Sunday, 18 July 2021

Answer to Ravi Narla

 ఆచరణాత్మక అంశాల్ని భావోద్వేగ అంశాలుగా మార్చకండి. 

డానీ

 

ఆచరణాత్మక అంశాల్ని భావోద్వేగ అంశాలుగా మార్చడం ఫ్యూడలిజం లక్షణం. ఈ విద్యలో ‘విప్లవ’ ప్రతినిధులు ఆరితేరారు.

          హరిభూషణ్‌, సారక్క  లకు నివాళి అర్పిస్తూ పాణీ రాసిన  ‘అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...’  (ఆంధ్రజ్యోతి, జులై 2)  మీద నేను స్పందిస్తూ  ‘ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ?’ (ఆంధ్రజ్యోతి, జులై 7)  అని అడిగాను. దీని మీద రవి నర్ల స్పందిస్తూ  ‘విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి’ అని రాశారు (ఆంధ్రజ్యోతి, జులై 16) . నా స్పందన తొలి వాక్యంలోనే “వారిద్దరి త్యాగం చాలా గొప్పది. అందులో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు” అన్నాను. ఇందులో రవికి  అవహేళన ఎక్కడ కనిపించిందో  తెలీదు.

 

          నిజానికి పాణీ నివాళీలో వాళ్ళిద్దరి విప్లవాచరణ గురించి ఒక్క వాక్యం  కూడ లేదు. వాళ్ళిద్దరికి నివాళులర్పించే వంకతో ఆయన అస్తిత్వ సమూహాల మీద దాడి చేయదలిచారు.  దానినే నేను తప్పుపట్టాను.

 

          భారత అణగారిన సమూహాలు కమ్యూనిస్టులకు వందేళ్ళ సమయం ఇచ్చాయి. అంటే నాలుగయిదు తరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు తమ కార్యక్రమం మీద స్పష్టమైన అవగాహనలేదు. కార్యక్రమం మీదనే స్పష్టమైన అవగాహనలేనపుడు అవి చేయగలిగింది ఏమీవుండదు.

 

          కార్ల్ మార్క్స్ చెప్పిన సాంప్రదాయ సోషలిజాన్ని తమ దేశాలకు అనువుగా మోడిఫై చేసుకోవడంవల్లనే లెనిన్ రష్యాలో, మావో చైనాలో, హోచిమిన్ వియత్నాంలో విప్లవాలను సకాలంలో విజవంతం చేసుకోగలిగారు. అలాంటి సృజనాత్మకత మన కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నడూలేదు. అయితే రష్యానో, కాకుంటే చైనానో కాపీ కొట్టారు. వర్తమాన సమాజాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోగలిగినవారే దానికి పరిష్కారంగా ఒక సృజనాత్మక   కార్యక్రమాన్ని రూపొందించుకోగలరు. లేకుంటే 1929 నాటి చైనా కార్యక్రమాన్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ వుంటారు.

 

          మన సమాజం అర్ధ వలస, అర్ధ భూస్వామ్యమనేది కమ్యూనిస్టుల పురాతన అవగాహన. దానిని బట్టే ‘వ్యవసాయ విప్లవం ఇరుసుగాగల నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే కార్యక్రమం  రూపొందుకుంది. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓ ఇరవై ఏళ్ళుగా విప్లవ పార్టీలు   దీన్ని “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం“ అంటున్నాయి. “మన దేశంలో రాజ్యం, రాజ్యవ్యవస్థలు హిందూత్వవాదులకు దన్నుగా నిలుస్తున్నాయనీ, మత మైనారిటీలపై ముఖ్యంగా,  ముస్లింలపై చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయనీ అందువల్ల హిందూ మతతత్వం ప్రధాన ప్రమాదకారిగా పరిణమించిందని 1990 లలోనే బి‌జే‌పి అధికారంలోకి రాక ముందు రెండున్నర దశాబ్దాల క్రితమే విశ్లేషించి అందుకనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకున్నది” అని రవి నర్ల అంటున్నారు.  వారు చెప్పిన తేదీ నుండే లెఖ్ఖలు వేసుకున్నా, గడిచిన 30 సంవత్సరాలలో “ముస్లింలపై చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న” సమాజానికి విరుగుడుగా వాళ్ళు చేసిందేమిటీ?  అస్తిత్వ సమూహాల జాబితా నుండి ముస్లింలను మినహాయించడం తప్ప. చెపుతున్నదానికీ చేస్తున్నదానికీ ఏదైనా పొంతన వుందా? సమాజ స్వభావం మారిందని మీరే అంటున్నపుడు పార్టీ కార్యక్రమం వ్యూహాలు, ఎత్తుగడలు మారాలిగా? మీ కార్యక్రమం మారలేదని తప్పుపడితే ‘విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి’ అంటారా?

