Saturday, 31 May 2014

Jaiandhra to Samaikyaandhra

జై ఆంధ్రా  జై సమైక్యాంధ్రాగా ఎలా మారిందీ?  
డానీ
"చారిత్రక సంధి సమయంలో ఆంధ్రజాతిని మేల్కొలిపి, కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన అశేష ప్రజానీకానికి వందనాలు" అని మొదలెట్టే గౌతు లచ్చన్న ఉపన్యాసాల్నీ ఆ తరం ఇప్పటికీ మరిచిపోదు. 1972-73  నాటి జై‌ ఆంధ్రా ఉద్యమాన్ని గౌతు లచ్చన్న, కాకాని వెంకట రత్నం, తెన్నేటి విశ్వనాధం, బీవి సుబ్బారెడ్డి  వంటి సీనియర్లు ముందుండి నడిపించగా, యం. వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు వంటి రెండవతరం నాయకులు దానికి జవసత్వాల నిచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లా గలగల పారే సుంకర సత్యనారాయణ ఉపన్యాసాలు వినడానికి జనం తెగ ఆసక్తి కనపరిచేవారు. సుంకర ఉపన్యాసానికి కొనసాగింపే వెంకయ్యనాయుడు ఉపన్యాస శైలి.

తెలంగాణ విద్యార్ధులు 1969లో ముల్కీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని సాగించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్నారు. ఆ తరువాత, బ్రహ్మానంద రెడ్డి దిగిపోయి పివీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం అదే మొదటిసారి. ఉన్నత న్యాయస్థానం 1972లో ముల్కీ నిబంధనల్ని సమర్ధించడంతో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఆందోళనకు దిగారు. మరోవైపు, భూసంస్కరణల చట్టం తేవడానికి  పీవీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల మీద ఆంధ్రా (ఇప్పటి సీమాంధ్ర) ప్రాంతంలో తీవ్ర  నిరసన చెలరేగింది. రెండూ కలిసి, సీమాంధ్ర అంతటా ఉద్యమ జ్వాలలు రగులుకున్నాయి. తమదైన స్వంత రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రుల భావోద్వేగాలు రెండవసారి చెలరేగిన కాలం అది.  అంతకు ముందు 1950వ దశకం ఆరంభంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సాగిన ఉద్యమం ఎలాగూ వుంది.

భావోద్వేగాలను పట్టుకోవడంలో లచ్చనగారిది ప్రత్యేక శైలి. నాయకుడు, ఉపన్యాసకుడు ఏకమైపోయిన అదుదైన సందర్భం అది. జై ఆంధ్ర ఉద్యమానికి అసలు సిసలు సూత్రధారి మాత్రం కాకాని వెంకటరత్నం. ఉద్యమం వుధృతంగా సాగుతున్నప్పుడు, పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. ఆ వార్త విన్న  కాకాని గుండె‌ ఆగి చనిపోయారు. అప్పుడాయన వ్యవసాయ, ఆరోగ్య శాఖల మంత్రిగా వున్నారు. కాకాని అంత్యక్రియలకు ఉయ్యూరు వెళ్లడానికి అప్పటి ముఖ్యమంత్రి పివీ నరసింహారావు సాహసించలేకపోయారు. పరకాల శేషావతారం, పాలడుగు వెంకటరావు తదితరులు పీవీకి తోడుగా సమైక్యవాదులుగా వున్నప్పటికీ, జైఆంధ్రా ఉద్యమానికి మద్దతుగా తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది.  ముఖ్యమంత్రి ఒక మంత్రి అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి వుందంటే ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పదని అప్పటి రాష్ట్రపతి వివి గిరి భావించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రపతి పాలన సాగిన  తొలి సందర్భం అది.

       జైఆంధ్రా ఉద్యమంలో కొంతకాలం చురుగ్గా పనిచేసిన ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి ఈ వ్యాసకర్త కార్యదర్శి. దానికి అధ్యక్షుడు అమ్మనమంచి కృష్ణశాస్త్రి.

ఇక వర్తమానానికి వస్తే, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత సాక్షాత్తు తెలంగాణ భవన్ లోనే కేసిఆర్ అనేక విమర్శల్ని ఎదుర్కొన్నారు. అనేక పరాభవాల్ని చవిచూశారు. దాదాపు ఆరు నెలల అవమాన పర్వం తరువాత ఆయన చేపట్టిన నిరాహారదీక్ష పరిస్థితుల్ని తలకిందులుచేసి, టీఆర్‌ఎస్ ను మళ్ళీ వెలుగులోనికి తెచ్చింది.  యూపియే ప్రభుత్వ హోం  మంత్రి చిదంబరం ఆ ఏడాది డిసెంబరు  రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నామని  ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజన పర్వం మొదలైంది.

                          చిదంబరం ప్రకటనపై రాయలసీమ - తీరాంధ్ర ప్రాంతం నుండి స్పందించిన తొలి రాజకీయ ప్రముఖుడు వసంత నాగేశ్వరరావు. అప్పట్లో ఆబ్కాబ్ ఛైర్మన్‌గావున్న ఆయన ఆ మరునాడు ఉదయమే తన పదవికి రాజీనామా చేసి, మళ్ళీ "జైఆంధ్ర" ఉద్యమాన్ని మొదలెడతానని ప్రకటించారు. ఆ వెంటనే చేగోండి హరిరామ జోగయ్య (హరిబాబు) కూడా "జైఆంధ్ర" అన్నారు.

        జై ఆంధ్ర ఉద్యమంతో వున్నఅనుబంధం రీత్యా వసంత నాగేశ్వరరావు ప్రకటన వెలువడిన సాయంత్రమే మాదాపూర్ లోని ఇంటిలో ఆయన్ని కలిశాను. విభజన ప్రక్రియ విధివిధానాలు ఎలా వుండాలి?  తెలంగాణ ఇచ్చేసిన తరువాత రాయలసీమ, తీరాంధ్ర ప్రజల హక్కులకు రక్షణ ఏమిటీ? అనేవి ఆ రోజు మమ్మల్ని వెంటాడిన ప్రశ్నలు. సీమాంధ్రుల హక్కుల సాధన కోసం విజయవాడ వెళ్ళి మళ్ళీ జైఆంధ్ర ఉద్యమాన్ని మొదలెడదామనుకున్నాము. ఆ రోజు రాత్రే బయలుదేరి విజయవాడ వెళ్ళాము.

                         విజయవాడ చేరుకున్న తరువాత సన్నివేశం మారింది. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేశారని ఢిల్లీ నుండి  వార్త వచ్చింది. ఆయన కూడా "జై ఆంధ్రా" అంటారనే వుద్దేశ్యంతో నేను మొగల్రాజపురంలోని రాజగోపాల్ క్యాంపు ఆఫీసుకు వెళ్ళాను. అప్పటికి ఆయన ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకోలేదు. ఎంపీ క్యాంపు ఆఫీసులో అప్పటి కార్యదర్శి రామచంద్రరావు (నాని) అంతకు మునుపు ఆంధ్రజ్యోతిలో నాకు సహోద్యోగి.  రాజగోపాల్ ది జైఆంధ్రబాటకాదనీసమైక్యాంధ్ర బాట అని నానీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. "వాళ్ళే విడిపోదాం అంటున్నప్పుడు మనమూ విడిపోతాం అనడంవల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? మనం సమైక్యంగా వుంటామన్నప్పుడేకదా మన డిమాండ్లు నెరవేరేవీ" అని రాజగోపాల్ ఆలోచిస్తున్నట్టు నానీ అన్నాడు.

