Saturday, 5 June 2021

దళితులకు పెట్టుబడి సమకూరుతున్న ప్రాంతాల్లోనే సామూహిక దాడులు జరిగాయి.

 దళితులకు పెట్టుబడి సమకూరుతున్న

ప్రాంతాల్లోనే సామూహిక దాడులు జరిగాయి.

 

విస్తృతంగా చర్చచేయండి. లైకులు కొట్టో,  good, nice వంటి కామెంట్లు పెట్టో తప్పుకోవద్దు. నచ్చకపోతే గట్టిగా విమర్శించండి. మీ వాదనను ప్రవేశపెట్టండి. ఈ  వేదికకు దూరంగా వుండాలనీ ట్రోల్స్ కు మనవి.

 

1.        కులాల మధ్య సాంఘీక విబేధాలు వైరుధ్యాలు శతాబ్దాలుగా వున్నాయి.

 

2.        దళిత సామాజికవర్గాల్లో వ్యసాయంవల్ల  ఆర్ధిక పెట్టుబడి, విద్యవల్ల సామాజిక పెట్టుబడి సమకూరుతున్న ప్రాంతాల్లో కుల వైరుధ్యాలు శత్రువైరుధ్యాలుగా మారి సామూహిక దాడులు జరిగాయి.

 

3.        కారంచేడు, చుండూరు, పిప్పర, వేంపెంట వంటివి నీటిపారుదలా సౌకర్యం పుష్కలంగా వుండి వ్యవసాయం లాభసాటిగవున్న  ప్రాంతాలు.

 

4.        యజమానికులాలు చాలాచోట్ల వ్యవసాయం చేయడం మానేశాయి. పొలాలు తోటలను శ్రామికకులాలకు కౌలుకు ఇచ్చి పూర్తి స్థాయి విశ్రాంతి వర్గంగా మారిపోయాయి.

 

5.        తమ వెనుక ఎకరాల కొద్దీ ఆస్తి వున్నదనే ధీమాతో అనేక గ్రామాల్లో యజమానికులాల పిల్లలకు చదువు మీద శ్రధ్ధ తగ్గిపోయింది.

 

6.        మరోవైపు దళిత యువకులు తమకు ఆస్తి లేకపోవడంతో రిజర్వేషన్లవల్ల కలిగిన సౌకర్యాన్ని ఉపయోగించుకుని విద్య మీద దృష్టి పెట్టారు.

 

7.        విస్తృతంగా కాకపోయినా అరుదుగా అయినా యజమానికులాల అమ్మాయిలకు చదువుకోని స్వీయసామాజికవర్గ అబ్బాయిలకన్నా చదువుకున్న దళిత యువకులు ఒక ఆకర్షణగా మారారు. వాళ్ళ మధ్య ప్రేమ అనేది కాకపోయినా స్నేహాలు పెరిగాయి.

 

8.        పట్టణాలలో మొదలయిన ఈ కులాంతర స్నేహాలు గ్రామాల్లో ద్వేషాలు పెరగడానికి దోహదపడ్డాయి.

 

9.        గ్రామాలు అనాగరీక కులతత్వ మురికి కూపాలు. గ్రామాల్లో పైకి కనిపించే అనుబంధాలు కూడా కులతత్వం, ముఠాత్త్వంతో ఏర్పడ్డవే. అవి అంతర్ముఖీన సమూహాలు.

 

10.   సమిష్ఠి సంపద పెరిగినా, సంపదకు సమిష్ఠి ముప్పు వచ్చినా యజమానికులాలు, శ్రామికకులాల మధ్య ఒక ఐక్యత ఏర్పడుతుంది. అలాంటి ఐక్యత ప్రస్తుతం అమరావతి గ్రామాల్లో కనిపిస్తున్నది. పట్టణీకరణ జరిగే కొద్దీ ఇలాంటి ఐక్యతలు పెరగవచ్చు.

