Monday, 24 June 2013

Letter to Kamalapathi Rao

Danny letter
24 June 2013

సోదరుడు కమలాపతిరావుకు!
ఉత్తరాఖండ్ మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటూ రాయునది.
 
మనిద్దరి ఆవేదనలు, అభిప్రాయాలు, ఒకేలాగున్నాయి.
ఈ రోజు ఆఫీసులో కేదార్ నాధ్ రుద్రరూపం వీడియోస్ కొన్ని చూశాను. గుండె తరుక్కుపోయింది. రాజకీయ నాయకులు వేరు; భక్తులువేరు. ఏ మతానికిచెందినా వారైనా, భక్తులు స్వభావరీత్యా సాత్వికులు, దైవభీతి, పాపభీతి కలవారు.  అలాంటి అమాయక జీవులు అంత పెద్ద సంఖ్యలో నిస్సహాయంగా చనిపోవడం చాలా బాధాకరం.  1977నాటి దివిసీమ ఉప్పెన బాధితులకు మా స్నేహితులందరం కలిసి మా స్థాయిలో, పాత వస్త్రాలు, కోంద నగదు పంపించాం. ఇప్పుడు అలాంటి చిన్నపని కూడా చెయలేకపొతున్నామనే అంశమే నన్ను ఎక్కువగా బాధపెడుతోంది.

నువ్వు పంపిన ’కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు’ పూర్తిగా చదివాను.  "ప్రజల పాపాలకు శిక్ష పాలకులకు పడుతుంది అని మన ప్రాచీన స్మృతులు చెబుతున్నాయి. కాని ప్రస్తుత కలియుగంలో పాలకుల పాపాలకు శిక్షలు ప్రజలకు పడుతున్నాయి" అని నువ్వు రాసిన దానితో నాకూ బాధతో కూడిన ఏకాభిప్రాయం వుంది.

"కేదార్ నాథ్ రుద్రభూమి. భగవంతుని యొక్క రుద్రస్వరూపం సంహారాత్మక మైనది. దానికి మనాతనా ఉండదు. చెయ్యకూడని పని చేసినప్పుడు ఆ వ్యక్తిని నిర్మూలించడమే రుద్రతత్త్వం. రుద్రుని ఫాలనేత్రాగ్ని జ్వాలల్లో చావులేని మన్మధుడే కాలిపోయి భస్మమయ్యాడు. మనుషులెంత?" అన్న నీ మాటలతొ నాకు కొంత భిన్నాభిప్రాయం వుంది.

తప్పులు చేసేవాళ్ళూ, ధర్మం తప్పేవాళ్ళూ,  సాధారణంగా సమాజంలో బలవంతులై వుంటారు. వాళ్లను నిస్సహాయులు ఎదుర్కోలేరు. అంచేత, పాపుల్ని దేవుడే శిక్షిస్తే బాగుంటుందని నేనూ చాలాసార్లు అనుకుంటాను. నువ్వూ అలాంటి అభిప్రాయాన్నే చెప్పావు. కానీ, కేదార్ నాధ్ విలయంలో తప్పు చేసింది ఏవరూ? బలయిపొయింది ఎవరూ? నువ్వు చెప్పినట్టు దేవుడే ఈపని చేసివుంటే,  విచక్షణా రహితంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాంక్టు కంపెనీల అధినేతల్ని, ఆ కంపెనీలకు అనుమతులిచ్చిన రాజకీయ పార్టీలని శిక్షించివుండాల్సింది. కానీ, కేదార్ నాధ్ లో అమాయక భక్తులు వేలాదిమంది చనిపోయారు. ఏకంగా  భగవంతుని ఆలయాలే విధ్వంసం అయిపోయాయి. ఎక్కడో హేతుబధ్ధత తప్పినట్టులేదూ.

"మనుషులు సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది" అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అన్నారు, కేదార్ నాధ్  ప్రళయం తరువాత ఒక్క రాజకీయ నాయకుడూ, ఒక్క కాంట్రాక్టరూ ఇది తమ తప్పిదమని చెప్పలేదు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గుళ్ళు విధ్వంసమై, వేలాది భక్తులు చనిపోయినపుడు  దానికి కారణమైన ప్రాజెక్టు నిర్మాణ సంస్థలూ, వాటికి వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా  సంఘ్ పరివారం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని అనుకోవడం ఎవరికైనా సహజం. కానీ అలా జరగలేదు. సంఘ పరివారం మౌనంగా వుండిపోయింది. కేదర్ నాధ్ పరిసరాల్లో బాధితులకు సేవలందిస్తున్నావారిలో సంఘ పరివారం కార్యకర్తలు కూడా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు వారిని అభినందించాల్సిందే.

సంఘటనను సంఘటనగా చూడడం పరిశోధనల్లో, మొదటి అడుగు మాత్రమే. దానికి, ముందూ వెనుకా చూడాలి. జరిగినదాన్నిబట్టి జరగబోయేదాన్ని వూహించాలి. రాజకీయపార్టీలు,  నిర్మాణసంస్థలూ, దేవాలయాలు, భక్తులు, బాధితులు ఆన్నీ ఒకే మతానికి చెందినవారేగాబట్టి ఈ విషాదం వివాదం కాలేదు. ప్రస్తుత వినాశనానికి కారణంగా భావిస్తున్న అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఒకవేళ హిందూవేతరులదైతే (ముస్లింలదైతే),  సంఘపరివారం ఎలా ప్రతిస్పందించేదో ఊహిస్తే, మతతత్వాన్ని నిర్వచించడానికి ఒక సజీవ ఉదాహరణ మనకు దొరుకుతుంది.

నాకు దేవుని మీద విశ్వాసం వుంది. ఇతర దేవుళ్లని నమ్మే ఇతర మతస్తుల మీద గౌరవమూ వుంది. కానీ, ఏ మతసామాజికవర్గంలో అయినా మతతత్త్వాన్ని నేను అంగీకరించలేను. 


మతం అనేది ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం, రెండోది ఆర్ధికం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం.

పేస్ బుక్ లో నా పోస్టుల మీద వచ్చే విమర్శలకు నేను సమాధానం ఇవ్వాలనుకోను; తీవ్ర అపార్ధం చోటుచేసుకుందని భావించినప్పుడుతప్ప.

శ్రేయోభిలాషి

ఉషా యస్ డానీ






Sunday, 23 June 2013

Congress, BJP and Uttarakhand Havoc

Congress, BJP and Uttarakhand Havoc
కేదార్ నాధ్ : కాంగ్రెస్ - బీజేపిల జంటపాపం
             కేదార్ నాధ్ రుద్రరూపం వీడియోస్ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. రాజకీయ నాయకులు వేరు; భక్తులువేరు. ఏ మతానికిచెందినా వారైనా, భక్తులు స్వభావరీత్యా సాత్వికులు, దైవభీతి, పాపభీతి కలవారు.  అలాంటి అమాయక జీవులు అంత పెద్ద సంఖ్యలో నిస్సహాయంగా చనిపోవడం చాలా బాధాకరం. ఈ విలయం మానవ తప్పిదం అని గుర్తుకువచ్చినపుడు మనస్సు చివుక్కుమంటుంది. 

               ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక గడిచిన పదమూడు సంవత్సరాల్లో, కాంగ్రెస్, బీజేపి చెరో ఆరున్నరేళ్ళు ఆ రాష్ట్రాన్ని పాలించాయి. విచక్షణా రహితంగా ప్రాజెక్టులు కట్టడంవల్ల, సొరంగాలు, గనుల తవ్వకాలవల్ల, అడవులు నరకడంవల్ల ఆ ప్రాంత భౌగోళిక స్వరూపమే మారిపోయింది. పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిన్నది. పాతికేళ్లక్రితం వరకు కూడా ఉత్తరాఖండ్ లోని ఉత్తర భాగం హిందూ పుణ్యక్షేత్రాల నిలయంగా వుండేది. మనుషుల్లో నిరంతరం పెరిగిపోతున్న అత్యాశను, వర్తమాన సమాజంలో విధ్వంసమైపోతున్న మానవసంబంధాలనూ చూసి విరక్తిచెందినవాళ్ళు కాసింత మనశ్శాంతి కోసం హిమపాదాల్లోని పర్వత సాణువుల్లో గడిపేవారు. ఇప్పుడది విలాసవంతుల పర్యాటక కేంద్రంగా మారిపోయింది. గంగా జలాన్ని అందరూ స్వఛ్ఛమైనవిగా భావిస్తారు, కొందరు పవిత్రమైనవిగా కూడా నమ్ముతారు. గంగానది జన్మస్థలం హిమగర్భంలోనే ’బిస్లరీ’ ప్లాస్టిక్ నీళ్ల సీసాలు అమ్ముతున్నారంటే ఆ ప్రాంతంలో కాలుష్యం ఏ స్థాయికి పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  ఈ తీరుగా, అభివృధ్ధ్ది పేరిట ఆ రాష్ట్రంలో జరిగిన భారీ విధ్వంసానికి ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సమాన దోషులే. 

        ఉత్తరాఖండ్ లో పధ్నాలుగు నదీలోయలున్నాయి. వీటిల్లో ఏకంగా రెండు వందలకుపైగా విద్యుత్తు, మైనింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయి.  గంగానది ఉపనదులైన అలకనంద, మందాకిని నదులపై డెభ్భయికి పైగా జల విద్యుత్కేంద్రాలు నిర్మించతలపెట్టారు. ఇందులో, నది ప్రవాహ మార్గాన్ని దారిమళ్ళించే ప్రాజెక్టులు, సొరంగాలు తవ్వి కొండల్ని దాటించే ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోయల్లో సాగుతున్న భౌగోళిక విధ్వంసానికి ఇవి ప్రాధమిక  కొలమానాలు మాత్రమే!

