరిట ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ‘ ‘7 పాయింట్ల ఫార్ములా’ ఒకదాన్ని గత ఏడాది సెప్టెంబరు 1న ప్రకటించింది.  రచయిత-కవి స్కైబాబ దీనికి కన్వీనర్. షాజహానా మరో ఐదుగురు ఇందులో సభ్యులు. “ముస్లింలు ఈ దేశ మూలవాసులు” అనేది ఈ జాబితాలో మొట్టమొదటి అంశం. “ముస్లింలు ప్రత్యేక ఐడెంటిటీని నిలబెట్టుకుంటూనే బహుజన  ఐడియాలజీతో ముందుకు సాగాలి”అనేది ఇందులో చివరి అంశం. ‘ముస్లిం రిజర్వేషన్ ను’ ఒక ప్రత్యేక అంశంగా చేర్చే సాహసం చేయలేక చివరి అంశానికి ఒక తోకగా  “అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయాలి” అని తగిలించారు.

 

జనాభా దామాషా ప్రాతినిధ్యం గురించి మాట్లాడే సమయంలో ఎస్టీ, ఎస్సీ, బిసిలు, మైనారిటీల గురించి మాత్రమే మాట్లాడడం సంకుచితత్వం. జనాభా దామాషా అన్నప్పుడు బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైశ్యులు మాత్రమేగాక కమ్మ, రెడ్డి, వెలమ తదితర యజమాని కులాలు, అనేకానేక ఇతర సమూహాలూ కూడ వస్తాయి.  వాళ్ళందరికీ స్థానం కల్పించాలి. ఈ ఎజెండాలో వాళ్ళకు స్పేస్ ఇవ్వకపోవడం అవగాహన రాహిత్యం. 

వర్తమాన భారత ముస్లిం సమాజంలోని అత్యధికుల పూర్వికులు ఎస్టి, ఎస్సి, బిసిల నుండి ఇస్లాంను స్వీకరించిన వారేనన్నది పరిమిత జ్ఞానం. ఇది ఒక కాల దశకు  మాత్రమే సంబంధించిన అంశం. ఇంకో వెయ్యేళ్ళో రెండు వేల యేళ్ళో వెనక్కి వెళితే ఇప్పటి యజమాని కులాలు కూడ ఒకప్పటి ఆదివాసులే అని స్పష్టం అవుతుంది. ఇంకో వెయ్యేళ్ళు వెనక్కి వెళితే ఇప్పటి ప్రపంచ జనాభా మొత్తం ఒకే దంపతుల సంతతి అని కూడ తేలుతుంది. పశ్చిమ  ఆసియాలో యూదులు, అరబ్బులు ఒక్కరే అని అర్ధం అవుతుంది.  ఇద్దరూ, ఇబ్రాహీం, మూసా ప్రవక్తల అనుయాయులే అని బోధపడుతుంది. కానీ, వాళ్ళ మధ్య వర్తమాన సంబంధాలు దానికి పూర్తి విరుధ్ధంగా వున్నాయి.

 

మానవ సమూహాలకు కొత్త అస్తిత్వాలు వచ్చేశాక పురాతన అస్తిత్వాలు పనిచేయవు. తెలుగు, తెలంగాణ అస్తిత్వాలు ఏర్పడి పట్టుమని రెండు మూడు శతాబ్దాలు కూడ అయ్యుండవు. ఆ రెండు అస్తిత్వాల మధ్య ఒక పెద్ద ఘర్షణ జరగడాన్ని మనం గత దశాబ్దంలో చూశాం. తెలంగాణ అస్తిత్వంతో తెలుగు అస్తిత్వం మీద విరుచుకుపడిన స్కైబాబకు ఈ అస్తిత్వ జ్ఞానం కొంచెం ఎక్కువగానే వుండాలి మరి.  రెండు వందల ఏళ్ళ అస్తిత్వాన్ని కూడ వదులుకోలేని స్కైబాబకు 14 వందల ఏళ్ళ అస్తిత్వాన్ని వదులుకోమని ముస్లిం సమాజానికి పిలుపు ఇచ్చే నైతిక అర్హత లేదు.

