Tuesday, 27 May 2014

Mosquito Musings


దోమ సంవాదం
- డానీ

        సమయంకాని సమయంలో, ప్రదేశంకాని ప్రదేశంలో ఒకానొక విూడియా సంస్థకు చెందిన సీపా అనే  సీనియర్‌ పాత్రికేయుడికి కాంటాక్టు పెట్టింది తెలంగాణ-తెలుగు దోమల సమాజం అధికార ప్రతినిధి టైగర్‌ దోమ.  కుశల ప్రశ్నలు అవ్వగానే  వచ్చిన పనిలోకి దిగిపోయాడు సీపా. 

సీపా : విూడియాను పిలవడానికి కారణం

టైదో : చలికాలం మొదలవ్వగానే ప్రతిఒక్కరూ మా మనోభావాల్ని దెబ్బతీసేలా, మా ఆత్మగౌరవానికి భంగంకలిగేలా మాట్లాడుతున్నారు. పోలీసులు, బ్రాహ్మణ సంఘాలకేకాదు దోమలకు కూడా సివిల్‌ రైట్స్‌         వుంటాయి. మమ్మల్ని కించ పరిచేవాళ్ల విూద హ్యూమన్‌ రైట్స్‌ కవిూషన్‌ లో కేసు వేస్తాం. హైకోర్టులో  మిల్‌ వేస్తాం.
సీపా : దాన్ని పిల్‌ అంటారనుకుంటా?
టైదో :  మాది పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ కాదు.  మస్కిటో ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌; మిల్‌!
సీపా : విూరు ప్రత్యేకవాదులా? సమైక్యవాదులా?
టైదో :  మేము కేసిఆర్‌, టిజీ వెంకటేష్‌, లగడపాటి రాజగోపాల్‌ టైపుకాదు. మాది అంతర్జాతీయ సమాజం. మాలో మూడువేల సభ్యజాతులున్నాయి. ''ప్రపంచ దోమల్లారా! ఏకంకండి'' అనేది మా నినాదం. కాంగ్రెస్‌ లో వున్నా, టీడీపీలో వున్నా, జగన్‌ క్యాంపులో వున్నా మైసూరారెడ్డి మైసూరారెడ్డియే అన్నట్టు తెలంగాణలోవున్నా, రాయలసీమలో వున్నా, కోస్తాంధ్రాలోవున్నా దోమలు దోమలే!
సీపా : పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల్ని  కొందరు వ్యతిరేకిస్తున్నారంటే అందులో కొంత అర్ధం వుంది. విూరేమిటీ ఏకంగా హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారూ?  .
టైదో : యస్‌. మేము హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నాం. నైజాంసంస్థానం ఇండియాలో విలీనం జరిగినప్పటి నుండీ మావాళ్ళు అక్కడ నివాసం వుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపొమ్మంటే ఎక్కడికి       పోవాలి. ముందు మాకు రిలీఫ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ప్యాకేజి     ప్రకటించమనండి. అలా కాకుండా, మమ్మల్ని హుస్సేన్‌ సాగర్‌ ను ఖాళీ చెయ్యమంటే, మేము సెక్రటేరియట్‌ ను ఆక్రమించుకుంటాం. ముఖ్యమంత్రి కిరణ్‌   కుమార్‌ రెడ్డి ఛాంబర్‌ మాకు కూతవేటు దూరంలో కూడా లేదు.