.                                మొన్నటి వరద వుధృతికి కేదారనాధుడి ప్రధాన ఆలయం ఒక్కటితప్ప, ఆ ఆలయ ప్రాంగణం, పరిసరాలు మొత్తం నాశనం అయిపోయాయి. వరదకు జగద్గురు ఆదిశంకరాచార్యుని సమాధి కొట్టుకుపోయింది. అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అయితే, నిర్మాణపు పనుల్లో మరీ బరితెగించింది. ఇది జీవీకే హైడల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ. ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఏకంగా ఉత్తరాఖండ్ క్షేత్రపాలకురాలుగా భావించే, ధారీదేవీ ఆలయంలో మూలవిరాట్టునే పెకలించి, మరో చోటుకి తరలించేసింది. గత ఏడాది అస్సీ గంగా హైడల్ ప్రాజెక్టు ఉత్తర కాశీలో సృష్టించిన ఉత్పాతం అందరికీ గుర్తుండేవుంటుంది. 

            "మనుషులు సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది" అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నమాటలు హేతుబధ్ధంగానే వున్నాయి. అయితే,   కేదార్ నాధ్ లో అమాయక భక్తులు వేలాదిమంది చనిపోయారు. విచక్షణా రహితంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాంక్టు కంపెనీలు, వాటికి అనుమతులిచ్చిన రాజకీయ పార్టీలు సురక్షితంగా వున్నాయి. దీన్ని చూస్తుంటే ప్రకృతికి కూడా ‘వర్గపక్షపాతం’ వుందేమోనని నమ్మాల్సివస్తోంది. 

                        పూరి పీఠాధిపతి స్వామీ నిశ్చలానంద సరస్వతి కేదార్ నాధ్ ప్రాంతానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సరిగ్గానే పసికట్టారు. జూన్ మొదటి వారంలో, కేదార్ వ్యాలిని సందర్శించిన స్వామీ నిశ్చలానంద సరస్వతి దేశంలో గంగానది అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానది విషాదానికి కాంగ్రెస్, బీజేపీల్ని సంయుక్త బాధ్యులుగా స్వామీజీ పేర్కొన్నారు.

            మతాన్ని నాస్తికులు మత్తుమందు అని ఒక్క మాటలో కొట్టిపడేస్తారు. అది బాధ్యతతో చేసిన విమర్శకాదు. మతాన్ని ’నల్లమందు’ అని పేర్కొన్న కార్ల్ మార్క్స్,  సమాజంలో మతం అస్థిత్వంలో వుండడానికి మూడు కారణాలను కూడా చెప్పాడు. "మతం అనేది అణగారిన జీవులకు ఒక నిట్టూర్పు. హృదయంలేని ప్రపంచానికి ఒక హృదయం, మనస్సులేని వాతావరణానికి ఒక మనస్సు. అది ప్రజలకు నల్లమందు" ("Religion is the sigh of the oppressed creature, the heart of a heartless world, and the soul of soulless conditions. It is the opium of the people") అన్నాడు. మతాన్ని నల్లమందు అనడంలో మార్క్స్ గొప్ప వివేకాన్ని ప్రదర్శించాడు. నల్లమందు కేవలం మత్తు పదార్ధం మాత్రమేకాదు; అదొక ఔషధగుణమున్న మందు కూడా!  వెరసి మనం మతాన్ని ఒక మత్తు; ఒక మందు అనుకోవచ్చు. ఏ మోతాదు వరకు అది మందుగా పనిచేస్తుందీ, ఏ మోతాదు మించితే మత్తుగా మారుతుంది అనేది సామాజిక విచక్షణకు సంబంధించిన వ్యవహారం. 

            మతం అనేది ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం, రెండోది రాజకీయార్ధికం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం రాజకీయం. మతం మందు; మతతత్త్వం మత్తు.

                        కేదర్ నాధ్ పరిసరాల్లో బాధితులకు సేవలందిస్తున్నావారిలో సంఘపరివారం కార్యకర్తలు కూడా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు వారిని తప్పక అభినందించాలి.  చారిత్రక మందిరాల పునరుధ్ధరణ కోసం సంఘ్ పరివారం సాగించిన పోరాటాలు, నిర్వహించిన రథయాత్రల గురించి తెలియనివాళ్ళు వుండరు. హైదరాబాద్ చార్మినార్ పక్కన, చారిత్రకంగా అంతగా ప్రాధాన్యంలేని, భాగ్యలక్ష్మి గుడి విషయంలో గత ఏడాది సంఘ్ పరివారం భూమ్యాకాశాల్ని ఏకం చేసింది. ఇలాంటి నేపథ్యంలో, కేదర్ నాధ్,  ధారీ దేవి వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గుళ్ళు విధ్వంసమై, వేలాది భక్తులు చనిపోయినపుడు, ఈ విధ్వంసానికి  కారణమైన ప్రాజెక్టు నిర్మాణ సంస్థలూ, వాటికి వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా  సంఘ్ పరివారం  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని అనుకోవడం ఎవరికైనా సహజం. కానీ అలా జరగలేదు. సంఘపరివారం మౌనంగా వుండిపోయింది. సంఘ్ పరివారానికి భక్తికన్నా  రాజకీయ ఆసక్తి ఎక్కువ అనడానికి ఇది ఒక ఉదాహరణ. 

            సంఘటనను సంఘటనగా చూడడం పరిశోధనల్లో, మొదటి అడుగు మాత్రమే. దానికి, ముందూ వెనుకా చూడాలి. జరిగినదాన్నిబట్టి జరగబోయేదాన్ని వూహించాలి. కేదార్ నాధ్ విధ్వంసంలో, రాజకీయపార్టీలు,  నిర్మాణసంస్థలూ, దేవాలయాలు, భక్తులు, బాధితులు ఒకే మతసామాజికవర్గానికి చెందినవారేగాబట్టి ఈ విషాదం వివాదం కాలేదు. ప్రస్తుత వినాశనానికి కారణంగా భావిస్తున్న అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఒకవేళ హిందూవేతరులదైతే (ముస్లింలదైతే),  సంఘపరివారం ఎలా ప్రతిస్పందించేదో ఊహిస్తే, మతతత్వాన్ని నిర్వచించడానికి ఆలోచనాపరులకు ఒక సజీవ ఉదాహరణ దొరుకుతుంది.

మతం అనేది ఒక సామాజికవర్గపు అంతర్గత వ్యవహారం. మతతత్త్వం అనేది రెండు మత సామాజిక వర్గాలమధ్య వివాదం. 

హైదరాబాద్

 23 June 2013

Thursday, 20 June 2013

Suicides

డానీ కాలం
ఆత్మహత్యలు
ఏ. యం.  ఖాన్‌ యజ్దానీ

''ఒక కవి, సృష్టికర్త;
తనను తాను విధ్వంసం చేసుకున్నాడు
ఒక తత్వవేత్త, ఆలోచనాపరుడు
ఆలోచన ప్రక్రియను స్థంభింపచేశాడు''

ప్రముఖ హిందీ విప్లవ కవి గోరక్‌ పాండే 1989 జనవరిలో చనిపోయినపుడు, పాత్రికేయ మిత్రుడు మోహన్‌ రామ్మూర్తి, ఢిల్లీ నుండి వెలువడే పేట్రియాట్‌ ఇంగ్లీషు డైలీలో రాసిన న్యూస్‌ ఐటమ్‌ ప్రవేశిక ఇది.

సాటి మనిషి ఆత్మహత్య చేసుకున్నప్పుడు బాధ్యత వహించడానికి  ఎవ్వరూ సిధ్ధంగా వుండరు. ఆత్యహత్య అనేది మానసిక రోగం అని కొందరంటే, అది వాళ్ళకు బాల్యం నుండే కొనసాగిన దౌర్బల్యం అని మరి కొందరంటారు. చాలా సందర్భాలలో వాస్తవాలకన్నా, వ్యాఖ్యానాలే ఎక్కువ ప్రాచూర్యాన్ని సంతరించుకుంటాయి. ఒక రకం ఫోబియాకు గురై గోరక్‌ పాండే ఆత్మహత్య చేసుకున్నాడనేది ఒక వాదం. అన్నంలో అతనికి రక్తం కనిపించేదట. మానసిక వైద్యులు ప్రయత్నించారుగానీ అతన్ని కాపాడలేకపోయారు.  ఫలితంగా ఆయన తనను తాను చంపుకున్నాడు అనేది ఈ వాదం సారాంశం.

మనస్తత్త్వ కారణాలు, జీవధర్మ కారణాలవల్ల గోరక్‌ పాండే ఆత్మహత్యకు    పాల్పడ్డాడనే వాదనతో మోహన్‌ రామ్మూర్తి ఏకీభవించలేకపోయాడు. పాండే ఆత్మహత్యకు మరో పార్శ్వాన్ని అవిష్కరించే ప్రయత్నం చేశాడతను. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడాన్ని పాండే జీర్ణంచేసుకోలేక పోయాడు.