 

ముస్లిం వ్యతిరేక ప్రచారం మన దేశంలో చాలా ఉధృతంగా సాగుతోంది. ముస్లింలు ఆధునిక విద్యను ఆహ్వానించరనీ. ఆడపిల్లల్ని అణిచివేస్తారని, మత ఛాందసులనీ సాగుతుంది ఆ ప్రచారం. ఆ ప్రచారం నిజమని నమ్ముతున్నట్టుంది ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’.

 

దేశరాజధానికి వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించి వర్తమాన నిరంకుశ కేంద్ర ప్రభుత్వంతో ఎలా పోరాడాలో  నేర్పింది ముస్లిం మహిళలే. దేశంలో ఏ ఇతర సామాజికవర్గానికీ రాని ఒక మహత్తర ఆలోచన ముస్లిం మహిళలకు మాత్రమే వచ్చింది. వెనుక భారత రాజ్యాంగాన్ని, ఒళ్ళో అంబేడ్కర్ ఫొటోను పెట్టుకుని, ఒక చేత్తో జాతీయ జెండా పట్టుకుని, ఇంకో చేత్తో పిడికిలి బిగించి “న్యాయము, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావము” అని నినదించారు షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు.  అది దేశ వ్యాప్త ఉద్యమంగా మారింది. ప్రతి పట్టణంలో షాహీన్ బాగ్ వేదికలు ఏర్పడ్డాయి. సమీపగతంలో ఇలాంటి ఉద్యమం ఒక్కటంటే ఒక్కటీ లేదు.

 

షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు చూపిన బాటలోనే ఇప్పటి రైతుల ఆందోళన ఢిల్లీలో సాగుతోంది. అయినప్పటికీ, అది షాహీన్ బాగ్ లా దేశవ్యాప్త వుద్యమం కాలేదు. షాహీన్ బాగ్ ఉద్యమం నాడు వెలసినన్ని వేదికల్లో పదవ వంతు పట్టణాలలో అయినా రైతు ధర్నా వేదికలు ఏర్పడ్డాయా? ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమమూ అంతే; దాదాపుగా విశాఖపట్నానికి పరిమితమైపోయింది.

 

ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్న షాహీన్ బాగ్ ఉద్యమ వాస్తవాన్ని దాచిపెట్టి ముస్లిం మహిళలు వెనుకబడివున్నారు, ముస్లింలు భారత రాజ్యాంగం, జాతీయ పతాకం చేతబూని పురోగమించాలని  పిలుపివ్వడాన్ని మించిన బూటకం ఎక్కడయినా వుంటుందా? ఓ ఏడుగురిని సామాజిక మార్గదర్శకులుగా పేర్కొన్నవాళ్ళు షాహీన్ బాగ్ వ్యవస్థాపకుల పేర్లను ఎందుకు దాచారూ? కనీజ్ ఫాతిమా, రఫత్ ఖాన్, బడీదాదీల  నుండి కాన్సెప్ట్ ను దొంగిలించి ముస్లిం మహిళలు వెనుకబడి వున్నారంటారా? ఇదేమి సోషల్ హైజాకింగ్ ?  చెలం ఒక సందర్భంలో అన్నట్టు “మనం ఎవరి నుండి దొంగిలిస్తామో వాళ్ళను ఎన్నటికీ క్షమించలేము” !!!

 

స్కైబాబ ఉద్దేశిస్తున్న ముస్లిం సమాజం ఏదీ? అనేది కూడ ఒక కీలక అంశం. తెలుగు ముస్లిం సమాజంలో ఒక చిన్న భాగం గురించి మాత్రమే స్కైబాబాకు తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉర్దూ ముస్లిం సమాజం గురించి ఆయనకు తెలీదు. భారత ముస్లిం సమాజం గురించి బొత్తిగా తెలీదు. కొందరికి కొంచెం అతిగా కనిపించవచ్చుగానీ, స్కైబాబ కు ‘ముస్లిం’ అనే పదానికి అర్థం కూడ తెలీదు. అనుమానం వున్నవాళ్ళు వారినే అడిగి నిర్ధారణ చేసుకోవచ్చు.