         

భారత కమ్యూనిస్టు పార్టీ తొలినాళ్ళలో ఎంతో మంది ముస్లింలు నాయకత్వ స్థానానికి ఎదిగినప్పటికీ ఆ సమాజం నుండి వచ్చిన వారు ఇప్పుడు లేరని రవి నర్ల అన్నారు. ఇది వాస్తవాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటన. 1921లో తాష్కెంట్ లో భారత కమ్యూనిస్టు పార్టిని స్థాపించించిందే ముస్లింలు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో 90 శాతం మంది ముస్లింలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి థింక్ ట్యాంక్ గా పనిచేసిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ లో మళ్ళీ 90 శాతం మంది ముస్లీంలు. తెలంగాణ సాయుధపోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించింది మాత్రం ముస్లీంలు కాదు. పోరాటం పీక్ సమయంలో ఆయుధాలను దించివేయడం మూలంగా తెలంగాణలో కొన్ని వేల మంది ముస్లింలు చనిపోయారు.  ఎలా నమ్మేదీ?

 

“(అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్థ అయినా, పెట్టుబడీదారీ వ్యవస్థ అయినా) ప్రస్తుతం దేశ ప్రజానీకంపై జరుగుతున్న ఫాసిస్టు దాడులను ప్రతిఘటించడానికి కలిసి పనిచేయడానికి ఆటంకం కావలసిన అవసరం లేదు. ఇంకా ఎన్నో రైతాంగ, కార్మిక, విద్యార్థి, ఆదివాసీ, మహిళా సమస్యలపై గానీ, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా కానీ ప్రజా పోరాటాలు నిర్మించడానికి గానీ, సంయుక్తంగా కలిసి పని చేయడానికి గానీ అడ్డు రావలసిన పని లేదు”. “..... అందులోనూ ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య అని ప్రస్తావించి వీటి గురించి ఏ వైఖరి చేపట్టాలి, ఏ చర్యలు చేపట్టాలి అని (విప్లవోద్యమం) విస్పష్టమైన వైఖరితోనే ఉంది” వంటి అతిశయాలు రవి నార్ల ఉపన్యాసంలో వున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ పేటలో  విప్లవోద్యమం ఈ “స్పష్టమైన వైఖరిని” అమలు చేసిందో  ఒక్క ఉదాహరణ చెప్పినా ముస్లీం సమాజం విని ఆనందిస్తుందిగా!

 

ముస్లింలకు ప్రధాన సమస్య ఎన్డిఏ. దాన్ని ఓడించే ఎత్తుగడ మీకేమయినా ఉందా? అని నేను సూటిగా అడిగాను. “ఎన్‌డి‌ఏ కూటమిని ఓడించడానికి ఒక పార్లమెంటరీయేతర ఉద్యమంగా విప్లవోద్యమం ప్రత్యక్షంగా చేయగలిగేది లేదు” అని రవి నర్ల కూడ సూటిగా సమాధానం చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు.  అయితే ఈ ‘పార్లమెంటరీయేతర ఉద్యమం’ అనే మాట ఏమాత్రం నిజాయితీగా లేదు. మీకు నచ్చినపుడు ఎన్టీఆర్ కు మద్దతు ఇచ్చారు. చెన్నారెడ్డికి మద్దతు ఇచ్చారు. రాజశేఖర రెడ్డికి మద్దతు ఇచ్చారు. కేసిఆర్ కు మద్దతిచ్చారు.   ముస్లింల అంశం ఎజెండా మీదకు రాగానే  మాది ‘పార్లమెంటరీయేతర ఉద్యమం’ అంటారా?  గ్రేట్.  ముస్లింల సమస్యను పరిష్కరించాలనే నిజాయితీ మీకు లేదు. ఈ ముక్కే మీనోటితో చెప్పించదలిచాను. మీరు చెప్పారు. అందుకు ధన్యవాదాలు.

 

18 జులై 2021

Friday, 16 July 2021

Dissuade Slaughter Of Cows On Bakrid

బక్రీద్ కు ఆవుల్ని ఖుర్బానీ ఇయ్యవద్దు,

 

            నరసాపురం టేలర్ పేట మసీదు వీది మొత్తం ఒకటే కుటుంబం. ఐదు  తరాలు ఒకేచోట జీవించేవాళ్ళం. జనాభా వంద వరకు వుంటుంది. వందేళ్ల క్రితం ఆదిమ నాలుగు కుటుంబాలూ ఐశ్వర్యవంతులుగా జీవించారు. నా బాల్యం నాటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకే ఒక కుటుంబం ఐశ్వర్యవంతులుగా వుండేది. మిగిలినవాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, నిరుపేదలుగా మారిపోయారు.

 

            ఐశ్వర్యవంతులయినా, నిరుపేదలయినా మా ఆహారపు అలవాట్లు  ఒకేలా వుండేవి. మాకు నాన్ వెజ్ అంటే సీఫుడ్, లేదా వేట మాంసం. మా సాంప్రదాయ జాబితాలో కోడిమాసం, బొమ్మిడాయిలు, కొర్రమేను చేపలు కూడ లేవు. బీఫ్ అసలేలేదు. ఐశ్వర్యాన్ని కోల్పోయి నిరుపేదలుగా మారిపోయి బంధువుల ఇళ్ళల్లో పాచీపనులు చేసుకుని తిరిగే కుటుంబం కూడ బీఫ్ తినేది కాదు.