                          తెలంగాణ వుద్యమంలో ప్రస్తుత దశ   కాళోజీ నాయకత్వాన 1997 డిసెంబరులో జరిగిన వరంగల్ ప్రకటన తో మొదలైనప్పటికీ అప్పటి వరకు "సమైక్యాంధ్ర" అనేమాట ఎక్కడా ఎవరినోటా రాలేదు. ఎవరూ వినలేదు. అలాంటి అవగాహన కూడా ఎవరికీ వున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చాక రాయలసీమ, తీరాంధ్ర హక్కుల సాధన, పరిరక్షణల కోసం ఒక ఉద్యమం ఆరంభం కావలసిన చారిత్రక సందర్భంలో, సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తేవడం అంటే సమస్యను పక్కదారిపట్టించడంతప్ప మరేమీకాదు.


                          రాజకీయ సంఘటన కుదరకపోయినా ఆలోచనాపరులైన పాత్రికేయుల సంఘటన అయినా  కుదురుతుందనే అభిప్రాయంతో  విజయవాడ ప్రెస్ క్లబ్ కు వెళ్ళాను. పాతమిత్రులు చావ రవి, అన్నవరపు బ్రహ్మయ్య కలిశారు. నేనూ బ్రహ్మయ్య వెంటనే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, రాయలసీమ -తీరాంధ్ర  హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడాము. ఆ హక్కుల సాధన కోసం ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం ఒకదాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నాము. దానితో కొంచెం అగ్గిరాజుకున్నట్టు కనిపించింది. అదేరోజు రాత్రి ఏబిఏన్- ఆంధ్రజ్యోతి టీవీ న్యూస్ ఛానల్ మా ఇద్దరితో ఓ  ప్రత్యక్ష చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది.

                          ఒక వారం తరువాత మళ్ళీ విజయవాడ వెళ్ళే సమయానికి సన్నివేశం తలకిందులుగా దర్శనమిచ్చింది. కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో తమ ఆర్ధిక ప్రయోజనాలని కాపాడుకోవడానికీ, తమ రాజకీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికీ ఒక ప్రణాళిక ప్రకారం సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో బలంగా భావోద్వేగాలని రెచ్చగొట్టారు.  నకిలీ రాజీనామాలు, నిరాహారదీక్షలు చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని  వీళ్ళు ప్రజల్ని నమ్మజూపారు.  దానితో సీమాంధ్ర హక్కుల సాధన, పరిరక్షణ కర్తవ్యం మరుగున పడిపోయింది. సీమాంధ్రులకు సమైక్యాంధ్రపై అవగాహన లేనప్పుడు తాను నిరాహారదీక్ష చేసి,  అవగాహన కల్పించి నట్టు తరువాతి కాలంలో లగడపాటి రాజగోపాల్ ఘనంగా చెప్పుకున్నారు.   


                          తక్షణం కాకపోయినా సమీప భవిష్యత్తులోనయినా  అంధ్రప్రదేశ్ విభజన తప్పదన్న వాదనను  అంగీకరించడానికి కూడా ఎవరూ సిధ్ధంగాలేరు. ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు కూడా మద్దతు దొరకలేదు. అంతకు ముందు సానుకూలంగా కనిపించిన అన్నవరపు బ్రహ్మయ్య కూడా నాతో కొనసాగలేనని స్పష్టంచేసి సమైక్యాంధ్ర శిబిరంలో చేరిపోయాడు.

                          ఈ పరిణామాలు వసంత నాగేశ్వరరావు, కత్తి పద్మారావు తదితర జైఆంధ్రావాదుల్ని నిరుత్సాహ పరిచాయి. విజయవాడలో సీనియర్ న్యాయవాది కర్ణాటి రామ్మోహనరావు వంటివారు జైఆంధ్ర ఉద్యమానికి ప్రాణం పోయాలని చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. వాళ్ళు ముందుకు తెచ్చిన ఆచరణాత్మక ప్రతిపాదనల్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల ఉపన్యాసాల్ని అడ్డుకున్నారు. సభలపై దాడులు చేశారు. అయినప్పటికీ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దళిత, బహుజన నాయకులు ఉపస్రవంతి రాజకీయాలని ఏదో ఒకస్థాయిలో కొనసాగించారు. వాళ్ల కార్యక్రమాల్ని ప్రధాన స్రవంతి రాజకీయాలు  అణిచివేశాయి. మీడియా అస్సలు పట్టించుకోలేదు.

                          రాయలసీమ-కోస్తాంధ్రాలో తటస్థులు ఇంకో వాదనను మందుకు తెచారు. మొదట్లో, ఒక ఎత్తుగడగారాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయ్యే జనసమీకరణ క్రమంగా రాయలసీమ-తీరాంధ్ర హక్కుల సాధన ఉద్యమంగా మారుతుందనేది వారి వాదన సారాంశం. గతంలోనూ అనేక ఉద్యమాలు ఎవోకొన్ని తక్షణ ప్రేరణలతో మొదలయ్యి, వుధృతం అయ్యేకొద్దీభిన్నరూపం తీసుకున్న సందర్భాలున్నాయి. రాయలసీమ- కోస్తాంధ్రా ఉద్యమంలోనూ అలాంటి మలుపు సంభవించవచ్చని కొందరు భావించారు. .  కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తాత్కాలిక ఎత్తుగడను శాశ్వితఎత్తుగడగా మార్చారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు  రాయలసీమ- కోస్తాంధ్రా పునర్నిర్మాణం అనేది ఎజెండా లోనికి రాకుండా చేశారు. సచివాలయంలో అధికారులందరూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన ప్రక్రియకు అవసరమైన కసరత్తులు చేస్తున్న సమయంలోనే శాసనసభలో ముఖ్యమంత్రి విభజన బిల్లును తిరస్కరించడం ఒక విచిత్రం.  విభజన చట్టాన్ని సుప్రీంకోర్టులో  అడ్డుకుని రాష్ట్రాన్ని మళ్ళీ సమైక్యంగా వుంచుతామని శపథాలు చేయడం దీనికి పరాకాష్ట.

       విభజన అనివార్యం అనుకున్నప్పుడు దానికి ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారో సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ లు బిల్లు పెట్టడానికన్నా ముందే సీమాంధ్రులకు వివరించి, ఒప్పించి ఉండాల్సింది. వాళ్ళు ఆ పని చేయలేదు. నాలుగేళ్లపాటు సీమాంధ్రలో కాలు పెట్టే సాహసం కూడా వాళ్ళు చేయలేకపోయారు.