Friday, 4 June 2021

‘Kara’ Master is the most exciting ‘story’ teller among our predecessors

 ‘Kara’ Master is the most exciting ‘story’ teller among our predecessors

 మా తరానికి ఉత్తేజపూరిత ‘కథా’నాయకుడు ‘కారా’ మాస్టారు.

ఉషా ఎస్ డానీ

 

లోకంలో గొప్పవాళ్ళు చాలామంది వుంటారు. కొత్తతరాల్ని ప్రోత్సహించేవాళ్ళు గొప్పవాళ్ళలో గొప్పవాళ్ళు. వారు మహాత్ములు. అలాంటి అరుదైన వారిలో కాళీపట్నం రామారావు ఒకరు.  వారు చనిపోయాయారు అనగానే 37 ఏళ్ళ  నాటి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది.

విప్లవ రచయితల సంఘం 1984 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు విశాఖపట్నంలో ఒక కథా  వర్క్ షాప్ నిర్వహించింది. రావి శాస్త్రి, భూషణం, అల్లం రాజయ్య, సివి సుబ్బారావు  టీచర్లు. కాళీపట్నం రామారావుగారు ఆ కథా  వర్క్ షాప్ కు ప్రిన్స్ పాల్. 

వర్క్ షాప్ కు స్టూడెంట్స్‍ ను ఎంపిక చేయడానికి కారా మాస్టారు ఒక ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టారు. 1. మీరు కథలు ఎందుకు రాయాలనుకుంటున్నారూ? 2. ఎలాంటి కథలు రాయాలనుకుంటున్నారూ? 3. కథలు రాయడంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటీ? అని మూడు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాసి పంపాలని అడిగారు. 

“ఆకలంత సహజంగా అన్నమంత అవసరంగా నా జీవితంలోనికి కథలు వచ్చాయి” అంటూ సమాధానం మొదలెట్టాను.  

నా తొమ్మిదవ ఏట ‘సినిమా కష్టాలన్నీ’  మా కుటుంబం లోనికి వచ్చాయి.  మానాన్న కొంచెం పేరూ డబ్బూ వున్న కుటుంబంలో పుట్టాడు. మాకున్న లాంచీ వరదలో కొట్టుకుపోయింది. మాకో టైర్ రీ-ట్రేడింగ్ వర్క్స్ షాప్ వుండేది. బస్సుల జాతియీకరణతో అది మూతపడి పోయింది. అది చాలనట్టు కార్ఖానాలో అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాపు పెడితే అదీ నడవలేదు. కుటుంబం అప్పులపాలయింది. అప్పులోళ్ళ వత్తిడిని తట్టుకోలేక మానాన్న ముఖం చాటేసి ఊరి వదిలి ఢిల్లీ - లూధియాన వెళ్ళిపోయారు. అప్పులవాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇంట్లోవున్న బంగారం, వెండి పళ్ళేలు, గ్రామ్ ఫోన్, పందిరిమంచం, రంగూను భోషాణం, టేబుల్ కుర్చీలు అమ్మి  మా అమ్మ అప్పుల్ని చాలా వరకు తీర్చి,  ఇంటిని వేలం వేయకుండ కాపాడింది. 

