ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురణర్థం
ముస్లిం రిజర్వేషన్లు - వర్తమానంలో గతం
ఏ. యం. ఖాన్ యజ్దాని ( డానీ)
''వ్యవస్థలో ఒక కొత్త మార్పును తలపెడుతున్నప్పుడు; దానివలన
సాధక బాధకాలకు గురయ్యేవారి అభిప్రాయాలను సరంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?'' అనే
ప్రశ్నతో ఆరంభమైంది; గుంటూరుజిల్లా బీసీ ఉద్యోగుల సంఘం,
ప్రధాన కార్యదర్శి, వై. వెంకటరత్నం వ్యాసం. (ఆంధ్రజ్యోతి;
24 మే 2005).
కొత్తగా ఒక సామాజికవర్గానికి
ఏదైనా ఒక రాయితీని కల్పించాల్సి వచ్చినపుడు; అప్పటికే అలాంటి రాయితీలను పొందుతున్న సామాజికవర్గాల
అభిప్రాయాలను; ప్రభుత్వం, స్వీకరించాలని
వెంకటరత్నం అంటున్నారు. జస్టిస్ దళ్వ సుబ్రమణ్యం
నాయకత్వంలో ఏర్పడిన రాష్ట్ర బీసీ కమీషన్ ముస్లింలు అధికంగావున్న
ప్రాంతాలలో మాత్రమే పర్యటించి హిందూ వెనుకబడిన కులాలు అత్యధికంగావున్న ప్రాంతాల్లో పర్యటించలేదని ఆయన
తప్పుపట్టారు.
ముస్లింలకు బీసీ రాయితీని కల్పించాల్సి
వచ్చినపుడు ముస్లింలు,
చారిత్రకంగా అణగారిపోతున్న తీరునూ, ఆర్థికరంగంలో వాళ్ళ
వెనుకబాటుతనాన్నీ, సమగ్రాభివృద్ధిని
సాధించడానికి వాళ్ళు కోల్పోతున్న అవకాశాలనూ, అధ్యయనం చేసినా,
చేయకపోయినా; ఇప్పటికే బీసీ రాయితీలను
పొందుతున్నవారి అభిప్రాయాలను మాత్రం సమగ్రంగా స్వీకరించాలనేది ఆయన అభిప్రాయం.
26 జనవరి 1950న భారత రాజ్యాంగం
అమలులోనికి వచ్చిన మరుక్షణమే, అప్పటి
పెత్తందారీ కులాల ప్రతినిధులు, సరిగ్గా, వై. వెంకటరత్నం వేసిన ప్రశ్ననే
లేవనెత్తారు. చారిత్రకంగా అవకాశాలను కోల్పోయిన కులాలకు, విద్యాసంస్థల్లో,
రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంపట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి చెందడానికి, ప్రతి
ఒక్కరికీ, వివక్షరహిత అవకాశాలు వుండాలనే ప్రాధమిక
హక్కుకు; ఈ
రిజర్వేషన్లు; విఘాతం కల్గిస్తాయని, వాదించారు. తమ
మనోభావాలను సంప్రదించకుండానే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ముందు మద్రాసు హైకోర్టులో, ఆ తరువాత సుప్రీం కోర్టులో వాజ్యాలు నడిపారు.
న్యాయస్థానాలకు స్వయంప్రతిపత్తి
వుండాలనేది గొప్ప ఆదర్శమే. కానీ, కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు
సామాజికన్యాయానికి విరుద్ధంగానూ వుండవచ్చు. న్యాయమూర్తులనేవారు రంగు, రుచి, వాసన తెలియని జడపదార్థాలేమీకారు. ఆ మేరకు,
వాళ్ళిచ్చే తీర్పులపై కూడా లోపలి నుండో బయటి నుండో న్యాయస్థానాలక స్వయంప్రతిపత్తికి
భిన్నమైన ప్రభావాలుండే అవకాశాలులేకపోలేదు.
అణగారినవర్గాలకు రాయితీలు
కల్పించడంపై నడిచిన తొలి కేసులోనే అన్యాయం
జరిగింది. న్యాయస్థానాల్లో పెత్తందారీ కులాల వాదనే గెలిచింది. సామాజికన్యాయ
ఆదర్శాలతో ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు; రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు తీర్పు
చెప్పాయి.
