Monday 26 May 2014

Corporatization of Politics

వాణిజ్య రాజకీయాలు
డానీ                                                       

ధర్మం నాలుగు కాళ్లతో నడిచే యుగం ఒకటి వున్నట్టు, రాజకీయాలు నాణ్యంగా వున్న రోజులూ వుండేవి.  కాంగ్రెస్ గా పుట్టినోళ్ళూ కాంగ్రెస్ గానే బతికేటోళ్ళు. కమ్యూనిస్టులుగా పుట్టినోళ్ళు కమ్యూనిస్టులుగానే బతికేటోళ్ళూ. రాజకీయ పార్టి సంకరం మహాపాతకంగా వుండేది. ఎల్పీజీ అనబడే వర్తమాన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ యుగంలో ప్రమాణ స్వీకారం కాకుండానే పార్టీలు మారిపోతున్నారుగానీ అప్పట్లో పదిసార్లు ఓడిపోయినా పార్టీ మాత్రం  మారేవారుకాదు. 

ఆ రోజుల్లో కూడా పార్టీలు మారినవాళ్ళు ఒకరిద్దరున్నారుగానీ ఆ మార్పులు వ్యాపారాభివృధ్ధి కోసం మాత్రం కాదు. అసలు ఆ రోజుల్లో వ్యాపారం వేరుగానూ, రాజకీయాలు వేరుగానూ వుండేవి. టాటా, బిర్లా, దాల్మియా వగయిరాలు అభిమానంతో రాజకీయా నాయకుల ద్వార నాలుగు పనులు చేయించుకునేవారేమోగానీ వాళ్ళే ఎన్నికల్లో నిలబడి పార్లమెంటును ఏలేవారుకాదు.

ముందు సోషలిస్టుగావున్న జవహర్ లాల్ నెహ్రు తరువాతి కాలంలో కాంగ్రెస్ వాది అయ్యాడు. కమ్యూనిస్టుగా జైలుకెళ్ళిన అల్లూరి సత్యనారాయణ రాజు కాంగ్రెస్ గా మారి బయటకు వచ్చాడు. 

జైల్లో వుండగా సత్యనారాయణ రాజు కాంగ్రెస్ రాహుల్ సాంస్కృత్యాయన్ రచన ఓల్గా సే గంగ ను తెలుగులోనికి అనువాదం చేశాడు. తెలుగునాట కమ్యూనిస్టు గాలులు బలంగా వీస్తున్న ఆ రోజుల్లో ఓల్గా సే గంగను చదవనివాడు పాపిగా వుండేవారు. ఒక ఆసక్తికర విషయం ఏమంటే 1980లలో  కమ్యూనిస్టు ప్రచురణకర్తలు ఓల్గా సే గంగసత్యనారాయణ రాజు తెలుగు అనువాదాన్ని పునర్ ముద్రించాలనుకున్నారు. అనువాదకుని వారసులు అడిగిన రాయల్టీకి భయపడి ఆ పని మానుకోవాల్సివచ్చింది. ఇవన్నీ పార్టీ మార్పిడి పరిణామాలు. 

మర్రి  చెన్నారెడ్డి 1978-80 ల మధ్య కాలంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, కమ్యూనిస్టు పుచ్చలపల్లి  సుందరయ్య  ప్రతిపక్ష నేతగా వున్నారు. శాసనసభా సమావేశాల్లో మర్రి  చెన్నారెడ్డి ప్రతిరోజూ సభలోనికి ప్రవేశించగానే సుందరయ్య వైపు తిరిగి నమస్కారం చేసేవారట. ఎవరి పార్టి వారిదే అయినా  అదో మర్యాద.

పారిశ్రామికవేత్తల్ని లోక్ సభ నుండిగాక రాజ్యసభ నుండి పార్లమెంటులో ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని కాంగ్రెస్సే మొదలెట్టింది. వాళ్ళు ఎన్నికల సమయంలో పోల్  మేనేజ్ మెంట్ చేసేవారు. పోల్ మేనేజ్ మెంట్ అంటే భారీ వాణిజ్య సంస్థల నుండి  నిధులు సేకరించి ఎన్నికల సమయంలో ఓట్లు కొని పార్టీని గెలిపించడం అని సింపుల్ గా చెప్పుకోవచ్చు. 

ఇప్పటి రోగాలన్నీ ఎల్పీజీలోనే పుట్టినట్టు, పీవీ నరసింహారావు కాలంలోనే రాజకీయాల ప్రైవేటీకరణ పుంజుకుంది. ఎన్నికలకు ముందు ఒక్క రోజు కూడా పార్టీలో లేని వ్యక్తుల్ని ఏకంగా పార్టీ యంపీ అభ్యర్ధులుగా దించే సాంప్రదాయం వారే మొదలెట్టారు. సాంకేతికరంగంలో కొత్తది ఏది వచ్చినా వెంటనే పట్టుకుని రాజకీయ రంగంలో చొప్పించే  చంద్రబాబు  కూడా అతిసహజంగానే పీవీ ప్రయోగాలని కొనసాగించారు. 1998 ఎన్నికల్లో టీడిపి విజయవాడ లోక్ సభ బరిలో  విజయా ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ ను దింపింది ఈ నియమం ప్రకారమే! అది ఆరంభం అయితే, దానికి కొనసాగింపు వైయస్సార్ సిపి పార్టీ టిక్కెట్టుపై గెలిచిన నంద్యాల యంపి ఎస్పివై రెడ్డి, కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఇప్పుడు టిడిపి తీర్ధం పుచ్చుకోవడం. వధువు కాళ్ళ పారాణి ఆరక ముందే పెళ్ళికొడుకు పారిపోయినట్టు వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారాలు చేయకముండే పార్టి మారిపోయి సాంప్రదాయాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించారు.

అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యం అని ఎస్పీవై రెడ్డి, రేణుక ముక్తకంఠంతో చెప్పారు.  ఈరోజుల్లో ఇదొక ప్రామాణిక ప్రకటన. ఒకవేళ వీళ్ళిద్దరూ టిడిపి టిక్కెట్టు మీద గెలిచి, జగన్ పార్టి ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుని, కేంద్రంలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చివున్నా అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా అది జగన్ తోనే సాధ్యంఅని వీళ్ళిద్దరూ ముక్తకంఠంతో ప్రకటించి వుండేవారు.  మనం కొంచెం శ్రమపడి గత నెల వార్తాపత్రికలు తిరగేస్తే చాలు వీళ్ళిచ్చిన ఇలాంటి ప్రకటనలు బోలెడు కనిపిస్తాయి.

       మీడియావాళ్ళు జరగరానిది జరిగిపోయినట్టు జగన్ కు ఝలక్అని రాశారుగానీ వ్యాపారంలో ఝలక్ లు సహజమేనని జగన్ కూ తెలుసు, చంద్రబాబుకూ తెలుసు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడంలో వాళ్ళిద్దరిలో ఎవరూ ఎవరికీ తీసిపోరు.

       చంద్రబాబు రాజకీయాల్లో పాటించే కార్పొరేట్ శైలి ఈ ఎన్నికల్లోనూ ప్రస్పుటంగా కనిపించింది. ఉత్తరాంధ్రకు నారాయణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పి. నారాయణను, మధ్య-దక్షణ ఆంధ్రాకు  సుజన చౌదరినీ, రాయలసీమకు సియం రమేష్ ను పోల్ మేనేజర్స్ గా వారు నియమించారు.

నారాయణ, సుజనా చౌదరి ఎన్నికలలోనే తమ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నా, సియం రమేష్ అనంతపురం జిల్లాలోతప్ప మిగిలిన రాయలసీమ జిల్లాల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారు. ఎన్నికల తరువాత ఎస్పీవై రెడ్డి, బుట్ట రేణుకను టీడీపి లోనికి ఆకర్షించడంతో రమేష్ కూడా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నట్టు అయింది. నరేంద్ర మోదీ తొలివిడత క్యాబినెట్టులో  అశోక్ గజపతి రాజుకు సీనియారిటీ ప్రాతిపదిక మీద  స్థానం లభించినా, మలివిడత క్యాబినెట్టులో కార్పొరేట్ ప్రాతిపదికపై  స్థానం కోసం  సుజనచౌదరి, నారాయణ, సియం రమేష్ కతార్ మే హై!

      
       కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్ధి  రాహుల్  గాంధీ కూడా ఈసారి ఎన్నికల్లో  రాజకీయేతర నైపుణ్యాలను పోల్ మేనేజ్ మెంట్ కు వాడుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఉద్దండుల్ని పక్కన పెట్టి కేంద్ర సర్విసు అధికారుల్ని రంగలోనికి దించారు. కాంగ్రెస్ వరుస వైఫల్యాల్లో భాగంగా అది కూడా బెడిసి కొట్టింది. కాలం కాటేస్తున్నపుడు తెలంగాణ ఇచ్చినా సీట్లు రానట్టే, కాలం కలిసి వచ్చినపుడు ఎన్నికైన యంపీలు సహితం వచ్చి పార్టీలో చేరుతారు.  ఇది కాంగ్రెస్ ను కాటేస్తున్న కాలం, టీడీపికి కలిసి వస్తున్న కాలం.

వైయస్సార్ సిపి ప్రస్తుతం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేననీ,  దానికి ఇంత వరకు ఎన్నికల సంఘం గుర్తింపులేదనీ, గుర్తింపులేని పార్టీలకు పార్లమెంటులో వ్హిప్ జారీచేసే అవకాశం వుండదనీ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, జగన్ ఆయన సమీప బంధువులుతప్ప మిగిలిన యంపీలు కొంచెం ముందో వెనకో  యస్పీవై రెడ్డి బాటలో నడిచినా అశ్చర్యపడాల్సిన పనిలేదు.  

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
మొబైలు : 9010757776

http://www.andhraprabha.com/columns/a-column-by-danny/17879.html


26 -5-2014

No comments:

Post a Comment