            బీఫ్ అనేది అలవాటుకు సంబంధించిన అంశమేగానీ,  పేదరికానికి సంబంధించిన అంశంకాదు. నిజాం సంస్థానంలో ముస్లిం ధనవంతులు కూడ బీఫ్ తింటారు.  ఆంధ్రా ప్రాంతంలో ముస్లింలలో  30-40 శాతం మాత్రమే బీఫ్ తింటారు.  60-70 శాతం తినరు. మాకుటుంబాల్లో  మరో ప్రత్యేకత ఏమంటే ఎవ్వరూ మీసాలు తీసేసి, గడ్డాలు పెంచేవారు కాదు. మసీదు ఇమాం ఒక్కరే సాంప్రదాయ దుస్తుల్లో వుండేవారు. వారొక్కరికే మా వీధి మొత్తంలో గడ్డం వుండేది.

 

            కమ్యూనిస్టు పార్టీల్లో  సభలు జరిగినపుడు నాన్ వెజ్ గా బీఫ్ వండుతారు. అలవాటులేని వ్యవహారం కనుక తినడానికి నేను ఇబ్బంది పడేవాడిని. ఎస్సీ సమూహాల్లో పనిచేసే సందర్భాల్లోనూ బీఫ్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది. సంస్థాగత వ్యవహారంగా మారినపుడు తినకతప్పదు. నాకు వీలున్న చోట అలవాటు లేదని చెప్పి తప్పించుకునేవాడిని.

 

            నాలుగు రకాల మాంసాల్ని మనం అందరం సాధారణంగా  బీఫ్ అంటాం. దున్నపోతు, గేదే,  ఎద్దు, ఆవు మాంసాలు ఈ జాబితాలో వస్తాయి.  మన దేశంలో బీఫ్ మీద ఒక వివాదం వుంది. నిజానికి ఈ వివాదం ఆవు (గో) మాసం మీద మాత్రమే. మిగిలిన మాంసాల మీద వివాదంలేదు. మాసం వ్యాపారులు కూడ సాధారణంగా ఆవును కోయరు.

 

            కేరళతో సహా  అనేక రాష్ట్రాల్లో దున్నపోతు, గేదే మాంసాల్ని బీఫ్ గా హొటళ్ళలో హాట్ కేకుల్లా అమ్ముతుంటారు. మళయాళం టీవీల వంటల కార్యక్రమాల్లో రకరకాల బీఫ్ వంటల గురించి వుంటాయి. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సినిమాల్లోనూ బీఫ్ ప్రస్తావన వుంటుంది. హీరో చాలా ఇష్టంగా బీఫ్ తింటాడు. వివాదాల కారణంగా బీఫ్ బోర్డుల మీద ఇటీవల బ్రాకెట్లో  ‘బఫెలో మీట్’ అని రాస్తున్నారు. 

 

            బీఫ్ తింటారని ముస్లింల మీద బిజేపి కార్యకర్తలు అక్కడక్కడా  డాడులు చేస్తుంటారు. నిజానికి బీఫ్ మీద బిజేపికి ఒక జాతీయ విధానం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ ను నిషేధించాలని బిజేపి ఎన్నడూ అనదు. కేరళలో అయితే ఏకంగా తాము గెలిస్తే క్వాలిటీ బీఫ్ ను పంపిణీ చేస్తామని బిజెపి అభ్యర్ధులు ఎన్నికల్లో వాగ్దానం చేస్తుంటారు.

 

            బీఫ్ ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా తరువాత భారత్ ది నాలుగవ స్థానం. అమెరికాతో దాదాపు సమానంగా భారత్ బీఫ్ ను ఎగుమతి చేస్తుంది.  బీఫ్ ను ఎగుమతి చేసే కంపెనీలన్నీ ముస్లింలవని చెప్పడం కూడ కుదరదు. ముస్లిమేతరులే ఈ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో వున్నారు.

 

            నేను హైదరాబాద్ కు మారాక ఒక సంఘటన జరిగింది. నేను అప్పట్లో సి-టీవీలో సెక్రటేరియట్ రిపోర్టరుగా వున్నాను. ఒకరోజు ముస్లిం సాంప్రదాయ దుస్తుల్లోవున్న ఒకతను సిటీవీ ఆఫీసులో నా గదిలోనికి వచ్చాడు. అప్పటికి ఓ పది రోజుల్లో బక్రీద్ (బలిదానాల) పండుగ జరుగనుంది.