దాదాపు పదేళ్ళు నాన్చి నాన్చి రోజుకో తప్పుడు సంకేతాలనిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం  చివరి క్షణంలో ఆంధ్రప్రదేశ్ ను  అడ్డగోలుగా విభజించిన తీరు మాత్రం సీమాంధ్రులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. కాంగ్రెస్ తోపాటూ, విభజన విషయంలో చివరి వరకూ తమను తప్పుదోవపట్టించిన జై సమైక్యాంధ్ర పార్టీని సహితం మట్టి కరిపించి  సీమాంధ్రులు తమ  రాజకీయ విజ్ఞతకు చాటుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలకూ ఒక్కటంటే ఒక్కస్థానం కూడా ఇవ్వలేదంటే వాటి మీద సీమాంధ్రుల ఆగ్రహం ఏస్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
హైదరాబాద్
22 మే  2014

ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 1 జూన్ 2014


(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలోని కొన్ని భాగాల్ని మాత్రమే ప్రచురించారు. అది కుడా సీమాంధ్ర ఎడిషన్లో మాత్రమే)

Brand Andhra

బ్రాండ్ ఆంధ్రా

ఉషా యస్ డానీ 

వరాలన్నీ వరాలూకానట్టే శాపాలన్నీ శాపాలుకావు. కొన్నిశాపాలు వరాలుగా మారుతాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు రాష్ట్ర విభజనను ఇప్పుడు వరంగా మార్చుకునే దిశలో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఇటీవలి జమిలి ఎన్నికలు గతాన్ని మరిచిపోయి రాష్ట్ర పునర్ నిర్మాణనికి అద్దం పట్టాయి. సీమాంధ్రులు ఇంత త్వరగా కోలుకుని నూతన ఉత్సాహంతో నడుం బిగిస్తారని చాలా మంది అనుకునివుండరు. వాళ్లను ఓదార్చాలనుకున్నవాళ్లనే ఓదార్చేంతగా వాళ్ల మనోధైర్యం ఎదిగిపోయింది. 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల నాయకత్వంలోని యూపియే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్  పునర్  వ్యవస్థీకరణకు సిధ్ధమైనపుడు రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ సునామీ చెలరేగింది. ఆ ప్రాంత ప్రజల్ని కలచివేసిన ఒకే ఒక ప్రశ్న హైదరాబాద్ లేని జీవితం సాధ్యమా అనేదే! తెలంగాణ గ్రామీణ ప్రాంతాలేకాదు, సీమాంధ్రలోని పట్టణాలు సహితం దాదాపు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ మీద అంతగా ఆధారపడిపోయాయి. చదువు పూర్తి అయినా, మధ్యలో ఆగిపోయినా, కరువో, వరదలో వచ్చి ఉపాధి కోల్పోయినా రాజధానికి ప్రయాణమయ్యే ’హైదరాబాద్ బస్సు ఎకానమి”  సీమాంధ్ర అంతటా కొనసాగింది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదాన్ని పొందాక ఆ దశ ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే  రైళ్ళు బస్సుల్లోకన్నా, విజయవాడ నుండి హైదరాబాద్ వచ్ఛే రైళ్ళు బస్సుల్లో టిక్కెట్లు సులువుగా దొరుకుతున్నాయి. తిరుగు - వలసలు మొదలయ్యాయి అనడానికి ఇదొక సంకేతం. 

బ్రాండ్ హైదరాబాద్ ను నమ్ముకుని సాగుతున్న రోజుల్లో చాలా మంది గమనించ లేదుగానీ హైదరాబాద్ లా అభివృధ్ధి చెందగల మౌలిక  లక్షణాలు, సదుపాయాలున్న పట్టణాలు, నగరాలు సీమాంధ్రలో కోకొల్లలుగా వున్నాయి.  చరిత్ర పుటల్లో  రెండు, మూడు శతాబ్దాలు వెనక్కిపోతే రాజధాని నగరాలుగా ఒక వెలుగు వెలిగిన  పట్టణాలేకాదు గ్రామాలు సహితం అనేకం కనిపిస్తాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీనులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, వెలనాటి చోళులు, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు మొదలుకుని బహమనీలు, కుతుబ్ షాహీలు, పాలెగాళ్ళు, నిజాం పాలకులు, జమీందారులు, చివరకు మదరాసు ప్రెసిడెన్సీ వరకు అనేక చారిత్రక దశల్లో విలసిల్లిన నాటి రాజధాని నగరాలు సీమాంధ్రలో అడుగడుగున కనిపిస్తాయి.  విజయనగరం, బొబ్బిలి, రాజమండ్రి మాత్రమేకాదు జాబితా తయారు చేయడం మొదలెడితే జిల్లాకు పది గ్రామాలైనా అలాంటివి కనిపిస్తాయి. 

అల్లోపతి వైద్యం ఇంగ్లీషు వైద్యంగామారి ఆయుర్వేద, యూనానీ,  హోమియోపతి వైద్యాలను మింగేసినట్టు, హైదరాబాద్ అభివృధ్ధి సీమాంధ్ర పట్టణాలు, నగరాల అభివృధ్ధిని మింగేసింది. తెలంగాణ పోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నగరాన్ని అన్వేషించడానికి వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సీమాంధ్రలోని ప్రతి నగరానికీ రాజధాని అయ్యే యోగ్యత వుందని అనడంలో అతిశయోక్తి ఏమాత్రంలేదు. 

శివరామకృష్ణన్ కమిటీ నిర్ణిత కాలపరిమితి ప్రకారం  ఆగస్టు లోపు  కేంద్ర ప్రభుత్వానికి తన సూచనల్ని అందచేస్తుంది. ఈలోపులో రాజధాని నగరం గురించిన చర్చలు, ఊహాగానాలు సాగుతూనే వుంటాయి. రాజధాని నగరాన్ని తమ దగ్గరే నిర్మించాలని సీమాంధ్రలోని జిల్లాలన్నీ సహజంగానే కోరుతాయి.  ప్రతి జిల్లాకూ, ప్రతి నగరానికీ,  పట్టణానికీ, ఆ మాటకొస్తే ప్రతి గ్రామానికీ ఏవో కొన్ని ప్రత్యేక వసతులుంటాయి. కొన్నింటికి చారిత్రక నేపథ్యం కూడా వుంటుంది. 

          సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైనపక్షంలో డీ-గ్రేడేడ్ అటవీ ప్రాంతాన్ని సహితం డీ-నోటిఫై చేస్తామని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు కనుక ఇప్పుడు కొందరు అటవీ ప్రాంతాల్లో సహితం రాజధాని నగరాన్ని అన్వేషిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తే కాలక్రమంలో ఆ ప్రాంతం అభివృధ్ది చెందుతుందనే వాదన ఇలాంటి ప్రయత్నాలకు ఒక సమర్ధనగా వుంది.  అయితే ఆధునిక రాజధాని నగర నిర్మాణం అనేది ఒకటి రెండు ఆంశాల మీదగాక అనేకానేక అంశాల మీద ఆధారపడి నిర్ణయించాల్సిన విషయం. 

ఉత్తరాన ఇచ్చాపురం నుండి దక్షణాన తడ మధ్య రోడ్డు, రైలుమార్గాల పొడవు  దాదాపు  970 కిలో మీటర్లు.  అనంతపురం / చిత్తూరు నగరాల నుండి ఇచ్చాపురం దాదాపు 1070 కిలో మీటర్లు. లెఖ్ఖగట్టి మ్యాప్ మీద మధ్య బిందువును గుర్తిస్తే  అది ఏలూరు, తాడేపల్లిగూడేం మధ్యన వుంటుంది. అయితే, రాజధాని నగరానికి రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యం, జలవనరులు పుష్కలంగా వుండాలిగానీ, స్కేలుపెట్టి కొలిచినట్టు  అది రాష్ట్రానికి సరిగ్గా మధ్యన వుండాలనే నియమం ఏమీలేదని శివరామకృష్ణన్ కమిటీ ముందుగానే చెప్పింది. 