అప్పటి వరకు భావోద్వేగ జీవితాన్ని ఆస్వాదించిన కవికి, ప్రధాన స్రవంతిలో కలిసిపోయి బతికేయడం చేతకాలేదు. పైగా, అలా బతకాలనుకోవడం హీనం అనుకున్నాడు. ''నెత్తుటి కూడు'' తిన లేకపోయాడు. నాటి ఢిల్లీలోని ఇతర పాత్రికేయులకన్నా మోహన్‌ రామ్మూర్తికి,  ఈపార్శ్వం బాగా తెలుసు. అందుకే అ ప్రవేశిక అంతగా భావాల ఉన్నతీకరణని సంతరించుకుంది.

ఆత్మహత్యల్ని చాలా మంది  స్వీయ మానసిక సమస్యగానో, జీవసంబంధ సమస్యగానో భావిస్తుంటారు. గోరక్‌ పాండే ఆత్మహత్యను మోహన్‌ రామ్మూర్తి  రాజకీయ సమస్యగా గుర్తించాడు. తాత్విక సమస్యగా భావించాడు. అంతిమంగా దాన్ని ఒక సామాజిక సమస్యగా ఆవిష్కరించాడు.

ఆత్మహత్యల్ని మొట్టమొదటిసారిగా, సామాజిక సంక్షోభంగా గుర్తించినవాడు ఎమిలి డర్ఖేమ్‌ (1858 - 1917). ఈ ఏప్రిల్‌ 15 నాటికి డర్ఖేమ్‌ పుట్టి సరిగ్గా నూటయాభై సంవత్సరాలు. నూట పదకొండు సంవత్సరాల క్రితం, 1897లో, రాసిన  ఉద్గ్రంధం 'లా సూసైడ్‌'లో సమాజానికీ, ఆత్మహత్యలకూ మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని ఎమిలి డర్ఖేమ్‌ సవివరంగా నిరూపించాడు.

సామాజిక జీవనం అంటే అన్యోన్య, పరస్పర సంఘీభావమే అని గుర్తించినవాడు ఎమిలి డర్ఖేమ్‌. ఈ సంఘీభావం కూడా, ఏదో ఒక కుటుంబ సభ్యుల మధ్యనో, ఒక వీధో, ఒక ప్రాంతానికో చెందిన వాళ్ల మధ్యనో పరిమితమై వుండదనీ, మొత్తం సమాజ సభ్యుల మధ్య సజీవ సంఘీభావం కొనసాగుతూవుంటుందని ఆయన నిర్థారించాడు.

సంఘీభావ చారిత్రక స్వభావాన్ని నిర్థారించడంలో తన పూర్వికుల అభిప్రాయాలతో డర్ఖేమ్‌ పూర్తిగా విబేధించాడు. పురాతన సులభ సమాజాల్లో మనుషుల మధ్య  బలంగావుండే సంఘీభావం, ఆధునిక సంక్లిష్ట సమాజాల్లో బలహీన పడిపోతుందని చాలా మంది భావించేవారు. సులభ సమాజాల్లోకన్నా సంక్లిష్ట సమాజాల్లోనే సంఘీభావం బలంగా వుంటుందని డర్ఖేమ్‌ సూత్రీకరించాడు.



సులభ సమాజాల్లోని సభ్యులందరికీ ఒకేరకమైన  నైపుణ్యం దాదాపు ఒకే స్థాయిలో వుంటుంది గనుక ఒకరిపై మరొకరు ఆధారపడల్సిన అవసరం వుండదని డర్ఖేమ్‌ గుర్తుచేశాడు. సంకీర్ణ సమాజాల్లో విస్తృతమైన శ్రమ విభజన కారణంగా ఒక్కక్కరికి ఒక్కొక్క రకమైన నైపుణ్యం వుండడమేగాక, నైపుణ్య స్థాయిల్లోనూ విపరీతమైన వ్యత్యాసం వుంటుందన్నాడు. సరిగ్గా ఈ కారణం వల్లనే, సమాజంలోని సభ్యులందరూ ఒకరిపై మరొకరు అనివార్యంగా ఆధారపడతారు. ఈ పరస్పరాధార అవసరాలను క్రమబద్దీకరించే సంఘీభావాన్ని పరిరక్షించే బాధ్యతను నైతిక సమాజం నిర్వహిస్తుందన్నాడు.

నైతిక సమాజానికి ప్రాణప్రదమైన సంఘీభావం స్థాయిని అంచనావేయడానికి  డర్ఖేమ్‌ ఒక పరికరాన్ని ఎంచుకున్నాడు. అదే ఆత్మహత్య. సంఘీభావానికీ, ఆత్మహత్యలకూ మధ్య విలోమానుపాత సంబంధం వుంటుందని దర్ఖేమ్‌ నిర్థారించాడు. సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే సంఘీభావం ఎక్కువగావున్నదని అర్థం. ఆత్మహత్యల రేటు ఎక్కువగావుంటే, సమాజంలో సంఘీభావం అంతరించి పోతున్నదని హెచ్చరిక.

అచ్చంగా సామాజిక లోపాలకారణంగానే, మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారని నిర్థారించిన ఎమిలీ డర్ఖేమ్‌ ఆత్నహత్యల్ని నాలుగు రకాలుగా వర్గీకరించాడు; ఎగోయిస్టిక్‌, అల్ట్రూయిస్టిక్‌ , అనామిక్‌ , ఫాటలిస్టిక్‌.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ''తిన్నది అరక్క'' అన్న మంత్రులు మనకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు ఎక్కడా నమోదు కాకుండా రికార్డుల్ని మాయం చేసిన పాలకులు మనకు తెలుసు. ఇదేదో ప్రభుత్వ వ్యవహారమనీ, తమకేవిూ సంబంధంలేదనీ భావించే వారిలో మనందరమూ వున్నాం. సంఘీభావహీనతే ఆత్మహత్యలకు దారితీస్తుందిగనుక, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే  అతని చూట్టూవున్న మొత్తం సమాజాన్ని తప్పుపట్టాలనేది డర్ఖేం లా సూసైడ్‌ లో ప్రధానాంశం.   

భారతదేశంలో ప్రతియేటా ఆత్మహత్యల సంఖ్యేకాదు, ఆత్మహత్యల రేటు కూడా పెరుగుతోందని ఇటీవలి అనేకానేక సర్వే నివేదికలు చెపుతున్నాయి. విద్యావంతుల శాతం తక్కువగావున్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకన్నా, విద్యావంతుల శాతం ఎక్కువగావున్న కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి దక్షణాది రాష్ట్రాలలోనే ఆత్మహత్యల రేటు అధికంగా వుందనేది చేదు వాస్తవం. అందులో, మన పాత్ర ఎంత అని ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

విజయవాడ
26-04-2008


Wednesday, 19 June 2013

Notes On Religion

Notes on Religion

డానీ

18 July 2013

మతాల సామాజిక దృక్పధాలు

       భారత ఉపఖండంలో హిందూమతం అతిపురాతన మతమనీ, ఇతర మతాలు ఆ తరువాతే ఇక్కడ పుట్టాయి, లేదా ఇక్కడికి వచ్చాయి, అనే వాదనతో నాకు స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. దీని అర్ధం ఏమిటీ? హిందూమతంలోని అంతర్గత అణిచివేతని భరించలేక, అణగారిన వర్గాలు ఇతరమతాల్లోకి వెళ్ళడమో, లేక, తామే ఒక కొత్త మతాల్ని సృష్టించుకోవడమో చేశాయనేకదా!. అంటే, సాంప్రదాయిక హిందూమతంకన్నా, ఆ తరువాత పుట్టిన లేదా, వచ్చిన మతాలు, సంపూర్ణంగా కాకపోయినా, సాపేక్షకంగా అయినా  ఉదారమైనవనేకదా!

       ఇతర మతాల నుండి హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళు దాదాపు వుండరనే చెప్పాలి. కానీ, హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్ని స్వీకరించినవాళ్ల సంఖ్య  వేలు, లక్షలుకాదు కోట్లలో వుంటుంది. ఇలా మత వలసలు ఒకవైపుకే ఎందుకు వుండేవి అనేది  ఆలోచించాల్సిన విషయం.

       అణగారినవర్గాలు ఇతర మతాల్లోకి పొయే వలసలు ఇటీవలికాలం లో తగ్గుముఖం పట్టివుండవచ్చు. దానికి కారణం హిందూ మతంలో మార్పులు వచ్చాయనికాదు, రాజ్యాంగం వాళ్లకు ప్రత్యేక రక్షణ కల్పించడమే! హైందవ పెత్తందారీ కులాలు దళిత బహుజనులపై దాడులుచేయడం ఇప్పటికీ ఆగలేదు. 


Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు
       విభిన్న మతాల సామాజిక దృక్పధాలని తులనాత్మక పరిశీలన చేయాలంటే రెండు అంశాలని పరిగణణలోనికి తీసుకోవాలి. వీటిల్లో, మొదటిది ఆయా మతాలు ప్రకటించుకున్న పామాణిక గ్రంధాలు. రెండోది, చరిత్ర క్రమంలో ఆయా మత సామాజికవర్గాల ఆచరణలో వస్తున్న మార్పులు. ఈ రెండింటిలో మొదటిదానికన్నా రెండోదే కీలకం.

       హిందూ సామాజికవర్గం ఆచరణను పరిశీలించడానికి మనం గతంలోకి పెద్దగా ప్రయాణం చేయాల్సిన పనిలేదు. వర్తమానంలోనే అడుగడుగునా దానికి కొకోల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి.