 

            వచ్చినవాడు తనను పరిచయం చేసుకుని “ఆవును ఖుర్బానీ వేస్తున్నాం; మీరు వాటా కలుస్తారా?”  అని అడిగాడు. అతని అతి చొరవకు నాకు చాల చిరాకు వేసింది.  ఓ నలుగురు ఛాందసుల్ని పోగేసి అందులో నాలుగు డబ్బులు కొట్టేయడానికి బయలుదేరిన బ్రోకర్ గా కనిపించాడు అతను. ఒక్కమాటలో “ఫో బయటికి” అని అతన్ని గెంటేయవచ్చు. కానీ, అతని మూర్ఖత్వాన్ని ఎండగట్టాలని అనిపించింది నాకు.

 

            “ఖుర్బానీ సాంప్రదాయం మా ఇంట్లోలేదు. మానాన్నగారి హయాంలో ఖుర్బానీ వేసేంత ఆర్ధిక స్తోమత మాకు లేదు.  నా హయాంలో, బక్రీద్ రోజు మా పేటలోవుండే ఓ నలుగురు పేదలకు భోజనం పెడతాము, బంధుమిత్రులతో కలసి భోజనం చేస్తాము. అంతేగానీ ఖుర్బానీ  ఎప్పుడూ ఇవ్వలేదు. నా వరకు పేదలకు భోజనం పెట్టడం ముఖ్యం. నా దగ్గర డబ్బులుంటే ఓ గొర్రె కొని ఖుర్బానీ వేస్తా. మధ్యలో ఈ ఆవులో వాటాల గోలేంటీ?” అన్నాను.

 

            “ఆవును ఖుర్బానీ ఇస్తే  పుణ్యం ఎక్కువ?” అన్నాడు అతను నన్ను ఊరించడానికి.  

            ‘ఎవరు చెప్పారూ?” అని అడిగాను.

            “హదీస్, సున్నత్”  అన్నాడతను.

నేను ఆంధ్రా ముస్లింని కనుక ఇస్లాం ధార్మిక అంశాల గురించి మాకు ఏమీ  తెలియదని అతని నమ్మకం.

 

            నాకు చిర్రెత్తు కొచ్చింది. ఖురాను, హద్దీస్, సున్నత్ లు  ఆమూలాగ్రం నాకు తెలుసని అనలేనుగానీ, నా ధార్మిక గురువు మా అమ్మీ మూలంగా ఇస్లాంలో కీలక అంశాల వరకు  నాకు కొంత పరిజ్ఞానం వుంది.

 

            “హదీస్, సున్నత్ లో ఎక్కడ వుందీ ఆవుమాసం తినాలనీ?” అని మళ్ళీ రెట్టించాను. ఒక ఆంధ్రా ముస్లిం ఇలా అడుగుతాడని అతను ఊహించలేదు. షాక్ తిన్నాడు.

 

అతనేదో చెప్పడానికి ప్రయత్నించాడు. నేను అతనికి అవకాషం ఇవ్వదలచలేదు.

 

            “చూడు భాయీ! నీకు రెండు విషయాలు తెలియాలి. మన భారతదేశ ఆవులు వేరు; అరేబియా ఆవులు వేరు. మన అవులకు మూపురం వుంటుంది. అక్కడి ఆవులకు మూపురం వుండదు. అక్కడి ఆవులు  తెల్ల గేదెల్లా వుంటాయి. అవి గేదెలతో సమానం. రెండోది; ఖురాన్ కథనం ప్రకారం ఆరోజు హజ్రత్ ఇబ్రాహీంగారు బలి ఇచ్చింది ‘దుంబా’ని.  అది మన గొర్రెల జాతికి చెందిందేగానీ, గొర్రె కాదు. ఖుర్బానీ వేస్తే దుంబాని వేయాలి; లేకుంటే గొర్రెను వేయాలి. మధ్యలో ఈ ఆవు ఎక్కడి నుండి వచ్చిందీ? “ అని నిలదీశాను. 

            అతనికి అప్పటికే కళ్ళు బైర్లుకమ్మాయి. వాదించడానికి అతని దగ్గర ధార్మిక అంశం లేదు.  టాపిక్ ను రాజకీయాల్లోనికి మార్చే ప్రయత్నం చేశాడు.

 

“బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ వాళ్ళకు మనం బుధ్ది చెప్పాలి” అన్నాడు.

“ఇప్పుడు మీరు అసలు రూపానికి వచ్చారు. మీ రాజకీయం కోసం ఖురాను, హద్దీస్, సున్నత్ లను వాడకండి” అన్నాను.

 

“మరి వాళ్ళు చేస్తున్నది సరియినదేనా?” అన్నాడు.

 

“వాళ్ళూ కరెక్టుకాదు; మీరూ కరెక్టు కాదు. వాళ్ళు  ధార్మిక అంశాల్ని రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయ అంశాన్ని ధార్మికంగా మారుస్తున్నారు. ఏంటీ తేడా? ” అన్నాను.

 

“వాళ్ళను అలా వదిలెయ్యాలా?”