          హైదరాబాద్ ను చూసిన కళ్లతో సీమాంధ్ర కొత్త రాజధాని నగరాన్ని ఊహించాల్సిన పనిలేదు. అలాంటి ఊహ మరికొన్ని తప్పులకు దారితీస్తుంది.  హైదరాబాద్ లో రాజధాని నగరమేగాక అనేక ఇతర అంశాలూ వున్నాయి. వాటన్నింటినీ విడివిడిగా చూడాల్సిన అవసరం వుంది. లేకపోతే అన్ని అంశాలనూ ఒకేచోట కేంద్రీకరించేసి హైదరాబాద్ లో చేసిన తప్పునే మళ్ళీ సీమాంధ్రలో చేసే ప్రమాదముంది. 

          వ్యాపార, వాణిజ్యకేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, వినోద పరిశ్రమ,  పరిపాలనా కేంద్రం ఒక్కచోటే వుండాల్సిన పనిలేదు. భారతదేశానికి ఢిల్లీ పరిపాలన కేంద్రం అయితే ముంబాయి వాణిజ్య కేంద్రం. మొన్నటి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గుజరాత్ లో సహితం పరిపాలనా కేంద్రం గాంధీనగర్ అయితే వాణిజ్యకేంద్రం అహ్మదాబాద్. 

          సీమాంధ్రలోను ఇలాంటి విభజనను మనం చూడవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పరిపాలనా కేంద్రంకాగా రాజమండ్రి వాణిజ్యకేంద్రం. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పరిపాలనా కేంద్రంకాగా, విజయవాడ వాణిజ్యకేంద్రం.  రాయలసీమలో చిత్తూరు, తిరుపతి కూడా ఇలాంటివే. ఇలా వికేంద్రీకరణ దిశగా కొత్త ఆలోచనలు సాగాలి. ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి  1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడూ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, విశ్వవిద్యాలయాల్ని మూడు ప్రాంతాలకు చెందిన  కర్నూలు, గుంటూరు, విజయవాడ/ విశాఖపట్నంలకు పంచారు. అదే ఫార్మూలాను యధాతథంగా కాకున్నా అవసరమైన మార్పులతో ఇప్పుడూ అనుసరిస్తే మంచి ఫలితాలుంటాయి. 

              మిగిలిన అలంకారాలను పక్కనపెట్టి ఆలోచిస్తే అసలు రాజధాని నగరం అంటే ఏమిటీ?. సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలు, మంత్రులు, శాసనసభ్యులు, సచివాలయ అధికారులు, సిబ్బంది కోసం ఇళ్ల సముదాయం ఇవన్నీ ఒక సమూహం. ఇవి కూడా ఒకే చోటా వుండాల్సిన పనిలేదు.  రెండు చోట్ల వుండవచ్చు. మహారాష్ట్రలో ముంబాయి, నాగ్ పూర్ లలో  అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. జమ్మూ- కాశ్మీర్  వేసవి రాజధాని శ్రీనగర్ కాగా, శీతాకాలం రాజధాని జమ్ము. మనకు పొరుగునున్న కర్ణాటక విధాన్ సౌధ బెంగళూరులో వున్నట్టు అందరికీ తెలుసు. కానీ, ఆ రాష్ట్ర శాసనసభా శీతాకాల సమావేశాలు బెల్గాంలో జరుగుతాయని చాలా మందికి తెలీదు. 

                   సాధారణంగా సచివాలయం వున్న నగరంలోనే పోలీసు కేంద్ర కార్యాలయం వుండాల్సి రావచ్చుగానీ,  హైకోర్టు కూడా అదే నగరంలో వుండాల్సిన పనిలేదు.  ఆ తరువాత కావలసింది రాజకీయ పార్టీల రాష్ట్ర కార్యాలయ భవనాలు. అధికారిక సమావేశాలు జరపడానికి ఓ నాలుగు భారీ కన్వెన్షన్ సెంటర్లు,  ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సభలు, నిరసన ప్రదర్శనలు జరపుకోడానికి ఓ నాలుగు అలకమైదానాలు. రాజధాని నగరానికి వచ్చేవారి విడిది కోసం కొన్ని ప్రభుత్వ  అతిధి గృహాలు, హోటళ్ళు. నిజానికి వివిధ ప్రభుత్వశాఖల కేంద్ర కార్యాలయాలు కూడా ఒకే నగరంలో వుండాల్సిన పనిలేదు. 

                కొత్త రాజధాని నగర నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందన్న అంశం మీద ఎవరి అంచనాలు వారికున్నాయి. ఈ వ్యాసకర్త ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ  ప్రతినిధిని కలిసినపుడు  చాలా ఆశ్ఛర్యకర విషయం చెప్పాడతను. రాజధాని నిర్మాణానికి పెట్టుబడి దేనికీ? అని ప్రశ్నించాడాయన. మన స్థలంలో బిల్డర్ అపార్ట్ మెంటు కట్టి మనకు ఫ్లాట్లు ఇస్తున్నట్టే  తగిన స్థలం అప్పచెప్పి, డిజైన్ ఇచ్చేస్తే ఆ నిష్పత్తి ప్రకారం రాజధాని నగరాన్ని ఊరికే కట్టివ్వడానికి అనేక నిర్మాణ సంస్థలు సిధ్ధంగా వుంటాయి అన్నాడతను. ఇదేమీ కొట్టిపడేయదగ్గ  ఆలోచన కాదనిపించింది. “నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి” (బీవోటి) పధ్ధతిలో కూడా రాజధాని నగరాన్ని  నిర్మించవచ్చు.  ఆ అంశాన్ని అలా వుంచినా,  సీమాంధ్ర కొత్త రాజధానికి కావలసిన శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని పునర్ వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు కనుక రాజధాని ఎక్కడో తేల్చడమే ఇప్పుడు కీలకం.

               పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీమాంధ్రలో చర్చ మొత్తం ఇప్పటికీ  రాజధాని చుట్టే సాగుతున్నప్పటికీ సీమాంధ్ర పునర్ నిర్మాణాన్ని ఆరంభించడం అంతకన్నా ప్రాణప్రదమైన  అంశం. 

          సుదీర్ఘ సముద్రతీరం భౌగోళికంగా సీమాంధ్రకు గొప్పవరం. దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం సీమాంధ్రకు వుంది. ఇది తెలంగాణకన్నా సీమాంధ్రను విభిన్నంగా నిలబెట్టే అంశం. విశాపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం  ఓడరేవుల గురించి అందరికీ తెలుసు. శతాబ్దాల క్రితమే ప్రపంచాన్నిఆకర్షించి తరువాత నిర్లక్ష్యానికి గురైన ఓడరేవులు సీమాంధ్ర తీరం వెంట అనేకం వున్నాయి. వాడరేవు- నిజాంపట్నం అభివృధ్ధి (వాన్ పిక్ ) ప్రాజెక్టు మొదలై ఆగిపోయింది. అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో దూగరాజపట్నం వద్ద భారీ ఓడరేవు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