       "ఆంధ్రులంతా ఒక్కటే ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్రం. ఆంధ్రుల్ని సమైక్యంగా వుంచడానికి ప్రాణల్నైనా ఇస్తాం" అంటూ సమైక్యవాదులు గొంతు చించుకుంటున్న సమయంలోనే, గత ఏడాది జూన్ రెండవవారంలో, శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, లక్ష్మింపేటలో దళితుల మీద అతి క్రూరంగా దాడి జరిగింది. మరోవైపు,"తెలంగాణలో, కులాలులేవు, మతాలులేవు, వర్గాలులేవు, అందరిదీ ఒకే స్వప్నం, ఒకే స్వర్గం" అంటూ, పండితులు, పామరులు కూడా ఒకే రాగాలాపన చేస్తున్న సమయంలోనే, రాజధాని నగరానికి కూతవేటు దూరంలోవున్న, కీసర మండలం, రాంపల్లి దాయర గ్రామంలోని దళిత కాలనీపై పెత్తందారీ కులసామాజికవర్గానికి చెందినవారు దాడులు జరిపారు.

       రాంపల్లి దాయరలో దళితులపై దాడులు జరిపినవారు సీమాంధ్రులూ కారు. లక్ష్మింపేట దళితులపై దాడిచేసినవారు తెలంగాణవారూ కాదు. బలహీనవర్గాలపై పెత్తందారీ కులాలు సాగిస్తున్న అణిచివేతకు ప్రాంతీయవాదాలు సహితం అవరోధంకాదని చెప్పడానికి లక్ష్మింపేట, రాంపల్లి దాయర సంఘటనలు సమీప, సజీవ ఉదాహరణలు. కులప్రసక్తి  వచ్చిందంటేనే అది హిందూ మతసామాజికవర్గమని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. రెండు ప్రాంతాల ప్రజలు రెండు ఉద్యమాల్లో సమైక్యంగావున్న కాలంలోనూ  కులం తన పని తాను చేసుకుని పోతున్నదని చెప్పడానికే ఆ రెండు ఉదాహరణలు పేర్కొన్నాను.




Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు
       ఇస్లాం కు మతగ్రంధం ఖురాన్. దానికి అనుబంధమైనది ప్రవక్త ముహమ్మద్ (స) జీవితాచరణ. దాన్నే హదీస్ అంటారు. హిందూ మతానికి ప్రమాణిక గ్రంధాలు వేదాలు. భగవద్గీత, రామయణ, భారతాలతోపాటూ మనుస్మృతికి కూడా మతగ్రంధాల స్థాయి వుంది.

       ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల మధ్య ఘర్షణలు జరగడం కొత్తేమీ కాదు. వాటికి రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక తదితర ’లౌకిక’ కారణాలు అనేకం వుండవచ్చు. ముస్లిం సమాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు  ఇరాన్ -ఇరాక్ యుధ్ధం ఒక ఉదాహరణ. పాకిస్తాన్ తో ఘర్షణపడి, యుధ్ధంచేసి ప్రత్యేక దేశంగా ఏర్పడింది బంగ్లాదేశ్.

       ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల విషయంలో ఇతర మతాలకూ, హిందూమతానికీ మధ్య రెండు కీలకమైన తేడాలున్నాయి. ఇతర మత సామాజికవర్గాల్లో ఈ విభజన సమమట్టంగా  (Horizontal  Stratification)  వుంటుంది. హిందూ మత సామాజికవర్గాల్లో ఈ విభజన నిలువు పొరలుగా  (Vertical Stratification)  వుంటుంది. సామాజిక అంతస్తుల దొంతరల్లో పైమెట్ల మీద వున్నవాళ్ళు, తమకన్నా కింది మెట్ల మీద వున్నవారిని సాంస్కృతికంగా తక్కువగా చూడడానికీ, వాళ్ల చేత శ్రమ చేయించుకోవడానీకీ, వాళ్లను అణిచివేయడానికీ సాంప్రదాయక హిందూసమాజంలో ధార్మిక సమర్ధన వుంది. ఇలాంటి ధార్మిక సమర్ధన ఇతర మతాల్లో కనిపించదు. ఈ అంశమే, భారత ఉపఖండంలో అనేక కొత్తమతాల అవిర్భావానికీ, మతాంతీకరణకీ దారితీశాయి.

       భారత రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ అతి పురాతన పార్టీ. ’గ్రాండ్ ఓల్డ్ పార్టి’లకు ఒక సావకాశం వుంటుంది. తమనుతాము వేరే పార్టీ వాళ్ళుగా  ప్రకటించుకున్నవాళ్ళుతప్ప దేశంలో మిగిలినవాళ్లందరూ తమపార్టీవాళ్ళే అనుకునే చెసులుబాటు ఆ పార్టీకి వుంటుంది. హిందూ నాయకులు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. దేశంలో "మిగిలినవాళ్లందరూ’ హిందువులే అంటుంటారు. అంటే, భారతీయులు మతపరంగా  రెండు రకాలు; హిందువులు, మాజీ హిందువులు. ఇది పసలేని వాదన అని నిరూపించడానికి ఎవరూ పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. బలహీనవర్గాలపై పెత్తందారీకులాలు ప్రతినిత్యం సాగించే దాడులే ఈ వాదనని ఖండిస్తూ వుంటాయి.


Danny Notes
19 June 2013


"అంరత్గత అణిచివేత" నింద నుండి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు కొందరు కృషిచేస్తున్నారు. మనుస్మృతి, భారతం, భగవద్గీత,  రామాయణం, వేదాలకన్నా ముందే భారత ఉపఖండంలో సనాతన ధర్మం అనేది ఒకటి వుండేదనీ, అదే వాస్తమైన హిందూ ధర్మం అనేది వీరు ముందుకు తెస్తున్నవాదం. ఈ రకం వాదనల్లో బలంకన్నా బలహీనతే ఎక్కువగా వుంది. వేదకాలం నుండి ఇప్పటి వరకు, బలహీనవర్గాలపై కులం, మతం పేరున సాగిన, సాగుతున్న అణిచివేత సామాజిక మహా తప్పిదమని వీరు గుర్తిస్తున్నట్టున్నారు. ఈ మహాతప్పిదాన్ని పైనుండయినా, కింది నుండయినా ఎలా సరిదిద్దుతారారనేది మన ముందున్న ప్రశ్న.





Monday, 17 June 2013

Library christened in the name of a tea vendor

కళాక్షేత్రానికి టీ కొట్టువాడి పేరు
ఉషా యస్‌ డానీ

        ఏదో పుస్తకంలో చదివిందో, ఎక్కడో విన్నదో ఈ సంఘటన.

        అక్టోబరు విప్లవం విజయవంతమయ్యాక రష్యాలో సాంస్కృతిక పునర్‌ నిర్మాణం మొదలైంది. అప్పటి వరకు రష్యాలోని అనేక నగరాలకు, వీధులకు జారు చక్రవర్తుల పేర్లో, వాళ్ల కొలువులోని ఉన్నతాధికారుల పేర్లో వుండేవి. వాటిని మార్చేపనిలో పడింది కమ్యూనిస్టుపార్టి. ఆ క్రమంలో అనేక ప్రధాన పట్టణాల  పేర్లు, వీధుల పేర్లు మారిపోయాయి.

        అప్పట్లో,  మాస్కో నగరంలో ఓ పెద్ద ఒపేరా హౌస్‌ వుండేది. ఆ ఆడిటోరియానికి కొత్త పేరుపెట్టే సందర్భం వచ్చింది. ఆడిటోరియానికి పేరు పెట్టడానికి రష్యన్లకు కవులు, రచయితలు,  కళాకారులకు కొదవ ఏముందీ?  కమ్యునిస్టు పార్టి సాంస్కృతిక విభాగం ఓ డజను మంది ప్రసిధ్ధ కవులు, రచయితలు,  కళాకారుల పేర్లను  ప్రతిపాదించి తుది నిర్ణయం కోసం లెనిన్‌ దగ్గరికి  పంపింది.

        లెనిన్‌ ఆ పేర్లన్నింటినీ పక్కనపెట్టి ఆడిటోరియానికి కొత్త పేరు పెట్టాడు. ఆ పేరు విని అక్కడున్న  కమ్యూనిస్టు ప్రముఖులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లందరికీ  సుపరిచితమైన పేరది. అతను కవికాదు. రచయితకాదు. కళాకారుడుకూడాకాదు.  మాస్కోలో ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ బంకు నడుపుకునేవాడు అతను. జీవితంలో, తెల్లకాగితం మీద అక్షరం ముక్క రాసినవాడూకాదు. అత్యంత ప్రతిష్టాత్మక  కళాకేంద్రానికి  లెనిన్‌ అతని పేరు పెడతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకు పెట్టాడో కూడా వాళ్లకు అర్ధం కాలేదు. వాళ్ల సందేహాన్ని లెనినే తీర్చాడట!

        ఉద్యమకాలంలో. అజ్ఞాతవాసంలోవున్న కమ్యూనిస్టు కవులు, రచయితలు మారుపేర్లతో పత్రికలకు రచనలు పంపించేవారు. వాటికి కేరాఫ్‌ అడ్రస్‌ గా ఆ టీ బంకు వుండేది. అంతేకాదు, రాయడానికి  కావలసిన కాగితాలు, కష్టకాలంలో జేబు ఖర్చులు వగయిరాలు ఇచ్చి ఆ  కవులు, రచయితల్ని  ఆ టీ బంకు  యజమాని ఆదుకుంటుండేవాడు.

        ”మన కవులు, కళాకారులు, రచయితల్ని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళు రాసిన రచనలున్నాయి. మరి ఆ టీ బంకు యజమాని చేసిన సాహిత్యసేవ గురించి భావితరాలకు తెలియడానికి ఏముందీ?" అని లెనిన్‌ సూటిగా అడిగాడట!

