Friday, 3 September 2021

We lost Shireesha but her Aalambana spirit continues.

 We lost Shireesha but her Aalambanaa spirit continues.

  శిరీషగారు లేరు; వారి ‘ఆలంబన’ స్పూర్తి  కొనసాగుతుంది.

  

మనతరం అనేమాట ఎవరికైనాసరే గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూవుంటుంది.  అలా నాకు గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూ వచ్చిన వ్యక్తుల్లో రచయిత్రి దాసరి శిరీష గారు ఒకరు. వారు మా రతం.

 

సమాజంలో ఒక మనిషి పుట్టడం మహత్తర విషయం అయినట్టు ఆత్మీయులు చనిపోవడం చాలా బాధాకర సన్నివేశం. మనతరం వాళ్ళు చనిపోయినపుడు మన పునాదిరాళ్ళు కదిలిపోయి మన  జీవన భవనం కూలిపోతున్నదనే భావన కలుగుతుంది. త్రిపురనేని శ్రీనివాస్, పతంజలి, బాలగోపాల్, తాడి మోహన్, ఉప్పుమావులూరి సాంబశిరావు (ఉసా), దేవిప్రియగార్లు చనిపోయినపుడు నేను అలాంటి భావోద్వేగానికి లోనయ్యాను.

 

శిరీషగారు చనిపోయారని నిన్న మా రెండో అబ్బాయి హైదరాబాద్ నుండి  ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఆలోచనలు 50 యేళ్ళు వెనక్కి పోయాయి.

 

శిరీషగారు దాదాపు 48 యేళ్ళుగా తెలుసు. అప్పుడు నాకు 23 యేళ్ళు. ప్రతి మనిషి జీవితంలో ఇది చాల సంక్లిష్టమైన వయసు. మనుషులు ప్రేమలో పడే కాలం ఇది. జీవితంలో ఎలా స్థిరపడాలనే ఆరాటం ఒకవైపు, జీవిత భాగస్వామి గురించిన ఆలోచనలూ మరోవైపు వెంటాడుతుంటాయి.  ఉపాధి, ప్రేమల మధ్య పొత్తు కుదరని సమయం అది. రెండింటిలో ఏదో ఒకదాన్ని వదులుకోలేక చాలా ఘర్షణ పడాల్సి వస్తుంది. జీవితంలో స్థిరపడితే పెళ్ళి చేస్తామని పెద్ద తరం అంటుంది. పెళ్లి చేసుకుంటే స్థిరపడతామని చిన్నతరం అంటుంది. అలాంటి ఒక ఘర్షణకు  పరిష్కారం కోసం నేను తొలిసారిగా 1975లో భీమవరంలో శిరీషగారిని కలిశాను.

 

నాకు నరసాపురంలో చొప్పరపు ఉషారాణి అనే మంచి సాహిత్య స్నేహితురాలు వుండేది.  స్నేహం వరకు బాగానే వుండిందిగానీ తను నన్ను ప్రపోజ్ చేసిన తరువాత మా ఇద్దరికీ కష్టాలు మొదలయ్యాయి. దానికి మతం ప్రధాన కారణం; నాకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడం మరో కారణం. ఒకటి సాంస్కృతికం; మరొకటి ఆర్థికం.

 

ఇరువైపుల నుండి పెద్ద మనుషులు చెరొకరు నిలబడి పెళ్ళిచేయాలనే ఒక కాంప్రమైజ్ ఫార్మూల ఒక దశలో ముందుకు వచ్చింది. మా నాన్నగారి తమ్ముడు భీమవరంలో పేరున్న వ్యాపారి. అప్పట్లో ఉష మూడవ అక్క నర్శమాంబగారు కూడ భీమవరంలో ఉద్యోగం  చేస్తూండేవారు. నేను భీమవరం వెళ్ళి మా బాబాయితో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాను. అలాగే నర్శమాంబగారినీ కలిశాను. ఇటూ మా బాబాయి, అటు నర్శమాంబగారు  నిలబడితే సమస్య  పరిష్కారం అయినట్టే.