          మన మనోఫలకాల నుండి చెరిగిపోతున్న మరో రేవు పట్టణం నరసాపురం. 18వ శతాబ్దానికి ముందే యూరప్ మార్కెట్లకు నూలు దుస్తులు ఎగుమతి చేసిన ఘనత  నరసాపురం (రివర్ పోర్ట్)  నదీ- ఓడ రేవుది.  అప్పట్లో, నరసాపురం రేవును మాధవాయిపాలెం అనేవారు. మాధవాయిపాలెం నుండి వచ్చే నూలు వస్త్రాల్ని యూరప్ మార్కెట్లలో “మాధోపల్లెమ్స్” అనేవారు.  వీటి తాకిడికి మాంచెస్టర్, ల్యాంక్ షైర్ జౌళి మిల్లులు విలవిల్లాడేవట.   చివరకు, జౌళీ పరిశ్రమాధిపతుల వత్తిడి మేరకు ఇంగ్లండ్ లో మాధోపల్లెమ్స్  దిగుమతుల్ని బ్రిటీష్ పార్లమేంటు నిషేధించాల్సి వచ్చింది. జర్మనీకి చెందిన సమాజశాస్త్రం ప్రొఫెసర్ మారియా మేస్ 1982 లో రాసిన ’లేస్ మేకర్స్ ఆఫ్ నర్సాపూర్ : ఇండియన్ హౌస్ వైవ్స్ ప్రొడ్యూస్ ఫర్ ద వరల్డ్ మార్కెట్’ పుస్తకంలో ఇలాంటి వివరాలు మరికొన్ని వున్నాయి. గతించిన నాటి పోటీతత్వానికి కొత్త ఉత్తేజాన్ని నింపగలిగితే సీమాంధ్ర జాతీయా మార్కెట్ నేకాదు, అంతర్జాతీయ మార్కెట్ ను సహితం ఆకర్షించగలదు. బ్రాండ్ ఆంధ్రా నిర్మాణం కష్టసాధ్యం అయితే కావచ్చుగానీ ఆసాధ్యం మాత్రం కాదు. 

          సీమాంధ్ర అందులో ముఖ్యంగా తీరాంధ్ర అనగానే గుర్తు కొచ్చేది కృష్ణా, గోదావరి నదులు. నిజానికి ఈ రెండు నదులు నాలుగు రాష్ట్రాల మీదుగా వచ్చినప్పటికీ ఈ రెండు నదుల పేర్లతో నాలుగు జిల్లాలున్న ప్రాంతం తీరాంధ్ర ఒక్కటే. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలేకాదు, ఇప్పటి గుంటూరుజిల్లా కూడా మునుపు కృష్ణా మండలంలో వుండేది, నదులతో తీరాంధ్రకు వున్న అనుబంధం అలాంటిది. కృష్ణా, గోదావరి మండలాల్ని ఇప్పటికీ దక్షణ భారతదేశపు ధాన్యాగారం అంటారు. దక్షణ భారత దేశంలో కాలువల వ్యవసాయం ముందుగా కృష్ణా- గోదావరి డెల్టాలోనే పుట్టి  తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో, కృష్ణా-గోదావరి డెల్టా వాసుల్ని కాలవల సంతతి అన్నా అతిశయోక్తికాదు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటూ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా ఈ ప్రాంతంలో పుష్కలంగా అవకాశాలున్నాయి. తీరాంధ్రతో పోలిస్తే రాయసీమలో నీటివనరులు తక్కువే అయినప్పటికీ చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సహితం వ్యవసాయాధార పరిశ్రమలు నెలకొల్పడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. 

          దాదాపు రెండు శతాబ్దాలు నేరుగా బ్రిటీష్ పాలన కింద వున్న ప్రాంతమిది. సవాళ్లను ఎదుర్కొని, ముందుకు సాగగల సంసిధ్ధతలో  సీమాంధ్రకు రెండు వందల సంవత్సరాల చరిత్రవుంది. 

          రాయలసీమ ఖనిజాలకు తరగని గని.  వైయస్సార్ కడప జిల్లాలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వున్న అవకాశాలను ఆరు నెలలలోగా  సెయిల్ పరిశీలించనుంది. మరోవైపు, తీరాంధ్రలో గ్రీన్ ఫీల్డ్ నూనెశుధ్ధి కర్మాగారం  నిర్మాణానికి వున్న అవకాశాలను కూడా ఆరు నెలలలోగా ఐవోసీ, గానీ హెచ్ పిసీఎల్ గానీ పరిశీలించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవతో  ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక కారిడార్ తరహాలో, విశాఖపట్నం - చెన్నయ్   పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కాబోతున్నది. 

          రాయలసీమ. తీరాంధ్ర సరిహద్దుల్లోని నల్లమల అడవులు, ఉత్తర సర్కారు జిల్లాల పశ్చిమ ప్రాంతంలోని దండకారణ్యం అటవీ సంపదకేకాక, బాక్సైటు తదితర ఖనిజాలకూ నిలయంగా వున్నాయి. అయితే, ఏ ప్రాంతంలో అయినా వనరులుంటే చాలదు వాటిని వినియోగంలోనికి తేవడానికి మౌళిక సదుపాయాలుండాలి. వాటిల్లో కీలకమైనవి రవాణా సౌకర్యాలు. 

            విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రస్తుతమున్న విమానాశ్రాయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృధ్ధ్ది చేయడానికికున్న అవకాశాలను  పరిశీలించడమేగాక వాటి  నిర్మాణానికి చొరవ తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం  హామీ ఇచ్చింది. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వేజోన్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా భారత రైల్వేశాఖ పరిశీలిస్తున్నది. విశాఖపట్నంతోపాటూ విజయవాడ – గుంటురు – తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీ లలో మెట్రో రైలు నిర్మాణం  చేపట్టడానికికున్న అవకాశాలను పరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి చొరవ తీసుకుంటానని కూడా ఢిల్లీ చెప్పింది. దీనికి ముక్తాయింపు ఏమంటే, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నుండి వేలువిడుస్తున్న రాజధాని  హైదరాబాద్ కు విస్తృత రోడ్డు రవాణ సౌకర్యం కల్పించడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

           కొత్త రాష్ట్రాన్ని వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య నిధుల కొరత. 40 శాతం జనాభావున్న తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ వాటా 60 శాతం  వుండగా, 60 శాతం  జనాభావున్న  సీమాంధ్ర  ప్రాంతంలో  రెవెన్యూ  వాటా 40 శాతం మాత్రమే వుంది. ఈ భారీ  కొరతను  తీర్చడానికి  సీమాంధ్రలో  ఏర్పడే  ప్రభుత్వం  తొలి రోజు  నుండే నిధుల  కోసం కేంద్ర  ప్రభుత్వంపై  ఆధారపడితీరాలి. 

అయితే, రెవెన్యూ లోటును తీర్చడానికి అంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో కొన్ని హామీలున్నాయి.  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు  పదమూడవ  ఆర్థిక సంఘం  కేటాయించిన  నిధుల్ని  ఇప్పుడు ఏర్పడిన రెండు  రాష్ట్రాలకు  జనాభా  ప్రాతిపదిక,  ఇతర సూచికల ఆధారంగా పంపకాలు చేస్తానని  కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులోవున్న ఆదాయ వనరుల్ని పరిగణనలోనికి తీసుకుని వాటికి విడివిడిగా నిధుల్ని కేటాయించాలని  పదమూడవ ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి ఆదేశిస్తారని కూడా బిల్లులో పేర్కొన్నారు. అంతేగాక, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలి ఏడాది, - మరీ ముఖ్యంగా అప్పాయింటెడ్ డే నుండి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలోగా-,  తలెత్తే రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు  2014-15  జాతీయ బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హామీ ఇచ్చారు. 