            ఈ సంఘటనను తలుచుకున్నప్పుడెల్లా నాకు ముగ్గురు ఆత్మీయులు  గుర్తుకువస్తారు. ఆ ముగ్గురూ విజయవాడవాళ్ళే. ఒకరు, ’శ్రీశ్రీ ప్రింటర్స్‌’ విశ్వేశ్వరరావు, మరొకరు ’నాగేంద్ర ప్రెస్‌’ బాబూరావుగారు. మూడవ వ్యక్తి తమ్మిన గణపతిరావు పాత్రుడు.  వాళ్ళు రాతగాళ్ళుకాదు. రాతగాళ్లంటే వాళ్లకు వల్లమాలిన అభిమానం. విశ్వేశ్వరరావు నన్ను బంధించి రాయించిన సందర్భాలున్నాయి. నేను ఒక అక్షరం రాస్తేచాలు దేశమంతా ప్రచారం చేసి వచ్చేవారు గణపతిరావు. చేపలంటే నాకు ఇష్టమని చేపలు వండించి తేవడమేగాక, స్వయంగా ముళ్ళు తీసి, తినిపించేంతటి  అక్షర ప్రేమికులు బాబూరావుగారు!

        మా ముందు తరంవాళ్ళు ’నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహన రావుగారి గురించి కూడా ఇలాంటి అభిమానపు మాటలే అనేవారు.

హైదరాబాద్‌

1 ఆగస్ట్‌ 2011 

Charu Majumdar Road

చారు మజుందార్ రోడ్డు, విజయవాడ
 ఉషా యస్‌ డానీ

విజయవాడ నివసించేది ఏలూరు రోడ్డు,  బందరు రోడ్డు మధ్య అనే నానుడి ఒకటుంది. అంటే,  ఈ రెండు రోడ్ల మధ్యనున్న  ప్రాంతంలో నివాసం వుంటున్నవాళ్ళే నగరాన్ని శాసిస్తారని దీనికి విస్తృత అర్ధం. ఇందులోని  'మధ్య' అనేమాటకు నా దృష్టిలో ఇంకో అర్ధం కూడా వుంది. ఈ రెండు రోడ్ల మధ్యగా 5 - 13 సిటీబస్‌ రూటు వెళుతుంది.  ఆ రోడ్డే విజయవాడకు కొత్త  సంస్కృతిని  నిర్ణయిస్తూవుంటుంది. 

ఇప్పుడు ఏలూరు రోడ్డును కార్ల్‌ మార్క్స్‌ రోడ్డుగానూ, బందరురోడ్డును మహాత్మాగాంధీ రోడ్డుగానూ పిలుస్తున్నారు. కానీ, 5-13 సిటీబస్‌ రూట్‌ గా లిటీల్‌ ట్రెడిషన్‌ పేరుతోనే వుండిపోయిన మొగల్రాజపురం రోడ్డుకు ఇప్పటి వరకు గ్రేటర్‌ ట్రెడిషన్‌ పేరులేదు. కానీ, ఆ ప్రాంతం మాత్రం అనేక ఆధునిక సాంప్రదాయాలకు  నిలయం. కనీసం, కస్తురిబాయిపేట గాంధీబొమ్మ దగ్గర మొదలై, ప్రజాశక్తినగర్‌, మధుకళామండపం, జమ్మిచెట్టు, సిధ్ధార్ధ ఆర్ట్స్‌ కాలేజీ, నవోదయకాలనీ, సున్నపుభట్టీల సెంటర్‌, ఆకాశవాణికాలనీ, ఐటిఐ, పాలిటెక్నిక్‌ ల విూదుగా లయోలా కాలేజీ దగ్గర రింగురోడ్డులో కలిసే  మొగల్రాజపురం రోడ్డు మేరకైనా చారు ముజుందార్‌ పేరు పెడితే బాగుంటుంది.

ఇప్పుడు అంతరించిపోయిన పుల్లేరు నది ఒడ్డున, మూడు బౌధ్ధారామాల మధ్య వెలసిన ప్రాంతం మొగల్‌ రాజపురం. అందులోనిదే నవోదయకాలనీ.  దానితో, నా అనుబంధం 1978లో మొదలైంది.  నక్సలైటు ఉద్యమ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నివశించిన కాలనీ అది. అప్పట్లో, వాళ్ళే దానికి ఆ పేరుపెట్టారని కూడా విన్నాను. నవోదయ పబ్లిషర్స్‌ రామ్మోహనరావుగారి ఇల్లూ అక్కడే. ఆ పక్కనే అరుణా పబ్లిషర్స్‌ బెల్లపు బాబూరావుగారి ఇల్లు. నా రాజకీయ గురువు  వాసిరెడ్డి వెంకట కృష్ణారావు అప్పట్లో నవోదయాకాలనీలో వుండేవారు. వారికి దగ్గరగా వుండాలని నేను కూడా మొగల్రాజపురం  చేరుకున్నాను.

ప్రజాశక్తి నగర్లో మహీధర రామ్మోహనరావు,  జమ్మిచెట్టు సెంటరులో సుంకర సత్యనారాయణ, మధుకళామండపం  దగ్గర  ద్రోణవల్లి అనసూయమ్మ, అక్కడే నేనూ, జమున, సిధ్ధార్ధ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా పరకాల పట్టాభిరామారావు, వేగుంట మోహన ప్రసాద్‌, నవోదయ కాలనీలో కొండపల్లి కోటేశ్వరమ్మ, కొండపల్లి కరుణ, వీ.వీ. కృష్ణారావు.  ఇదీ తొలి వరస.

హంగేరి మార్క్సిస్టు తత్వవేత్త జార్జ్ లుకాక్స్ అనుయాయుల  అధ్వర్యంలో లండన్‌ నుండి వచ్చే 'బ్రాడ్‌ షీట్‌' పత్రికను కృష్ణారావు.  విజయవాడలో పునర్ముద్రించేవారు. అలాగే, 'తూర్పుగాలి'  అనే మాసపత్రికను  ప్రచురించేవారు. వాటి సంపాదకవర్గంలో నన్ను చేర్చుకున్నారు. ఆ తరువాత కృష్ణారావు మొదలెట్టిన 'నడుస్తున్న చరిత్ర'కు కూడా నేను వ్యవస్థాపక సంపాదకవర్గ సభ్యుడ్ని.


తొలిదశలో, నేను పీపుల్స్‌ వార్‌ పార్టిలో రాడికల్‌ యువజన సంఘానికి కృష్ణాజిల్లా బాధ్యుడిగావున్నాను. కృష్ణారావు సూత్రధారిగా, నేను పాత్రధారిగా 1980లో  సున్నపుభట్టీల సెంటరులో రాడికల్‌ నగర్‌ వెలసింది. తరువాత దానికి, నక్సలైట్‌ అమరుడు దాసరి రమణ పేరు పెట్టాము. పార్టీవాళ్ళు మా నాన్నకు ఇచ్చిన స్థలంలోకి నా నివాసాన్ని మార్చుకోవడంతో,  నాపేరు ‘సున్నపుభట్టీల డానీ’ అయిపోయింది. దాసరి రమణ నగర్‌ లోనే మార్క్సిస్టు తత్వవేత్త   ఏటుకూరి  బలరామమూర్తి, చిత్రకారుడు టీ. వెంకట్రావు వుండేవారు. వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కూడా కొంతకాలం సున్నపుభట్టీల సెంటరులో వున్నారు. మాకు ఆనుకునివున్న ఆకాశవాణి కాలనీలో ఖాదర్‌ వుండేవాడు. ఆ పక్కనే, సి. రాఘవాచారిగారు. కొంచెం ముందుకెళితే, బెంజిసర్కిల్‌ లో తుమ్మల వేణుగోపాలరావు, కృష్ణాబాయిగార్ల ఇల్లు. అక్కడే ’శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు-ప్రమిలగార్ల నివాసం.  అటుపక్కే రావి రాంప్రసాద్‌ ఇల్లు.

నగరానికి  ఆలోచనాపరులు  ఎవరు వచ్చినా  విజయవాడ- టెన్‌ అనగా లబ్బీపేట (ఇప్పడు దాన్ని తపాలశాఖవాళ్ళు  వెంకటేశ్వరపురం అంటున్నారు) పోస్టాఫీసు పరిధిలోకే చేరేవారు.  నేను ప్రతిపాదించిన  చారు మజుందార్‌ ప్రాంతమంతా విజయవాడ-టెన్‌ పరిధిలోకే వస్తుంది.  తరువాతి కాలంలో, అఫ్సర్‌, కలైకూరి  ప్రసాద్‌, మమత, ఐవీ సురేష్‌, గుర్రం శ్రీనివాస్‌ అంతా మొగల్‌ రాజపురంలోనే వున్నారు. వేమన వసంత లక్ష్మీ, త్రిపురనేని శ్రీనివాస్‌, బుధ్ధా జగన్‌, అంతా బెంజిసర్కిల్‌ ప్రాంతంలో చేరారు.