 

కష్టాల్లో వున్నవాళ్ళు బాధితులుగా ఒకచోట చేరుతారు. బాధితులంతా ఒక్కటే అని భావిస్తారు. అందరి కన్నీళ్ళు ఉప్పగానే వుంటాయని గుర్తిస్తారు. ఒకరి కన్నీళ్ళను మరొకరు తుడుస్తారు. “కార్మికులారా ఏకంకండు” అన్నట్టు “బాధితులారా ఏకంకండు” అంటూ నినాదాలు కూడ ఇస్తారు.  వాళ్ళ మధ్య ఐక్యత అంత వరకే.  తక్షణ ఉమ్మడి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవి పనికివస్తాయి. అయితే, విభిన్న బాధిత సమూహాల దీర్ఘకాలిక ఆకాంక్షలు ఒకటికావు.

 

ముస్లింల సామాజిక ఎజెండ మత అణిచివేతను నిర్మూలించి  మతసామరస్యాన్ని నెలకొల్పడం. ఎస్సీ, బిసిల సామాజిక ఎజెండ కులనిర్మూలనను సాగించి కులరహిత సమాజాన్ని నిర్మించడం. ఎస్టీల సామాజిక ఎజెండ మైదాన దోపిడిని నిర్మూలించడం. మహిళల సామాజిక ఎజెండ పితృస్వామ్య వ్యవస్థను నిర్మూలించడం. ఇవన్నీ భిన్నమైన సామాజిక ఎజెండాలు. కొన్ని సందర్భాలలో ఇవి పరస్పర విరుధ్ధమైనవి కూడ.

 

విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రాతినిధ్యం అంశం మీద ఎస్సీల్లోని ఉపకులాలు ఓ పాతికేళ్ళుగా తగువు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక కనీస అవగాహనకు కూడ అవి రాలేకపోతున్నాయి. అంబేడ్కర్ ను తప్పుపట్టేంత వరకు వాళ్ళ వాదనలు సాగుతున్నాయి.  బిసీలు, ఎస్టీల్లోను అలాంటి సన్నివేశమే కొనసాగుతూ వుంది. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో ముస్లింలకు 14.2 శాతం (అదే  వాళ్ళ జనాభా దామాషా) రిజర్వేషన్ ను ఎస్టీ, ఎస్సీ, బిసిలు సమర్ధించే సన్నివేశం వర్తమాన సమాజంలో వుందని ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ నమ్మబలుకుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లిం వెనుకబడిన తరగతులకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించినపుడు న్యాయస్థానాల్లో దాన్ని అడ్డుకున్నదెవరో ఈ మేధావులకు తెలీదా? ఆ కేసులు ఇప్పటికీ తేలలేదు. ఫలితంగా ముస్లీం రిజర్వేషన్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోర్టు  స్టేల మీద నడుస్తున్నది.

 

విచిత్రం ఏమంటే ఆ కేసులకు కౌంటర్ గా కే బాలగోపాల్ ఇంకో కేసు వేశాడు. అందులో స్కైబాబనే పిటీషనర్ గా పెట్టాడు. స్కైబాబ వాయిదాలకు హాజరు కావడంలేదని బాలగోపాల్  మదనపడ్డ సందర్భాలున్నాయి.

 

ఒకవైపు ముస్లింలను దూరంగా పెడుతూనే మరోవైపు ముస్లింలు తమతో కలవరు అని నిందించే సాంప్రదాయం వర్తమాన సమాజంలో  వుంది.   ఈ బూటకాన్ని ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ పెద్దలు కూడ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. వర్తమాన భారత ముస్లిం సమాజంలోని 90 శాతం  ప్రజలు ఎస్టీ, ఎస్సీ, బిసీల నుండే వచ్చారని వీళ్ళే చెపుతున్నారంటే అందర్నీ ఇముడ్చుకునే స్వభావం అక్కున చేర్చుకునే సాంప్రదాయం ఇస్లాంలో అనాదిగా వుందనేగా? అంతకు మించి వీళ్ళు కొత్తగా ఏ ఐడియాలజీని  నేర్పదలిచారూ? ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ భారత ముస్లిం సమాజాన్ని ఒక స్వతంత్ర అస్తిత్వంగా గుర్తిస్తున్నట్టు కనిపించదు. “బహుజన  ఐడియాలజీతో ముందుకు సాగాలి” అని పిలుపిస్తుంది. అస్తిత్వం అంటేనే ప్రత్యేకత అని వీళ్ళకు ఎప్పుడు తెలియాలీ?