న్యాయస్థానాల
తీర్పు; సామాజిక న్యాయానికి విరుద్ధమంటూ పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ పెద్దఎత్తున ఉద్యమాన్ని ఆరంభించడంతో కేంద్ర ప్రభుత్వ దిగివచ్చింది. న్యాయస్థానాల
తీర్పుకూ, సామాజికన్యాయ
ఉద్యమానికీ మధ్య ఒక సర్దుబాటు ఫార్మూలాను రూపొందించింది. విద్యారంగంలో అణగారినవర్గాలకు
రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేసి, తన చేతులు కడిగేసుకుంది.
ఆమేరకు, 1951 జూన్
14న భారత రాజ్యాంగానికి తొలి సవరణ చట్టం అమలులోనికి వచ్చింది. ఆర్టికల్ 15కు;
4వ క్లాజు చేరిన చారిత్రక నేపథ్యం ఇది.
ఇదంతా గతమైతే, ముస్లిం రిజర్వేషన్ చెల్లదంటూ;
బీసీ మిత్రులు, రాష్ట్ర
కన్వీనర్, కే. కొండలరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్
వేయడం వర్తమానం. 1950లో మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన పెత్తందారీ కులాల
అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నట్లు కే. కొండలరావుకు కూడా తెలిసివుండకపోవచ్చు. చరిత్ర
ఒక ప్రహసనంగానేకాదు; అప్పుడప్పుడు కౄరంగానూ పునరావృతమౌతుంది!
ఆ తరువాత, పాతికేళ్ళ
వరకు వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని, కేంద్ర ప్రభుత్వం అసలు
పట్టించుకోనేలేదు. 1953లో కాకా కలేల్కర్ కమీషన్ ఒక నివేదికను
సమర్పించిందిగానీ, కేంద్ర ప్రభుత్వంలో దాన్ని పట్టించుకున్న నాధుడులేడు. 1977లో
కేంద్రంలో అధికారానికివచ్చిన, తొలి కాంగ్రెసేతర, జనతా ప్రభుత్వం, బీ.పీ. మండల్ కమీషన్ను నియమించింది.
కేంద్ర ప్రభుత్యోద్యోగాల్లో, ఇతర వెనుకబడిన
తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్ కల్పించాలని, మండల్ కమీషన్, 1980లో
నివేదికను సమర్పించేనాటికి, కేంద్రంల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. మండల్ కమీషన్ సిఫార్సుల్ని, గుజరాత్ లో,
ప్రయోగాత్మకంగా అమలుచేసి చూడాలని 1982లో కాంగ్రెస్ భావించింది. వెంటనే, గుజరాత్ అంతటా, అణగారిన కులాలపై పెత్తందారీ
కులాల దాడులు కొనసాగాయి. గుజరాత్ ఘర్షణల్లో పెత్తందారీ కులాల పక్షం వహించిన
బీజేపి, సహజంగానే, అణగారిన కులాలల ఆగ్రహానికి
లోనైంది. 1984 ఎన్నికల్లో, ఆ పార్టీకి, లోక్ సభలో కేవలం రెండు స్థానాలు మాత్రమేదక్కాయి.
రాజకీయాల్లో బతికిబట్టకట్టాలంటే, బలహీనవర్గాలను
కూడగట్టక తప్పదని గుర్తించిన సంఘ్ పరివారం, దానికోసం ఒక
ద్విముఖ వ్యూహాన్ని రచించింది. ఇందులో,
అణగారిన కులాలను ఆకర్షించడం ఒక ఎత్తయితే, అణగారిన కులాల్లో రగులుతున్న అసంతృప్తిని ముస్లింలవైపుకు మళ్ళించడం మరో
ఎత్తు. ఫలితంగా, హిందూత్వ నినాదంతోపాటూ, బాబ్రీ మసీదు వాదం ముందుకు వచ్చింది.
ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న
బీసీలందరూ సంఘపరివార్ శక్తులేనా? అని బీసీ మిత్రులు, రాష్ట్ర కన్వీనర్,
కే. కొండలరావు ప్రశ్నించారు. బీసీల్లో అందరూ సంఘపరివార్ శక్తులూకారు; ముస్లిం
వ్యతిరేకులు అంతకన్నా కారు. ముస్లింలకు అన్నిరంగాలలో, జనాభా
దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్న, హిందూ
అణగారిన కులాల నాయకులు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ, అటు జాతీయ
స్థాయిలోనూ, అనేకులున్నారు.