 

నర్శమాంబగారికి సూత్రప్రాయంగా మా పెళ్ళి విషయంలో సానుకూలతే వుంది. అయితే, నన్ను స్క్రూటినీ చేసే బాధ్యతను వారు తన స్నేహితురాలు శిరీషగారికి అప్పచెప్పారు. అప్పట్లో శిరీషగారు కూడ భీమవరంలో ఉద్యోగం  చేస్తూండేవారు.

 

అప్పటికి  నాకు శీరీషగారి గురించి పరోక్షంగా కొంత తెలుసు. నా కాలేజి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు పల్లం రామానుజాచారి వాళ్ళది కృష్ణాజిల్లా గండేపల్లి గ్రామం. అక్కడ శిరీషగారి అమ్మగారు; రచయిత్రి పరిపూర్ణ  గారితో ఆచారీ కుటుంబానికి ఒక అనుబంధం  వుండేది. ఆ అనుబంధంతో   శీరీషగారు నరసాపురంలో ఆచారీ ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళారు. నాకో దారి దొరికినట్టయింది. “డానీ ఒక మంచిబాలుడు. నమ్మి అమ్మాయిని ఇవ్వవచ్చు” అంటూ ఆచారి దగ్గర ఒక ‘రికమెండేషన్ లెటర్’ తీసుకుని, భీమవరం వెళ్ళి   ‘పెళ్ళి ఇంటర్వ్యూ’ కు  శిరీషగారి ముందు చేతులు కట్టుకుని   నిలబడ్డాను.

 

విజయవాడ మారుతీనగర్ లోని శిరీషగారి ఇంట్లోనే 1978 చివర్లో నాకు ఆర్టిస్టు తాడి మోహన్ పరిచయం అయ్యాడు.  హైదరాబాద్ కు మారిన తరువాత కూడ శిరీషగారి కుటుంబంతో పాత అనుబంధం కొనసాగింది.

 

మనుషులు రెండు రకాలు. నాయకత్వం వహించేవారు; నాయకుల వెంట నడిచేవారు. లీడర్స్ అండ్ ఫాలోయర్స్.  కొందరు వయసు పెరిగే కొద్దీ జీవితానుభవంతో రాటుదేలుతారు. కొందరు బాల్యంలోనే జీవితానుభవాన్ని చవిచూస్తారు. అలాంటివారు సాధారణంగా కుంగిపోతారు. వాళ్ళల్లో కొందరు మాత్రం రాటుదేలి  నాయకులుగా ఎదుగుతారు. వీళ్ళనే మనం  ‘బోర్న్ లీడర్స్’ అంటాం. నిజానికి వీళ్ళకు కూడ స్వంత సమస్యలు అనేకం వుంటాయి. అయినప్పటికీ, వీళ్ళు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలగడమేగాక  తమ చుట్టూవున్న వాళ్ళ సమస్యల్ని కూడ పరిష్కరిస్తుంటారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చి, ప్రోత్సహించే సామర్థ్యం వారికి సహజంగానే ఉంటుంది. శిరీషగారు నాకు తెలిసినప్పటి నుండి  చనిపోయే వరకు తన టీమ్ కు తిరుగులేని నాయకురాలు.  ఆ సమూహంలో వారి స్థానం నిత్యం ఒక మెట్టు పైన వుండేది.  వారి మనస్తత్వానికి ప్రతిరూపమే ‘ఆలంబన’. 

 

శిరీషగారికి నివాళులు,

తోట అపర్ణకు ప్రగాఢ సానుభూతి.

 

పరిపూర్ణగారికి వచ్చిన కష్టం ఒకరు ఓదార్చగలిగేది కాదు. అనేక తూఫాన్లను తట్టుకుని నిలిచిన నావ వారు. ఇప్పుడు దీనిని కూడ తట్టుకోగలరని ఆశిస్తాను.

 

శిరీషగారు లేరు; వారి ‘ఆలంబన’ స్పూర్తి  కొనసాగుతుంది.

 

-        ఉషా యస్ డానీ 

Wednesday, 1 September 2021

Present day media do not have ethics

ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్‍ లేవు.

 

1998 తెలుగు పత్రికలకు గడ్డు కాలం. ఆంధ్రపత్రిక, ఉదయం, ఏపిటైమ్స్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కు ఒక ఇంగ్లీషు పత్రిక వుండేది, అవన్నీ మూసేశారు. అంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. ఒక అంచనా ప్రకారం ఓ ఐదు వేల మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు.