మేము నలుగురం. అమ్మా, నేను, తమ్ముడు, చెల్లెలు. మా అమ్మ చాలా మొండిది. తెల్లవారగట్ల నమాజ్ కోసం నాలుగున్నరకు లేచేది. నన్నూ లేపి తనతోపాటు నమాజ్ చదివించేది. ఆ తరువాత నన్ను చదువుకోమని చెప్పి, తను పాత న్యూస్ పేపర్లతో కిరాణా దుకాణాల కోసం కాగితపు సంచులు తయారు చేసేది. సూర్యోదయానికి ముందే లేవడం మూలంగ నాకు సూర్యాస్తమ సమయానికి నిద్ర వచ్చేసేది. ఒక్కోసారి అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూస్తే హరికెన్ లాంతరు పెట్టుకుని తను కాగితపు  సంచులు చేస్తూ వుండేది. ఇంతగా కష్టపడినా రోజుకు రెండు మూడు రూపాయలకు మించి వచ్చేదికాదు.  తను పడే కష్టం చూడలేక ఒకరోజు నేను “నన్ను ఎక్కడయినా పనికి పెట్టు. చదువు మానేస్తాను” అన్నాను. “అలాంటి ఆలోచనలు చేయకు. నువ్వు బాగా చదవాలి. ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడాలి” అంది. తను ఇంకోమాట కూడా చెప్పేది; “అరేయ్ యజ్దానీ!  అల్లా మనకు తప్పకుండ మళ్ళీ మంచి రోజులు ప్రసాదిస్తాడు. అప్పటి వరకు మనం బతికుండాలి; ఆరోగ్యంతో వుండాలి”.    

కొన్నిసార్లు వండడానికి మా ఇంట్లో బియ్యం వుండేదికాదు. కొనడానికి డబ్బులు వుండేవి కావు. అప్పుడు మా అమ్మ మా ముగ్గుర్ని ఒకే మంచం మీద పడుకోబెట్టి ఒక కథ చెప్పేది. 

అది ఏడవ శతాబ్దపు ఖలీపా హజ్రత్ ఉమర్  ఫారూక్ పాలన నాటి కథ. ప్రజల స్థితి గతుల్ని తెలుసుకోవడానికి హజ్రత్ ఉమర్  రాత్రుళ్ళు గుర్రం మీద మారువేషంలో తిరుగుతుండేవారు. ఒక రోజు అర్ధరాత్రి ఊరి చివర ఒక చెట్టు కింద ఒకామె వంట చేస్తూ కనిపించింది. హజ్రత్ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆమెకు కనిపించకుండ అంతా గమనిస్తుంటారు. ఓ మధ్య వయస్కురాలు పొయ్యి మీద కుండ పెట్టి వంట చేస్తుంటుంది. ఆకలితో నకనక లాడుతున్న ఆమె నలుగురు పిల్లలు పొయ్యి చుట్టూ కూర్చొని అన్నం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎంత సేపటికీ అన్నం ఉడకకపోవడంతో పిల్లలు నీరసపడిపోయి నేల మీద పడుకుంటారు. ఆ తరువాత పొయ్యి ఆర్పి ఆమె కూడ పిల్లలపక్కన ఏడుస్తూ పడుకుంటుంది. హజ్రత్ ఉమర్  పొయ్యి దగ్గరికి వెళ్ళి కుండ మీది మూత తీసి చూస్తారు. అందులో నీళ్ళు, నాలుగు రాళ్ళు వుంటాయి. ఆ తరువాత హజ్రత్ ఉమర్  తన రాజ్యంలో ఎవరికీ  ఆకలితో పడుకునే పరిస్థితి రాకూడదంటూ అందరికీ ఉచిత ఆహార పంపిణి ఏర్పాట్లు చేస్తారు. 

మా అమ్మ ఈ కథను చెపుతున్నదంటే ఆ రోజూ ఇంట్లో అన్నం నిండుకున్నదని మాకు తెలిసిపోయేది. ఎవ్వరం ఆకలి మాట ఎత్తేవాళ్ళం కాదు. ఆకలితో నిద్ర కూడ వచ్చేదికాదు. ఆ విషయం మా అమ్మకు తెలియకూడదని రాత్రంతా కళ్ళు మూసుకుని  నిశ్శబ్దంగా వుండిపోయేవాళ్ళం. 