 

 బహుజన అనే పదం వర్తమాన రాజకీయాల్లో ఒక బ్రహ్మ పదార్ధం. ఎవరైనా ఎప్పుడైనా తమకు ఇష్టం వచ్చిన రీతిలో దాని పరిధిని పెంచుకోవచ్చు. తగ్గించుకోనూవచ్చు. దళితులంటే ఎస్సీలనీ, బహుజనులంటే బిసిలనే మాటలు ఇప్పుడు వాడుక అర్థంలో కొనసాగుతున్నాయి.    బహుజన పేరుతో ఒక రాజకీయ పార్టీయే వుంది. రిపబ్లికన్ పార్టి జెండా పట్టుకుని, బహుజన జెండా పట్టుకుని బిజెపితో పొత్తులు పెట్టుకున్నవారూ వున్నారు. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఇంతకీ ముస్లింలను బహెన్ మాయావతి వెంట నడవాలని చెపుతోందా? బహెన్ మాయావతిని వ్యతిరేకించాలని చెపుతోందా? రాందాస్ అథవాలేను అనుసరించాలని చెపుతోందా?  బలహీనవర్గాలన్నీ బౌధ్ధమతాన్ని స్వీకరిస్తే కులరహిత సమాజం ఏర్పడుతుందని బహుజన మేధావులు కొందరు ఇటీవల ప్రచారం చేస్తున్నారు. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ అటుగా అడుగులు వేస్తోందా?

 

భారత ముస్లింలను ఓ నాలుగు భూతాలు వెంటాడుతుంటాయి. మొదటిది; దేశాన్ని విభజించారనే నింద,  రెండోది;  మైనారిటీ సోషల్ స్టాటస్, మూడవది; పేదరికం, నాలుగోవది;  అసహన వాతావరణం. వీటివల్ల ఏర్పడే సర్దుబాట్లు, లొంగుబాట్లు, ఆందోళన, అభద్రత, వెనకడుగులు, కుంగుబాట్లు, అంతర్ముఖం వగయిరాలు అన్నీ వర్తమాన భారత ముస్లిం సమాజంలో పుష్కలంగా వున్నాయి. దేశంలో మరే సమూహానికి లేనంత ప్రాణ భయం కూడ ముస్లిం సమాజానికి వుంది. ఈ బంధనాల మధ్య ముస్లిం సమాజం అలాకాక మరోలా ఎలావుంటుందీ? ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ దీన్ని తలకిందులుగా చూస్తున్నది. అణిచివేత, పేదరికంవల్ల ముస్లిం సమాజం అలా వుందని కాకుండ ముస్లీం సమాజం తన వెనుకబాటుతనం వల్లనే పేదరికంలో కొట్టుమిట్టాడుతుందని ఈ సంస్థ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.

 

మతసామరస్యాన్ని సాధించడం సామాజిక ఎజెండాగా భావించి ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను సాగిస్తున్నది. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఆ దిశగా ఆలోచిస్తే ముస్లిం సమాజానికి కొంత మేలు జరగవచ్చు.

-        డానీ

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

9 మార్చ్ 2021 

ముస్లింల సామాజిక ఎజెండ మతసామరస్యం

 ముస్లింల సామాజిక ఎజెండ మతసామరస్యం


    ముస్లిం సమాజం మీద తమకున్న అభిప్రాయాన్ని కవిత పులి తదితర దళిత ఆలోచనాపరులు చాలా స్పష్టంగా ప్రకటించారు. ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ ముస్లింల సమస్య మాత్రమే అన్నారు. బీఫ్ వివాదం కూడ ముస్లింల సమస్యే అన్నారు. ఆ రెండు వివాదాలకు తమ సామాజికవర్గం దూరంగా వుండాలని వారు ఒక స్పష్టమైన పిలుపిచ్చారు.