 

 ఆ తరువాత జర్నలిజం స్వభావం మారిపోయింది. అంతకు ముందు కూడ మీడియాది వ్యాపారమే. ఇప్పుడూ వ్యాపారమే. కాకపోతే అప్పటి మీడియా వ్యాపారంలో కొన్ని ఎథిక్స్‍ వుండేవి. సామాజిక బాధ్యత ఎంతో కొంత వుండేది. పార్టీ అభిమానం కూడ వుండేది; కానీ, ఇతర పార్టీల వర్తల్ని కూడ అనిమతించేవారు. ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్‍ లేవు.

 

గతంలో ఎడిటర్ అనేది మీడియా సంస్థల్లో అత్యున్నత స్థానం. నార్ల వేంకటేశ్వర రావు, సి. రాఘవాచారి వంటివారు  ఆ గౌరవాన్ని పొందారు. ఏబికే, నండూరి రామ్మోహన రావు వంటివారు మొదటి దశలో అలాంటి గౌరవాన్ని పొందారుగానీ, వాళ్ళ కెరీర్ చివరి దశల్లో వాళ్ళకు అలాంటి గౌరవం దక్కలేదన్నది వాస్తవం. 

 

ముట్నూరి కృష్ణారావు వంటివారు జర్నలిజానికి ఒక గౌరవాన్ని తెచ్చారు. అయితే, గిరీష్ సంఘీ వంటివారు  జర్నలిజంలో పతన విలువల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాదాపు అందరూ  ఆ పతన విలువల్నే పాటిస్తున్నారు.

 

ఇప్పుడు జర్నలిజంలో ఎడిటర్ కన్నా సిఇవో పెద్ద ఉద్యోగం. రెవెన్యూను తేగలిగిన వాళ్ళే ఇప్పుడు సిఇవోలు అవుతున్నారు. వాళ్ళు కూడ రెవెన్యూను తేగలిగిన వాళ్ళనే రిపోర్టర్లుగా నియమిస్తున్నారు. ఇవ్వాళ జర్నలిజం మేడ్ ఈజీ అయిపోయింది. అప్పాయింట్ మెంట్ ఇచ్చిన క్షణమే రోజూ ఎవర్ని పొగడాలో ఎవర్ని తిట్టాలో చెప్పేస్తున్నారు.

 

చిన్న పత్రికల వ్యవహారం మరీ ఘోరం.  వాళ్ళకు రిపోర్టర్స్ తో పనిలేదు. యాడ్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే కావాలి. జీతాలు ఇవ్వరు. యాడ్ తెచ్చి కమీషన్ తీసుకోమంటారు. వాళ్ళంతా రిపోర్టర్‍ ఐడెంటిటీ కార్డును మెడలో వేసుకున్న యాడ్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు యాడ్ తెచ్చుకోవాలి. లేకుంటే, మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇనెస్పెక్టర్లకు సహాయకులుగా మారి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి.  

 

చదువుకున్నోళ్ళు వస్తే జర్నలిజం బాగుపడుతుందనే భావన కూడ తప్పే. దేశంలో భారీ స్కాములు నడిపినవాళ్ళు వున్నత విద్యావంతులే. సోషల్ వర్కర్లు జర్నలిజం లోనికి రావాలనడం సమంజసమైన సూచన కావచ్చు. భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడే అతి పెద్ద మీడియా సంస్థకు కూడ అధిపతి. ఈ స్థితిలో  ప్రధాన స్రవంతి జర్నలిజం నుండి ప్రజాప్రయోజనాన్ని ఆశించలేం.

 

మరోవైపు, జర్నలిస్టుల్ని ప్రజలు పోషిస్తున్నారనే ఒక తప్పుడు భావన కూడ ప్రచారంలో వుంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. ఆ పన్నులతో ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు జీత భత్యాలు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడ జర్నలిస్టులకు జీతభత్యాలు ఇవ్వదు.  అసలు జర్నలిస్టుల్లో సగం మందికి అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండదు. అప్పాయింట్ మెంట్ ఆర్డరు వున్న వాళ్ళలో సగం మందికి జీతాలు ఇవ్వరు.