 

“బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ లను నిలవరించాల్సిందే; కానీ దానికి ఇది మార్గం కాదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి.  బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కోసం ఆవును బలి ఇస్తే మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి. మీరు మీ చెత్త బుర్రలతో హిందువులందర్నీ ముస్లింలకు శత్రువులుగా మారుస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. నీకు డబ్బులు అవసరం అయితే వంద రూపాయలు కావాలని అడుగు; ఇస్తాను. నువ్వు ఆఫీసులో కొచ్చి మాట్లాడావుగాబట్టి వదిలేస్తున్నాను.  ఇదే మాట రోడ్డు మీద అనుంటే నిన్ను తన్ని వుండేవాడిని.” అన్నాను అవేశంగా.

 

అతను మాట్లాడకుండ వెళ్ళిపోయాడు.

ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లోనూ వుంటారు. అందరూ వాళ్ళను దూరంగా వుంచాలి.

 

            ఆహార సేకరణ కాలంలో ఆవులు గేదెలు మేకలు గొర్రెల్ని ఆహారం కోసమే పెంచేవారు. వ్యవసాయం అభివృధ్ధి చెందాక దృక్పధం మారిందని చరిత్రకారులు చెపుతారు. శంకరాచార్యుడు వచ్చే వరకు బ్రాహ్మణులు మాంసాహారులేనని కూడ చరిత్ర చెపుతోంది. వాళ్ళు గోమాంసం కూడ తినేవారని వేదాల్లో వుందని   కొందరు అంబేడ్కరిస్టులు అంటుంటారు. తాబేలు, చేప, సింహం,  వరాహం కూడ విష్ణుమూర్తి అవతారాల్లో వున్నాయి విఘ్నేశ్వరుడ్ని పూజించకుండ హిందూ సమాజం ఏ పనీ మొదలు పెట్టదు. ఆ జీవులన్నింటి మీద లేని వివాదం ఒక్క గోవు మీదనే ఎందుకని కొందరి సందేహం. 

 

            ఎవరి ఆహార అలవాట్లు వారివి. ఒకరి ఆహారపు అలవాట్లలో మరొకరి జోక్యం  అనవసరం అనే వాదనలూ వున్నాయి. బీఫ్ తినే హక్కును నిలబెట్టుకోవడానికి ఆ మధ్య ఉస్మానియా యూనివర్శిటీలో కొందరు అంబేడ్కరిస్టులు  బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు.  దానికి పోటీగా మరికొందరు ఆకతాయిలు పోర్క్ ఫెస్టివల్ జరిపారు. అదో ఫన్నీ వ్యవహారం.

 

            వాళ్ళు ఎలాగూ దాడి చేయదలచుకున్నారు కనుక ఒకవేళ ముస్లింలు బీఫ్ ను వదిలేసినా వాళ్ళ మీద దాడులు కొనసాగుతాయనే మాట కూడ వుంది. బీఫ్ సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్యను ముందుకు తెస్తారు అన్నవాళ్ళూ వున్నారు. అవన్నీ నిజమేగానీ, వర్తమాన సమాజంలో సాధారణ హిందూ సామాజికవర్గాలు ఆవును గోమాతగా భావిస్తున్నాయి కనుక వాళ్ళ మనోభావాలను గౌరవించడమే మంచి సాంప్రదాయం. అదొక గుడ్ గెశ్చర్. పేదరికంవల్ల ప్రొటీన్ డైట్ గా బీఫ్ తినే సమూహాలకు ప్రత్యామ్నాయంగా బఫెలో మీట్ ఎలాగూ వుంది. ఇకముందు బీఫ్ అనవద్దు బఫెలో మీట్ అనండి సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.  

 

            దీన్ని దృష్టిలో  పెట్టుకుని రేపు బక్రీద్ సందర్భంగా ఎట్టి పరిస్థితిలోనూ గోవుల్ని బలి ఇవ్వవద్దని ముస్లిం సమాజాన్ని కోరుకుంటున్నాను. కొన్నేళ్ళుగా అనేక ముస్లీం ధార్మిక సంస్థ (జమాత్)లు కూడా గోవధ వద్దంటున్నాయి. ఆ మేరకు ఫత్వాలున్నాయి. వాటిని గౌరవిద్దాం.

 

రచన 16 జులై 2021

ప్రచురణ 20 జులై 2021

ఆంధ్రజ్యోతి డైలీ

 

https://epaper.andhrajyothy.com/c/7BB70F5237F02D0B244B57CA49794958

https://www.andhrajyothy.com/telugunews/what-does-the-quran-say-about-bakrid-qurbani-192107200258259

Wednesday, 7 July 2021

Social Media Profile

Social Media Profile 

మన ఆలోచనలు అభద్రలోకానికి ఉత్తేజాన్ని ఇవ్వాలి; మంచి రోజులు రాబోతున్నాయనే నమ్మకాన్ని కలిగించాలి.

కలియుగం అంటే నిజం చేదుగానూ, అసమ్మతి అసహనంగానూ మారిపోయి న్యాయం అందుబాటులో లేకుండా పోయే కాలం. 