గుజరాత్ మారణకాండ నుండే ఒక సెక్షన్ లో ఈ ధోరణి ఆలోచనలున్నాయి. ముస్లింల సామాజిక వ్యవహార శైలిని విమర్శిస్తూ, ఎస్టీ, ఎస్సీ, బిసీలు గుజరాత్ మారణకాండలో పాల్గొనడాన్ని సమర్థిస్తూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ ద హిందూ దినపత్రికలో అప్పట్లోనే ఎడిట్ పేజి వ్యాసం రాశారు. వారు ఆ పిదప నరేంద్ర మోదీజీ ఉన్నత శిఖరాలకు చేరుకోవడాన్ని The Rise of Modi అనే వ్యాసం కూడ Outlook లో రాశారు.
భారత ముస్లిం సమాజానికి సంబంధించి మతసామరస్యం వాళ్ళ ప్రధాన కార్యక్రమం; ఎజెండ. ఆ సమాజంలో అంతర్గతంగా కొంత కుల పోకడలు కూడ వున్నప్పటికీ అది వాళ్ళకు ప్రధాన సమస్య మాత్రంకాదు.

    అభద్రలోకానికి చెందిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మధ్య సామాజిక సఖ్యతను కోరుకునేవారు ఇప్పుడు ఈ అంశం మీద విస్తారంగా చర్చ జరపాల్సిన సందర్భం ఇది.

Danny 9 Articles on Triple Talaq

 Danny 9 Articles on Triple Talaq

1.

తలాక్ వివాదం, పరిష్కారం

ఆంధ్రజ్యోతి దినపత్రిక
16-04-2017 00:57:51

http://www.andhrajyothy.com/artical?SID=399038

 

2.

షాబానో నుండి షాయరాబానో వరకు

భారత ముస్లీం సమాజం పురోగమనం!

మన తెలంగాణ దినపత్రిక, 24 ఆగస్టు 2017

 

http://epaper.manatelangana.news/1330773/Mana-Telangana-Daily/24-08-2017#page/4/2

 

3.

‘వివాహహక్కుల రక్షణ’ ముస్లిం మహిళలకేనా?

ఆంధ్రజ్యోతి దినపత్రిక 26 డిసెంబరు 2017

 

http://www.andhrajyothy.com/artical?SID=511835

 

4.

సాంస్కృతిక  భయోత్పాతమే లక్ష్యం!

ప్రజాపాలన దినపత్రిక,  3 జనవరి 2018

https://www.blogger.com/blog/post/edit/7435539703073908345/2651367992027904831

 

5.

ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ

ప్రచురణ :  వీక్షణం మాస పత్రిక, ఫిబ్రవరి 2018

https://veekshanam.files.wordpress.com/2018/01/02_feb_2018.pdf

 

6.

రాజకీయ ప్రయోజనం కోసమే ముస్లిం మహిళా బిల్లు

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జులై 2018

https://www.blogger.com/blog/post/edit/7435539703073908345/1190985326640306099

 

7.

తలాక్  క్రిమినల్ కేసు; విడాకులు సివిల్ కేసు 

మన తెలంగాణ, 12 ఆగస్టు 2018

 https://www.blogger.com/blog/post/edit/preview/7435539703073908345/2502526821318747047

 

 

8.

విడాకులు ఒక ప్రజాస్వామిక పౌరహక్కు

ఆంధ్రజ్యోతి, 21 జూన్ 2019

 

https://www.andhrajyothy.com/artical?SID=825110

 

9.

విడాకులు పౌర పరిష్కారమా? నేరమా?

వీక్షణం మాస పత్రిక, సెప్టెంబరు, 2019

https://www.blogger.com/blog/post/edit/7435539703073908345/1537903736385030228