 

అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండి, తగినంత సర్విస్ వుంటే ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తుంది. దానివల్ల ప్రభుత్వ బస్సుల్లో టికెట్ రాయితీ వస్తుంది.  అలా ఏడాదికి ఒక వెయ్యి రూపాయలు కూడ కలిసి రావు. సీనియర్లకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. జర్నలిస్టుల్లో ఒక ఐదు శాతానికి కూడ ఈ సౌకర్యం దక్కదు.

 

-         డానీ

విజయవాడ

1 సెప్టెంబరు 2021

Sunday, 29 August 2021

The Afghans will drive out the Taliban also if they do not reform

 

సంస్కరించుకోకపోతే తాలీబాన్లను కూడ తరిమేస్తారు ఆఫ్ఘన్లు

-        డానీ 

 

ప్ర 1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా?

 

జ 1. సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి.  మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ, కశ్మీర్ లోయలో నివశించే ముస్లింలలో ఆదివాసులుంటారన్న స్పృహ మనలో చాలామందికి వుండదు.  సరిగ్గా ఈ కారణం వల్లనే భారత రాజకీయాల్లో కశ్మీర్, లక్షద్వీప్ లు వివాదాస్పద ప్రాంతాలుగా వుంటాయి.  మనకు మన దేశంలో కశ్మీర్, లక్షద్వీప్ లు అర్థం అయితే ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు సులువుగా అర్థం అవుతాయి.

 

అఫ్ఘానిస్థాన్‌ లో చమురుతో పాటు అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. వాటికోసం ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్టు సామ్రాజ్యవాదులు ఎప్పుడూ చెప్పరు. జీవాయుధాలు వున్నాయన్న నెపంతో ఇరాక్ మీద దాడి చేసింది అమెరిక; అక్కడ జీవాయుధాలు  కనిపించలేదు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఆశ్రయం పొందాడన్న నెపంతో అఫ్ఘానిస్థాన్‌ ను ఆక్రమించింది అమెరికా. అక్కడ బిన్ లాడెన్ కనిపించలేదు.

 

ప్ర 2  : అఫ్ఘానిస్థాన్‌ పరిణామాల‌ను ఎలా చూస్తున్నాం? ఎలా చూడాలి?  స్వేచ్ఛ, ప్ర‌జాస్వామ్యాల‌కు పాశ్చాత్య‌, స్థానీయ సంస్కృతులు ఎలాంటి అర్థం ఇచ్చుకుంటున్నాయి?

 

జ 2 :    అఫ్ఘానిస్థాన్‌ లో మూడు అంశాలున్నాయి. మొదటిది; ఆఫ్ఘన్ ప్రజలు, రెండోది; అమెరికన్ సామ్రాజ్యవాదం, మూడోది; తాలిబాన్లు. అమెరికా వీరాభిమానులేకాక, కొందరు కమ్యూనిస్టులు కూడ ఆదేశాన్ని అతిగొప్ప ప్రజాస్వామిక దేశంగా భావిస్తున్నారు. వాళ్ళకు తాలీబాన్లు ఆఫ్ఘన్ దేశపు ఫాసిస్టులుగా కనిపించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు. 1980వ దశకంలో తమ దేశాన్ని ఆక్రమించిన  అలనాటి సోవియట్ రష్యన్ సామ్రాజ్యవాదాన్ని అఫ్ఘానిస్థాన్‌ ప్రజలు తిప్పికొట్టారు. సోవియట్ రష్యా పతనమైపోయినా మన వామపక్షీయులకు ఆఫ్ఘన్ ప్రజల మీద అక్కసు మాత్రం పోయినట్టులేదు. ఇక్కడ వామపక్షీయులు చేస్తున్న వాదనకూ ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ మీడియా చేస్తున్నవాదనకూ తేడలేదు.