1989 లోక్ సభ ఎన్నికల తరువాత; వామపక్షాలు,
బీజేపీల, బయటి నుండి ఇచ్చిన మద్దతుపై; కేంద్రంలో నేషనల్
ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ ఊహించని విధంగా, 1990 ఆగస్ట్ 7న విపీ. సింగ్
ప్రభుత్వం, మండల్ కమీషన్ సిఫార్సుల్ని
ఆమోదించింది. రిజర్వేషన్ల ఆశ నుండి, అణగారిన కులాల దృష్టిని మళ్ళించడానికి, బాబ్రీ మసీదుపై అశ్వమేధయాత్రకు
బయలుదేరారు అద్వాని. ఏనుగుకు రెండు రకాల దంతాలున్నట్లు బీజేపీ కార్యక్రమాలకూ రెండు
పార్శ్వాలుంటాయి. కనిపించే కొన్ని; కనిపించని కొన్ని.
అద్వానీ రథాన్ని అడ్డుకున్నది
ముస్లింలుకారు; ఆ శక్తి వాళ్ళకు ఎలాగూలేదు. మండల్ సిఫార్సులకు వ్యతిరేకంగా,
కమండలం ధరించిన అద్వానీని,
బీ.పీ. మండల్ స్వరాష్ట్రమైన బీహార్ లో, మండల్
రాజకీయ వారసుడూ ఆయన కులస్తుడూయైన లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకుని అరెస్టుచేయడం చరిత్రలో
నెగేషన్ ఆఫ్ నెగేషన్ కు అద్భుత ఉదాహరణ.
అద్వానీ అరెస్టుతో వీ.పీ. సింగ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ మేరకు తాత్కాలికంగానైనా, బీసీల రిజర్వేషన్లను ఆపగలగడం అద్వాని
సాధించిన విజయమనే భావించవచ్చు. అయితే, అద్వానీని అరెస్టుచేసింది లాలూ ప్రసాద్ యాదవ్ కావడంతో ఖంగుతిన్న
సంఘ్ పరివారం అణగారిన కులాల్ని అణగారిన కులాతోనే ఎదుర్కోవాలనే కొత్త గుణపాఠాలు
నేర్చుకుంది. ఈ పవిత్ర యుద్ధంలో సైన్యాధిపతి ఎల్. కే.
అద్వానీకి దళపతిగా కళ్యాణ్ సింగ్ ను ఎంపికచేసింది. అణగారిన వర్గాల్ని హిందూత్వ శిబిరంలోనికి
తేవడంతోపాటూ వాళ్ళతో బాబ్రీ మసీదును కూలగొట్టే సైన్యాన్ని నిర్మించే బాధ్యతనూ అణగారిన వర్గాలకే చెందిన కళ్యాణ్ సింగుకు
అప్పచెప్పడంలోనే సంఘ్ పరివార్ తెలివి
వుంది. మండల్
రిజర్వేషన్లను అమలు పరచడానికి, వీ.పీ. సింగ్ పధాని పదవిని త్యాగంచేస్తే బాబ్రీ మసీదును కూల్చడానికి, కళ్యాణ్ సింగ్, ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. అణగారిన
కులాల రాజకీయాల్ల కళ్యాణ్ సింగ్
ప్రతికూల పార్శ్వామైతే లాలూ ప్రసాద్ యాదవ్ అంతకన్నా బలమైన అనుకూల పార్శ్వం.
