పునర్నిర్మాణనికే ఓటు!
డానీ
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి
ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలూ తమతమ
రాష్ట్రాల పునర్ నిర్మాణానికి పెద్ద పీట వేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా
గాంధీకన్నా రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసిఆర్ మిన్న అని తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వగా, రాష్ట్ర
పునర్ నిర్మాణానికి జగన్ కన్నా చంద్రబాబు
అనుభవం ఎక్కువ అవసరమని సీమాంధ్ర ప్రజలు
తీర్పు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ను
అర్ధంతరంగా విభజించిన తీరుతో ఆగ్రహంగావున్న
సీమాంధ్ర ప్రజలు తమ కసిని కాంగ్రెస్ మీద సంపూర్ణంగా చూపించారు. ఒక అధికార
పార్టీకి రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క సీటు కూడా దక్కకపోవడం సరికొత్త రికార్డు. 1994 ఎన్నికల్లో యన్టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ కు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కేవలం 26 సీట్లు వచ్చాయి. పొన్నాల, రఘువీరా రెడ్డి ఇద్దరూ కలిసి ఇప్పుడు 20 సీట్లతో యన్టీఆర్ రికార్డును బద్దలుగొట్టారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ ఊడ్చుకుపోతుందనేది అందరూ ఊహించిందే. అయితే
తెలంగాణలో సహితం ఆ పార్టికి ఇరవైకు మించి సీట్లు రావని మాత్రం ఎవరూ ఊహించి వుండరు.
“రెండు రాష్ట్రాలకు చెడ్డ సోనియా” అనేది కొత్త సామెత. రాజకీయాల్లో హత్యలు వుండవు. ’సామూహిక’ ఆత్మహత్యలు వుంటాయని సోనియా, రాహుల్, మన్మోహన్ త్రయం మరొక్కసారి నిరూపించారు.
బూటకపు ఉద్యమాలతో సమస్యను
పక్కదోవ పట్టించిన జై సమైక్యాంధ్ర పార్టీకి కూడా సీమాంధ్రులు గట్టి గుణపాఠం
నేర్పారు. 1983 వరల్డ్ కప్ లో కపిల్ దేవ్
175 నాటౌట్ గా నిలిచి అప్పట్లో
ఒక రికార్డు సృష్టించాడు. మన కిరణ్ కుమార్ రెడ్డి175 బాల్స్ ను
ఎదుర్కొని ఖాతా కూడా తెరవకుండా మరో రికార్డు సృష్టించారు.
జైల్లో వున్నంత వరకు జగన్ ప్రజాదరణ
గ్రాఫ్ పైపైకి దూసుకుపోయింది. అప్పట్లో నిర్వహించిన అనేక సర్వే నివేదికలు ఈమాటనే
చెప్పాయి. మరోవైపు చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకూ క్షీణిస్తూ వచ్చింది. జగన్ బెయిల్ మీద బయటికి వచ్చాక వ్యవహారం
తలకిందులవడం మొదలయింది. చంద్రబాబు క్రమంగా పుంజుకోగా జగన్ గ్రాఫ్ క్షీణిస్తూ
వచ్చింది.
నాయన వైయస్ రాజశేఖర రెడ్డి అకస్మిక
మరణం తాలూకు సానుభూతి పవనాలనే జగన్ గత నాలుగున్నరేళ్ళుగా నమ్ముకుని సాగుతున్నారు. ఈలోపు వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు ఆయన నమ్మకాన్ని
మరింత పెంచాయి. ఇక కాబోయే ముఖ్యమంత్రి తానే అనే గట్టి ధీమాలో ఆయన వుండిపోయారు.
రాజకీయాల్లో సానుభూతి పని చేసేమాట నిజమేగానీ, ఐదేళ్ళ తరువాత కూడా సానుభూతి
పనిచేస్తుందని అనుకోవడం అమాయకత్వం.