 

తాలిబాన్లు నిస్సందేహంగా ఛాందసులు; పైగా సాయుధులు. ఆఫ్ఘానిస్తాన్ ప్రజలు  అటు అమెరికన్ సామ్రాజ్యవాదానికీ,  ఇటు తాలిబాన్లకు కూడ వ్యతిరేకులే. ఇదొక ఘర్షణ అంశం. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తాలిబాన్లు నిర్ణయాత్మక పోరాటం జరపడం పాజిటివ్ కోణం. అదొక ఐక్యత అంశం.  జాతియోద్యమ కాలంలో విశ్వనాధ సత్యనారాయణ వంటి రచయితలు వలసవాదానికి వ్యతిరేకంగా ఛాందసవాదాన్ని ముందుకు తేవడాన్ని మనం తెలుగు సాహిత్యంలో చూశాం. ఒక విధంగా ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలు అలాగే సాగుతున్నాయి. బయటి దెయ్యంకన్నా ఇంట్లోని భూతమే మేలు అనుకోవచ్చు.  

 

సామ్రాజ్యవాదుల ఆక్రమణల్లో ఒక విచిత్రం వుంటుంది. భారీ ఆర్థిక ప్రయోజనాల కోసమే అవి అభివృధ్ధి చెందుతున్న దేశాల్ని ఆక్రమిస్తాయి. అయితే, ఆక్రమణల నిర్వహణ  అంత సులువుకాదు. అక్కడ తిరుగుబాట్లు, ఉద్యమాలు చెలరేగుతాయి. వాటిని అణిచివేయడానికి భారీగా ఖర్చు పెట్టాల్సివస్తుంది. ఈ పరిణామాలు పరిమాణాత్మక మర్పు నుండి గుణాత్మక మార్పుకు చేరుకుంటాయి. వలస దేశాల నిర్వహణ లాభసాటిగా కాకుండా నష్టదాయికంగా మారుతాయి.  పైగా, ఇతర ప్రపంచ సమాజం ముందు పరువు పోతుంది. అప్పుడు వెనుకడుగు తప్పదు. మనదేశం దీనికి మినహాయింపు అనుకుంటాను. ఇప్పటి భారతదేశంలో సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం, సామ్రాజ్యవాదంతో సంధి చేసుకుంది. 

 

 

ప్ర 3 : సామ్రాజ్య‌వాదుల ప్ర‌త్య‌క్ష జోక్యం, యుద్ధ ప్ర‌భువుల ఏలుబ‌డిలోనే మొద‌టి నుంచీ అఫ్ఘాన్ వ్య‌వ‌స్థ‌లు న‌డుస్తున్నాయి.

 

జ 3  :  ఆక్రమణల్ని తట్టుకొని నిలబడడంలో ఆఫ్ఘాన్లకు రెండున్నర వేల సంవత్సర్ల చరిత్రవుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తు పూర్వం 330లో ఆఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించాడు.  హిందూఖుష్ పర్వతాల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. భారీ నష్టాలను చవిచూశాడు. ఆఫ్ఘానిస్తాన్  లోనికి ప్రవేశించడం చాలా సులువు; బయటికి రావడం చాలా కష్టం అన్నాడు. “easy to march in to; hard to march out”.  

 

గ్రీకు, బ్రిటీష్, సోవియట్ రష్యా, అమెరికా సామ్రాజ్రవాదాల్ని తట్టుకుని నిలబడిన నెల అది. మనలో చాలామంది మరిచిపోయినట్టున్నారుగానీ, బ్రిటీష్ ఇండియా నుండి విడిపోయిన తొలి దేశం ఆఫనిస్తాన్. 1876లో విడిపోయింది.

 

 

ప్ర 4 : ఇప్పుడు తాలిబ‌న్ల జోక్యం అక్క‌డి వ్య‌వ‌స్థ‌ల్లో తీసుకురాగ‌ల ఏ మార్పుల గురించి ప్ర‌పంచం భయపడుతోంది?

 

జ 4 : సోవియట్ రష్యా, అమెరికాలు ఆక్రమించుకున్నప్పుడే ఆఫ్ఘానిస్తాన్ గురించి ప్రపంచం ఆందోళన చెంది వుండాల్సింది.  ఇప్పుడు కొత్తగా భయపడడం ఒక బూటకం.  తాలిబాన్లను వ్యతిరేకించే నెపంతో వాళ్ళు సామ్రాజ్యవాదాన్ని వెనకేసుకు వస్తున్నారు.