మా అమ్మకు చెప్పకుండ స్కూలు ఉదయం సెషన్ కు మధ్యాహ్నం సెషన్ కు మధ్య నేను ఒక దుకాణంలో పార్ట్ టైం బాల కార్మికునిగా పనికి చేరాను. తీరిక దొరికినప్పుడెల్లా మా వూరి లైబ్ర్రీలో పిల్లల బొమ్మల కథలు తెగ చదివేవాడిని. లవకుశలు, అభిమన్యుడు, బాలవర్ధిరాజు వగయిరాలు నా అభిమాన కథా నాయకులు. ఇంటికి వచ్చి ఆ కథల్ని మా అమ్మకు చెప్పేవాడిని. ఇందులో నాకు ఒక ‘వ్యూహం- ఎత్తుగడ’ వుండేది. ఆ కథల్లో బాల కథానాయకులు తమ తల్లుల కష్టాల్ని తీర్చినట్టు మా అమ్మ కష్టాలన్నీ నేను తీరుస్తాను అని చాలా తెలివిగా సంకేతాలు ఇచ్చేవాడిని.  సంద్ర్భాన్ని బట్టి మా అమ్మకు ఉత్సాహాన్ని కలిగించడానికి కొంచెం స్వేఛ్ఛ తీసుకుని కథల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసేవాడిని. మా అమ్మ చాలా సంబరపడిపోయేది. నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకునేది. నవ్వేతే మా అమ్మ చాలా అందంగా వుండేది. తనను నవ్వించడం కోసం అనేక కథలు అల్లేవాడిని. అలా నేను నా జీవిత అవసరార్ధం కథకుడ్ని అయ్యాను – అంటూ కారా మాస్టారికి నా సమాధానాన్ని రాసి పంపాను. 

అల్లం రాజయ్య, బిఎస్ రాములు, నేను  మరో ఇరవై మంది గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఆగస్టు 13 ఉదయం విశాఖపట్నం చేరుకున్నాము. కాళీపట్నం రామారావు మాష్టారు స్టేషనుకు వచ్చారు. వారు లాంఛనంగా అందర్నీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారనుకున్నాను.  వారు నన్ను కౌగలించుకుని “నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను” అన్నారు. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. “మనం ఓ రెండు గంటల తరువాత ఎలాగు క్లాసులో కలవబోతున్నాం. నేను అంత వరకు ఆగలేకపోయాను. మీలో ఒక జాక్ లండన్ వున్నాడు” అన్నారు. నేను పరవశించిపోయాను. 

అప్పట్లో నేను ఒక పిల్ల కథకుడ్ని. కాళీపట్నం రామారావు మాస్టారంతటి వారు నా రచనాశైలి గురించి అంత గొప్ప మాటలంటుంటే నా వొళ్ళు నేల మీద నిలబడలేదు. గాల్లో తేలిపోయింది. కొత్త తరం గురించి అన్ని మంచి మాటలు అనడం మహాత్ములకే సాధ్యం. 

4 జూన్ 2021


Wednesday, 2 June 2021

Mother Tongue, Official Language and Medium of Instruction

 Mother Tongue, Official Language and Medium of Instruction

మాతృభాష, అధికార భాష, బోధనా భాష

 డానీ

 

‘ఎన్.టి.ఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ పేరుతో సాహిత్య పురస్కారo అందిoచే నైతిక హక్కు శ్రీమతి లక్ష్మీ పార్వతికి, అందుకునే నైతిక అర్హత శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడుకి ఎక్కడిది?’ – శీర్షికతో 26 మే 2021న ‘జనసాహితీ’ సంస్థ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడాన్ని అందులో తీవ్రంగా విమర్శించారు.

 

‘జనసాహితీ’ కరపత్రం మీద స్పందనగా ఈ వ్యాసంలోని మొదటి భాగాన్ని రాశాను. దాని మీద తన ప్రతిస్పందనగా  జనసాహితీ నాయకులు దివికుమార్ 2019 నవంబరు ఆరంభంలో అచ్చయిన  ‘ఇంగ్లీషు మాధ్యమంలో చదువుల ద్వారా ఎంత ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని అలవరుచుకో గలిగాము? ‘ అనే  వ్యాసాన్ని పంపించారు.  దాని మీద నా స్పందనగా ఇందులోని రెండవ, మూడవ భాగాన్ని రాశాను)

 

మొదటిభాగం

 

1.  మాతృభాష వేరు; అధికార భాష వేరు; బోధనా భాషవేరు. ఇవి కన్నవారికీ, పాలకులకు, నియతవిద్యకు సంబంధించిన మాధ్యమాలు.