సీపా : విూ నాయకుడు ఎవరూ? విూరిప్పుడు ఏ పార్టీలో వున్నారూ?
టైదో : మా సమాజంలో పార్టీకీ, మనిషికి విలువలేదు. విూ ప్రభుత్వాల్లో మాకు         ఇరిగేషన్‌ మంత్రులన్నామున్సిపల్‌ అఫైర్స్‌ మంత్రులన్నా ఇష్టం.
సీపా : వాళ్ళంటే ప్రత్యేక ఇష్టం దేనికీ?
టైదో :  ఇరిగేషన్‌ మంత్రులు నదుల్ని మురిక్కాలువలుగా మారుస్తారు. మున్సిపల్‌ అఫైర్స్‌ మంత్రులు మురిక్కాలవల విూద మూతలు తీసేస్తారు.
సీపా : విూ మాతృభాష ఏమిటీ? తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు  మహాసభల్ని విూరు విజయవంతం చేస్తున్నారా? బహిష్కరిస్తున్నారా?
టైదో : ముందే చెప్పాను. మాకు భాషాబేధాలు లేవు. మనుషులు ఎక్కడ  వుంటే మేము అక్కడ వుంటాం. తిరుపతికి  ముందుగా చేరుకున్నది మావాళ్ళే. అవిలాల చెరువులో ప్రస్తుతం పది కోట్ల దోమలు దిగాయి.  మా ధాటికి తట్టుకోలేకే మహాసభల వేదికను మార్చుకున్నారు. 
సీపా :  విూ విూద జరిగే దుష్ప్రచారాన్ని ఖండించడానికి విూరేమయినా టీవీ న్యూస్‌ ఛానల్‌          పెట్టే ఆలోచనలో వున్నారా?
టైదో : కిరణ్‌ కుమార్‌, సత్తిబాబు, రాఘవులు, నారాయణ కూడా న్యూస్‌  ఛానల్‌ పెట్టేసుకున్నాక, ఇక దోమలేనా  పెట్టుకోలేనిదీ?
సీపా : విూ ఛానల్‌ ఎప్పుడు ఎయిర్‌ లోకి వస్తుందీ?
టైదో : టివీలు పుట్టక ముందు నుండే మాకు మస్కిటో మ్యూజిక్‌ ఛానల్‌        వుంది. దోమలకు కళాపోషణ కొంచెం ఎక్కువ. సంగీతమంటే మహాఇష్టం. చీకటిపడగానే  ప్రతి దోమలో తాన్‌ సేన్‌ ఆత్మో, త్యాగరాజు ఆత్మో ఆవహిస్తుంది.  దానితోఎక్కడపడితే అక్కడ ఉచితంగా సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాయి. 
సీపా : విూ మస్కిటో మ్యూజిక్‌ ఛానల్‌ ట్యామ్‌ రేటింగ్స్‌ ఎలా వున్నాయి?
టైదో : ఎవరికి ఇష్టమైన ఛానల్‌ ను వాళ్ళు చూడాలని ప్రతి ఇంట్లో రోజూ        ఫ్యామిలీ మెంబర్స్‌ తగువులాడుకుంటుంటారు.  మస్కిటో మ్యూజిక్‌ ఛానల్‌ అసలు అలాంటి ఛాయిసే ఇవ్వదు. మా ప్రైమ్‌  టైమ్‌ లో ప్రతి         ఒక్కరూ దోమలు అందించే వెయ్యి ఫిడేళ్ళ  సింఫనీని  ఆస్వాదించాల్సిందే! మాది టివీకి కట్టిపడేసే ఛానల్‌ కాదు. ఒళ్ళంతా కుట్టి పడేసే ఛానల్‌!
సీపా : ఇతరుల సంగీతానికీ. మస్కిటో మ్యూజిక్కుకూ తేడా ఏమిటీ?