1985 ప్రాంతంలో నక్సలైటు ఉద్యమంపై నిర్భధం పెరిగింది. వరంగల్లులో డాక్టర్‌ రామనాధం హత్య తరువాత, తెలంగాణ నక్సలైటు ఉద్యమ మేధావులు  విజయవాడకు వలస రావడం  మొదలెట్టారు. బాలగోపాల్‌, వరవరరావు అలా వచ్చినవారే. అప్పట్లో విజయవాడ ప్రభుత్వ దృష్టిలో శాంతి మండలంగా వుంది.   ఎన్‌. వేణుగోపాల్‌, కే. నరసింహాచారీ, అల్లం నారాయణ ఉద్యోగాలరీత్యా  అప్పటికే విజయవాడలో వున్నారు. కే. రామచంద్రమూర్తి, కే. శ్రీనివాస్‌, గడియారం శ్రీవత్స కూడా  అలా వుద్యోగాల రీత్యా విజయవాడ వచ్చి మొగల్‌ రాజపురాన్ని ప్రేమించినవారే! అప్పట్లో, రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర నాయకునిగా అజ్ఞాతంలోవున్న బీ. ఎస్‌. రాములుకు ఖాదర్‌ ఇల్లో, మా ఇల్లో ఆశ్రయంగా వుండేది. తరువాతి కాలంలో,  ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధోసంపత్తిని సమకూర్చడంలో వీళ్ళదే కీలక పాత్రకావడం ఒక ఆసక్తికర పరిణామం. 

అప్పటి మొగల్రాజపురం సాంస్కృతిక జీవనంలో మరో ఇద్దర్ని పేర్కోకపోతే జాబితా పూర్తయినట్టుకాదు. మొదటి వ్యక్తి 'వ్యాన్‌ గార్డ్‌' ఎడిటర్‌ మోహన్‌ రామ్మూర్తి.  రెండవ వ్యక్తి  తమ్మిన గణపతిరావు పాత్రుడు. మోహన్‌ ది తమిళనాడు. గణపతిరావుది చిట్టినగర్‌. కానీ, తెల్లారితే ఇద్దరూ   మొగల్రాజపురం చేరుకునేవారు. ఇంటర్నెట్‌ లేని ఆరోజుల్లో,  ఏ విషయం విూదనైనా 'ఇన్‌ పుట్‌' కావాలంటే సమకూర్చడానికి మోహన్‌ వుండేవాడు. సెల్‌ ఫోన్లు లేని కాలంలో, నేను అక్షరం ముక్క రాస్తే చాలు మొత్తం  ప్రపంచానికి చాటిచెప్పడానికి గణపతిరావు సిధ్ధంగావుండేవారు. ఇప్పటి టెలివిజన్ న్యూస్ ఛానల్స్ భాషలో చెప్పాలంటే, మోహన్ నాకు ఇన్ పుట్ ఎడిటర్ అయితే, గణపతిరావు అవుట్ పుట్ ఎడిటర్!!  వీళ్ళుకాక, వల్లమాలినంత విప్లవాభిమానం, సాహిత్యాభిమానం వున్నవాళ్ళు మొగల్రాజపురంలో కోకొల్లలుగా వుండేవాళ్ళు. ఇదీ మలి వరస.

అప్పటి విరసం కృష్ణాజిల్లా యూనిట్‌ రాష్ట్రంలోకెల్లా పెద్దది. విజయవాడవాసులతోపాటూ, ఆలూరి భజంగరావు, అరుణ, సౌదా, రజినీ కూడా అందులో సభ్యులు. విరసం కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల యూనిట్‌ కు చాలాకాలం నేనే ప్రాంతీయ కన్వీనర్‌ గా వుండేవాడ్ని. మా ఇళ్లన్నీ సాహిత్య సమావేశాలతోనో, యూనిట్‌ విూటింగులతోనో కళకళలాడుతూ వుండేవి. ఏలూరు రోడ్డును రైటర్స్‌ స్ట్రీట్‌ అన్నట్టు, మొగల్‌ రాజపురాన్ని రైటర్స్‌ కాలనీ అనవచ్చు.

ఇదంతా పైకి కనిపించే ప్రపంచం. దీనికి ఎప్పటికప్పుడు ప్రాణవాయువును అందించే ఒక రహాస్య  ప్రపంచం మరొకటుండేది. పీపుల్స్‌ వార్‌ నాయకత్రయం  కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ఐవీ సాంబశివరావు అప్పుడప్పుడు వచ్చి, పరిసర జిల్లాల యువకులకు  రహాస్య తరగతులుపెట్టి, స్వయంగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు బోధించి, పీపుల్స్‌ వార్‌ పంథాను వివరించి వెళుతుండేవారు. 'టెక్‌' జాగ్రత్తల రీత్యా పదిమందిని ఒకేసారి కలవడం కుదరనపుడు, వ్యక్తిగత స్థాయిలోనే ఈ జ్ఞాన ప్రసరణ కార్యక్రమాలు సాగేవి.

        పీపుల్స్‌ వార్‌ నాయకత్రయం తలలకు ప్రభుత్వం కట్టిన  వెలలు వుండేవి. వారిని  గుర్తించగలిగిన వాళ్ళు  మొగల్‌ రాజపురంలో చాలా మంది వుండేవారు. సిపిఐ, సిపియం ప్రముఖులు వుండే ప్రాంత్రం అది.  ఆ ముగ్గురితో వాళ్లకు  రాజకీయంగా తీవ్ర విబేధాలు కూడా వుండేవీ. కానీ, ఎవ్వరూ ఎప్పుడూ వాళ్ల సమాచారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. ''వాడూ మావాడే. మనతో విబేధించినా మంచిపనే చేస్తున్నాడుగా'' అని కొంచెం కినుకతో మెచ్చుకునేవారు.   దాయాదుల మీద నమ్మకంతోనే, పీపుల్స్ వార్ నాయకత్రయం మొఘల్రాజపురంలో స్వేఛ్ఛగా తిరుతూ వుండెది.


        ప్రజాశక్తినగర్‌ నుండి బెంజిసర్కిల్‌ వరకు మొత్తం సాగదీస్తే రెండు కిలోవిూటర్ల ముక్క. కావల్సినవాళ్ళంతా ఒకేచోట వుండడంవల్లనేమో విజయవాడ ఓ పెద్ద గ్రామంలా కనిపించేదేతప్పా, ఎప్పుడూ ఓ నగరంలా కనిపించేదికాదు. విజయవాడ వాళ్లకు సెన్సాఫ్‌ బిలాంగింగ్‌ కూడా కొంచెం ఎక్కువ. 

          నక్సలైటు అభిమానులు ఎక్కువగా వుండడంవల్ల విజయవాడ-టెన్‌ విూద ఎప్పుడూ పోలీసు నిఘా వుండేది. పోలీసు భాషలో వాళ్ళు ఏకే-47!. దీనికి మరో కారణం కూడా వుంది. అప్పట్లో విజయవాడ-టెన్‌  పరిధిలోని  (బీ.ఎస్‌.ఎన్‌.ఎల్‌.)  టెలీఫోన్ల  లెవల్‌ 47.  డానీ, విజయవాడ  - 10  అని రాస్తే చాలు మా ఇంటికి వుత్తరం వచ్చేసేది. అప్పట్లో అదో ఇది!!!

హైదరాబాద్‌
8 ఆగస్ట్‌ 2011


Vegunat Mohana Prasad

డెభ్భయేళ్ళ పసిపిల్లాడు!
ఉషా యస్ డానీ

 అప్పుడు కాలం కడుపుతోవుండింది. కార్ల్‌ మార్క్స్‌ ను కనింది అని మయకోవిస్కీ రాసినట్టు, ఎమరెన్సీ రోజుల్లో విజయవాడ కడుపుతో వుండింది. కాలం కలిసివస్తే నడిచివచ్చే పిల్లలు పుడతారు అన్నట్టు మమ్మల్ని కనింది. మేము అంటే నేను, తాడి మోహన్‌, ఖాదర్‌, గౌస్‌, పతంజలి, విశ్వేశ్వరరావు, రావి రాంప్రసాద్‌, జమున వగయిరాలు. అప్పటికి మా వయస్సు  పాతికేళ్లకు ఓ బెత్తుడు అటుఇటూ వుండేది.   ఎవరికైనా ఇప్పుడు అభ్యంతరం వుంటేవుండొచ్చుగానీ, నాటి శ్రీకాకుళం,  కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సాయుధ రైతాంగ పోరాటాల ప్రభావం మావిూద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుంది. ఆమేరకు, మేమంతా నక్సల్‌ బరీ సంతతి!

కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కవి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ మాకన్నా ఓ పుష్కర కాలం  పెద్దాళ్ళు. వాళ్ళిద్దరికీ అప్పట్లోనే ఒకరకం స్టార్‌ ఇమేజి వుండేది.

ఖాదర్‌, గౌస్‌ ఇద్దరూ వేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారితో చాలా సన్నిహితంగా వుండేవారు. అనేక రాత్రుళ్ళు ఆయనతో గడిపేవారు. అయితే, తొలిదశలో,  వేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారితో నావి సత్సంబంధాలు కావు.  మా ఇద్దరికీ అసలు పడేదికాదు. పడే అవకాశమూలేదు. ఎలా పడుతుందీ? ఆయన టి.ఎస్‌. ఇలియట్‌ అభిమాని. నాది జాక్‌ లండన్‌ జీవనశైలి. ఇర్వింగ్‌ స్టోన్‌   'సైలర్‌ ఆన్‌ హార్స్‌ బ్యాక్‌' గుర్తుందికదా! మనది సేమ్‌ టూ సేమ్‌ స్టోరీ! !