 

2. ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు అధికార భాష. అంటే యజమాని భాష; మిగిలినవి శ్రామిక భాషలు.

 

3.   జనసాహితీ వంటి సామ్యవాదుల సంస్థ అధికార భాష గురించి ఇంతగా ఆవేదన పడడం విచిత్రంగా వుంది.

 

4. ప్రభుత్వ పరంగా కనీస ఆదరణ గుర్తింపులు లేని భాషా సమూహాలు ఆంధ్రప్రదేశ్ లో అనేకం వున్నాయి. జనసాహితీ వాటికి ప్రాణం పోసే చర్యలు తీసుకుని వుంటే బాగుండేది.

 

5. ఏ తల్లిదండ్రులు కూడ తమ పిల్లల్ని  పొట్ట కూటి కోసమే నియత విద్యకు పంపిస్తారు. బాషోధ్ధరణ కోసం ఎవ్వరూ తమ పిల్లల్ని నియత విద్యకు  స్కూళ్ళకు  పంపరు.

 

6.    ఒక అర్ధ శతాబ్దానికి పైగా  భద్రలోకం తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకే పంపుతోంది.

 

7.   ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ సంఖ్య పెరిగాక ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళకు పోయేవారు తగ్గిపోయారు.

 

8.   ఉన్నత విద్యలో సైన్స్ కన్నా ఆర్ట్స్  తక్కువది అని అనుకుంటున్నట్టు ఇంగ్లీషు మీడియం కన్నా తెలుగు మీడియం తక్కువది అనే భావన బలంగా వుంది. ఇదొక అత్మన్యూనతాభావం. ఇదొక అణిచివేత.

 

9. తమ పిల్లల్ని కూడ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించాలని  అభద్రలోకం ఆశపడుతున్నది. ఇదొక అత్మగౌరవ అంశం. వాళ్ళ కోరికను కాదనే హక్కు ఇతరులకు లేదు.

 

10. ఇప్పటికీ తమ పిల్లలకు తెలుగు మీడియం మాత్రమే కావాలనుకునే తల్లిదండ్రులు వుండవచ్చు, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే కొన్ని భాషల  కోసం కొన్ని స్కూళ్ళు వున్నాయి.

 

11. తమను తాము తెలుగు భాషాభిమానులుగా చెప్పుకునేవారు ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భం ఇంత వరకు కనిపించదు.

 

12.17 సంవత్సరాల పాటు ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న అనేకమంది పిల్లలు కనీసం సెలవు చీటీని కూడా ఇంగ్లీషులో తప్పులు లేకుండా రాయలేని స్థితి వుందని ‘జనసాహితీ’ కరపత్రంలో పేర్కొన్నారు. పిల్లల ఆంగ్ల పరిజ్ఞానాన్ని తరువాత పరిశీలిద్దాము. తెలుగు మీడియంలో బోధించే ఉపాధ్యాయుల్లో  ఎంత శాతం మంది ‘వ్యవసాయ చట్టాలు’ ‘పోలవరం ప్రాజెక్టు’ ‘ఆర్టికల్ 370 రద్దు’, ‘కరోనా విశ్వమారి’ ‘గోదావరి – కావేరి అనుసంధానం’ తదితర వర్తమాన అంశాల మీద తెలుగులో ఒక అందమైన వ్యాసం  రాయగలరూ? ఎవరయినా సర్వే జరిపారా?