కలియుగం అంటే నిజం చేదుగానూ, భిన్నాభిప్రాయం అసహనంగానూ మారిపోయి న్యాయం అందుబాటులో లేకుండా పోయే కాలం. 

జీవనశైలులు రెండే కూలిపోయిన జీవితాన్ని నిర్మించడం, నిర్మించిన జీవితాన్ని కూల్చుకోవడం.

Friday, 2 July 2021

What should be done to defeat NDA in 2024 elections

For publication in edit page of Andhrajyothi daily.

ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ?

డానీ 

హరిభూషణ్‌, సారక్క  లకు పాణీ నివాళి ‘అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...’  (ఆంధ్రజ్యోతి, జులై 2)  శ్రధ్ధగా చదివాను. వారిద్దరి త్యాగం చాలా గొప్పది. అందులో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి.

 వారు ఏ విప్లవోద్యమంలో పాల్గొన్నారూ? అది వ్యవసాయిక విప్లవమా? నూతన ప్రజాస్వామిక విప్లవమా? మరేదయినా విప్లవమా?

 నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ 1920వ దశకంలో చైనాలో పుట్టింది. నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం. నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగంగా వ్యవసాయ విప్లవాన్ని పూర్తి చేయడం. ముందు గ్రామాలను విముక్తి చేయడం. తరువాత పట్టణాలను విముక్తి చేయడం వగయిరాలు దీని రోడ్ మ్యాప్. గడిచిన శతాబ్ద కాలంలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం ఈ రోడ్ మ్యాప్ లో ఎన్నిమైలు రాళ్ళను  దాటిందీ? మిగిలిన  మైలురాళ్ళను ఇంకెన్ని శతాబ్దాల్లో దాటుతుందీ? 

వందేళ్ళ క్రితపు విప్లవోద్యమ నమూనా నేటి భారత  సమాజానికి   వర్తిస్తుందా? అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ రూపుదిద్దుకుంది. ఇప్పటి సమాజాన్ని కూడా హరిభూషణ్‌, సారక్క వంటి వారు అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ గా పరిగణిస్తున్నారా? 

కొందరు మావోయిష్టులు ఇటీవల వర్తమాన సమాజాన్ని  “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” అంటున్నారు.  అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా రూపుదిద్దుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” లకు కూడా  వర్తిస్తుందా? నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం మారదా? ఇది హిందూమత రాజ్యం, “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” అయితే ప్రధాన వైరుధ్యం ఏ ఏ సమూహాలమధ్య వుంటుంది? దానికి పరిష్కారంగా హరిభూషణ్‌, సారక్కలు చూపిన మార్గం ఏమిటీ? ఈ సందేహాలకు జవాబులు పాణీ నివాళీలో ఎక్కడా కనిపించలేదు. 

               సాంఘీక అస్తిత్వ సమూహాలైన ఆదివాసులు, దళిత బహుజనులు, మహిళల ప్రస్తావన వుందిగానీ మతమైనార్టీల ప్రస్తావన విప్లవోద్యమంలో వున్నట్టు ఈ వ్యాసంలో కనిపించలేదు.  మైనారిటీల ప్రస్తావన లేకపోవడం అంటే “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” మీద పోరు విప్లవోద్యమ అజెండాలో లేదని అర్ధం. 

గురజాడ కన్యాశుల్కంలో జట్కావాలకు వచ్చిన సందేహంలాంటిది నాకూ ఒకటుంది. ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ? అని. అలాంటి కార్యక్రమం ఏదైనా వుందా?  లేకుంటే, బాఖీ సబ్ బక్వాస్. 

2 జులై 2021

7 జులై 2021

https://andhrajyothy.com/telugunews/what-should-be-done-to-defeat-the-nda-in-the-coming-elections-192107071226630


Tuesday, 22 June 2021

Advantages Groups, Vulnerable Sections and Communist Parties భద్రలోకం, అభద్రలోకం - కమ్యూనిస్టుపార్టీలు

 భద్రలోకం, అభద్రలోకం - కమ్యూనిస్టుపార్టీలు 

విప్లవోద్యమ నాయకత్వం తన ఆలోచనా శక్తి మేరకు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటుంది. సోషలిజం తెస్తానని  భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం వందేళ్ళుగా చెపుతోంది. నూతన ప్రజాస్వామిక విప్లవం తెస్తామని ఎంఎల్ పార్టీలు 50 యేళ్ళుగా చెపుతున్నాయి. పీపుల్స్ వార్ ప్రకటించుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం చైనాలో వందేళ్ళ క్రితం నాటిది. ఒకరు కార్మికుల విముక్తి అంటున్నారు. ఇంకొకరు రైతు-కూలీల విముక్తి అంటున్నారు. వందేళ్ళలో ఐదు తరాలు సాగిపోయాయిగానీ సోషలిస్టు విప్లవంగానీ, నూతన ప్రజాస్వామిక విప్లవం గానీ పూర్తికాలేదు. ఇది కఛ్ఛితంగా కమ్యూనిస్టు  పార్టీల నాయకత్వాల చేతగానితనం. 