 

            తాలిబాన్లు ఛాంధసులు కనుక అతిశయించిన ఇస్లామిక్ ఆచారాలను అమలు చేస్తారనేది ఒక అనుమానం. ముఖ్యంగా, స్త్రీలను క్రూరంగా అణిచివేస్తారనే నింద తాలిబాన్ల మీద వుంది. మరోవైపు, తాలిబాన్లు కూడ తమ లోపల్ని గుర్తించినట్టున్నారు. “అందరికీ క్షమాభిక్ష, మహిళలు బుర్ఖాలు ధరించడం తప్పనిసరికాదు. వాళ్ళు హిజబ్ (స్కార్ఫ్) వెసుకుంటే సరిపోతుంది. ఎవరయిన సరే  ఆఫ్ఘానిస్తాన్ వదిలి పోవాలనుకుంటే పోవచ్చు. ఫ్రీ పాసేజ్ ఇస్తాం”  వంటి ప్రకటనలు తాలిబాన్ల లో వచ్చిన మార్పుని సూచిస్తున్నాయి.

 

మరోవైపు, ‘బుర్ఖా వేయలేదని మహిళను చంపిన తాలీబాన్లు’ అనే వార్తలూ వస్తున్నాయి. బహుశ,  తాలీబాన్ నాయకులు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఇంకా కింది శ్రేణులకు చేరివుండక పోవచ్చు.  లేదా వాళ్ళు పాత అలవాట్లను వదులుకోలేక పోతుండవచ్చు.  త్వరలో మారవచ్చు.

 

ప్రశ్న 5 : ఆఫ్ఘానిస్తాన్ పరిణామాల్ని రాజ‌కీయార్థిక కోణం నుంచి వివ‌రిస్తారా?

జ 5 : గతంలో 1996-2001 మధ్య కాలంలో కూడ ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ల పాలన సాగింది. అప్పట్లో సౌదీ అరేబియా, ఖతర్, పాకిస్తాన్ మాత్రమే  ఆఫ్ఘానిస్తాన్ ను గుర్తించాయి. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ ను గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఇదొక రాజకీయ మద్దతు. చైనా ఇప్పటికే  ఆఫ్ఘానిస్తాన్ లోని చమురు బావుల్ని దక్కించుకుంది. రష్యాకు కూడ ఆఫ్ఘానిస్తాన్ లో ఆర్థిక ఆసక్తులున్నాయి. ఆఫ్ఘాన్ ప్రజల అభిలాష మేరకు రాజకీయార్ధిక సాంస్కృతిక సంస్కరణల్ని  తాలీబాన్లు  చేపట్టాల్సివుంటుంది. అలా జరగకపోతే తాలీబాన్లను కూడ ఆఫ్ఘాన్ ప్రజలు తన్ని తరిమేస్తారు. 

విజయవాడ

30 ఆగస్టు 2021

 //EOM//


https://vasanthamegham.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%95%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%87-%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%ac/?fbclid=IwAR3OhMfkyMbi63sEHVIAqVXkLEWXyh2vzZzj8U2L1ctJ6KEkbnPNFYYtWa8




Thursday, 26 August 2021

Thanks to All

 అందరికీ ధన్యవాదాలు

 

ఇష్ట దైవానికీ

జన్మనిచ్చిన నేలకు

పుట్టించిన తల్లిదండ్రులకు

జ్ఞానబోధచేసిన గురువులకు

దారి చూపిన మార్గదర్శులకు  

కలిసినడిచిన మిత్రులకు

ఉద్యమ సహచరులకూ

రాటుతేల్చిన ప్రత్యర్ధులకు

అవకాశాలిచ్చిన యజమానులకు

ఊతమిచ్చిన శ్రేయోభిలాషులకు

రచనల్ని ఇష్టపడ్డ పాఠకులకూ

అభిమానించిన స్నేహితురాళ్ళకు

తోడుగా నిలిచిన జీవితభాగస్వామికీ

సంతృప్తినిచ్చిన సంతానానికీ

అపార్థం చేసుకున్నవారికీ

అర్థం చేసుకున్నవారికీ

ద్వేషించినవారికీ

ప్రేమించినవారికీ