రాష్ట్ర విభజన జరగనంత వరకు సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్రను గట్టిగా
కోరుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరువాత సీమాంధ్ర ప్రజల
రాజకీయ ఎజెండా పూర్తిగా మారిపోయింది. సమైక్యరాష్ట్రం నినాదం వెనక్కి వెళ్ళిపోయి
రాష్ట్ర పునర్ నిర్మాణ అంశం బలంగా ముందుకు వచ్చింది. రాష్ట్ర విభజన తరువాత
సీమాంధ్ర ప్రజల మనోభావాల్లో వచ్చిన మార్పును జగన్ పట్టించుకోలేదు. అందివచ్చిన
అవకాశాన్ని చంద్రబాబు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. సీమాంధ్రలో చంద్రబాబు
అనుభవం ముందు జగన్ అనుభవరాహిత్యం ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో జగన్, చంద్రబాబు పోరు
కుందేలు, తాబేలు కథను తలపించింది.
టిడిపి-బీజేపి పొత్తువల్ల మనోభావాలు దెబ్బతిన్న మత అల్పసంఖ్యాక సామాజికవర్గాలు
తెలంగాణలో టీఆర్ ఎస్ కూ, సీమాంధ్రలో వైసిపీకీ మద్దతు ఇవ్వాలనుకున్నారు. విద్యా,
ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని
ఎన్నికల హామీ ఇవ్వడమేగాక, హైదరాబాద్ లో యంఐయంతో దోస్తీని కూడా కొనసాగించిన కేసిఆర్ ముస్లిం సామాజికవర్గాన్ని విపరీతంగా
ఆకట్టుకొన్నారు. సీమాంధ్రలో మత అల్పసంఖ్యాకవర్గాలను
ఆకట్టుకోవడానికి జగన్ దగ్గర కనీస ఎత్తుగడ కూడా లేకుండాపోయింది. తనకు మద్దతివ్వాలనుకుంటున్న
సామాజికవర్గాల మనోభావాలు తెలియని జగన్ అనేకసార్లు కేంద్రంలో నరేంద్ర మోదీకి మద్దతు
ఇస్తామని ప్రకటించి వాళ్ల అభిమానానికి దూరం అయ్యారు.
జగన్, చంద్రబాబు, నరేంద్రమోదీల
అర్ధిక విధానాల్లో మౌలిక తేడా ఏమీలేదు. ముగ్గురూ ప్రాయోజిత పెట్టుబడీదారీ
విధానాన్ని పాటించేవారే. మోదీ-బాబూ బ్రాండు ప్రాయోజిత
పెట్టుబడీదారీ విధానాన్ని వ్యతిరేకించే వారికి కూడా ఈ ఎన్నికల్లో ఆప్షన్
లేకుండాపోయింది. బీజేపీతో టిడిపికి పొత్తు వుందని తెలిసినా ఎన్నికల అనంతరం
ఎన్డీయేకు మద్దతు ఇస్తానని ప్రకటించడం ఈ ఎన్నికల్లో జగన్ చేసిన ఘోరమైన తప్పిదం. ఎన్నికలకు
ముందే మోదీతో చంద్రబాబు రాజకీయ వివాహం చేసుకున్నారు. ఎన్నికల తరువాత మోదీతో
వివాహేతర సంబంధం పెట్టుకుంటానని జగన్ అనడం ఓటర్లకు నచ్చలేదు. ఒరిజినల్ పీసులు
కావలసినన్ని దొరుకుతున్నప్పుడు, డూప్లికేట్ పీస్ ను ఎవరు కొంటారూ? అదే జగన్ ఓటమికి
కారణమైంది.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మోదీ ప్రభావం కనిపించలేదు. బీజేపీతో పొత్తుపెట్టుకోకున్నా చంద్రబాబుకు
ఇప్పుడొచ్చినన్ని సీట్లు కఛ్ఛితంగా వచ్చివుండేవి. మోదీతో పొత్తు పెట్టుకుని వారు
అనవసరంగా మరొక్కసారి లౌకిక ముద్రను
చెరుపుకున్నారు. తెలంగాణలో అయినా, సీమాంధ్రలో అయినా టీడీపీతో పొత్తువల్ల లాభపడింది
బీజేపియేగానీ; టిడిపికాదు. పొత్తులో భాగంగా తెలంగాణలో తక్కువ స్థానాల్లో పోటీ
చేసిన టిడీపికి ఎక్కువ స్థానాలొచ్చాయి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన బీజేపికి
టిడిపికి వచ్చిన స్థానాల్లో సగం కూడా రాలేదు. నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో బీజేపి
సిట్టింగ్ సీట్లను సహితం పోగొట్టుకుంది. హైదరాబాద్ లో ఆ పార్టికి కొత్తగా దక్కిన
నాలుగు సీట్లు కూడా పొత్తులేకుంటే టిడిపికి దక్కేవే!