ముస్లిం రిజర్వేషన్లు జాతి
సమైక్యతకు ఘాతం కల్గిస్తాయని 'బీసీ మిత్రులు' ఎక్కడా
వ్యాఖ్యానించనిమాట వాస్తవం. అందుకు, వారికి, ధన్యవాదాలు చెప్పాల్సేవుంది. అయితే, బీసీ మిత్రుల మిత్రులైన గుంటూరుజిల్లా బీసీ
ఉద్యోగుల సంఘం, ప్రధాన కార్యదర్శి, వై. వెంకటరత్నం వ్యాసంలో
ఇలాంటి వ్యాఖ్యలు రెండుమూడు సందర్భాలలోఉన్నాయి. (ఆంధ్రజ్యోతి; 24 మే 2005). ''ముస్లింల సంతుష్టీకరణ'', ''సమాజ విచ్ఛిత్తి'', ''దేశవిచ్ఛిత్తీ'' తదితర
పారిభాషిక పదాల్న సంఘ్ పరివార్ శిబిరం నుండి అరువు తెచ్చుకున మరీ వాడారు వై. వెంకటరత్నం.
అణగారినవర్గాలకు ప్రత్యేక రక్షణ
కల్పిస్తే సామాజిక శాంతి నెలకుంటుంది. పాలక
వర్గాలకూ, పాలిత
వర్గాలకూ మధ్య ఘర్షణ తగ్గుతుంది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే హిందూవులపట్ల ప్రభుత్వంపట్ల
ప్రజాస్వామిక వ్యవస్థపట్ల, ముస్లింలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందేగానీ, తగ్గదు. సామాజిక వాస్తవాలను తలకిందులుగా చిత్రించి, సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం, సంఘ్ పరివారానికి కాషాయంతో
పెట్టిన విద్య. సమాజ విచ్ఛిత్తి, దేశవిచ్ఛిత్తీ వంటి భయాందోళనల్ని
ప్రచారం చేయడం కూడా, వారికి కొత్త ఎత్తుగడేమీకాదూ. ఈ ప్రచారాన్ని ముస్లింలకు
వ్యతిరేకంగా మాత్రమే సంఘ్ పరివారం,
ప్రయోగిస్తున్నదనుకున్నా పొరపాటే.
ఈ పెత్తందారీ కులాలే ఆరు దశాబ్దాల క్రితం అణగారిన కులాలకు వ్యతిరేకంగా ఇలాంటి భయాందోళనల్నే ప్రచారంలో పెట్టిన విషయాన్నీ,
పెత్తందారీ కులాలపై పెరియార్ సాగించిన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఇప్పటి బీసీ మిత్రులు పూర్తిగా
మరిచిపోయినట్టున్నారు. అణగారిన కులాలకు ప్రత్యేక రక్షణ లేనపుడు ద్రవిడ ప్రాంతం ఇండియన్
యూనియన్ లో ఎందుకు కలిసివుండాలని ఆ ఉద్యమం ఘాటుగానే ప్రశ్నించింది. కుల-వర్ణ
వ్యవస్థను బలపరుస్తున్నాయంటూ భారత రాజ్యాంగ అధికరణాలను తగలబెట్టింది.
1957 నవంబరు 26న, పది వేల మంది ద్రవిడ కజగం కార్యాకర్తలు భారత రాజ్యాంగ అధికరణాలను, నడివీధుల్లో తగులబెట్టారు.
వాళ్లలో, మూడువేల మంది అరెస్టై, మూడు
నెలల నుండి, మూడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షను అనుభవించారు.
కేంద్ర ప్రభుత్వం, పెత్తందారీ కులాలను
ప్రోత్సహిస్తున్నదంటు 1960 జూన్ లో
వేలాది మంది ద్రవిడ కజగం కార్యాకర్తలు, ఇండియన్ యూనియన్ మ్యాపుల్నీతగలబెట్టారు. (డబ్లూడబ్లూడబ్లూ.తమిళ్ నేషన్.ఓఆర్ జి/ హండ్రెడ్
తమిల్స్/పెరియార్.హెచ్ టీయం)
తమ పూర్వికులు సాగించిన ఉద్యమాలను, అణగారిన
కులాల నాయకులు, మరిచిపోవడం
చారకరమే. గానీ; తమ పూర్వికుల చేతుల్లో ఓడిపోయి, తుప్పుపట్టిన ఆయుధాలను;
ఇప్పుడు ముస్లింలపై ప్రయోగించాలనుకోవడం, అంతకన్నా బాధాకరం.
( రచయిత సీనియర్ పాత్రికేయుడు)
హైదరాబాద్
1 జూన్ 2005
ప్రచురణ :
ఎడిట్ పేజీ, ఆంధ్రజ్యోతి; 7 జూన్ 2005
No comments:
Post a Comment