దేశంలో ఫ్యాక్టరీ కార్మికులు, రైతుకూలీలు మాత్రమే అణగారిన సమూహాలు కావు.  తమ సంగతి ఏమిటని మిగిలిన అణగారిన సమూహాలు ముందుగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలనే అడిగాయి. మన కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం లెనిన్, మావో, హోచిమిన్ లు కారు. వాళ్ళు తమ దేశాల్లో 5, 10 సంవత్సరాల్లో సాధించిన విజయాలను వీళ్ళు వందేళ్ళలోనూ సాధించలేకపోయారు. 

అణగారిన సమూహాల సమస్యలకు ఇప్పటి కమ్యూనిస్టు పార్టీల  నాయకుల దగ్గర సమాధానాలు లేవు. పైగా తమ సంగతి ఏమిటని అడిగిన వారి మీద  మార్క్సిజాన్ని బలహీనపరచడానికి అస్తిత్వవాదాన్ని ముందుకు తెస్తున్నారని నిందలేశారు. తమ విముక్తి మార్గం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం దగ్గర లేదని తేలిపోయిన తరువాత మాత్రమే అస్తిత్వ సమూహాలు కమ్యూనిస్టు పార్టీల్ని వదిలివేశాయి. వాళ్ళు వదిలివేసింది కమ్యూనిస్టు పార్టీలనేగానీ మార్క్సిజాన్ని కాదు. నిజానికి ఈనాటి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం మార్క్సిజాన్ని అధ్యయనం చేయడం మానేసి చాలాకాలం అయింది.   

          కమ్యూనిస్టు పార్టీలు నిజంగానే అస్తిత్వవాదాన్ని నిరాకరిస్తాయా? అంటే అదీ కాదు. తమకు నచ్చినపుడు బేషరతుగానే తెలంగాణ వంటి అస్తిత్వ ఉద్యమాలను సమర్ధిస్తాయి.  

తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించకూడదని నేను ఎన్నడూ అనలేదు. షరతులతో కూడిన  సమర్ధన వుండాలన్నాను. పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి కుదుర్చుకోవాలన్నాను. కానీ, అలా చేయలేదు. ఈనాటి తెలంగాణ పరిస్థితిని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. మావోయిస్టు పార్టి సహితం ఊహించలేకపోవడం చారిత్రక నేరం.  

సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం లేనివాళ్ళు అంటే భద్రలోకం, , సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం వున్నవాళ్ళు అంటే అభద్రలోకం ఇద్దరూ విప్లవోద్యమాల లోనికి వస్తారు. సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం లేనివాళ్ళు బయటికి పోతే యధాస్థితిలో సులువుగా సర్దుకుపోతారు. విప్లవకారులుగానూ, యధాస్థితివాదులుగానూ  ద్విపాత్రాభినయం  చేసే వెసులుబాటు భద్రలోకానికి ఎప్పుడూ వుంటుంది. సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం వున్నవాళ్ళు విప్లవోద్యమాల నుండి బయటికి పోయినా యధాస్థితితో సర్దుకుపోలేరు. వాళ్ళ జీవితాల్లో సహజంగానే  సమాజంతో వుండే ఘర్షణ కొనసాగుతుంది.

Monday, 21 June 2021

Do you know how fast the corona third wave is coming?

Do you know how fast the corona third wave is coming?

కరోనా థర్డ్ వేవ్ ఎంత ఉధృతంగా  వస్తున్నదో తెలుసా?॥

 

1.        కరోనా సెకండ్ వేవ్ అన్ లాకింగ్ ప్రక్రియ మొదలయిపోయింది. ఇప్పుడు హాట్ టాపిక్ కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తున్నదనీ?

 

2.        కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిపోతున్నప్పుడు కూడ సెకండ్ వేవ్ గురించి ఇలాంటి చర్చే జరిగింది.

 

3.        మనం చర్చిస్తామే తప్ప రానున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిధ్ధపడం. వీలయితే ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసిపడేస్తాం.

 

4.        కరోనా ఫస్ట్ వేవ్ లో మనం సిధ్దంగా లేకపోవడాన్ని అర్థం చేసుకుని క్షమించవచ్చు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిధ్ధపడక పోవడాన్ని అలా క్షమించవచ్చా?

 

5.        ఇప్పుడు కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికైనా మనం సిధ్ధపడతామా? హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్య పెంచుతామా? ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతామా? అవసరమైన వెంటిలేటర్లు సమకూర్చుకుంటామా?మందులు సిధ్ధంగా వుంచుతామా? డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్ ను నియంత్రిస్తామా? క్రోనా మృతుల అంత్యక్రియలకు అవసరమైన మేర  లాజిస్టిక్స్ ను పెంచుతామా?