సున్నితమనస్కుడైన ఓ కవికీ, కరడుగట్టిన కమ్యూనిస్టు కార్యకర్తకు పొంతన ఎలా కుదురుతుందీ? వ్యవసాయిక విప్లవానికేతప్పా, సాహిత్య వ్యవసాయానికి అది సమయం కాదని నమ్మే 'విజయవాడ చారు మజుందార్‌' వి.వి. కృష్ణారావు నాకు రాజకీయ గురువు. పచ్చి నిరాశవాదం, పలాయనవాదమంటూ 'మో' 'చితీ-చింత' ను చించి చాటేసిన 'తిరుపతి మావో సేటుంగ్‌' త్రిపురనేని మధుసూదనరావు నాకు తాత్విక గురువు!
అప్పట్లో, విజయవాడలో ఎక్కడ సాహిత్య సభ జరిగినా  కృష్ణారావు మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. ''విూదారి నక్సల్‌ బరియా? కాదా?'' అని వక్తల్ని నిలదీసేవారు. అప్పుడు కొంత రభస జరిగేది. మేము సివిల్‌ కోర్టుల్ని కూడా వదిలేవాళ్లం కాదు. జడ్జిగారి పోడియంలోకి వెళ్ళి''బూర్జువా కోర్టులు నశించాలి'' అని నినాదాలు చేసేవాళ్ళం.  ఎక్కడైనా సరే గొడవపడడమే మాపని. కృష్ణారావు దళంలో నాది దండనాయకుని  పాత్ర అని వేరే చెప్పాల్సినపనిలేదు. ఆ పరంపరలో, 'చెట్టు' ఇస్మాయిల్‌, 'ఖాళీసీసాల' స్మైల్‌ సభల్లో కూడా మేము రభసచేశాం. మా భీభత్సాన్ని కళ్ళారా చూసినవాళ్లలో నండూరి రామ్మోహనరావు, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ వంటి సున్నిత మనస్కులు కూడా వున్నారు.

దండనాయకుని  పాత్ర మొరటుగావున్నా, అందులో కొన్ని అదృష్టాలు కూడా వుంటాయి. ఉద్యమ ప్రముఖులు కృష్ణాజిల్లాకు వచ్చినపుడు వాళ్లకు అంగరక్షణ పాత్రను కూడా నేను నిర్వహించేవాడిని. నోబెల్‌ బహుమతి గ్రహిత గున్నార్‌ మిర్డాల్‌ కొడుకు జాన్‌ విూర్డాల్‌ (థర్డ్‌ వరల్డ్‌ పత్రిక ఎడిటర్‌)  1979లో కొండపల్లి సీతారామయ్యను కలవడానికి భారతదేశానికి వచ్చాడు. ఆ సమావేశం  సందర్భంగా కొండపల్లికి బాడీగార్డ్‌ గా నన్ను పంపించారు కృష్ణారావు. అలాగే, 'మాభూమి' సినిమా శతదినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీశ్రీకి కాపలాగా నన్నే పెట్టారు.

శ్రీశ్రీని కలవడానికి వచ్చినపుడు హాఫో, ఫుల్లో తేవడం అభిమానులకు అలవాటు. రాత్రి సభ జరిగిన తరువాత ఎలాగో అభిమానులు ఆయన్ని  ఆల్కహాలాభిషేకం చేస్తారు కనుక, సభ జరిగేవరకైనా శ్రీశ్రీని  తాగకుండావుంచే బాధ్యతను నాకు అప్పచెప్పారు. గవర్నరుపేట నటరాజ్‌  హోటల్లో  శ్రీశ్రీకి బస ఏర్పాటు చేశాం. వారిని లోపల విశ్రాంతి తీసుకోమని చెప్పి, గుమ్మం ముందు చెయ్యెత్తు కర్ర పట్టుకుని నేను నిలబడ్డాను. అభిమానుల్ని కలవకుండా (మందు ముట్టనివ్వకుండా) మహాకవిని గదిలో పెట్టారని ఊర్లో  ప్రచారం అయిపోయింది. విశ్వేశ్వరరావుని వెంటబెట్టుకుని, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ హోటలుకు వచ్చారు. నేను అడ్డు నిలబడ్డాను. వారు నన్ను పక్కకు తోసేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ పెద్దాయన్ని నేనేం చేసేదీ? అంతే! అభిమానులంతా కలిసి విూటింగుకన్నా ముందే శ్రీశ్రీని ఫుల్లుగా ముంచేశారు. సభ జరిగే హనుమంతరాయ గ్రంధాలయానికి మహాకవిని దాదాపు మోసుకుపోవాల్సి వచ్చింది. అందుకు నేను మాట పడాల్సివచ్చింది. మరోవైపు, వేగుంట నన్ను ''డానీయిజమ్‌ - డాండీయిజమ్‌'' అనడం మొదలెట్టారు. ఆయన నన్ను తిడుతున్నారని  తెలిసేదిగానీ, ఆ తిట్టుకు అర్ధం మాత్రం తెలిసేదికాదు. నా ఇంగ్లీషు పరిజ్ఞానం పరిమితమైనదని కొత్తగా చెప్పాల్సినపనిలేదు.

మా అపార్ధాలకు ఓ పారడాక్స్‌ కూడా వుంది. పెద్ద ఇస్మాయిల్‌, చిన్న ఇస్మాయిల్‌ తో నాకు దూరపు చుట్టరికం వుందని చాలా కాలం తరువాత  తెలిసింది. పెద్దాయన నాకు తాత వరస. చిన్నాయన నాకు అన్న వరస. నండూరిగారి విషయమూ అంతే. ఓ పదేళ్ల తరువాత నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరి, ఓ ఏడాది పనిచేసిన తరువాతగానీ, నండూరిగారికి నా విూద పాత అభిప్రాయం పోలేదు. వారి ఉద్యోగ విరమణ ఉపన్యాసంలో నన్ను చాలా  ఆత్మీయంగా ప్రస్తావించారాయన. అన్నట్టు, మోహన్‌ ప్రసాద్‌ గారిది పశ్చిమ గోదావరి జిల్లా. ఆ విషయం నాకు ముందే తెలియక పోవడం అన్యాయం. పశ్చిమ గోదావరి జిల్లావాళ్లకు ఒక సాంప్రదాయం ఉంది. వాళ్ళు, అక్కడ పుట్టినవాళ్లకు  నూరుతప్పుల్ని మన్నించేస్తారు!.

          1981 అక్టోబరు నెలలో  జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్శిటీకి చెందిన విదేశీ భాషల విభాగం లూసన్‌ శతజయంతోత్సవాలు నిర్వహించింది. అందులో వక్తగా నన్ను పిలిచారు.  విశ్వవిద్యాలయం వేదిక విూంచి ఇంగ్లీషు ప్రసంగం చేయడానికి శక్తిని కూడదీసుకోవాల్సివచ్చింది. ముందు తెలుగులో రాసుకుని, దాన్ని నెమ్మదిగా ఇంగ్లీషులోనికి మార్చుకున్నాను. దాన్ని సంస్కరించమని అడగడానికి  వేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారి ఇంటికి వెళ్ళాను.  'కమ్మేమోరేషన్‌'  'డేడికేటరి' 'హానర్‌' 'ట్రిబ్యూట్‌' 'మొమెంట్‌' 'మూవ్‌ మెంట్‌' 'ఎజిటేషన్‌' 'ప్రోటెస్ట్‌' 'డిస్టర్బన్స్‌' వగయిరా పదాల ధాత్వర్ధాల్ని నాకు వివరించి చెప్పడానికే వారు నాలుగైదు  గంటలు తీసుకున్నారు.  ఆ రోజు ఒక్క పేరా కూడా సరిచేయలేకపోయాం.  ఇంగ్లీషు భాషలో వారిది అపారమైన పరిజ్ఞానం. కానీ, వారి పధ్ధతిలోపోతే డెడ్‌ లైన్‌ లోపల ఆ పని పూర్తికాదని భయంవేసింది. “జ్ఞానం మరీ ఎక్కువైపోయినా పనికాదు” అని నాకు అనిపించింది. “వీళ్ళకు ఎప్పటికప్పుడు పని జరిగిపోవాలేతప్పా, జ్ఞానంతో పనిలేద”ని వారికి అనిపించింది. పైగా, డెడ్‌ లైన్‌ విధింపు అనేది మోహన్‌ ప్రసాద్‌ గారికి అస్సలే పడని విషయం!
స్మైల్‌, వేగుంట ఆత్మీయ మిత్రులు. స్మైల్‌ విజయవాడలో వున్నరోజుల్లో వాళ్ళిద్దరూ దాదాపు ప్రతిరాత్రీ కలిసేవారు. త్రిపురనేని శ్రీనివాస్‌ విజయవాడకు మారేక మోహన్‌ ప్రసాద్‌ గారితో సన్నిహితంగా వుండేవాడు. స్మైల్‌, శ్రీనివాస్‌ ల ద్వార నేను వేగుంటని కలిస్తుండేవాడ్ని. అప్పట్లోనే మా మధ్య అపార్ధాలు తగ్గడడం మొదలైంది.