టైదో  : ఇతరుల సంగీతం వింటే  జనానికి నిద్ర వస్తుంది. మస్కిటోమ్యూజిక్కు వింటే, ఎంతటిగాఢ నిద్ర అయినా పారిపోతుంది. చంద్రబాబుగారు     అధికారంలోవున్నరోజుల్లో ''నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను'' అని   అనేవారు. ఆయన మమ్మల్ని చూసుకునే అంత ధైర్యంగా ఆ మాటలు అన్నారు. మేము ఎవ్వర్నీ నిద్రపోనివ్వము. మానవ జాతిని జాగృతం చేసే కర్తవ్యాన్ని దోమలు నిర్వహిస్తాయి.
సీపా : మానవాళికి విూరు చేస్తున్న ఇతర సేవల్ని కూడా వివరించండి.
టైదో : మేము లేకపోతే అనేక రకాల జబ్బులు వుండవు. జబ్బులు లేకపోతే, ర్మస్యూటికల్‌ ఇండస్ట్రీ కుదేలైపోతుంది. హాస్పిటళ్ళు కూలిపోతాయి. డాక్టర్లు  ఈగల్నితోలుకోవాలి. మెడికల్‌ కాలేజీలు మూసుకోవాలి. ఆ తరువాత వరుసాగ్గా మెడికల్‌ టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీరియల్‌ ఎస్టేట్‌ అన్నీ కూలిపోతాయి. ఇప్పుడయినా అర్ధం అయిందా; ఈ భూమండలం దోమల కొండెం        విూద తిరుగుతోందనీఅయినా మాకు తగిన గుర్తింపులేదు. మేము గనుక సమ్మెచేస్తే హోల్  వరల్డ్‌         మార్కెట్‌  పతనమైపోతుంది.
సీపా : విూ డిమాండ్లు ఏమిటీ
టైదో : డాక్టర్లు పట్టా పుచ్చుకునేటప్పుడు అపోలో వగైరాల్ని తలుచుకుని        హిప్పోక్రాటిక్‌ శపథం చేస్తే సరిపోదు. ప్రాక్టిస్‌ బాగుండాలని దోమలకు ప్రత్యేక పూజలు చేయాలి. దోమలకు ప్రత్యేక        గుళ్ళు కట్టించాలి. దోమ విగ్రహం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే మేము టెంపరరీ దీవెనలు ఇస్తాం. ప్రాక్టిస్‌ బాగుపడ్డాక వచ్చి మళ్ళీ    నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే పర్మనెంట్‌ దీవెనలు ఇస్తాం.
సీపా : విూకు కుల, మత, వర్ణ, వర్గ  బేధాలు ఏవిూ వుండవా?
టైదో  : వుండవు. హైదరాబాద్‌ లో హోం మినిస్టర్‌ నైనా కుట్టేస్తాం. దండకారణ్యంలో మావోయిస్టు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కేను అయినా కుట్టి పడేస్తాం. మాకు పేర్లతో కుడా పనిలేదు. ఓన్లీ బ్లడ్‌ తోనే పని.