 

6.        ఇవేవీ చేయకుండ మనం ఓ పన్నెండు గంటలు ఇంట్లో కూర్చొని భజన చేస్తే రోడ్డు మీద కరోనా దిక్కులేక చనిపోతుందని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తామా?

 

7.        12 గంటల తరువాత కరోనా చనిపోతుంది గనుక ఇళ్ళ కప్పులెక్కి పళ్ళాలు, చెంబులు, తప్పేళాలు వాయిస్తూ సంబరాలు  పండుగ చేసుకోమంటారా?

 

8.        మనం మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిధ్ధపడినా పడకపోయినా కరోనా మాత్రం మళ్ళీ ర్కతప్పదు అంటున్నారు నిపుణులు.

 

9.        కరోనా ఫస్ట్ వేవ్  వెనక్కు మళ్ళిన  ఆరు నెలల తరువాత కరోనా సెకండ్  వేవ్  వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వెనక్కు మళ్ళిన  ఆరు వారాల్లోనే కరోనా థర్డ్  వేవ్  వస్తుందట.

 

10.    వస్తుంద్ట కాదు వచ్చి తీరుతుందట.

 

11.   కరోనా మూడో వేవ్ రావడం అనివార్యం "inevitable" అంటున్నారు ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్  డాక్టర్  రణదీప్ గులేరియా.

 

12.   రానున్న ఆరు లేదా ఎనిమిది వారాల్లో కరోనా మూడో వేవ్ కఛ్ఛితంగా వచ్చి తీరుతుందని వారు అంటున్నారు.

 

13.   పైగా కరోనా మొదటి వేవ్ కన్నా కరోనా రెండో వేవ్ తీవ్రంగా వున్నట్టు కరోనా రెండో వేవ్ కన్నా కరోనా మూడో వేవ్ మరీ ఉధృతంగా వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

14.   కొత్తగా వస్తున్న డెల్టా వేరియంట్ చాల వేగంగా వ్యాపిస్తుంది. చాలా త్వరగా సోకుతుంది. చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుందని డాక్టర్  రణదీప్ గులేరియా వివరిస్తున్నారు.

 

15.   మహారాష్ట్రలో కరోన రెండో వేవ్ ఒక లక్షా 40 వేల మందికి సోకింది.  రాష్ట్రంలో థర్డ్ వేవ్ 8 లక్షల మందికి సోకే ప్రమాదం వుందని వారు అంచనా వేస్తున్నారు.

 

16.   కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ మూడు రెట్లు ఎక్కువ మందికి సోకింది. కరోనా రెండో వేవ్ కన్నా మూడో వేవ్ ఐదు రెట్లు ఎక్కువ మందికి సోకుతుందట.

 

17.    మామూలు మాటల్లో చెప్పాలంటే కరోనా మొదటి వేవ్ లో ఊరికి ఒక్రు చనిపోతే రెండో వేవ్ లో వీధికి ఒకరు చనిపోయారు. కరోనా థర్డ్ వేవ్ లో ఇంటికి ఒక్రు చనిపోతారట.

 

18.   కరోనా థర్డ్ వేవ్ ను కట్టడి చేయలేమా?  అంటే ఒక ప్రణ్ళిక వుంటే కట్టడి చేయవచ్చట.

 

19.   మొదటిది; సాధ్యమయినంత మందికి సాధ్యమయినంత త్వరగా  కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయడం పూర్తిచేయాలి.

 

20.   అవసరం అయితే వ్యాక్సిన్ మొదటి డోసుకూ రెండో డోసుకు మధ్య ఆరు వారాల కాల వ్యవధిని తగ్గించాలి.

 

21.   దేశంలో ప్రతి ఒక్కరూ మాస్కులు, గ్లౌజులు, శానిటైజ్ర్లు వాడాలి. సామాజికదూరం పాటించాలి. గుమిగూడడం మానివేయాలి. లాక్ డౌన్ నిబంధనల్ని కఛ్ఛితంగా పాటించాలి.

 

22. అలాగే ప్రభుత్వాలు COVID-appropriate behaviourను పాటించాలి. అంటే వైద్య సిబ్బందిని, మందుల్ని, వైద్య పరికరాల్ని, ఆక్సిజన్ ప్లాంట్లను, క్వారంటైన్ సెంటర్లనూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సిధ్ధంగా వుంచాలీ?

 

23. ఆ పని ప్రభుత్వాలు చేస్తాయా? కరోనా నియంత్రణ బాధ్యత కేంద్రానిదని ఒకరూ, కాదూ రాష్ట్ర ప్రభుత్వాలది అని మరొకరు పరస్పరం నిందలేసుకుంటూ కాలం గడుపుతాయా?

 

24.   కేంద్ర ప్రభుత్వం తప్పుచేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుచేసినా నష్టపోయేది ప్రజలే.

 

25.   త్వరలోమరోటాపిక్ తో కలుద్దాం.