సీమాంధ్రకు హైదరాబాద్ తో వున్న మరో ప్రగాఢ  అనుబంధం విద్యారంగానికి సంబంధించింది.  రాష్ట్రంలోని  విద్యాసంస్థలన్నింటిలోనూ  ప్రవేశం కోసం  ప్రస్తుతం అమల్లోవున్న కోటా విధానమే మరో పదేళ్ల పాటు  కొనసాగుతుందని   పునర్ వ్యవస్థీకరణ బిల్లు స్పష్టంగా పేర్కొంది. ఆమేరకు ఉన్నత చదువులు ఆశించే సీమాంధ్ర విద్యార్ధులకు గట్టి హామీ వుందనే భావించాలి. పదేళ్ల గడువు పూర్తికాకముందే జాతీయ స్థాయి విద్యాసంస్థలు పదింటిని సీమాంధ్రలో  నెలకొల్పుతారు.  ఐఐటి,  ఎన్ ఐటి,  ఐఐయం,  ఐఐయస్ ఇఆర్,  ఐఐఐటి  లతోపాటూ   కేంద్ర విశ్వవిద్యాలయం,  పెట్రోలియం  విశ్వవిద్యాలయం,  వ్యవసాయ విశ్వవిద్యాలయం, గిరిజన  విశ్వవిద్యాలయం  ఇందులో వున్నాయి. ప్రకృతి  విలయాల  నివారణ నిర్వహణ  సంస్థను  నెలకొల్పడమేగాక, ఏఐఐఎమ్ ఎస్ (ఏయిమ్స్)   తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  మరియూ  బోధనా సంస్థను  నిర్మిస్తారు. 

             ఇంత పెద్ద ఎత్తున మౌలిక రంగాన్ని విస్తరిస్తున్నపుడు పెద్దఎత్తున  పెట్టుబడుల్ని ఆకర్షించడం ఒక ప్రధాన కర్తవ్యం. కొత్తగా  ఏర్పడే  సీమాంధ్రలో   పారిశ్రామీకరణ,  ఆర్ధికాభివృధ్ధి  వేగవంతంగా సాగేలా  ప్రోత్సహించం కోసం పన్ను రాయితీలతోసహా అనేక ఆర్ధిక చర్యలు, ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృధ్ధి ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం అందించాల్సి వుంది.  

                  రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, ఉత్తర తీరాంధ్ర ప్రాంతానికి చెందిన మూడు జిల్లాలతో పాటూ, మొత్తం పదమూడు  జిల్లాలతో ఏర్పడే భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందించడానికి వీలుగా ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. ఈ హోదా ఐదేళ్లపాటు అమల్లో వుంటుంది. దానివల్ల భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక స్థితి పటిష్టంగా మారడానికి అవకాశం వుంటుంది. రాయలసీమ, ఉత్తర తీరాంధ్రలని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి  ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని అందించే అంశాన్ని  కూడా పునర్ వ్యవస్థీకరణ బిల్లులోనే పేర్కొన్నారు. ఒడీశా లోని కోరాపుట్ – బాలంగీర్ – కలహండి (కే-బీ-కే), మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతాలకు ప్రస్తుతం అందిస్తున్న ప్రోత్సాహకాల  తరహాలో ఈ  ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వుంటుంది. ఈప్రాంతాల్లో టాక్స్  హాలిడేను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

                     అయితే ఇందులో అనేక తిరకాసులున్నాయి. హామీలిచ్చిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ప్రధానిగాలేరు. ఆయన ప్రాతిధ్యం వహించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవడమేకాదు ప్రధాన ప్రతిపక్షంగానూ లేదు. అసలు, ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలకు చట్టబధ్ధత వుందా? లేదా?  అనేది అంతకన్నా కీలక అంశం. ఒకవేళ చట్టబధ్ధతవున్నా యూపియే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎన్డీయే ప్రభుత్వం  ఏమేరకు చిత్తశుధ్ధితో నెరవేరుస్తుందనేది ఇంకా తేలాల్సిన అంశాలు. ఇలాంటివి చట్టాల పరిధిలోకన్నా కొత్త ప్రధాని నరేంద్ర మోదీ, కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య కొనసాగే సత్సంబంధాల మీద ఆధారపడి పరిష్కారం అవుతాయి. 

                      కొత్త యుగంలోనికి ప్రవేశిస్తున్న తరుణంలో మనం అభివృధ్ధి, పెరుగుదలలకు సంబంధించిన అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాల్సి వుంది. లేనిపక్షంలో సీమాంధ్ర సామాన్య ప్రజలకు మరోమారు తీవ్ర అన్యాయం జరగబోతున్నదని గ్రహించాలి.  అభివృధ్ధిని మనం సాధారణంగా  సాలీన స్థూల జాతీయోత్పత్తి (జీడిపి) పెరుగుదల శాతంతో కొలుస్తుంటాం. మనుషుల జీవన  నాణ్యతా ప్రమాణాలు జీడీపి కొలమానంలో  ప్రతిఫలించవని మహబూబ్ ఉల్ హక్ వంటి విఖ్యాత ఆర్ధికవేత్తలు గతంలో ఐక్యరాజ్యసమితికి అందచేసిన మానవాభివృధ్ది నివేదికల్లో హెచ్చరించివున్నారు. 

వస్తు వుత్పత్తిలో పెరుగుదల అనేది అభివృధ్ధిలో ఒక పార్శ్వం మాత్రమే. పంపిణీ అనేది అంతకన్నా ప్రాణప్రదమైన పార్శ్వం. ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం ఎంత సంపాదించిందనేదానికన్నా ఆ సంపాదన ఎక్కడికి చేరుతోంది? ఎవరికి చేరుతోంది? అనేది అంతకన్నా మహత్తర ప్రశ్న. మనుషుల శక్తిసామర్ధ్యాల (Capabilities) వికాసం మన లక్ష్యంకావాలి.  వాటిని సాధించడం కోసం మనం పెరుగుదల అధారిత నిర్మీతిని (growth – Based Paradigm)  నిరాకరించి మానవాభివృధ్ధి నిర్మితిని (Human Development Paradigm) పరిగణనలోనికి తీసుకోవాలి.  

అమర్త్యాసేన్, మార్థా నస్ బామ్ వంటి ఆర్ధికవేత్తలు మానవ శక్తిసామర్ధ్యాల వికాసానికి సంబంధించి కొన్ని జాబితాలు తయారు చేశారు. అందరికీ సమానంగా విద్యా, వైద్య ఆరోగ్య సేవల అందుబాటు, స్త్రీపురుష, ధనికపేద వివక్ష నిర్మూలన, స్వేఛ్ఛాయుత మీడియా, బహిరంగ చర్చలు చేసే స్తోమత వంటి ప్రమాణాల్ని  అమర్త్యాసేన్ ప్రతిపాదించగా, మార్థా నస్ బామ్ తనవైన రీతిలో పది అంశాలను ప్రతిపాదించారు. ఆ ఇద్దరిలో సామాన్యాశం ఏమంటే జీడిపికన్నా మానవాభివృధ్ధి సూచికను ప్రమాణంగా తీసుకోవాలనేదే. 