హిందూత్వ ఎజెండావున్న
నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్ధిగా దూసుకు రావడంతో ఈసారి విపరీతంగా ఆందోళనపడ్ద
సామాజికవర్గాలు ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు. 2004, 2009 ఎన్నికల్లో భారత ముస్లిం సమాజం కాంగ్రెస్ కు గట్టి మద్దతు ఇచ్చింది. యూపియే-1 అధికారాన్ని చేపట్టగానే అట్టహాసంగా వేసిన సచార్ కమీటీ
సూచనల్ని అమలు చేయకుండా తొమ్మిదేళ్ళు పక్కన పడేసింది. అంచేత కాంగ్రెస్ మీద
ముస్లీంలకు సకారణంగా పీకలోతు కోపం వుంది. ఈసారి మోదీ కనుక ప్రధాని అభ్యర్ధి
కాకుండావుంటే భారత ముస్లిం సమాజం మూకుమ్మడిగా బీజేపికీ ఓటేసి కాంగ్రెస్ మీద కసి
తీర్చుకునేదంటే అతిశయోక్తికాదు. గెలుపోటముల్ని ముస్లింలు ప్రభావితం చేయగల 212 పార్లమెంటు నియోజకవర్గాల్లో 136 చోట్ల బీజేపి గెలిచిందంటే దానికి కారణం ముస్లిం సమాజంలో పెల్లుబుకుతున్న కాంగ్రెస్
వ్యతిరేకతే అని తప్ప మరో వివరణ ఏం ఇవ్వగలం?
సీమాంధ్ర మత అల్పసంఖ్యాక సామాజికవర్గాల్లో ఎక్కువమంది హిందూత్వ నరేంద్ర
మోదీకి వేయలేని ఓటును అయిష్టంగానే జగన్ కు వేశారు. ముస్లింల జనాభా ఎక్కుగావున్న
కర్నూలు, కడప జిల్లాల్లోనేగాక, విజయవాడ పశ్చిమ వంటి నియోజకవర్గాల్లోనూ దీని
ప్రభావం ప్రముఖంగా కనిపించింది. వైయస్ రాజశేఖర రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఎన్నివున్నా ఆయన
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీద పేదప్రజల్లో ఇప్పటికీ గణనీయమైన అభిమానం వుంది.
జగన్ కు గౌరవప్రదమైన సీట్లు రావడానికి
కారణం అదే.
టిడిపి-బీజేపి కూటమికి దక్కిన 17 లోక్ సభ సీట్లలో అత్యధికం ఉత్తర, మధ్య ఆంధ్ర ప్రాతం నుండే
దక్కాయి. వైయస్సార్ సిపికి దక్కిన 8 లోక్ సభ సీట్లలో అత్యధికం దక్షణ ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం నుండే వచ్చాయి.
చంద్రబాబు శిబిరంలోని యంపీల్లో జగన్ సామాజికవర్గానికి చెందినవారు జేసి దివాకర
రెడ్డి ఒక్కరు మాత్రమే కావడం విశేషం. జగన్
శిబిరం లోని యంపీల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు ఒక్కరూ లేకపోవడం మరీ
విశేషం. జగన్ కు ఉత్తరాంధ్రాలో అరుకు లోక్
సభ సీటు బోనస్ గా దక్కితే, చంద్రబాబుకు రాయలసీమలో అనంతపురం లోక్ సభ సీటు బోనస్ గా
దక్కింది. లోక్ సభ సీట్ల గణాంకాలనుబట్టి, సీమాంధ్రలోని రెండు ప్రధాన ప్రాంతాలు
రెండు ప్రధాన పార్టీల పరంగా, రెండు ప్రధాన సామాజికవర్గాల పరంగా చీలిపోయాyanయని గమనించవచ్చు. కొత్తగా ఏర్పడిన సీమాంధ్ర రాష్ట్రంలో రానున్న
పరిణామాలకు ఇది ఒక సంకేతం కావచ్చు!
(రచయిత సీనియర్
పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
18-5-2014
http://www.andhraprabha.com/columns/a-column-by-donny/17528.html
No comments:
Post a Comment