        ఖాదర్‌ చెప్పినట్టు వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కవితామార్గం నిజంగానే ''అనితర సాధ్యం!''. నేనెలాగూ కవితలు రాసేవాడ్నికాను. అయితే, ఇంగ్లీషులో నైపుణ్యాన్ని మెరుగుపెట్టుకోడానికి వారి పరిచయం నాకు తోడ్పడింది. చరిత్ర గుర్తులు మన చుట్టే వుంటాయి అని డిడీ కొశాంబి అన్నట్టు, ఒక పదం నిర్మీతిలోనే దాని అర్ధం కూడా నిగూఢంగా వుంటుందని వేగుంట మోహన్‌ ప్రసాద్‌  ఒకసారి ఓ 'సెషన్‌' లో చెప్పారు. కాన్‌ స్టేబుల్‌ అనే పదంలో  కాన్‌ స్టాంట్‌, స్టేబుల్‌ అనే రెండు పదాలున్నాయనీ, ఆ రెండింటి అర్ధం స్థిరం అనీ, ఆమేరకు యధాస్థితిని కాపాడడమే పోలీసుల పని అనీ, అది కవులకు బొత్తిగా పడని వ్యవహారమని వివరించారు. అలాగే కాంపోజ్‌ బిళ్లల్లు. అవి మన 'పోజ్‌' ను 'కామ్‌' చేయడానికేనట!

1990లో మానాన్న చనిపోయిన మరునాడు రాత్రి నన్ను 'ఓదార్చే లాంఛనాన్ని' స్మైల్‌ నిర్వర్తించారు.  దానికి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కూడా వచ్చారు. 'తండ్రి చనిపోవడం' అనే కష్టం ఆయన్ని కలిచివేసింది. నా భుజాల్ని పట్టుకుని, గట్టిగా  ఊపేస్తూ, ''నాన్న చనిపోయాడా? నీకిప్పుడు నాన్న లేడా డానీ? నాన్నలేడా? మన డానీ తండ్రిలేని పిల్లాడైపోయాడ్రా స్మైల్‌!'' ఆంటూ ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. తరువాత వారిని మేమంతా ఓదార్చాల్సి వచ్చింది. డెభ్భయి యేళ్ల పసిపిల్లాడు మా మాస్టారు!

అయితే, మా పునస్సంబంధాలకు, వ్యక్తిగత కారణాలను మించిన, బలమైన సమాజిక నేపథ్యమే వుంది. 1985లో తెలుగుదేశం ప్రభుత్వం రెండవసారి అధికారాన్ని చేపట్టాక విజయవాడను అర్బన్‌ పోలీస్‌ జిల్లాగా ప్రకటించి, కే.ఎస్‌. వ్యాస్‌ ను ఎస్పీగా నియమించింది. కొత్తగా ఏర్పడిన పోలీస్‌ జిల్లాలో  విజయవాడ సామాన్య ప్రజలు నరకాన్ని చవిచూశారు.  అప్పటి వరకు విజయవాడకు 'నిద్రపోని నగరం' అనే పేరుండేది. మందు మొదలు వేడివేడి ఇడ్లీ వరకు అన్నీ ఇరవై నాలుగు  గంటలూ దొరికేవి. ఏలూరు రోడ్డు బృందావనం  హోటల్లో
అర్ధరాత్రి దాటేక  ఆవిర్లు విరజిమ్మే  ఇడ్లీ తినడం చాలామందికి ఒక అలవాటుగా వుండేది. సినిమాహాళ్ళతో సహా నగరంలో ప్రతీదీ రాత్రి పదకొండు గంటలకెల్లా మూసివేయాలనే వ్యాస్‌ ఉత్తర్వులతో విజయవాడ తన రాత్రికళను కోల్పోయింది. నగరంలో పోలీసు రాజ్యం నెలకొంది. వీటికి పరాకాష్టగా విజయవాడలో లాకప్‌ డెత్‌ లు  పరంపరగా సాగాయి.

పోలీసులు, నక్సలైట్లు ఎలాగూ పామూ, ముంగీస లాంటి వైరజాతులు. పుట్టుక రీత్యానే వాళ్లకు పడదు. కానీ, నిషేధాలు తెలియని విజయవాడలో పోలీసు రాజ్యాన్ని చూసి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ వంటి సర్రియలిస్టు కవులకు కూడా చిర్రెత్తుకొచ్చింది. 

1985 ప్రత్యేకత ఏమిటోగానీ, ఈ కాలంలోనే నక్సలైట్ల ఆలోచనా విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ''నక్సలైట్లే దేశభక్తులు'' అనే నినాదం ''నక్సలైట్లు కూడా దేశభక్తులు''గా మారింది. వ్యవసాయిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి విప్లవకారుల  బలిదానాలు మాత్రమే సరిపోవనీ, దానికి  ప్రజాస్వామికవాదుల మద్దతు కూడా చాలా అవసరమని  గుర్తించడం మొదలెట్టారు. అలా మేము సమాజం నుండి  సాహిత్యానికి ప్రయాణమయ్యాం.

విజయవాడలో పోలీసు రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఇటునుండి నక్సలైట్లు, అటునుండి ప్రజాస్వామికవాదులు నడుంబిగించారు. ఆ దశలో, లాయర్‌ కర్నాటి రామ్మోహనరావు, కవి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ మహత్తరమైన పాత్రను నిర్వర్తించారు.

అప్పట్లో, మురళీధరన్‌ అనే  నావికాదళ ఉద్యోగి ఒకడు, రైలుప్రయాణం మధ్యలో విజయవాడలో దిగాడు. మందు కోసం రైల్వేస్టేషన్‌ సవిూపాన్న  ఓ బ్రాందీ షాపుకు వెళ్ళి వాళ్ళతో గొడవపడ్డాడు. పోలీసులు అతన్ని  అరెస్టుచేసి తీసుకువెళ్ళారు. మర్నాడు అతను శవమైతేలాడు. మురళీధరన్‌ లాకప్‌ డెత్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనతో, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ చలించిపోయారు. అంతః  ప్రపంచాన్ని వదిలి బయటికి వచ్చారు. లాకప్‌ డెత్‌ పై కవిత రాశారు. బహుశ అదే వారి తొలి 'సామాజిక' కవిత అనుకుంటాను.

సుప్రసిధ్ధ ఆంగ్ల రచయిత సోమర్‌ సెట్‌ మామ్‌, 1940లలో రమణమహర్షి ఆశ్రమానికి వెళుతూ, విజయవాడ రైల్వే స్టేషన్లో  కొన్ని గంటలు గడిపాడట. ''అప్పట్లో, వ్యాస్‌ వంటి పోలీసాఫీసర్‌ వుంటే,  సోమర్‌ సెట్‌ మామ్‌ ని విజయవాడలో లాకప్‌ డెత్‌ చేసేసేవారు కదా!'' అని ఓ బహిరంగ సభలో వేగుంట వాపోయారు.  'మో' కలం నుండి, ఆ పరంపరలో వచ్చిందే, 'డార్క్‌ రూంలో సూర్యుడు'  కవిత.  విరసం సాంస్కృతిక నాయకుడు వరవరరావు చంచల్‌ గూడ జైల్లో పొలిటికల్‌ డెటిన్యూగా వున్నప్పుడు వారు రాశారు దీన్ని.  అలా మో
సాహిత్యం నుండి సమాజానికి ప్రయాణాన్ని సాగించారు.   

హైదరాబాద్‌
8 ఆగస్ట్‌ 2011

ప్రచురణ : న’మో’
సంకలనం : ఖాదర్ మొహియుద్దీన్, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు

విరి వాల్యూమ్స్, ఆగస్ట్ -  2011 

మోహన్‌ ప్రసాద్‌ సెన్సాఫ్‌ హ్యూమర్‌
ఎన్‌. వేణుగోపాల్‌ విజయవాడ నవోదయా కాలనిలో వున్నప్పటి సంఘటన ఇది. అప్పట్లో, వేణు వ్యవహారశైలి క్రమశిక్షణా కమిటి ఛైర్మన్‌ లా వుండేది. ఆయన గదికి దాదాపు ఎదురుగా ఓ చిన్న బ్రాందీ షాపువుండేది. అర్ధరాత్రిదాటినాసరే, తెలిసినవాళ్ళు తలుపుకొడితే,  ఆ షాపులో మందు ఇచ్చేవారు.  అయితే, విరసం సభ్యులుగానీ, నక్సలైట్‌ అభిమానులుగానీ ఆ షాపులో మందు కొనడానికి జంకేవారు. వేణు కళ్ళల్లో పడడం దేనికనీ!

వేణు గదికి ఓ పది ఇళ్ల అవతలే వేగుంట మోహన్‌ ప్రసాద్‌ ఇల్లు.  ఓరోజు రాత్రి  మోహన్‌ ప్రసాద్‌,  త్రిపురనేని శ్రీనివాస్‌ సెషన్‌ అర్ధరాత్రి దాటేసే వరకు సాగింది. మందు అయిపోయింది. ఇంకాస్త మందు వుంటే బాగుంటుంది అనిపించింది. 
  
''ఫరవాలేదు. తలుపు చప్పుడు చేస్తే చాలు. ఆ షాపువాడు మనకు  మందిస్తాడు'' అని  శ్రీనివాస్‌ అన్నాడు.
''కానీ, మరీ రెండవుతోంది. ఇప్పుడు వాడు లేస్తాడా?'' - అని మో సందేహం.
''దాందేముంది మాస్టారూ! లెగకపోతే తలుపు గట్టిగా కొడతాం. బాదిపడేస్తాం. దట్సాల్‌!'' - ఇదీ శ్రీనివాస్‌ ధీమా.
''షాపు తలుపులు  తెరుచుకోకపోయినా ఫరవాలేదు. ఆ సౌండుకు, ఎదిరింటి  తలుపులు తెరుచుకుంటేనే ప్రమాదం!'' అన్నారట మోహన్‌ ప్రసాద్‌! 
(ఖాదర్!  కావాలంటే దీన్ని పై వ్యాసానికి చివర్లో జోడించ వచ్చు)
8 ఆగస్ట్‌ 2011