                సీమాంధ్రకు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండీ భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. వస్తాయి. అవి ఇక్కడ లాభాల పంటలు పండించుకుంటాయి, ఆ లాభాలు తమ మాతృరాష్ట్రాలకో, మాతృదేశాలకో తరలి వెళ్ళిపోతే సీమాంధ్రుల జీవనప్రమాణాలు అభివృధ్ధి చెందకపోగా మరింతగా దిగజారిపోతాయి. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన చారిత్రక బాధ్యత సీమాంధ్ర ఆలోచనాపరులు అందరి మీదా వుంది.  బ్రాండ్ ఆంధ్రా విభిన్నంగా వుండాలి. మానవీయంగా తన ప్రత్యేకతను చాటుకోవాలి. 

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు) 

మొబైల్ : 9010757776 

హైదరాబాద్

22 మే  2014

ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 1 జూన్ 2014 

http://epaper.andhrajyothy.com/index.aspx?eid=31855#

Tuesday, 27 May 2014

Teluguganga Controversy and Sribhag Agreement


తెలుగుగంగ ముక్కోణ వివాదంలో శ్రీభాగ్
ఉషా యస్ డానీ

కుక్కలు, రాబందులూ తినేయగా మిగిలిన శవాల్ని వరుసగా పేర్చుకుంటూపోతే ఆ బారు కర్నూలు నుండి కడప  వరకు వుంటుంది. జనాభాలో సగం మంది చనిపోయారు

1837 నాటి నందన కరువును సమీక్షిస్తూ బ్రిటీష్ అధికారులు మదరాసు గెజిట్ లో రాసిన వాక్యాలివి. ఆ కర్నూలు, కడప పట్టణాలని కలుపుతూనే సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో కేసీ కెనాల్ వచ్చింది.

రాయలసీమకు 360 శతకోటి ఘనపు అడుగుల (టీయంసీ) నీరు అందించాలని కృష్ణా, తుంగభద్రలపై సర్ మెకంజి (Archibald Thomas Mackenzie) ఒక ప్రాజెక్టును రూపొందించాడు. మొదటి ప్రపంచ యుధ్ధం రావడంతో మెకంజీ ప్రాజెక్టు పురిట్లోనే కన్ను మూసింది. మరోవైపు, కేసి కెనాల్ ను అప్పట్లో సేద్యపునీటి కోసంకాక, సైనిక రవాణా కోసమే ఉద్దేశించారు.

కేసి కెనాల్ యుధ్ధావసరాలు తీర్చడానికే పరిమితం అయిపోతే, యుధ్ధం మెకంజీ ప్రాజెక్టును నిర్మాణ రూపం దాల్చకుండా నిరోధించి రాయలసీమను ఒక యుగం వెనక్కి నెట్టింది.

కృష్ణా- గోదావరి మందలాలు వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని సాధించేయి. గుడివాడ, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలు ధాన్యం ఎగుమతి కేంద్రాలుగా మారి జాతీయ వాణిజ్యరంగంలో అంతర్భాగం కాగలిగేయి. ఈ నేపథ్యంలోనే తెలుగునాట  ఆధునిక అర్ధంలో జాతీయ భావాలు మొలకెత్తడం ప్రారంభమయ్యాయి.

1913లో పుట్టిన ఆంధ్రమహాసభ రెండేళ్ళలోనే విశాఖసభలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం  కావాలని తీర్మానించింది. 1926లో వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీని విశాఖలో నిర్మించడం రాయలసీమ వాసులకు ఉత్తరాంధ్రుల మీద అనుమానాలకు దారితీసి, ఆంధ్రమహాసభలతో రాయలసీమ గొంతు కలపకుండా చేసింది.

దక్షణ జిల్లాల (తమిళనాడు) వారి ఆధిపత్యము వలన నిన్నటి దినముల వరకూ అనుభవించిన భాధను మనము మరువలేము. ఇక నిప్పుడు ఉత్తరాదివారి ప్రాబల్యమును రుచి చూచుచున్నాము అని కడప కోటిరెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఒక బహిరంగ సభ అభిప్రాయపడింది. సాధనపత్రిక సంపాదకులు పప్పూరి రామాచార్యులు చెన్న రాజధాని నుండి ఆంధ్ర రాష్ట్రము విడివడుట లాభకరమైనచో ఆంధ్రరాష్ట్రము నుండి రాయలసీమ విడిపోవుట మరింత లాభముకదా? అని తీర్మానించారు. 

రాయలసీమ నాయకులను జాతీయ స్రవంతి లోనికి తీసుకురావడానికి కోస్తా ఆంధ్రా నాయకులు 1937 అక్టోబరు నెలలో రాయలసీమ నాయకులను విజయవాడ నగర వీధుల్లో ఏనుగు అంబారీలపై ఊరేగించారు. ఈ క్రమానికి కొనసాగింపే అదే సంవత్సరం డిసెంబరు నెలలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మదరాసు నివాస భవనం శ్రీభాగ్లో కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందం. కడప కోటి రెడ్డిగారు అధ్యక్షత వహించిన ఈ సమావేశ ఒప్పంద పత్రాలపై ఇరు ప్రాంతాల నుండి పప్పూరి రామాచార్యులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటివారు ఎనిమిదిమంది సంతకాలు చేశారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను కోస్తా జిల్లాల స్థాయికి అభివృధ్ధి చేయాలనేదే ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశ్యం.

“ .... ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల నీటిని వాడుకునే విషయంలో ఈ ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడయినా నదీజలాల పంపకపు సమస్య ఎదురయితే ముందుగా ఈ ప్రాంతపు అవసరాలు తీర్చబడాలి అని ఆ రెండు పేజీల ఒప్పందం తీర్మానించింది.

జాతీయ రాజకీయాల్లో ఆనంద్ సాహెబ్ తీర్మానం దుమారాన్ని రేపుతున్నట్లే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీభాగ్ ఒడంబడిక వీలున్నప్పుడెల్లా  ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది. 

ఉమ్మడి మదరాసు రాష్ట్రం 200 శత కోటి ఘనపు అడుగుల నీటితో కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టునిర్మించడానికి 1937లో కేంద్ర ప్లానింగ్ కమీషన్ నుండి అనుమతి సంపాదించింది. ఆ ప్రాజెక్టులో రాయలసీమకూ, తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతానికీ చెరో వంద టీయంసీల నీటిని కేటాయించారు.

ఆంధ్ర జలాలతో ఆంధ్ర ప్రాంతపు అవసరాల్ని తీర్చకుండానే మదరాసు రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడం మీద అభ్యంతరాలొచ్చాయి. దానితో, రాయలసీమ ప్రజలు కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టునీళ్లకు నీళ్ళొదులుకుని ఆంధ్రా నాయకులతో గొంతు కలిపారు.
ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత నాగార్జునసాగర్ డామ్ కు శంకుస్థాపన చేస్తూ నెహ్రు దాన్ని ఆధునిక దేవాలయంఅన్నారు. ఆ దేవాలయం నుండి తులసీ తీర్ధం అంతటి నీళ్ళు కూడా రాయలసీమకు పారలేకపోయింది. 

