Friday 9 May 2014

Nexus Between Industrialists, Politicians and Media

త్రిమూర్తులు 
పారిశ్రామికవేత్తలు, పత్రికాధిపతులు, ప్రజాప్రతినిధులు

డానీ

 “రాజకీయ నాయకులు పత్రికలూ, టీవీలు పెడితే నిష్పక్ష పాత వార్తలు ఎలా వస్తాయి? జర్నలిస్టులకు స్వేచ్చ ఎక్కడ ఉంటుంది? అని  చంద్రబాబు నాయుడు ఇప్పుడు  ఆవేదన చెందడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశం.

పారిశ్రామికవేత్తలు, పత్రికాధిపతులు, ప్రజాప్రతినిధుల అన్యోన్య సంబంధాలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవికావు. పెట్టుబడిదారీ వ్యవస్థ, వాణిజ్య భావప్రకటనా స్వేఛ్చ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కవలపిల్లలు,  అయినట్టు పారిశ్రామికవేత్తలు, పత్రికాధిపతులు, ప్రజాప్రతినిధులు,  కూడా కవల పిల్లలే.

మొదట్లో ప్రచురణ సంస్థల్ని లాభాలను అర్జించే వాణిజ్య సంస్థలుగా భావించేవారుకాదు. జాతికి సేవచేసే స్వఛ్ఛంద సంస్థలుగా పరిగణించేవారు.  పెట్టుబడీదారీ వ్యవస్థలో ఆవిర్భవించిన కారణంగా పత్రికల పుట్టుకలోనే వాణిజ్య అంశం కూడా  వుంటుంది. అయితే, ఆ అంశం  ఎదగడానికి సానుకూలమైన  వాతావరణం అప్పటికి  ఏర్పడలేదు. అప్పటి ప్రజాప్రతినిధులు  స్వాతంత్ర సమరయోధులు, స్వఛ్ఛంద సంఘసేవకులు కనుక వాళ్ళు నడిపే పత్రికా సంస్థలు కూడా స్వఛ్ఛంద సేవా సంస్థలుగా వుండేవి. అనేక మంది సహృదయులు పత్రికల నిర్వహణకు ధన, వస్తు, కనక, భూమి రూపాల్లో ఉదారంగా దానాలు చేసేవాళ్ళు.


ఇరవైవ శతాబ్దపు తొలి పత్రికల్లో ప్రముఖమైన హిందుస్తాన్ టైమ్స్ ను  1924  లో అకాలీ నాయకుడు సుందర్ సింగ్ ల్యాల్పురి  ప్రారంభించినప్పటికీ, పదేళ్ళు తిరక్కుండానే ఆ పత్రిక  జీడీ బిర్లా చేతుల్లోనికిపోయింది. అది ఇప్పటికీ బిర్లాల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. ఈలోపులో, దేశప్రజల్లో జాతీయోద్యమ భావాలని ప్రచారం చేయడానికి జవహర్ లాల్ నెహ్రు ఇంగ్లీషులో నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో ఖ్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ పత్రికలు ప్రచురించాలని తలపెట్టారు. వీటి ప్రచురణ కోసం  1937 లో అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏజేపీయల్) అనే ప్రచురణ సంస్థను నెలకొల్పారు. ఆనాటి అత్యంత ధనవంతుల్లో టాటా, బిర్లాల తరువాత మూడవస్థానంలో వున్న రామకృష్ణ దాల్మియా  ఏజేపీయల్ లో పెట్టుబడులు పెట్టి నెహ్రూతోపాటూ సమాన వాటాదారుడయ్యారు.