సీపా : ఎఫ్‌ డిఐ బిల్లు విూద విూ అభిప్రాయం?
టైదో : వీసాలు, పాస్‌ పోర్టులు, బిల్లులు, చట్టాలతో  మాకు  పనిలేదు. అమెరికా నుండి ఎయిడ్‌ తీసుకోవాలంటే పార్లమెంటు చట్టం     చేయాలి. అమెరికా నుండి ఎయిడ్స్‌ రావడానికీ, డెంగూ, చికెన్‌ గున్యా రావడానికి పార్లమెంటులో చట్టంతో పనిలేదు.  మా దారి అంతర్జాతీయ రహదారి!
సీపా : విూ సామ్రాజ్య విస్తీర్ణం ఎంతుంటుందీ?
టైదో : దోమలేకదా అని మమ్మల్ని తేలిగ్గా చూడకండి. దోమలకు కూడా        సామ్రాజ్యం వుంది. అది అశోకుని సామ్రాజ్యంకన్నా, ఔరంగజేబు సామ్రాజ్యం కన్నా పెద్దది. రోమన్‌, గ్రీకు, మొఘల్‌, బ్రిటీష్‌ సామ్రాజ్యాలు ఎప్పుడో అంతరించిపోయాయి. ఇప్పటికీ విస్తరిస్తున్న       సామ్రాజ్యం దోమలది. ఆరోజుల్లో, బ్రిటీషువాళ్లది సూర్యుడు     అస్తమించని సామ్రాజ్యం. ఇప్పటికీ, దోమలది సూర్యుడు అస్తమించగానే ఆరంభమయ్యే సామ్రాజ్యం. 
సీపా : ఈమధ్య కులమతాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీలు వస్తున్నాయి. విూకేమయినా కొత్త పార్టి పెట్టే ఆలోచన వుందా? పోనీ, విూరు యూపియేనా? ఎన్డీయేనా? రెండూ కాకపోతే థర్డ్‌ ఫ్రంటా? మహాకూటమా?
టైదో : దోమలకు రాజకీయ పార్టీ పెట్టుకోవాల్సిన అవసరంలేదు. పంచాయితీ నుండి పట్టణం వరకు, రాష్ట్రం నుండి దేశం వరకు  ఏపార్టి అధికారంలో వుందీఏ కూటమి అధికారంలో వుందీ? అన్నది దోమలు పట్టించుకోవు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, పగలు రకరకాల పార్టీలు పాలిస్తాయి.  రాత్రుళ్ళు మాత్రం   దోమలే పాలిస్తాయి.
సీపా : అంటే, ప్రజాస్వామ్యం విూద విూకు నమ్మకం లేదా?
టైదో :  దోమలు లేకుండా మున్సిపాలిటీలు లేవు.  మున్సిపాలిటీలు లేకుంటే రాజకీయాలులేవు.  రాజకీయాలు లేకుంటే  ఎన్నికలే లేవు. ఎన్నికలే లేకుంటే ప్రజాస్వామ్యమేలేదు. ఒన్‌ రీసెంట్‌ ఎగ్జాంపుల్‌ చెపుతా. మొన్న రాజ్యసభలో, ఎఫ్‌ డీఐపై ఓటింగు జరిగినప్పుడు, ముగ్గురు టిడిపి సభ్యులు గైర్హాజరయ్యారు. యూ క్నో ద రీజన్‌? వాళ్లను దోమలు కుట్టాయి! ఆరోగ్యం పాడయ్యింది.  అంచేత, చివరాఖరికి   తేలేది ఏమంటే, దోమలే లేకుంటే ప్రజాస్వామ్యమే వుండదు. డెమాక్రసీ ఈజ్‌ ... ఆఫ్‌ ద మస్కిటోస్‌, బై ద మస్కిటోస్‌, అండ్‌ ఫర్‌ ద మస్కిటోస్‌!
సీపా : నేటి రాజకీయ నేతలకు విూరు ఇచ్చే సలహాలూ, సూచనలు ఏమైనా   వున్నాయా?
టైదో : కేసిఆర్‌ లాంటివాళ్ళు అప్పుడప్పుడు దంచుడు బ్యాచీల్ని తయారుచేస్తాము అంటుంటారు. కేసిఆర్‌ కు మా గురించి అవగాహన లేనట్టుంది. చెత్త కుప్పల విూద ఓ నాలుగు రోజులు పెనాయిల్‌ చల్లడం మానేస్తే సరి. ఊరూర లక్షలేం ఖర్మ? కోట్ల కొలది దంచుడు బ్యాచీలు తయారవుతావు. అదేనండి దోమలదండు! మాకు తెలుగు, తెలంగాణ బేధాలు లేవు. మనుషులందర్నీ కుట్టి పడేస్తాము.
సీపా : మా రాజకీయ నాయకులకు విూరు ఏదైనా చిట్కాలు చెపుతారా?
టైదో : దేశంలో ఇన్‌ సెక్ట్‌ రెపెల్లెంట్స్‌ వాడకాన్ని నిషేధించాలి. దోమలపై అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకురావాలి.
సీపా : దానివల్ల రాజకీయ నాయకులకు ఒరిగేది ఏమిటీ? స్వంత ప్రయోజనం లేకుండా మా రాజకీయ నాయకులు ఏ పనీ చెయ్యరుగా!
టైదో : దోమో రక్షతిహ్ణి రక్షిత్ణ! రాజకీయ నాయకులు దోమల్ని కాపాడితే. దోమలు వాళ్ల రాజకీయాల్ని కాపాడుతాయి
సిపా : ఇక చివరగా మానవాళికి విూరు ఇచ్చే సందేశం...
టైదో : దోమలకూ కళాహృదయముంది; వాళ్ల సంగీతాన్ని ఆస్వాదించండి.

        దోమలకు ఒక ఆహారపు అలవాటుంది; దాన్ని కొనసాగనివ్వండి.

హైదరాబాద్‌

9 డిసెంబరు 2012    

No comments:

Post a Comment