ఆ తరువాత కృష్ణా నదీజలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్ ఎస్  బచావత్ ట్రిబ్యూనల్ (1969-1973) ఏర్పడింది.  75 శాతం ఆధారిత ప్రమాణాల ప్రకారం కృష్ణా నదిలో 2060 టియంసీల నికర జలాల లభ్యత వుంటుందని తేల్చిన ట్రిబ్యూనల్ దాని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లకు  వరుసగా 560, 700, 800 టియంసీల చొప్పున  నీటిని కేటాయించింది,

నికర జలాలుకాకుండా ఇంకా లభ్యమయే అదనపు జలాలని వాడుకునే సౌలభ్యాన్ని దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారు.  ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి పూర్తి అయిన, నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టుల్లో అదనపు జలాలను స్వేచ్చగా వినియోగించుకోవచ్చు.  అయితే, అదనపు జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టులు మాత్రం నిర్మించడానికి వీలులేదు. అలా కొత్త ప్రాజెక్టుల్లో అదనపు జలాల్ని ఉపయోగిస్తే, ఒకసారి అనుభవించిన సౌకర్యం తరువాతి కాలంలో హక్కుగా మారే ప్రమాదం వుందనీ, అది ఈ శతాబ్దాంతానికి మరలా జరగాల్సివున్న కృష్ణాజలాల పున:పంపకాలకు అభ్యంతరకరంగా మారుతుందని బచావత్ ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది.

సరిగ్గా ఈ అంశం మీదనే ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఆంధ్రప్రదేశ్ లోని ఎలక్టోరల్ పార్టీల మధ్య, ఆయలసీమ కరువుల మధ్య ఈనాడు ముక్కోణ వివాదం ఒకటి తీవ్రరూపం దాలుస్తోంది. 

టంగుటూరి అంజయ్యగారి హయాంలో జరిగిన అఖిలపక్ష సమావేశం రాయలసీమకు నీరందించడానికి 1981లో శ్రీశైలం కుడి గట్టు కాలువను రూపకల్పన చేసింది.  తెలుగుదేశం పార్టి అధికారంలోనికి వచ్చిన తరువాత ఇదే కాలువ కొద్దిపాటి మార్పులతో తెలుగుగంగగా అవతరించింది. 

తాగునీరులేక కటకట లాడుతున్న మదరాసు నగరానికి కృష్ణాజలాల్లో తమ తమ వాటాల నుండి చెరో 5 టీయంసీల నీటిని కేటాయిస్తామని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమిళనాడు ప్రభుత్వానికి వాగ్దానం చేశాయి. ఆ విషయంలో నాలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వివాదం ఏమీలేదు.

మదరాసు నగరానికి పంపే నీరుకాక, తెలుగుగంగ ద్వార నెల్లూరుజిల్లాతోపాటూ, రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూముల్లో 5.75 లక్షల ఎకరాలకు సేద్యం కోసం 27.5 టీయంసీల నీరు అందిస్తాననీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రప్రభుత్వం చూపెడుతున్న ఆయకట్టు విస్తీర్ణానికీ, వాగ్దానం చేసిన నీటికీ పొంతనే లేకపోవడంతో కొత్త వివాదం తలెత్తింది.

శ్రీశైలం నుండి విడుదల చేస్తామంటున్న 27.5 టీయంసీల సాగునీరు నెల్లూరు జిల్లాలో చూపెట్టిన 2.5 లక్షల ఎకరాల సేద్యానికి అయినా సరిపోతాయి; లేదా రాయలసీమలో చూపెడుతున్న 2.75 లక్షల ఎకరాల సేద్యానికి అయినా సరిపోతాయి. అంచేత, ఈ జలాలు నెల్లూరు జిల్లాకా? లేక రాయలసీమ ప్రాంతానికా? అనేది ఒక అనుమానం అయితే, ఈ జలాలు అసలు నికర జలాలేనా అన్నది అంతకన్నా ప్రధాన సమస్య.

అసలౌ నికర జలాలు ఎక్కడున్నాయీ? అని రాష్ట్ర నీటి పారుదలా శాఖా మంత్రి కేఇ కృష్ణమూర్తి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నికర జలాలు చూపెట్టకపోతే కేంద్ర ప్లానింగ్ కమీషన్ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ప్రశ్నేలేదు.

అదనపు జలాల్ని కొత్త ప్రాజెక్టుల్లో ఉపయోగించరాదనే కర్ణాటక అభ్యంతరానికిగానీ, కరువును  ఎలా నివారిస్తారని అడుగుతున్న రాయలసీమ ప్రజలకుగానీ ఇవ్వగల సమాధానం తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరేకాదు రాష్ట్రంలోని ఎలక్ట్రోలు పార్టీలు ఎవరి దగ్గరా లేదు. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడం కోసం అవన్నీ పడరాని పాట్లన్నీ పడుతున్నాయి. ఈ రాజకీయాలకు దూరంగా కన్నీళ్ళు ఇంకిపోయిన  రాయలసీమను సహారా భూతాలు వెంటాడుతున్నాయి. మరో శతాబ్దం గడవకుండానే అనంతపురంజిల్లా ఎడారిగా మారిపోబోతున్నదని శాస్త్రజ్ఞులు గగ్గోలు పెడుతూనే వున్నారు. 

రాష్ట్ర వైజ్ఞానిక సాంకేతిక మండలిని మార్చి 2 న పున:ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని సహజ వనరులను సాధ్యమయినంత ఎక్కువగా వినియోగించుకునే మార్గాల్ని అన్వేషించాల్సిందిగా శాస్త్రజ్ఞుల్ని కోరారు. వాళ్ళిప్పుడు రాయలసీమకు నికర జలాలు చూపెట్తగలరా? లేదా? అన్నది కాదు ప్రశ్న. రాష్ట్రంలోని నదీ పరివాహక జలాల్నీ, భూగర్భ జలాల్నీ సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమకు మరో 350 టీయంసీల జలాలు కేతాయించడం కష్టమేం కాదని గతంలో అనేక మంది నిపుణులు సమర్పించిన నివేదికలు ఏ ప్రయోజనాల కోసం బుట్త దాఖలా అయ్యాయి? అన్నదే అసలు ప్రశ్న.

రాయలసీమ ఎడారిగా మారిపోతుండదానికి కారణం నాటి నిజామా? బ్రిటీష్ వలస పాలకులా? నిన్నటి కాంగ్రెసా? నేటి తెలుగు దేశమా? మిత్రపక్షాలా? విపక్షాలా అన్నదికాదు ప్రశ్న. దేశంలో ఏదో ఓక చోట అధికారపక్షంగా వుంటున్న  ఎలక్టోరల్ పార్టీలు సారాంశంలో పాలకవర్గాల ప్రయోజనాలకు పూర్తి భిన్నంగా ప్రవర్తించగలవా? అన్నదే ప్రశ్న.

నదీ పరివాహక ప్రాంతం నిష్పత్తిలోగానీ, జనాభా నిష్పత్తిలోగానీ, సేద్యపు భూముల నిష్పత్తిలోగానీ రాయలసీమకు జరిగిన అన్యాయం ఎంత అన్నదికాదు సమస్య. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమగ్రమైన అభివృధ్ధిని సాధించకుమ్డా తెలుగు జాతి ప్రజల మధ్య అయినా సమైక్యత సాధ్యపడుతుందా? అనేదే సమస్య.

వీటికి సమాధానం పరిష్కారం రెండూ దొరకనంత వరకు శ్రీభాగ్ ఒప్పందంకోసం చరిత్రలో వెతకాల్సిన పనిలేదు. అది వర్తమానంగా, గతంకన్నా తీవ్రంగా ముందుకు వస్తూనే వుంటుంది.

కడప
మార్చి, 1986

ప్రచురణ : ఎడిట్ పేజి, ఉదయం దినపత్రిక,  మార్చి, 1986