తెలుగులో తొలినాళ్ల ప్రముఖ పత్రికల  యాజమాన్యాల్లో కాంగ్రెస్ మద్దతుదారులతోపాటూ కమ్యూనిస్టు మద్దతుదారులూ కనిపిస్తారు. అంచేత పత్రికలు, రాజకీయ పార్టీల అనుబంధం అనేది ఈరోజు కొత్తగా వచ్చిందేమీకాదు.  కమ్యూనిస్టు పత్రికల్ని పార్టియే నిధుల్ని సేకరించి నిర్వహించగా, కాంగ్రెస్ పత్రికల్ని రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలు నిర్వహించేవారు.  కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు, రామనాధ్ గోయంక వంటివారు ఆ కోవలోనికి వస్తారు. అయితే వాళ్ళెప్పుడూ తమ పత్రికల్ని ఆదాయ వనరుగా చూడలేదు. వాటినో సమాజ సేవగానే భావిస్తూ వచ్చారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి, చేతికి పరిపాలనాపగ్గాలు చిక్కాక ప్రజాప్రతినిధులలోని ధనదాహం, అధికార పిపాస బయటపడడం మొదలెట్టాయి. దాన్ని పారిశ్రామిక సంస్థలు పనిగట్టుకుని ప్రోత్సహించాయి కూడా. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు అన్నట్టు జాతియోద్యమ కాలంలో సేవా సంస్థలుగా కనిపించిన మీడియా సంస్థలు సహితం స్వాతంత్రం రాగానే తమ వాణిజ్య రూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టాయి. అయితే, తొలి పాతికేళ్ళు మన పత్రికలు వ్యాపార ధోరణిలో సాగుతూనే కొన్ని ఆదర్శాలని కూడా పాటించాయి, 1955 నాటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రపత్రిక కాంగ్రెస్ అనుకూల ప్రచారం మాత్రమే చేసి ఊరుకోలేదు.  కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని కూడా హద్దులు మీరి సాగించింది. అయినప్పటికీ, ఆ ప్రచారాన్ని ఇప్పటిలా పెయిడ్ న్యూస్ అనలేం. అప్పటికి పెయిడ్ న్యూస్  సాంప్రదాయం పుట్టనూలేదు.

అచ్చంగా వ్యాపార విలువలతో, ఫైనాన్స్ నియమాలతో, కొత్త సాంకేతిక ఆకర్షణలతో వచ్చిన తొలి తెలుగు పత్రిక ఈనాడు.  1983 ఎన్నికల్లో ఆ పత్రిక తెలుగుదేశం పార్టికి చేసిన ప్రచారం మీడియా రంగంలో కొత్త సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టింది. అయితే, దీనికీ 1955 నాటి ఆంధ్రపత్రిక ప్రచారానికీ పోలికా పొంతనలేదు. ఆ తరువాత దాదాపు ముఫ్ఫయి యేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనే వున్నప్పటికీ ఆంధ్రపత్రిక లాభపడింది ఏమీలేదు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వున్నరోజుల్లోనే 1991లో ఆ పత్రిక శాశ్వితంగా మూతపడింది.  మరోవైపు, తెలుగుదేశం ప్రభుత్వాలు,  ఈనాడు గ్రూపు సంస్థలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాయి.  

ఓ ఇరవై ఏళ్ళ క్రితం వరకూ రియల్ ఎస్టేట్ లా మీడియాలో జాగా (స్పేస్) కు ఇంత గిరాకీలేదు. పత్రికల యాజమాన్యంతోపాటూ సిబ్బంది ఇష్టాఇష్టాలకు కూడా కొంత జాగా వుండేది. వాళ్ళు తమకు నచ్చిన వార్తల్ని ప్రముఖంగా వేయడమో, నచ్చని వార్తల్ని అప్రధానంగా ప్రచురించడమో, పక్కన పెట్టడమో  చేసేవారు. పత్రికలు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధుల అనుబంధాన్ని సరళీకృత ఆర్ధిక విధానం పునాది మీద వ్యవస్థీకృతం  చేసిన ఘనత మాత్రం 1995-2004 నాటి చంద్రబాబు ప్రభుత్వానిదే! ఈనాడు,  రిలయన్స్, చంద్రబాబుల ప్రగాఢ అనుబంధాలు ఉన్నత న్యాయస్థానం సాక్షిగానే బయటపడ్డాయి కనుక అవింక బహిరంగ రహాస్యాలే!  గుర్తుందిగా జస్టిస్ మదన్ లాల్ భీమ్ రావు లోకూర్ నాట్ బిఫోర్ మీ వాజ్యం!

రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వుంటూ, జాతీయంగా ప్రధాని కార్యాలయంలో చక్రం తిప్పుతూ, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వుల్ఫెన్ షోన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్  ల ప్రశంసలు అందుకుంటూ వున్న మహానేతను ప్రశ్నలు అడగడం మర్యాదకాదనే అప్రకటిత నియమం ఒకటి అప్పట్లో వుండేది.  మీడియా సమావేశాల్లో, ఎవరైనా ఒక ఇబ్బందికర ప్రశ్న వేస్తే నీది ఏ పేపరు?అని చంద్రబాబు అసహనంగా నిలదీసేవారు.

అయితే, ఈ సాంప్రదాయం ఒక్క ఈనాడులోనే వుందంటే అది తప్పు. వాణిజ్య మీడియా సంస్థలన్నీ ముందో వెనకో త్రిమూర్తుల్ని (Trinity) ప్రతిష్టించక తప్పడంలేదు.  ఎవరిమతం వారిది. ఎవరి సాంప్రదాయాలు వారివి కనుక, పాత్రికేయ సిబ్బంది వృత్తిధర్మం ఏమిటంటే వాళ్ళు తమ యజమానులు సూచించిన పార్టీల్ని తమ శక్తిమేర పొగడడమే. లక్స్ కంపెనీలో పనిచేసే కార్మికుడు లక్స్  సబ్బునే తయారుచేయాలి! లైఫ్ బాయ్ కంపెనీలో పనిచేసే కార్మికుడు లైఫ్ బాయ్ సబ్బునే తయారుచేయాలి!  ఈ నియమం మీడియాకు కూడా యధాతధంగా వర్తిస్తుంది. ఇటీవల ఇంకో నియమం వచ్చింది. మీడియా అధిపతులు వ్యతిరేకించే ప్రజాప్రతినిధుల్ని కసితీరా తిట్టడం కూడా జర్నలిస్టుల జాబ్ ప్రొఫైల్ లో భాగం అయిపోయింది. 

రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సూత్రప్రాయంగా  భావ ప్రకటనా స్వేఛ్ఛ వుంటుందిగానీ దాన్ని ఆస్వాదించడానికి ఒక ధర వుంటుంది. ఈ స్వేఛ్ఛ సినిమా హాలు లాంటిది. సినిమా చూడడానికి అందర్నీ పిలుస్తారుగానీ, ధియేటరులో ప్రవేశానికి టిక్కెట్టు కొనాలి. ఆ టిక్కెట్టులో కూడా మూడు నాలుగు తరగతులుంటాయి. ఎవరి శక్తిని బట్టి వారు ఆ టిక్కెట్లు కొనుక్కోవచ్చు.  

మన భావాలు  బాహ్య ప్రపంచానికి తెలియాలంటే  మీడియా సంస్థల అనుగ్రహం వుండాలిమనం వ్యక్తంచేసే భావాలకు ప్రచురణ విలువ వుందని మీడియా భావించడం తొలి దశ. దానికోసం కొంత జాగా (స్పేస్) ను కేటాయించడం మలిదశ. ఈ స్పేస్ లో  కూడా లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్ తో మొదలుకుని ఫ్రంట్ పేజీలో బ్యానర్ వరకు అనేక తరగతులుంటాయి. జాగాను కొనుక్కున్నవాళ్ల భావప్రప్రకటనా స్వేఛ్ఛను మాత్రమే మీడియా సంస్థలు  ప్రచురణో, ప్రసారమో చేయగలుగుతాయి. 