 

13. ఎన్టీ రామారావులో నూతన ప్రజాస్వామిక, ఫెడరల్ విలువల్ని చూడగలిగిన వాళ్ళకు అభద్రలోకపు ఆత్మగౌరవ కోరిక న్యాయమైనదని అనిపించకపోవడం అన్యాయం. కారంచేడు దురాగతంతో ఎన్టీ రామారావుకున్న అనుబంధాన్ని విస్మరించిన ఈ కరపత్రం అభద్రలోకపు ఆకాంక్షల్ని ప్రతిబింబించింది అనుకోవడం కష్టం.

 

14. అభద్రలోకం  తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య కావాలనగానే జనసాహితి సంస్థ మిన్ను విరిగి మీద  పడినట్టు గగ్గోలు పెట్టడం అస్సలు బాగోలేదు.

 

15. చారిత్రక కారణాలు ఏమైనాగానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుకన్నా ఇంగ్లీషు పొట్టకూటి భాష.  తెలుగు భౌగోళిక అస్తిత్వానికి సింబంధించింది;  ఇంగ్లీషు అభివృద్ధికి సంబంధించినది.

 

 

రెండవ భాగం

 

16. కార్పొరేట్ విద్యాసంస్థలు బలపడ్డాక టాలెంట్ గల  ఉపాధ్యాయులు అక్కడికి వలసపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలినవాళ్ళల్లో బహు కొద్దిమందితప్ప అత్యధికులు తుక్కు. స్ క్రాప్!

 

17. మాతృప్రేమ, మాతృభాషలకు ఉపయోగపు విలువ వుంటుంది.

 

18. నియత విద్య సరుకు; దానికి మారకపు విలువ కూడ వుండితీరాలి.

 

19. అధికారభాషా పరిరక్షణ  కోసం ఒక ప్రభుత్వ వ్యవస్థ వుంటుంది.

 

20. అభ్యుదయవాదులు అనధికార భాషల పరిరక్షణ కోసం కృషి చేయాలి.

 

21. ఇతర ప్రభుత్వోగులతోపాటూ ఉపాధ్యాయుల జీతభత్యాలు గత ఇరవై ఏళ్ళలో భారీగా పెరిగాయి. ఈ కాలంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య పెరిగిందిగానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు  పడిపోయాయి. విలోమానుపాతం (inversely  proportional)!

 

22. వచన కవితా ప్రక్రియే అంతరించి పోతూ కథా-నవలా ప్రక్రియలు పుంజుకుంటున్న కాలం ఇది. కొందరు అధికార భాషా పరిరక్షకులు  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పద్యాలనూ, ప్రబంధాలనూ పునరుధ్ధరించే పనిలో పడ్డారు.

 

23. ఓ యాభై ఏళ్ళ  క్రితం తెలుగు మీడియంలో చదివినవాళ్ళు  ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో  చదువుతున్న వారిని ‘వ్యక్తీకరణ సామర్థ్యం’  ‘స్థూల   ప్రాపంచిక  పరిజ్ఞానం’ లేనివారిగా చిత్రించేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఇది తాతా మనవళ్ళ పోటీ!

 

24. కొత్తతరంతో అనుబంధలేని వృధ్ధతరం ఇలాంటి ముసలి  వాదనలు చేస్తున్నది.

 

25. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియంలలో చదివిన ఇద్దరు ఫ్రెష్ గ్రాడ్యూయేట్ల మధ్య ‘వ్యక్తీకరణ సామర్థ్యం’  ‘స్థూల   ప్రాపంచిక  పరిజ్ఞానం’ అంశాల మీద పోటీ పెడితే ఎవరి సామర్ ధ్యం ఎంతో తేలిపోతుందిగా.

 

26. ఇంతకీ మాతృభాష తెలుగూ పాఠ్యపుస్తకాల్లో వుండే తెలుగూ ఒకటేనా?

 

 

మూడవ భాగం

 

1.     ప్రజాసమూహాలు అన్నింటికీ  మాతృభాషలుంటాయి. కానీ, ఒక ప్రజాసమూహానికి మాత్రమే తమ మాతృభాషను అధికార భాష చేసుకునే అవకాశం వుంటుంది.

 

2.     ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన తమిళ, మలయాళ, గుజరాతీ తదితర భాషా సమూహాలేగాక అచ్చంగా ఆంధ్రప్రదేశ్ నేల మీద పుట్టిన విభిన్న భాషా సమూహాలు పాతిక్కి పైగా వుంటాయి. దాదాపు పది శాతం మంది మాట్లాడే ఉర్దూ భాషనే పక్కన పెట్టిన అధికార భాషాభిమానులు ఇక గోండు, కోలామీ, కోయ, కువి, కుయి, ఎరుకల, సవర, పర్జీ, కుపియా, కొండ, ఆదివాసీ ఒరియా తదితర  స్థానిక భాషల్ని పట్టించుకుంటారని ఆశించడం అత్యాశ.

 

3.     ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్క తెలుగు భాషనే మాతృభాషగా భావించాలి అనే దురహంకారం ఆధిపత్యవాదం వీరిలో  కనిపిస్తోంది..

 

4.     ఎవరికైనాసరే  నియత విద్యలో చేరడానికి ముందే తల్లిదండ్రులు, పరిసరాల ద్వార మాతృభాష అబ్బుతుంది.

 

5.     పెద్దలకన్నా పిల్లలకు ఇతర భాషలు చాలా త్వరగా అబ్బుతాయి.

 

6.     మనుషులకు నియత  విద్య ద్వార మాత్రమే సమాజ పరిజ్ఞానం రాదు. వ్యక్తులకు తాము పుట్టిన సామాజికవర్గాలను బట్టి, కుటుంబము, , బంధువులు, పరిసరాలు, స్నేహితులు, సహోద్యోగులు, మార్కెట్, మీడియా, దేశ రాజకీయాలు వగయిరాల వల్ల   సమాజ పరిజ్ఞానం వస్తుంది.

 

7.     వ్యక్తులు ప్రత్యేక సాధన ద్వార కవులు, కళాకారులూ, రచయితలు అవుతారు. ఏమాత్రం నియత విద్య లేనివారు సహితం గొప్ప కవులు, కళాకారులైన ఉదాహరణలు మనకు అనేకం వున్నాయి.

 

8.     ఇప్పుడున్న ప్రభుత్వ టీచర్లలో ఎక్కువమంది తెలుగు మీడియంలోనే సరిగ్గా పాఠాలు చెప్పలేరు. ఇంగ్లీషును ‘మీడియం ఆఫ్ ఇన్ స్ట్రక్షన్’ గా ప్రకటిస్తే వారిలో సగంకన్నా ఎక్కువ మంది ఇంటిదారి పట్టాల్సి వుంటుంది.

 

9.     సహజంగానే ట్రేడ్ యూనియన్ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తాయి.

 

10. ఇప్పుడున్న టీచర్లందరూ గత నాలుగు దశాబ్దాలుగా  దిగజారుతున్న విద్యావ్యవస్థ నుండి పుట్టుకు వచ్చిన వారే. నాణ్యత లేని టీచర్లు తమను పోలిన విద్యార్ధుల్నే సృష్టిస్తారు.

 

11. పాత టీచర్లకు ఉద్యోగ భద్రతకన్నా కొత్త తరాలకు ఉపాధి కల్పన ముఖ్యం.

 

12. ట్రేడ్ యూనియనిజం బాగా వంటపట్టినవాళ్ళు సామ్యవాదాన్నీ, కమ్యూనిజాన్నీ, నూతన ప్రజాస్వామిక విప్లవ విలువల్నీ ఏ స్థాయికి దిగజార్చుతారో  తెలుసుకోవడానికి జనసాహితీ కరపత్రం తాజా ఉదాహరణ.

 

 (అయిపోయింది)

 

3 జూన్ 2021