అప్పట్లో, ప్రజలకు ఏ ఆదర్శాలు  చెప్పాలో ముందుగా నిర్ణయించుకుని మీడియా సంస్థలు పెట్టేవారు. ఇప్పుడు రెవెన్యూ వ్యూహం సంపూర్ణ వివరణలతో సిధ్ధం అయ్యాక మీడియా సంస్థలు పెడుతున్నారు. గతంలో ముందుగా సంపాదకుడ్ని ఎంపిక చేసేవారు. ఇప్పుడు ముందుగా సిఇవో ను ఎంపిక చేస్తున్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు మౌలిక తేడా ఏమంటే  జాగాను ప్రింట్ మీడియాలో చదరపు సెంటీ మీటర్లలో కొలిస్తే, ఎలక్ట్రానిక్ మీడియాలో సెకన్ల చొప్పున కొలుస్తారు. అంతకు మించి విధానపరంగా రెండింటి మధ్య తేడా ఏమీలేదు. ఎన్నికల వంటి గిరాకీ రోజుల్లో మొత్తం జాగాల్ని స్తోమత గలవాళ్ళు ముందస్తుగా కొనేసుకుంటారు. అంచేత, వాణిజ్య మీడియా ఏ ఎన్నికలలోనూ ప్రజల అభిప్రాయాన్నీ వ్యక్తం చేయదు. వ్యక్తం చేయాలన్నా దానికి సాధ్యంకాదు. వ్యక్తం చేయడానికి దాని దగ్గర స్వంత జాగా వుండదు. ఖరీదు కట్టి అమ్మేసుకున్నాక స్వంత జాగా ఎలా వుంటుందీ?

ప్రజాభిప్రాయానికి మీడియాలో కనీస స్థానం కూడా దొరకని సందర్భానికి 2004 ఎన్నికలు గొప్ప ఉదాహరణ. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆ ఎన్నికల్లో టిడిపిని చిత్తుగా ఓడించాలని నిర్ణయించుకున్నారు. తన అభివృధ్ధి మంత్రాలకు ఓట్లు రాలవని గ్రహించిన  చంద్రబాబు అలిపిరిలో బాంబు  దాడితో సానుభూతి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు మాత్రం వారి మీద కనికరం చూపదలచలేదు. ఈ పరిణామాలేవీ అప్పటి ప్రధాన మీడియా సంస్థల ప్రచురణల్లో, ప్రసారాల్లో ప్రతిఫలించలేదు. దేనికయినా వినియోగం, అతివినియోగం, దుర్వినియోగం, అత్యాచారం అనే నాలుగు దశలుంటాయి. 2004 లో ప్రధాన తెలుగు మీడియా సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సామూహికంగా అత్యాచారం  చేశాయి.

అప్పట్లో,  కొన్ని పత్రికలు ధైర్యంచేసి చంద్రబాబును విమర్శించాయిగానీ ప్రధాన పత్రికలతో పోలిస్తే వాటి సర్క్యూలేషన్  పది శాతం కూడా కాదు. ఈసారి ఎన్నికల్లోనూ అత్యధిక మీడియా సంస్థలు చంద్రబాబు-మోదీ ప్రచారం విస్తృతంగా సాగించాయి. వీటిల్లో టిడిపి అభిమానులు, నాయకులు, బంధువులు నిర్వహించే మీడియా సంస్థలు కూడా వున్నాయి.

మీడియాకు మళ్ళీ పాత రోజులు రావు. ఎన్నికలయ్యాక మరింత భారీ కార్పొరేట్ కంపెనీలు వస్తాయి. ఇప్పుడున్న మీడియా సంస్థల్ని విలీనం చేసేసుకుంటాయి. లేదా కొత్త సంస్థలు పెడతాయి.

మీడియా మద్దతు లేకుండానే 2004 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన  వైయస్  రాజశేఖర రెడ్డి అధికారాన్ని చేపట్టాక ముల్లును ముల్లుతోనే తీసే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే సాక్షి మీడియా సంస్థ. నచ్చని ఒక సాంప్రదాయాన్ని అదే సాంప్రదాయంతో సరిదిద్దవచ్చా? అనేది సమంజసమైన ప్రశ్నేగానీ,  జర్నలిస్టులకు స్వేఛ్ఛ గట్రా లేదని ఇప్పుడు చంద్రబాబు అనడం మాత్రం బొత్తిగా అసమంజసమైన వ్యాఖ్య. అమెరికాని ఎవరైనా తిట్టవచ్చుకానీ దాన్ని కనిపెట్టిన కొలంబస్సే తిట్టకూడదుగా!


9 May 2014


ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/a-column-by-danny/17053.html



No comments:

Post a Comment